ఏదోలా ఉన్న ఇక్కడ
నావల్లేం కావడం లేదు….
అమ్మా నాన్నా ఒక్కసారి రండి
బైట పడలేని ఏడుపుతో ఏ ఒక్క రాత్రీ నిద్ర పట్టడం లేదు
కాస్త నా తల నిమరండి
ఎన్నో మొక్కులకు పుట్టిన మొక్కనని
గారాం చేసావే అమ్మా
ఇప్పుడెందుకిలా వదిలేసి పోయావు
నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కదానినే
బంగారాన్నని మురిపెంగా చూసావే నాన్నా
ఎందుకిలా ఒంటరిని చేశావు
నాన్నమ్మ కథలకు ఊ కొట్టే ఉడతను ఒకప్పుడు
ఇప్పుడు ఒంటరి కన్నీటిని
వెచ్చటి అమ్మ ఒడిలో చేరిన ఆదమరిచిన నిద్రను
ఇప్పుడు తెల్లారగట్లే లేచే అలారపు మోతని
డ్రిల్ అంటూ
రన్నింగ్ అంటూ బెత్తపు దెబ్బలు రుచి చూస్తున్న పసి వయసును
అమ్మ చేతి అన్నపు రుచిని
నీళ్ల చారులో వెతుక్కుంటున్న లేత మనసుని
కలవరింతల బంధీ ఖానాలో చిక్కుకున్న
చదువుల గువ్వని
ప్రతీ రోజుని ఆదివారాలకై కలలు కంటున్న అమాయక బాల్యాన్ని
డే నైట్ స్టడీల భయంలో
గుడ్డి వెలుగును కలగంటున్న రెక్కలు రాని పక్షిని
-జి.నర్సింహ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~