ధర్మం నాలుగు పాదాలపై నడయాడే నా భరతమాత ఒడిలో
రామాయణ భారత భాగవత ఇతిహాసాలు
గొప్పగా పురుడుపోసుకున్న నాదేశంలో
స్త్రీలను తల్లులుగా, ఆడవారిని ఆదిశక్తిగా
అందంగా వర్ణిస్తూ కొలువబడే నా మాతృభూమిలో
అర్దరాత్రికూడా ఆడవారు నిర్భయంగా
తిరగగలరని గొప్పలు చెప్పుకునే నా ఈ భారతదేశంలో
ఆద్యాత్మికత అనువణువునా నింపుకుని తిరిగాడే నా దేశంలో
దైవచింతన దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న
ఈ నా గొప్ప తాత్విక దేశంలో
పట్టపగలే అతివలకు రక్షణ లేకుండా పోయిందని
సిగ్గు విడిచి ఎలా చెప్పును
ముక్కుపచ్చలారని బాలలు, బడిపిల్లలు ,
ముదిమి వయసున్న మహిళామూర్తులు
ఎవ్వరినీ వదలని కీచక పర్వం
నాదేశ వారసత్వ సంపదగా మారిందని
సిగ్గులేకుండా ఎలాచెప్పగలను?
మహిళలను చిత్రహంసలు గురుచేసి చంపడం
మానభంగాలుచేసి రూపురేఖలు కాల్చివేయడం
నాదేశ మగమృగ మహారాజుల నైపుణ్యం అని
మనిషిపై లైంగికదాడి చేసి నల్లిని నలిపినంత
సునాయాసంగా చంపడం నయా ఫ్యాషనుగాను
మానభంగాలుచేసి మర్డర్లు చేసినోళ్ళను
దండలేసి ఊరేగించడం
నిండు గర్భిణిని మగమృగాలు
ఒకరితరువాత మరొకరు లైంగికదాడి చేసి చంపేస్తే,
ఉరితీయాలని అరచిన నోళ్ళే
వారిని నిర్లజ్జగా బాజాభజంత్రీలతో ఊరేగించడం
కర్మభూమిగ, పుణ్యభూమిగా చెప్పుకునే
అందమైన నాదేశానికి ఆటవిడుపే
చట్టాన్ని చుట్టంగాను, న్యాయాన్ని కాపలా కుక్కగాను
చేసుకునే మా నేతల తలరాతలు మార్చాలి
నా ఈ రామరాజ్యంలో స్వంత తీర్పులను
అమలుపరచే పూలాన్ దేవిలు మళ్ళీ పుట్టాలి
మానభంగాలు అత్యాచారాలు చేసే
వారికి పుట్టగతులు లేకుండా చేయాలి!!
-బివివి సత్యనారాయణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~