అప్పనంగా వచ్చే ఆస్తిపై
మోజుపడే దశమగ్రహాలు…
ఇల్లరికంలో ఉంది మజా అంటూ
మామ ఆస్తిపై కన్నేసి
పెత్తనాన్ని చలాయిస్తూ…
అధికారాన్ని తమ
జన్మహక్కుగా భావిస్తూ
అనుభవించే బదనిక భర్తలు!
మూర్తీభవించిన సోమరితనంతో
ఏ పనీ చేయకపోయినా…
భార్య చెమటోడ్చి సంపాదించే
సొమ్మును జల్సాల కోసం,
వ్యసనలోలత్వంతో
ఉఫ్ మని ఊదేస్తూ…
పైనుంచి నోరూ,చేయి
చేసుకుంటూ చెలరేగే
బదనిక భర్తలు!
ఆత్మన్యూన్యతతో కుంచించుకుపోతూ…
ఆధిపత్యాన్ని ఆయుధంలా వాడుతూ…
అబలలపై తమ ప్రతాపాన్ని చూపిస్తూ…
ఆవేశకావేశాలు ప్రదర్శిస్తూ…
వారి ఆత్మగౌరవాన్ని
అణచివేసే బదనిక భర్తలు!
భద్రత కోసం…
సంతానం కోసం…
జీవితాంతం వారిని
భరించే భార్యలు…
అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడే…
దాడిని ప్రతిఘటించినప్పుడే…
కాస్తైనా వారి అహం
మత్తు వదిలేది!
ఆధిపత్యం సడలేది!!!
–చంద్రకళ. దీకొండ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~