కత్తి మీద సామే తప్పని ఈ జీవితం.
కలిసిరాని మనుషులతో కలకాలం
సాగుబాటయ్యేనా సంసారం.
కక్షగట్టిన కాలం
కలతల ఖడ్గం గుచ్చుతోంది
తలపుల మగ్గం విరిగిపోయాక.
బతుకు నొప్పి బాధపెడుతోంది..
బండరాయిని మెడకు చుట్టి..!
పచ్చని బంధం పరిహసిస్తుంది
పరువుకోసం పడుండమని చెప్తూ..!
ఎంతకాలమని మోయాలీ దైన్యాన్ని
నా చూపు చూస్తుంటే శూన్యాన్ని..!
మరిగిన మనసు అవిరైపోయింది
కన్నీళ్లనే కానుకగా పుచ్చుకొని..!
విలువలేని చోట నిలువలేని తనం
ఓదార్చుకుంటోంది ఒంటరి తనం..!
గ్రహణాలతోనే గమనం
పాణి గ్రహణమే సాక్షిగా చేస్తోంది యుద్ధం..!
వీగిపోయిన బతుకు మచ్చలే అన్నీ
కాయానికి జ్ఞాపకాలౌతున్నాయి.
అర్ధంలేని అపోహలే నిండు జీవితాల్ని వ్యర్థం చేస్తున్నాయ్.!
సైకత సౌధమే మన బంధం
అనుమానపు అలల తాకిడికి
విలవిలలాడుతోంది.
చెల్లని బతుకులేనా ఎప్పటికీ ..
మగువ మనసెరుగరా..?
మాటలు కరువైన మౌనం
మోస్తోంది నిశ్శబ్దం.
-జయసుధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~