మెత్తని మబ్బుల్లో చిక్కబడిన వాన
కురుస్తూనే వుంది గుండెలు చెరువులయ్యేలా..
చెప్పా పెట్టకుండా వచ్చిన వరద
ఎన్నో జీవితాల్ని ముంచేసింది.. !!
వినగలిగితే..
బాధాతప్త హృదయాల
కన్నీటి రాగాలెన్నో.. !!
అన్నీ కనపడవు
అంతే..
మనసుల్ని ముంచి వెళ్లిపోతాయి.. !!
వేసవిలో గొంతు తడపని దాహపు నావలు ఇప్పుడు వరదలై ముంచేస్తుంటే..
తెడ్డు లేని పడవకు నావికుడిలా
తీరం కనపడని దరికి కొట్టుకుపోయే బ్రతుకులు.. !!
ఎవరెవరికి ఎవరు
ఎక్కడి పరిచయాలో..
బాధల్లో అల్లుకుపోతారు
ఆకాశంలో మేఘాల్లా
ఒకరికోసం ఒకరుగా.. !!
దిగుళ్లను మూటగట్టి
తట్ట నెత్తికెత్తి తపోభంగమైన మునుల్లా మౌనంగా.. !!
ఇది జీవిత ప్రయాణం
ఎన్ని అలలో సంద్రంలో
మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ… తుంచుతూ.. !!
ముసురేసిన భారతానికి
ఈ కష్టాల దిష్టి ఎన్నడు తీరునో..
ఆ పరమాత్మకే ఎరుక.. !!
-జయసుధ కోసూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~