నేనైతే నీకై ఏ వసంతాలను తీసుకురాలేను
నువ్వలా చిగురిస్తూ వుంటే తన్మయిస్తాను
ఏ పండు వెన్నెలనూ పట్టుకు వచ్చి నీ దోసిట కుమ్మరించలేను
నీ నవ్వుల వెలుగులలో నన్ను నేను కోల్పోతాను
ఏ నీ ప్రశ్నల సరళికి సమాధానాలు అందించలేను
కాలాన్ని తవ్వి నీకు కానుకగా ఇవ్వనూ లేను
కలల మరకలపై నిన్ను ఊరేగించనూ లేను
ఆశ్చర్యకర అబద్దాల మైనపు పూత పూయనూ లేను
నేను నీకై నువ్వవుతాను
గాయమైన నీ మనసు నొప్పినౌతాను
నువ్వు నడిచే దారిలో అడుగును అవుతాను
నీ రెప్పలపై లే నిద్దురనవుతాను
నీ కోపపు విరుపునై
నీ కన్నుల మెరుపునై
నీలో సంగమిస్తాను
నీతో సహగమిస్తాను…..
-సుధా మురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~