పేదింట పెరిగిన పిల్లల బతుకులు
ఆకలికి అలవాటైన పేగులు
ఆటలతోనే తీర్చుకొనును ఆకలులు
అలకలు చేసినా ఆగవు ఆకలిమంటలు!
అమ్మానాన్నలకు నిత్యం పనుల జోరు
ఇంటికడ చూసుకునే నాధుడు లేక పిల్లల బేజారు
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదల బతుకులు
బతుకు పోరులో అంతా అలుపెరుగని పరుగులే
ఇంటికడ పిల్లలు ఏమైనా చూసుకొనగ ఎవ్వరూ ఉండరు
చింపిరి బట్టలతో దిక్కుతోచక తిరుగాడు బాలలు
ఆటలలో అలసిసొలసి ఆరుబయటే వారి నిదుర
నిండా మునిగినాక ఇంకెందుకు బెదుర!
కాని, వారు ఆటలలో అలుపెరుగక ఆదమరచి మనునుగుతారు
సరదాలను పంచుకుంటు బెదరక సాగిపోతారు
లేదనే బెంగలేక ఆకలనే అరుపులేక
ఎండిన పేగులైనా
మనసునిండ సంతోషం
కళ్ళలోన ఆనందం
అమాయక బతుకుల్లో ఆత్మీయ బంధనం
పేదింటి వారైననేమి
వీధి బాలలైననేమి
ఆస్తుల ఆరాటంలేదు
సంపాదననే ధ్యాస లేదు
కల్లాకపటం తెలియనివాళ్ళు
రేపటి సంగతి ఎరుగని వాళ్ళు
నేటి ఆనందాలను అందంగా పొందేవాళ్ళు
రేపటి భావిభారత పౌరులు
ఈ పేదింటి పువ్వులు !!
-బివివి సత్యనారాయణ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~