నల్లని మబ్బుల కోసం
కోటి ఆశలతో ఎదురు చూస్తుంటాడు
తల్లి చనుబాల కోసం గుక్కపెట్టే
పసిపాపలా తొలకరి చినుకులకై
కండ్లు నింపుకుని ఆకాశాన్ని అడుగుతుంటాడు…
నాలుగు చినుకులు కురిస్తే చాలు ప్రపంచాన్నే జయించినట్టు
పరవశించి పోతాడు
హలం పట్టి పొలం దున్ని విత్తులు వేసి కడుపున పడ్డ బిడ్డ కోసం
ఓ తల్లిలా తపిస్తాడు
రేయనకా పగలనకా
ఆరుగాలం శ్రమిస్తూ
ఏపుగా ఎదుగుతున్న పంటను
కన్న బిడ్డలా సాకుతాడు
కంటి పాపలా కాపాడుకుంటూ మురిసిపోతాడు
నకిలీలను నీటి ఎద్దడిని
రుణ భారాలను దాటుకుంటూ
ఇంటావిడ పుస్తెలు గిరి పెట్టి
వడ్డీలకు వడ్డీలు చెల్లిస్తూ
ఎకరం ఎవసాయంలోనే
సప్త సముద్రాలను ఈదేస్తాడు
కొడవలి పట్టి కోతలు కోసి
పంటను చూసి అలసట మరుస్తాడు శవాలను పీక్కుతినే రాబందుల
సంగతే మరిచిపోతాడు
చేతికొచ్చిన పంట ఇంటికి రాక
మళ్ళీ తొలకరికై ఎదురుచూస్తూ
కొత్త అప్పుకై వెదుగుతుంటాడు
–సలీమ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~