1
పెదవి చాటున
మౌనం తొంగిచూస్తోంది.
రాత్రి కొంగున దాచిన
తీపిని పెదవికద్దాలని
2.
నిద్ర లేమితో
చిత్తడైన మనసుతో నలిగే పక్కతో
యిప్పుడు తెలిసింది
ఆమె ఎంత లోతో
3.
చీకటి వాటేసుకున్నా
కళ్ళు తెరిచి నిద్రపోతాడు
అలిగిన ప్రేయసి
పాదాల వద్ద మెలుకువతో
4.
తొలి రేయికి ఎంత ఇష్టమో
ఇప్పటికీ మారాం చేస్తుంది
మళ్ళీ ఇద్దరూ కలిసి
తనను ముద్దాడాలని
5.
నేను తుళ్ళిపడ్డప్పుడు
నీవు నాలో తూలి లేపడం చూసి
మల్లెలు విరగబడి నవ్వడం
జీవితమంతా తలచుకునే సిగ్గు.
6.
నా మనసుకు నీ వయసు కాపలా….
నీ అందానికి నా ప్రేమ పహారా….
జీతంలేని ఉద్యోగాలకి
అనుభవాలే జీతభత్యాలు
7.
మన మధ్య నలగని రోజును
పూలతో ముడిచి కొప్పులో దాచినా
కొంటె ముసురులో ఒరిగి,
ఒదిగేది నా ఎదనేగా
8.
నా నుదుటద్ధంగా
నిన్ను చూసి చెప్పవా?
నీ నుదుటద్దంలో
నన్ను పోల్చుకుంటాను
9.
పడగ్గదిలో పట్టుచీరే మధ్య ప్రేమలేఖ
చెవులు రిక్కరించి వింటుంది….
పెళ్లి తరువాత నన్ను
చెప్పుకుంటున్నారో…లేదోనని
10.
పెళ్లిచూపులో తలను వంచుకున్నా
నీ అందాల్ని దొంగిలించానని
తీపి చూపులతో మొదటి రాత్రే
కౌగిట కారాగార శిక్ష వేశావు
11.
చీర ఎంత ఖరీదైనా
లెక్కచేయని
ఏకాంతమందు
దాని విలువ ఓటమి.
12.
ఎన్నేళ్లయినా కోరికలు మొగ్గలే.
మరోమారు మధుపర్కాలతో
దంపతులుగా మారితే
విచ్చుకోవాలని ఉబలాటం.
-శ్రీ సాహితి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~