ఇద్దరిలో
తవ్వకం జరిగి వెలికిరాపడ్డారు
చదవబడ్డారు
గొంతును ఖాళీ చేసి
మనసు వంతెనపై
మెదడును చేరుకున్నారు
పారేసుకున్నవాటిని
వెతికి పైకి లాగి
పూజ చేసుకున్నారు.
మూసకు మేకులు కొట్టి
వెలుతురు వస్త్రాలని కప్పి
నల్లని ఛాయలను నెట్టేసుకొన్నారు.
ఎగుడు దిగుడులో
మాట వంకర్లకి
చేతి కర్రలుగా మారిపోయారు.
ఒకరి ఆకలికి
మరొకరు కేకయ్యారు
ఒకరి కోరికకు
మరొకరు త్యాగమయ్యారు.
పూడుకుపోయిన
ఆస్తులకు ప్రేమ పరికరమైనది.
పూరించిన ఖాళితో
మనసులు పరిపూర్ణమయ్యాయి.
రెండు హృదయాల
ఒకే కలకు
నాలుగు చేతులు ప్రాణంపోసాయి.
రెండు జీవితాల
ఒకే బతుకును
నాలుగు కళ్ళు కాపలా కాసాయి.
అందుకే
తవ్వకం ఓ పండుగ
వెలికి ఓ వరం
నిజం ఓ బలం
నీతి పునాదిగా
ప్రేమను ఓ మూర్తిగా
రెండు జీవితాలు ఒక గుడితో సమానం.
-చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~