మాతృగర్భ క్షేత్రంలో కుదురుకుని
ప్రాణం పోసుకున్న చిన్ని మొలక!
మమతల ఉమ్మనీటి జలముతో
అభిషేకించబడి పాదుకుని
దినదినప్రవర్థమానమై ఎదిగి!
నాభిరజ్జువుతో అనుసంధానమై
పోషకాలనందుకుని
జీవశక్తిని పుంజుకుని!
కరచరణముల శాఖలనేర్పరుచుకుని
అమ్మపాల అమృతముతో
చిరాయువు పోసుకుని!
నేడు దేహవృక్షరాజంగా రూపుదిద్దుకుని
తనవైన ఫలపుష్పాదులతో
ఉనికిని చాటుకుని
పరిణతి చెందిన దేహవృక్షం!
పరోపకారార్థమిదం శరీరం
అను పెద్దల మాటను
ఋజువు చేసేలా
అవయవదానపు వాగ్దానంతో
అవసరమైనవారికి నీడనిచ్చినప్పుడే
దానికి సార్థకత!!!
-చంద్రకళ. దీకొండ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~