విహంగ (కథ)- ప్రగతి

ఇప్పుడెలా…? ఇదసలే కొత్త దారి. ఇంకా ఎంత దూరముందో తెలీదు. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా తప్పు చేశానా?

కొన్ని గంటల క్రితం…

“అంత అర్జంటుగా కాలేజీకి పోకపోతే ఏమవుతుంది? ఓవైపు హిందూపురంలో బంద్ జరుగుతావుంది. మరోపక్క ఆఫీస్ స్టాఫ్ సహాయనిరాకరణ అంటున్నావు. రేపెట్లా ఆదివారమే కదా, సోమవారం వెళ్లి చూసుకోవచ్చు కదా.” ఆయన గారి గొంతులో కన్సర్న్ కంటే ఇంట్లో ఉండకుండా వెళ్తున్నాననే బాధే ఎక్కువ వినబడుతోంది.

“శాలరీ బిల్స్ పెట్టకపోతే డీడీవోల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పైనుంచి అల్టిమేటం. రేపు ఆదివారమైనా సరే అక్కడే ఉండి పూర్తి చేయాలి. ఆఫీస్ స్టాఫ్ సహకరించకపోతే నేనే తిప్పలుపడి సొంతంగా చేసుకోవాలి.”

“బిల్లులు చేయకుండా అడ్డుకుంటున్నారట. ఇబ్బంది పడతావు, వొదిలేయరాదూ.”

“ఎలా వొదిలేయాలి? ఓ వైపు కొత్త పీఆర్సీ అమలుచేసి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. బిల్లులు పెట్టాల్సిందే అని ఒత్తిడి. ఏ మెమోనో వస్తే మళ్ళా ఎవరు తిరిగి చచ్చేది?”

“అదికాదు, బంద్ ఉంటే ఎట్లా పోతావూ అని.”

“నా ఫ్రెండ్ సునీత కారులో అని ఇప్పటికి వంద సార్లు చెప్పాను.”

“అవును, ఆవిడకి పెళ్ళీగిళ్ళీ లేదు, మొగుడూ-పిల్లలూ జంజాటం లేదు.”

“అదీ నీ అసలు బాధ! సునీతతో వెళ్ళకూడదు. అంతేకదా!?”

“అరె నామాట అర్థం చేసుకోవే, ఊళ్ళో డ్రైవింగంటే సరే. నూటపది కిలోమీటర్లు ఒక ఆడమనిషి డ్రైవ్ చేయడం, అసలు మగవాళ్ళు లేకుండా ఇద్దరూ ఆడవాళ్లే, ఏమైనా జరిగితే…?”

“చూడు బాబూ, అర్థ శతాబ్దం వొంటిమీదికొచ్చింది ఇద్దరికీ. మాకేమీ కాదు, నువ్వు దిగులు పెట్టుకోకు.”

సునీత కారు హారన్ విని బయటపడ్డాను, ముఖానికి మాస్కు, భుజానికి బ్యాగు తగిలించుకొని.

“నిన్న ప్రిన్సిపాళ్ళ మీటింగ్ లేకపోతే అక్కడే ఉండిపోయేదాన్ని, ఏ గొడవా లేకుండా.” కారు డోర్ వేస్తూ అన్నాను.

“సీట్ బెల్ట్ పెట్టుకో!” గేరు మారుస్తూ అన్నది సునీత.

సునీత నాకు యూనివర్సిటీలో బ్యాచ్ మేట్. అప్పట్లో బస్సులో ముఖపరిచయమే తప్ప, పెద్ద స్నేహం లేదు. మూన్నెల్ల క్రితం ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ వచ్చి హిందూపురం వచ్చిన మొదట్లో రైల్లో తిరిగిన రోజుల్లో అనుకోకుండా ఓరోజు రైల్లో కలిసింది. తను అక్కడే సెరికల్చర్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఒక నెల షటిల్ కొట్టాక నాకు సాధ్యం కాక అక్కడే రూమ్ తీసుకున్నాగానీ, తను మాత్రం అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం అనంతపురం నుండి రోజూ తిరుగుతోంది. అయితే రోజూ ఫోన్ చేస్తూ ఈ కొద్దికాలంలో బాగా దగ్గరైంది. ఒమిక్రాన్ తాకిడితో రైలు, బస్సు వొదిలేసి కారులో తిరుగుతున్నట్లు చెప్పింది. అయితే ఎప్పుడూ తన కారు ఎక్కే పరిస్థితి రాలేదు. ఈరోజు తప్పలేదు. రైల్లో ఒమిక్రాన్ భయం, బస్సులేమో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయలేదని అసంతృప్తితో బందు.

“ఏమిటాలోచిస్తున్నావు? సరిగ్గా తీసుకెళ్తానా లేదా అనా? నువ్వేం భయం పెట్టుకోవద్దు. నిన్ను క్షేమంగా మీ కాలేజీలో దింపే పూచీ నాది. సరేనా?” కారు హైవే పైకెక్కుతుంటే పెన్ డ్రైవ్ నుంచి మ్యూజిక్ ఆన్ చేస్తూ అన్నది.

“నాకేం భయం లేదులే తల్లీ…” అంటుండగానే స్టీరియోలో మధ్యలోంచి పాట…

‘పిలిచిపిలిచినా… పలకరించినా… పులకించదు గదా నీ యెదా!

          ఉసురుసురనినా… గుసగుసమనినా… ఊగదేమది నీ మది’

“ఓ… నువ్వూ శోభన్బాబు అభిమానివా?”

“నువ్వూ అంటే…? నువ్వు కూడానా? మనమేంటిలే, అప్పటి జనరేషన్ ఆడాళ్లంతా శోభన్ బాబునే కదా ఇష్టపడాల్సింది. అదొక అన్డిక్లేర్డ్ రూలన్నమాట. శోభన్ బాబును ఇష్టపడటం ఒకరకంగా ఆడ లక్షణం.” వెటకారంగా చెబుతున్న సునీత కొత్త ఫిలాసఫీతో నా నొసలు ముడుచుకుంది.

“అదేంటి?”

“అదంతే, మన ముందు తరాల మగాళ్లకు ఎన్టీఆర్, ఆడాళ్ళకు ఏఎన్నార్ నచ్చాలి. వాళ్ళ తరువాత ఫైట్లు చేసి, కౌబాయ్ వేషాలేసే కృష్ణ మగవాళ్ళ సూపర్ స్టార్ అయితే ఆడవాళ్ళకు శోభన్ బాబు ఫేవరెట్ అన్నమాట…”

“……!!?”

“అంతగా ఆశ్చర్యపోకు, వి ఆర్ ట్యూన్డ్ లైక్ దట్. రొమాంటిక్ గా కనిపించే శోభన్ అమ్మాయిల కలల హీరో. ఒకవేళ ఏ డిష్యుం డిష్యుం హీరోనో నచ్చాడనుకో, అదో పెద్ద నేరమన్నమాట.”

సునీత మాటలతో నాకు పూర్తి ఏకీభావం లేదు గానీ, నాకు మటుకు నిజంగానే ఒకప్పుడు శోభన్ బాబంటే చచ్చేంత పిచ్చి. వచ్చిన సినిమా అల్లా వొదిలిపెట్టకుండా చూశాను, శోభన్ బాబు కోసమే. ఇప్పుడనుకుంటే నవ్వొస్తుంది, శోభన్ బాబు కోసం ఎంత చెత్త సినిమాలు చూశానా అని.

“అమ్మడూ, లైట్ తీస్కో. అయినా నా కలెక్షన్లో ఆ హీరో ఈ హీరో అని కాకుండా అన్ని పాటలూ ఉంటాయి. పాత-కొత్త, తెలుగు-హిందీ, క్లాసికల్-వెస్ట్రన్ అన్నీ కలగాపులగంగా వస్తుంటాయి. ఎంజాయ్ చెయ్”  సునీత మాటలతో ఈ లోకంలోకి వచ్చేలోగా…

‘సా…గా…మా…పా…నీ…సా       సా…నీ…పా…మా…గా…సా’ అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయేలా వాణీజయరాం పాడుతోంది.

సీతాకోకచిలుక రిలీజయిన ఆర్నెల్లకు మా ఊళ్లోకొచ్చే నాటికి నాకు సీతాకోకచిలుక ప్రాయం. ‘చినుకులా రాలి – నదులుగా సాగి – వరదలై పోయి – కడలిగా’ పొంగిన కౌమారం శోభన్బాబు మీద పిచ్చిని కాస్త తగ్గించి, టీనేజ్ ప్రేమ సినిమాల వైపు మళ్ళించింది. ఒక్కో పాట టైమ్ మిషన్లా నన్నెక్కడెక్కడికో తీసుకుపోతోంటే మాటల్లేకుండా వింటూ కూచున్నా.

‘హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం…’ హీరో హీరోయిన్ల మీద ఇష్టం దాటిపోయి ఇళయరాజా మేనియాలో ప్రపంచంతో పాటు నేనూ ఊగుతూ పాడుకున్న పాట.

‘చుక్కల్లే తోచావే… ఎన్నెల్లే కాచావే…’ విస్తృతమవుతున్న నా మరో ప్రపంచాన్ని గుర్తుచేస్తూ జేసుదాస్ పాడుతున్నాడిప్పుడు. ఇంటర్ పుస్తకాలతో పాటు చదివిన ఇతర పుస్తకాలతో వికసిస్తున్న మెదడుతో సినిమాలు చూసిన సందర్భం… ‘నిరీక్షణ.’

“ఒక్కొక్క దశలో ఒక్కో రకమైన ఇష్టాలు. ఎంత చిత్రమైంది కదూ జీవితం!”

“హమ్మయ్య, నోరు తెరిచావా? అంతే కదా మరి, మార్పంటూ లేకపోతే జీవితమే కాదు, ఏదీ బాగుండదు. మార్పంటే ఎదుగుదల. అఫ్ కోర్స్ కొంతమందికి పతనం కూడా అనుకో.” సునీత రోడ్డు మీద నుంచి దృష్టి మళ్ళించకుండానే నాతో మాట్లాడుతోంది.

“శోభన్ బాబు మీద ఎంత అభిమానముండేదో అంతకంటే ఎక్కువ ఇళయరాజా అంటే ఇష్టం. కాకపోతే సినిమాలు చూడక్కర్లేదు. పాటలు వింటే చాలు. ఇప్పటికీ తగ్గని ఇష్టం అదొక్కటే. ఈ ఇష్టంలో మాత్రం మార్పు లేదు.”

‘ఓహో మేఘమొచ్చేనూ… ఏదో లాలి పాడెనూ…’ రేవతితో పాటు వాన జల్లుల్లో చిందులేసి, సినిమా హాల్లోనే డిల్లీ వీధులు తిరిగిన ఇంటర్ రోజులు.

“నా జీవితంలో మౌనరాగం సినిమా చూసినన్ని సార్లు థియేటర్లో ఇంకే సినిమా చూసుండను.”

“సరే, సరే, పాటలు వింటూ ఉండిపోదామా, కాస్త కాఫీ యేమన్నా తాగుదామా? ఆల్రెడీ కియా దాటేస్తున్నాం”

“కాస్త ముందుకెళ్తే కుంభకోణం ఫ్రాంచైజీ వస్తుంది. అక్కడ ఫిల్టర్ కాఫీ బావుంటుంది, తాగుదాంలే.”

ఐదు నిమిషాల్లో కుంభకోణం చేరుకున్నాం. సునీత కారు స్లో చేసి రోడ్డు వారగా నిలబెట్టింది. కారు దిగి వొళ్ళు విరుచుకుంటుంటే, నేను “రెండు కాఫీ” చెప్పాను.

“చెప్పు, ఎక్కడెక్కడ విహరించావో?”

“….?” అర్థం కాక చూశాను.

“అదేనమ్మా, పాటల లోకంలో విహరించావు కదా ఇంతసేపూ.”

“ఓ అదా! ఎక్కడ మొదలై ఎలా పోతున్నామా అని ఒక్కో పాట ఒక్కో దశను గుర్తు చేస్తోంది.”

“అంటే అప్పుడలా ఉన్నందుకు అంటే శోభన్బాబు నచ్చినందుకు గిల్టీగా అనిపిస్తోందా? లేకపోతే అలాగే ఉంటే బాగుండేది అనిపిస్తోందా?”

“అస్సల్లేదు, అయినా ఎందుకు అనిపించాలి? ఒక్కో వయసులో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బట్టి మన ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఆ ప్రభావాన్ని దాటుకునో, హత్తుకునో ఎదగడమే కదా జీవితం.”

“ఎగ్జాక్ట్లీ. ఆ మాటకొస్తే అవన్నీ కలిస్తేనే మన జీవితం.” కాఫీ అందుకుంటూ అంది సునీత.

“అవును, ఇప్పుడు కూడా అవే అభిరుచులతో, అవే ఇష్టాలతో ఉంటే అక్కడే ఆగిపోయేవాళ్ళం కదా.” కాఫీ రుచిని ఆస్వాదిస్తూ నేను.

“ఇంకా చాలా దూరం పోవాలమ్మడూ.” నర్మగర్భంగా అంటూ “బయల్దేరదామా?” పేపర్ కప్ డస్ట్ బిన్లో వేయడానికి లేచింది సునీత. కాఫీకి డబ్బులిచ్చి కదిలాను నేను కూడా. కారు మళ్ళీ హైవేపై కదిలింది.

‘శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా…?’ ఈసారి భానుప్రియనుద్దేశించి వెంకటేష్ పాఠం. ఎంసెట్ రోజుల్లోది కదూ స్వర్ణకమలం. విశ్వనాథ్ ఎంత కన్విన్సింగా చెప్పాలని చూసినా ‘పరుగాపక పయనించవె తలపుల నావా… కెరటాలకు తలవొంచితే తరగదు తోవా…’ అంటూ ధిక్కరించిన భానుప్రియే నచ్చింది. భానుప్రియలా కన్విన్స్ కాకుండా “నాకు ఎమ్బీబియ్యెస్ సరిపోదు, డిగ్రీ చదువుతా. డిగ్రీ మటుకు చదువు కాదా.” అంటూ గట్టిగా పెద్దవాళ్ళను ధిక్కరించడానికి ధైర్యం పెంచుకున్న రోజులు. ఆరోజంత గట్టిగా నిర్ణయించుకోకపోతే ఇంకొన్నేళ్ళ జీవితం వేస్టయివుండేది. అసలు ఇప్పుడిలా ఉండగలిగే దాన్నో కాదో.

నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ‘బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట వుంది, దేనికో వోటు చెప్పరా.’ అంటూ బాలు సుధాకర్ రూపంలో టీజ్ చేస్తున్నాడు.

“ప్రపంచీకరణ మొదలయ్యే నాటికి కాలేజీలు ఎలా వుండేవో చెప్పటానికి ఒక ఐకానిక్ మూవీ కదూ శివ. కాలేజీ యూనియన్లు, ఎన్నికలు, గొడవలు భలే ఉత్సాహంగా ఉండేది కాలేజీ వాతావరణం.” సునీత రోడ్డు మీద దృష్టి మళ్ళించకుండానే నా ఆలోచనలు పసిగట్టినట్లు అన్నది.

“అవును, అప్పటి చైతన్యమే వేరు, ఆలోచనా పరిధి మరింత విశాలం కావడానికి, సమాజం పట్ల కాస్త కన్సర్న్ కలగడానికి ఆ కాలేజీ రోజులే పునాదులు వేశాయి. అన్నిటికీ మించి టీచింగ్ లో నా కెరియర్ ను చూసుకోవాలన్న నా కలకు అక్కడే బీజం పడింది.” ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నా.

“అరెరే… మాటల్లో పడి మర్చిపోయాం. ఇటు కదా మనం వెళ్ళాల్సింది.” సోమందేపల్లి క్రాస్ ను పట్టించుకోకుండా నేరుగా హైవే మీద దూసుకుపోతున్న సునీతను ఆపాలని అరిచాను.

“ష్… అరవకు. నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను. ఏంటి పెద్ద ప్రిన్సిపాల్ అయిపోగానే మోస్ట్ ఒబీడియంట్ అనిపించుకోవాలని చూస్తున్నావా? రివర్స్ పీఆర్సీ వొద్దు మొర్రో అని ఎంప్లాయీస్ గోల పెడుతుంటే నువ్వెళ్ళి బిల్లులు పెడతానంటావా? ఇప్పుడెలా చేస్తావో చూస్తా.” స్పీడు ఏమాత్రం తగ్గించలేదు సునీత.

“ఏ… ఏయ్… ఏంటిలా మాట్లాడుతున్నావు? ను… ను…నువ్వు నన్ను కిడ్నాప్ చేయడమేంటి?” అయోమయంలో మాట తడబడుతోంది నాకు.

నా ముఖంలో కంగారు చూసి గట్టిగా నవ్వేసింది సునీత.

“భయపడిపోయావు కదూ, అంత ధైర్యవంతురాలివి ఈ మాత్రానికే భయపడిపోతావా? నిన్నేమీ చేయన్లే తల్లీ.” సునీత మాటలు నా టెన్షన్ను తగ్గించలేదు.

“సోమందేపల్లి రూట్లో మరీ వొళ్ళు హూనమైపోతోంది కదా. మొన్నీ మధ్యే పాలసముద్రం రూటు చూశాను. కొత్తరోడ్డు చాలా బావుంది. హైవే పైన ఓ పది కిలోమీటర్లు పెరిగినా హాయిగా వెళ్లిపోవచ్చు.” అప్పటికీ నాలో ఆందోళన పూర్తిగా తగ్గలేదు.

‘జగడజగడజగడం చేసేస్తాం… ఎగుడు దిగుడు గగనం దున్నేస్తాం…’  స్టీరియో అరుస్తోంది.

“అందరింతే! దున్నేస్తాం, నరికేస్తాం అంటూ చిందేస్తారు. తీరా సమస్యలొచ్చేసరికి, డీలా పడిపోయి, దిగాలు మొహాలేసుకొని విషాద గీతాలు పాడుకుంటూ శూన్యం లోకి నడుస్తుంటారు.” నన్నే అన్నట్టుంది సునీత.

“అబ్బ, అదేం లేదులే. నువ్వలా సడన్ గా అనేసరికి…” భుజాలు తడుముకున్నాన్నేను.

“నిన్ను కాదులేబ్బా. చాలా మంది గురించి. సరే గానీ, ఇదుగో ఈ ఎడమవైపు రోడ్డు కదిరికి పోతుంది. కుడివైపు తిరిగితే పాలసముద్రం. ఎప్పుడూ చూసిన దారి కాకుండా ఇవాళ కొత్త దారి చూడు.” స్టీరింగ్ కుడివైపు తిప్పుతూ అన్నది సునీత.

“కొత్త దారంటే గుర్తొచ్చింది. ఎన్నాళ్ళయిపోయిందో కొత్త ప్రదేశాలకు వెళ్లి. కరోనా పుణ్యమా అని ఎక్కడికీ కదల్లేదు.”

“ఇంకేం కరోనా? అంతా నార్మల్ అయిపోతుంటే. మరీ దూరం కాకపోతే కార్లో దగ్గరి ప్రాంతాలు చూసి రావచ్చు కదా.” సింగిల్ రోడ్డుపై మెత్తగా కారు పోనిస్తూ అన్నది.

“ఏంటి పోయేది? నలుగురం నాలుగు దిక్కులైపోయాము. ఎప్పుడన్నా ఏ కాన్ఫరెన్సుల కోసమో, ట్రైనింగ్ కోసమో వెళ్ళినపుడు రమ్మంటే వీళ్ళు కదలరు. అలా వెళ్ళినప్పుడు ఒక్కదాన్ని చుట్టుపక్కల తిరిగి చూద్దామంటే పిల్లల్లేకుండా ఎందుకులే అని ఏమీ చూడకుండా తిరిగి వచ్చేస్తాను. ఒక్కోసారి ఎంత కోపమొస్తుందో?”

“పిల్లలకు ఇంకా చాలా జీవితం ఉంది, వాళ్ళు ఎప్పుడైనా చూస్తారు మన తోడు కూడా అవసరం లేకుండా. మనం మాత్రం చూడాలనుకున్నవి చూసేసెయ్యాలి. కర్ణాటకలో ఆవిడెవరో అరవై ఏళ్ళ తర్వాత మొదలెట్టి ప్రపంచమంతా చుట్టేసిందట. ఆవిడకిప్పుడు డెబ్భై ఎనిమిదేళ్ళు. మనకంత అవకాశం ఉంటుందో లేదో తెలీదు. కేవలం మహిళల కోసమే మహిళలే నడుపుతున్న ట్రావెల్ ఏజెన్సీలున్నాయి. వెళ్దామంటే చెప్పు, వచ్చేనెలలో ఓ ట్రెక్కింగ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం.” సునీత గొంతులో ఉత్సాహం.

“ట్రెక్కింగ్ ట్రిప్పా?” నీరసంగా అన్నాను.

‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…’  స్టీరియోలో సునీతతో గొంతు కలుపుతూ సునీత కళ్ళెగరేసింది.

“అది సరేగానీ నువ్వెందుకు డ్రైవింగ్ నేర్చుకోలేదు? నేర్చుకొనుంటే హాయిగా నీ కారు నువ్వే నడుపుకుంటూ వెళ్ళుండేదానివి కదా ఇవ్వాళ.” పాడటం ఆపి అడిగింది.

“ఎందుకు నేర్చుకోలేదు, ఒకటి కాదు, రెండు సార్లు ఎనిమిదెనిమిది వేలు కట్టి మరీ నేర్చుకున్నాను. ట్రైనింగ్ కారులో బాగానే నడిపాను. మా కారులో ప్రయత్నించబోయినప్పుడు కాస్త అటూఇటూ అయ్యేసరికి మా మహానుభావుడు ‘నీకేం రాదు, నువ్వు తోలలేవు.’ అంటూ డిస్కరేజ్ చేశాడు. ఆ దెబ్బతో డ్రైవ్ చెయ్యాలన్న కోరికే చచ్చిపోయింది. ఈ లోగా ప్రిన్సిపాల్ అయిపోయానా, కాస్త పొగరెక్కి, నాకేమవసరం కారు నడపటానికి, కావాలంటే డ్రైవర్ని పెట్టుకుంటా అనుకొని పూర్తిగా వొదిలేశా.

“ఓహో పొగరెక్కువైతే ఇతరుల మీద ఆధారపడతారా? నేనింకా ఎవరితో అవసరం లేకపోతే పొగరెక్కువవుతుందనుకుంటున్నానే.” సునీత మాటలను అడ్డుకుంటున్నట్లు సూరజ్ కోసం మహమ్మద్ రఫీ అందుకున్నాడు,

‘బహారోం ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయా హై!’

బ్లాక్ అండ్ వైట్ ఫిలిప్స్ పోర్టబుల్ టీవీ గృహప్రవేశం చేసేనాటికి హిందీ సినిమాలతో అస్సలు పరిచయం లేదు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆదివారం పొద్దున్నే అత్యంత ఇష్టంగా మారిపోయిన దూరదర్శన్ రంగోలీ కోసం ఎదురు చూసిన రోజుల్లో విన్న ఆపాత మధురాల్లో ఇదీ ఒకటి. ఆ రోజులను మరింతగా గుర్తుచేస్తూ కిషోర్ కుమార్ అందుకున్నాడు రఫీ ఆపగానే, ‘ఖిల్తే హై గుల్ యహా!’ బయటెక్కడో పేపర్ చదువుకుంటూ కూర్చున్న నాన్న అమాంతం లోపలికొచ్చేలా చేసేదీపాట. ఇదొక్కటేనా? ‘చౌధవీ కా చాంద్ హో’ ‘ఆధా హై చందమా రాత్ ఆధీ’ ‘ఖొయా ఖొయా చాంద్ – ఖులా ఆస్మాన్’  నాన్నకూ, నాకూ కామన్ ఫేవరెట్స్ చాలానే ఉన్నాయి. పాటల పల్లకిలో ఊరేగుతున్న నన్ను ఒక్క దెబ్బ చరిచి ఈ లోకం లోకి వచ్చేలా చేసింది సునీత.

“ఎంత కాలం అయ్యిందేం పాటలు విని? అంతగా లీనమయిపోయావు. మీ పిల్లలకు పాటలంటే ఇష్టం లేదా?”

“ఎందుకు లేదు, నాకంటే కూడా ఎక్కువ పిచ్చి. కాకపోతే అన్నీ ఇంగ్లీషు, కొరియను ఇవే. వాళ్ళతో పాటు వీళ్ళూ చిందులేస్తూ అరుస్తుంటారు. నాకా అవి అర్థం కావు. ఈ పాటలో ఎంత ఫిలాసఫీ ఉందో తెలుసా? అంటూ నన్నో నిరక్షరకుక్షిని చేసి మాట్లాడతారు. అయినా మనం నేర్పించకపోయినా వాళ్ళు అన్నేసి భాషలు నేర్చుకుంటుంటే కాస్త గర్వంగానే ఉంటుందనుకో.” పులకించిపోతూ చెబుతున్న నన్ను అదోలా చూసింది సునీత.

‘జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవితం నాది…’  శ్రీ తత్వం పాడుతున్నాడు ప్రభాస్ కోసం.

“అవునూ, అప్పట్లో ఆడవాళ్ళం శోభన్ బాబు పిచ్చిలో ఉంటే అదేదో ఆడ లక్షణం అన్నావు కదా, మరి ఇప్పటి అమ్మాయిలంతా ప్రభాస్ పిచ్చిలోనో, మహేష్ బాబు మేనియాలోనో పడిచచ్చిపోతున్నారు కదా, దాన్నేమంటావు?” భలే దెబ్బ తీశాను కదా అన్నట్టు చూశాను సునీత వైపు.

“రెండూ ఒకటే. రెండు సందర్భాల్లోనూ మనల్ని మనం కోల్పోవడమే అసలైన విషాదం. శోభన్బాబు సినిమాల్లో ఆత్మగౌరవంతో భర్తనుండి విడిపోతే అహంకారిగా చూపించి, చివర్లో భర్తకు క్షమాపణలు చెప్పిస్తారు. ఇప్పటి సినిమాల్లో ఒక లక్ష్యానికి కట్టుబడ్డ ఒక ధీర వ్యక్తిత్వాన్ని అత్యంత అనాగరికంగా, మొరటుగా ఎక్కడెక్కడో చేతులేసి, బలవంతంగా అందంగా తీర్చిదిద్దగానే ‘పచ్చ బొట్టేసినా పిల్లగాడా నిన్ను’ అని మైమరచిపోయి వాటేసుకునేలా పాటలు తయారవుతున్నాయి. ఆడవాళ్ళు ఉంటే సబార్డినేట్ గా ఉండాలి, లేదా రక్త మాంసాలున్న సరుకుగా ఉండాలి. అంతే కానీ ఆలోచించే మెదడున్న మనిషిలా మాత్రం ఉండకూడదు. ఏ కాలమైనా సినిమాల్లో సూత్రం ఇదే. ఎక్కడా స్త్రీ వ్యక్తిత్వాన్ని చూపడం ఉండదు.” సునీత విశ్లేషణకు అడ్డుపడుతూ,

‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు… నడవరా ముందుగా…  అటో ఇటో ఎటో వైపు.’  అంకురం మొదలైంది.

“ఎంత మంచి సినిమా కదా, రేవతి మీద ఇష్టాన్ని గౌరవంగా మార్చింది. ఈ మొలక మాత్రం పెద్దది కానేలేదు.” దీర్ఘ నిశ్వాసం తో నేను.

“సినిమా వాళ్లకు ఇలాంటి అంకురాలు కాదమ్మా కావాల్సింది, కాసులు కురిపించే కొమ్మలు.” మా చర్చ ఇలా జరుగుతుంటే ఇంకో పాట శోభన్ బాబు కోసం జేసుదాస్ గొంతులో…

‘ఓ బాటసారీ… ఇది జీవిత రహదారీ…’

“మళ్ళీ శోభన్ బాబు పాట. మొత్తానికి నీకూ శోభన్ బాబంటే పిచ్చే.” ఎటు తిరిగీ సునీతను దొరికించుకోవాలని నేను.

“మరే…” గట్టిగా నవ్వేసింది. అలా నవ్వుతూండగానే సునీత కళ్ళు వాలిపోతున్నాయి.

“అరె ఏమయింది? స్టీరింగ్ సరిగ్గా పట్టుకో.” నా గొంతులో వొణుకు.

“ఏం… ఏం… కాదులే. భయప…డ..కు…” నిదానంగా బ్రేకేసి రోడ్డు పక్క వారగా కారు నిలుపుతూ, “షుగర్ లెవెల్ ఫ్లక్చుయేట్ అవుతున్నట్లుంది.” అంటూనే స్టీరింగ్ పై తల వాల్చేసింది.

“అయ్యయ్యో ఇప్పుడెలా?” నా భయం ఇంకా పెరిగిపోయింది.

కిందికి దిగి చుట్టూ చూస్తే జన సంచారం లేదు. వెనక ఊరు దాటి చాలా దూరం వచ్చేశాము. ఇంకా ముందు ఎంత దూరముందో తెలీదు. గూగుల్ చేయబోతే సిగ్నల్ లేదు.

‘ఇప్పుడెలా…? ఇదసలే కొత్త దారి. ఇంకా ఎంత దూరముందో తెలీదు. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా తప్పు చేశానా?’

@@@@@

ప్రస్తుతం…

‘జిందగీ ఏక్ సఫర్ హై సుహానా… యహా కల్ క్యా హో కిస్నే జానా….’  స్టీరియో తన పాటికి తను పాడుకుంటూనే ఉంది.

నిజమే రేపేమవుతుందో తెలీదు, రేపేంటి? ఇంకాసేపటికి ఏం జరగబోతోందో తెలీదు. అదే కదా జీవితం. ఎప్పుడో బస్సులో అప్పుడప్పుడు పలకరించిన సునీత ఇలా ఎదురుపడుతుందని తెలీదు. వొంటరి జీవితం… నేనేం జాలిగా అడగలేదు కానీ, పెళ్ళెందుకు కాలేదంటే చళ్ళున సమాధానం చెప్పింది, “కాలేదు కాదు, చేసుకోలేదు. బై ఛాయిస్ అంతే.” “కుటుంబం బలం అనుకుంటాం గానీ నాకేమో బలహీనత అనిపిస్తుంది, ఒక అభద్రతా భావాన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుందో, అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుందో నాకర్థం కాదు. నా వరకు నాకు విశ్వమంతా నా కుటుంబమే. నా చుట్టూ ఉండేవాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూసుకుంటే, వాళ్ళూ నన్నూ అలాగే చూస్తారు కదా. నా కొచ్చిన లోటేమీ లేదు.” అనేక ప్రశ్నలకు సునీత నుంచి వచ్చిన సమాధానాల సారాంశం. ఇంకెప్పుడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు నేను.

హ్యాండ్ బ్యాగ్ వెతికి చాక్లెట్లేవో దొరికితే సునీతను లేపి తినిపించి, కొంచెం నీళ్ళు తాగించాను. నీళ్ళు తాగింతర్వాత కాస్త కుదుటపడింది తను. కానీ డ్రైవింగ్ చేయడం కష్టమని అర్థమవుతోంది. నన్ను అర్థం చేసుకున్నట్టు సునీత అందుకుంది.

“నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా, ఈ రూట్లో పెద్ద ట్రాఫిక్ ఉండదు. పైగా ఈరోజు బంద్ కావడం వల్ల వాహనాల రద్దీ ఇంకా తక్కువగా ఉంది. నిదానంగా డ్రైవ్ చేస్తే ఇబ్బంది లేకుండా చేరుకోగలం. ఎంత ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుందంతే.” సునీత మాటలతో నేను షాక్ తిన్నాను.

“నేను డ్రైవ్ చేయడమేంటి, నాకు లైసెన్సు లేదు, పూర్తిగా నేర్చుకోనూ లేదు. ఎవరినన్నా రమ్మని ఫోన్ చేద్దాం.” నేను ఒప్పుకోలేదు.

“సిగ్నల్స్ ఉన్నాయా ఫోన్ చేయడానికి? నేనున్నాను కదా, పక్కనే ఉండి నిన్ను గైడ్ చేస్తాను. పద బయల్దేరదాం.”

“ఏదన్నా జరిగితే…? ఎందుకొచ్చిన గొడవ. నేను డ్రైవ్ చేయను.” మొండిగా అన్నాను.

“ఇక్కడే ఉన్నామంటే నా పరిస్థితి మళ్ళీ దిగజారొచ్చు, నీ పని కూడా నిలబడిపోతుంది. నేనున్నాను కదా. భయపడకుండా పద.” ఇక తప్పలేదు నాకు.

కింద రాలిన లేత గులాబీ రంగు పూలు చూసి, పైకి తలెత్తిచూశాను. చెర్రీ బ్లోసమ్స్ ను తలపిస్తూ గుత్తులు గుత్తులుగా గులాబీ రంగు  పూలు. ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో కదా! ఎక్కడో హిమాలయల్లోనో, ఈశాన్య రాష్ట్రాల్లోనో పూస్తాయిట చెర్రీ బ్లోసమ్స్. అలాంటివే ఇవీనూ, ఈ రాళ్ళ సీమలో. తరచిచూస్తే ఇక్కడా పచ్చదనం కనిపిస్తుందప్పుడప్పుడూ. అప్పుడప్పుడూ కనిపించే ఈ పచ్చదనాన్ని, విరబూసిన రంగురంగుల పూలను చూస్తుంటే, డార్విన్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సిద్ధాంతం గుర్తొస్తుంటుంది. ఏ ప్రాణులైతే తమ చుట్టూ ఉన్న పరిస్థితులకనుగుణంగా తమను తాము మార్చుకుని మెరుగుపడతాయో అవి అద్భుతంగా మనుగడ సాగించగలుగుతాయిట. అలా మార్చుకోలేనివి అంతరించిపోతాయిట. మనుషులూ అంతేనేమో. నేనూ మారాను, మారుతున్నాను, ఇంకా మారాలి. ఇక తప్పలేదు నాకు.

సునీత కారు దిగి రెండోవైపు సీట్లో కూర్చుంటూ, “వెళ్లి అక్కడ కూర్చో.” నీరసంగానే అయినా హుకుం జారీ చేసింది.  నేను భయంభయంగానే స్టీరింగ్ ముందు కూర్చుని సీటు సర్దుకున్నాను. డ్రైవింగ్ క్లాసులు గుర్తు చేసుకుంటూ మెల్లగా క్లచ్ తొక్కి గేరు మార్చాను. వొణుకుతూనే ఇరవైకి మించకుండా నిదానంగా కారును ముందుకు కదిలించాను.

“గేరు మార్చు, స్పీడు పెంచు.” సునీత ఎంత చెప్పినా వినిపించుకోకుండా మెల్లగానే నడిపాను భయంభయంగా.

పది నిముషాలు గడిచాయి.

“అదుగో అదే కొట్నూరు. అక్కడ అనంతపురం హిందూపురం రోడ్డు లోకి కలుస్తాము. లెఫ్ట్ కు తిరిగితే హిందూపురం.” సునీత మాటలు వింటుంటే నాకింకో భయం పట్టుకుంది. ఇప్పటి దాకా ట్రాఫిక్ ఏమీ లేనందు వల్ల ఎలాగోలా తోలేశాను. ఇక ఇక్కట్నుంచి వాహనాల రద్దీ, తిరిగే జనాలు.

“ఎందుకొచ్చిన గొడవ సునీతా, ఇక ఎవరినన్నా రమ్మందాం. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి కదా.”

“ఇప్పటి దాకా వచ్చేశావు కదా, ఇంకెంత నాలుగు కిలోమీటర్లు. జనాలను చూసి భయపడకు. నిదానంగానే నడుపుతున్నావు కదా, పక్కకు సర్దుకుంటార్లే. హారన్ కొడుతూ ఉండు.”

‘నూనూగు మీసాల పోరగానివి నువ్వు బాల సూర్యునోలె ముందు నడవాలే…

          కంటికి దూరము కాళ్ళకు దగ్గర చేరవలసిన చోటు చేరుకోవాలే…’  స్టీరియోలో శంకర్ మహదేవన్ ధైర్యం చెబుతున్నాడు.

కొంచెం దూరం నడిపేసరికి భయం దాదాపుగా పోయింది. హిందూపురం లోకి ఎంటరవగానే అన్నాను.

“ముందు డాక్టర్ దగ్గరికెళ్దాం. నిన్ను డాక్టర్ దగ్గర చూపించి ఆతరువాత నేను కాలేజీ కెళ్తాను.”

“ముందు నీ కాలేజీ దగ్గరకు పద, అక్కడ నిన్ను దించి తరువాత చూద్దాం.” ఈ సునీత ఏ మాటా వినదు.

“అది కాదు, ముందు నిన్ను…” నా మాట నోట్లో ఉండగానే,

“ముందు కాలేజీ దగ్గరికి పద.” ఆ దబాయింపుకు జడిసి, కాలేజీ దగ్గరకు కారును మెల్లగా చేర్చాను.

“ఇప్పుడైనా నా మాట వింటావా? ఆఫీస్ వాళ్ళెవరన్నా ఉంటే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెబుతాను.” సీట్ బెల్ట్ తీస్తూ అన్నాను.

“ఎందుకట?” గడ్డం కింద చేయి పెట్టుకుని అడిగింది.

“ఎందుకా? కాసేపటి క్రితం భయపెట్టావే అందుకు. ముందా షుగర్ లెవెల్స్ చెక్ చేసి లెవెల్ చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది.”

“నా షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నార్మలే. బీపీ, డయాబెటిస్ ఇలాంటివేవీ నా దరిదాపుల్లోకి కూడా రావు. నువ్వేం బెంగ పెట్టుకోకు.” చిలిపిగా కన్నుగీటింది.

“అంటే… కళ్ళు తిరిగి పడిపోవడం…?”

“లేకపోతే నువ్వు స్టీరింగ్ పట్టుకునే దానివా? నీళ్ళలో పడేస్తేనే కదా ఈత నేర్చుకునేది. వచ్చేసినట్లేనా డ్రైవింగ్?” చలాకీగా లేచి స్టీరింగ్ ముందు కూర్చుంది.

“ఓసినీ… ఎంత నాటకమాడావు? నిన్నూ… భయపెట్టి చంపావు గదే. పోన్లే… ఎలాగయితేనేం ఓ ప్రయాణం ముగిసింది. కాదు కాదు, సరికొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎక్కడికో పోదామన్నావు కదా, బుక్ చేసెయ్. వెళ్ళిపోదాం.” నా నవ్వుతో సునీత శ్రుతి కలిపింది.

‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై…. ఆజ్ ఫిర్ మర్నేకా ఇరాదా హై…’ స్టీరియోలో లతాతో పాటూ నేనూ హమ్ చేస్తూ లోపలికెళ్ళాను.

– ప్రగతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో