భారతదేశంలో అనేక గిరిజన జాతులు వారు ఆయా రాష్ట్రాలలో జీవిస్తున్నారు. ఏ తెగకు ఆ తెగ ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని అడవులు, కొండ ప్రాంతాలలో గిరిజనులు నివసిస్తున్నారు. ప్రకృతిలో ప్రకృతిగా కలిసిపోయి, అడవుల పైన ఆధారపడి జీవించేవారు ఆదివాసీలు. ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రదేశానికి తరలి వెళ్లే అస్థిరనివాసులు (మొబైల్ రెసిడెంట్) సంచార తెగలు. ఒకప్పుడు అడివిని ఆశ్రయించి జీవించి కారణాంతరాల వల్ల ఎప్పుడో మైదాన ప్రాంతాలలోకి వచ్చి స్థిరపడి అక్కడ బ్రతుకు తెరువు కోసం విద్యలను లేదా శ్రమను నమ్ముకుని, ఎక్కువ కాలం బయటి ప్రాంతంలోనే సంచారం చేస్తూ జీవించే సామాజిక వర్గాలు. కుల వృత్తుల పైన ఆధారపడి ఇతర కులాలకు ఆశ్రిత కులాలుగా జీవించే తెగలు అర సంచార తెగలు. వీళ్లు గిరిజనులని రాసాని గారు పేర్కొన్నారు.
గిరిజన సాహిత్యం గురించి ప్రస్తావించాలి అంటే ఈ సాహిత్యం ఈ మధ్యకాలంలో వస్తున్నది కాదు. చింతా దీక్షితులు వారు రచించిన సుగాలి కుటుంబం, (సాహితీ – 1921 తెనాలి నుండి వెలువడే పత్రిక) అలాగే చెంచు దంపతులు (1922), సఖి పత్రికలో 1925లో చెంచు రాణి అనే కథలు వెలువడ్డాయి. (అక్కిరాజు రమాపతి గారు తెలిపారు – మే 2010 విపుల) అలాగే వీరి నుండి వచ్చిన సంచార, అర సంచార జాతుల గురించి మొట్ట మొదటగా వచ్చిన కథలని విమర్శకులు తెలిపారు. గూడూరు రాజేంద్ర రావు 1925లో భారతి పత్రికలో చెంచి అనే కథను ప్రచురించినట్లుగా తెలుస్తుందని రాసాని గారు పేర్కొన్నారు. అసలు సాహిత్య రూపంలోకి రావడానికి చిత్రించడానికి కారణం గిరిజనుల నిత్య దారిద్ర్యం అవిద్య, అజ్ఞానం, అమాయకత్వం మూలంగా రోజు రోజుకి ఛిద్రమైపోతున్న గిరిజన బతుకుల్లో అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నా అలజడి, ఆరాటం, పోరాటం, ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుని వందల ఏళ్ళ నుంచి అడవి బిడ్డలను పట్టిపీడిస్తున్న దోపిడి అనిచివేత, వాటి మూలంగా కలిగిన అభద్రతా భావం తెలుగు కథకుల్ని కూడా కదిలించాయని రాసాని గారు పేర్కొన్నారు.
కథల రూపంలో వచ్చిన గిరిజనుల వెతలను, అలాగే వారి సంస్కృతి సాంప్రదాయం, భాష, యాస వంటి అనేక అంశాలను తెలియజెప్పే కథలను ఏర్చి కూర్చి 2009 ప్రతిభ ప్రచురణలు వారు ఇప్పపూలు అనే కథా సంకలనాన్ని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, జీవన్ గార్ల సంపాదకత్వంలో ప్రచురించారు. దళితోద్యమం ఇచ్చిన స్ఫూర్తితో, ఎవరి అనుభవాలు అనుభూతులు వారే అక్షరీకరించాలి అనే సైద్ధాంతికత ఆధారంగా నేడు గిరిజన సాహిత్య రచన, అధ్యయనం, గిరిజన భాషలు, సంస్కృతి పై స్వీయ తెగలు, అలాగే ఇతర ఔత్సాహిక పరిశోధకులు పరిశీలించడానికి, పరిశోధించడానికి నడుంబిగించారు.
కథకుని పరిచయం –
మళ్లీపురం జగదీష్ గారు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పి.ఆమిటిలో జన్మించారు. ఐ.టీ.డీ.ఏ.లో ఉపాధ్యాయులుగా (ఆంగ్ల ఉపాధ్యాయులు) వారు ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలలోనే (టిక్కుబాయిలో) పని చేస్తున్నారు. వీరు రచించిన కథలను గాయం, శిలకోలా, గురి అనే కథా సంకలనాలుగా ముద్రించబడ్డాయి. వారి స్వీయ అనుభవాలు అనుభూతులను గిరిజనుల వాస్తవ పరిస్థితులను అద్దం పట్టే విధంగా వారి కథలు రచన చేయబడ్డాయి.
వారి తొలి కథా సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి. మరో కథా సంకలనం అయినా గురిలో పదమూడు కథలున్నాయి. వీరి కథలను చదవడం ద్వారా గిరిజనుల జీవన విధానం అలాగే వారి బతుకు వ్యదలను గమనించవచ్చు. వీరి కథల గురించి కారా మాస్టారు ముందు మాట రాస్తూ “ఈ రెండో తరం స్ఫూర్తితో కలం పట్టిన మూడో తరం వారిలో మల్లిపురం జగదీష్ ఒకడు. నేనెరిగిన మేరకు అతడు అచ్చమైన కొండ బిడ్డ కూడా. అందుచేతే అక్కడ గతంలోనూ వర్తమానంలోనే ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకో గోరే వారికి అతని రచనలు అమూల్యాలనిపిస్తాయి. ఆ కారణం చేతనే అతను చేసే ప్రతి రచనను నేను శ్రద్ధగా చదువుతుంటాను చదివించిన అంతకాలం” అని తెలియజేశారు. (పుట- 7- శిలకోల)
గిరిజన జీవన విధానం:
శిలకోల కథలలో గిరిజనుల జీవితాన్ని చిత్రీకరించారు మల్లిపురం జగదీష్. ఈ ఆధునిక కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐ.టీ.డీ.ఏలు వాటితో పాటు ఏర్పాటు చేసిన గిరిజన విద్యాలయాలు కొన్ని, గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేసే కార్పొరేషన్ సౌకర్యాలు ఇవి ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తున్నాయో మనకు వీరి కథల ద్వారా తెలుస్తుంది.
గిరిజనుల సంస్కృతిలో భాగంగా వారు చేసుకునే కొత్త ఎడు పండుగ జాకరమ్మ, గొడ్డలమ్మ వేడుకలు వంటివి సామూహిక ఉత్సవాలు వారి ఆనందాలను ప్రకటించు కొనడానికి తుడూం డప్పు థింసా నాట్యం ప్రదర్శిస్తారు. చాప క్రింద నీరు లాగా ఒకపక్క మత మార్పిడి తద్వారా వారిదైన సంస్కృతి సాంప్రదాయం వేడుకలు కళారూపాలైన తుడూం డప్పుల విన్యాసం థింసా నాట్యం కనుమరుగు కావటం గమనించవచ్చు.
గిరిజనులు విద్యావంతులై, వారి చదువులకు తగిన విధంగా ఉద్యోగాలు పొంది ఆయా ప్రాంతంలోని పనిచేస్తున్న గిరిజనులు పల్లపు ప్రాంతాల్లో మాదిరిగా అవసరం లేని సౌకర్యాలు, మద్యం సేవించడం, ఇతర దురలవాట్లు చేసుకున్నారు. ఇవి అన్నింటితో పాటు నగర ప్రాంతం వారితో స్నేహం చేసి సొంత మనుషులపై లైంగిక దాడికి కూడా పాల్పడడానికి కారణం అవుతున్నారు.
కొండలలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించడానికి, వారి గ్రామాలలో సాకుల కోసం ఎదురు చూసి, మరణాలను బూచిగా చూపి, అక్కడి సహజ సంపదను దోచుకోవడం ఈ కథలో చూస్తాము. గిరిజనుల అమాయకత్వం, మూర్ఖత్వం నిండు ప్రాణాలను కూడా చిల్లంగి అని పేరు చెప్పి, జీవితాలను చిధ్రం చేసి పిల్లలను ఆనాథలను చేస్తున్న క్రమాన్ని ఈ కథలో గమనిస్తాము.
ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని కథలను పరిశీలిద్దాము.
అక్షరాల దారిలో ఈ కథలో సన్నాయి అనే విద్యార్థి హాస్టల్ వాతావరణం, అక్కడి భోజన పానాదులు నచ్చక పోవడం, అలాగే వారి ఆహారంలో రాళ్ళు, పురుగులు రావడం కష్టంగా భావించాడు. ఇంకా అక్కడి హాస్టల్ వార్డెన్ విద్యార్థులను సొంత పనులకు వినియోగించుకుంటూ దుర్లవాట్లకు దారితీసే విధంగా మద్యం, సిగరెట్లు తెప్పించు కోవడం కనిపిస్తుంది. మరో వైపు విద్యార్థులను సందు దొరికితే వార్డెన్ లెక్కల మాస్టారు, డ్రిల్ మాష్టారు బెల్టుతో కొట్టడం గమనిస్తాము.
అయితే ఈ సన్నాయి పాఠశాల నుండి ఇంటికి వచ్చి ఆనందంగా రోజు గడిపిన పాఠశాల పాటల మాష్టారు పాటలు, వారి పాఠాలు గుర్తుకు వచ్చి బాధ పడ్డాడు. అక్కడి పరిస్థితుల్లో ఇక బడికి వెళ్లకూడదని అనుకుంటాడు.
పాటల మాష్టారు సన్నాయి ప్రతిభను గుర్తించి తను వేసిన హంస బొమ్మకు అసలైన రంగులు అద్దించి తన బొమ్మను అందరికీ చూపి పరిచయం చేసి ప్రోత్సహించారు. సన్నాయి ఇంటికి వచ్చిన ఆ రోజు సాయంకాలం సన్నాయిని చూడ్డానికి పాటల మాష్టారు వచ్చారు. సన్నాయి నీ బయటకు నడిపిస్తూ బడికి రావాలని పిలువగా చాలా దుఃఖించాడు. ఎందుకు ఏడుస్తున్నావనీ అడిగితే సమాధానం లేదు. అంతలో మామిడి చెట్టు పైన మామిడి కాయను చూపిస్తూ ఆ పండు బాగుంది, కొట్టి ఇవ్వవవు అని అడిగితే టక్కున మామిడి పండు కొట్టి ఇచ్చాడు. అప్పుడు పాటల మాష్టారు నీవు పండు కోసం ఈ చుట్టున్న కంప మొక్కలు రాళ్ళు రప్పలు అలాగే చెట్టు కొమ్మలు ఆకులు అడ్డు వున్న ఆ పండును గురి చూసి కొట్టావు. దృష్టి మొత్తం పండు పై పెట్టి నీవు ఆ పని చేశావు. విద్య కూడా అలాగే అంటూ చుట్టూ ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్న విద్యపై దృష్టి సారించాలనీ బోధించి బడికి సన్నాయే వచ్చేలా మార్పును తీసుకువచ్చారు పాటల మాష్టారు.
“అడవి చిరుగాలై నవ్వింది
పెరట్లో నెమలి పురివిప్పి ఆడింది.” – పుట-31
అరణ్య రోదన – ఈ కథలో సాయుధ పోరాటంలోని వ్యక్తులు ఆకలి అంటు వచ్చి నిలబడి ఉంటే బూదా తల్లి రెండు నిమిషాల్లో కొర్ర బువ్వ వండి పెట్టింది. వారు ఎదురుపడ్డాగానే కొంత భయపడిన తనకు హాని చేయరు అనే నమ్మకంతో ఉంది. అయితే సాయుధ వీరుల కాల్పులలో ఆమెకు బులెట్ తగిలి మరణిస్తుంది. ఆ బుధడు ఆనాథ అవుతాడు. ఈ పాపం ఎవరిది అంటు సాయుధ వీరులకు, రాజ్యానికి ప్రశ్నను సంధిస్తాడు కథకుడు.
బూదా తల్లి “సూడన్నా మీలెవరో నాకు తెలీదు…. అక్కా అన్నారు ఆకలేస్తుందన్నారు…. జావొండి పెట్టేను. ఆ మాట కొస్తే మీరే కాదు ఈ కొండకి ఎవలొచ్చినా ఒట్టినే పంపము. పండో, కాయో…. సేతి లెడతం. అందర్నీ నమ్ముతం కొండైనా, కొండల్ల పుట్టి నోలమైనా కడుపు నింపడమే తెల్సు” అని అంటుంది. గిరిజనులు ఔదార్యానికి వారి ఔనత్యానికి ఇంతకన్న మరో తార్కాణం అవసరం లేదు.
ఉరులు – ఉరులు అనే కథలో సొంబుర గిరిజనుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అయితే ఇతడు చదువును మధ్యలో అపివేసిన మళ్ళి వారి మాష్టారు సహాకారంతో, ప్రోత్సాహంతో పదవ తరగతి పాస్ అయ్యాడు. సొంబుర తల్లిదండ్రులను కొండపైనే వదిలి తాను ఉద్యోగం పేరుతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాని అద్దె ఇంటిలో గడుపుతున్నాడు. సొంబుర తండ్రి తన అటవీ ఉత్పత్తులను పండ్లను సంతలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఇంట్లో వాడుకొనే సరుకులు కొని ముసలమ్మ అడిగిన చుట్ట కోసం డబ్బులు లేక పల్లపు ప్రాంతంలోనే ఉన్న సొంబుర ఇంటికి వేళ్ళాడు. కొడలు కుర్చి వేసి ఫాన్ వేసింది త్రాగడానికి నీళ్ళు ఇచ్చింది. ఆమె దూరంగానే ఉంటూ ఈ పనులు చేసింది. కొడుకు గురించి అడిగితే మీ కోసమే సంతకు వేళ్లాడని చేప్తుంది. అప్పుడే పోలీసుతో వచ్చిన అప్పులోడిని చూసి వణికి పోయిన కోడలను గమనించాడు. సొంబురడు ఇంట్లోని సౌకర్యాల కోసం చీటిలు వేసి అవి కట్టకుండా పారిపోయాడనే విషయం తెలుసుకొన్నాడు. గిరిజన తాత తన కొడుకు చదువుకోకుండా ఉండి వుంటే ఈ రోజు దొంగలాగా పారిపోవలసిన అవసరం రాదు కదాని అనుకొంటాడు. ఈ కథలో గిరిజన పోడు వ్యవసాయ కష్టం, షావుకారు నిర్ధయ, అప్పుల ఊబి వంటి సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. గిరిజనులకు విద్యావంతులు అయి ఉద్యోగులుగా ఉన్నా, పోడు వ్యవసాయం చేసి కాలం వెల్లదీస్తూన్న, ఈ ఆర్థిక సమస్యల నుండి విమూక్తి పొందలేకున్నారని అనుకొంటాడు తాత. అయితే పదవ తరగతిలో సహాయం చేసిన మాష్టారు గారే ఏదొక్క ఉపాయం చెప్పగలరని ఆయని వెతుకుంటూ తాత బయలుదేరాడు.
కలలు కాలుతున్న వాసన- అనే కథలో గిరిజనులు కొంత చదువుకొని షావుకారు దగ్గర పని చేస్తూ వారి జీవనం కొనసాగుతూంది. గిరిజన సంస్కృతిలో జీలుగు కల్లు త్రాగడం ఉంది. అది కూడా పండుగల సందర్భంలో తప్పమరి దొరకదు. ఆ ఉత్సవానికి ఆనందానికి ప్రతీకగా జీలుగు కల్లు త్రాగి నృత్యం చేస్తారు. ఈ కథలో వాసు ఉద్యోగస్తునిగా తనకు అవసరం లేని వస్తు సామగ్రితో అది కూడా నెలకు కొంత సొమ్ము కట్టే పద్ధతిలో తీసుకుంటూ ఉంటాడు. తను రోజు తాగుతూ ఇంటికి తనతో కూడా స్నేహితులను తేస్తూ ఉంటాడు. ఒక రోజు వాసు భార్య పై తాగి ఎగబడారు. అప్పడు ఇల్ల పక్కన వాళ్ళు వచ్చే సరికి పారిపోయారు. చెల్లెమ్మ అంటు ఇంత పాపానికి ఒడిగట్టారు. వాసు త్రాగుడుకు బానిస అయ్యాడు. పై పెచ్చు అసాంఘిక నృత్యాలు చూసి, అలాగే నీలి చిత్రాలు చూపి భార్యను హింసించేవాడు.
ఈ కథలో గిరిజనులు ఏ విధంగా చెడు ప్రభావాలకులోనైయి విచక్షణ జ్ఞానం కోల్పోయి చివరికి భార్యను కూడా అకృత్యాలకు ప్రోత్సహించడం, అలాగే చుట్టు చేరిన వారు కూడా ఎటువంటి అఘాయిత్యానికి అయిన పాల్పడేవారితో స్నేహం చేయడం, అటు ఆర్థికంగా, శారీరకంగా గిరిజనులను అమాయకులను చేసి వారి జీవితాలల్లో చిచ్చు పెడుతున్న పరిస్థితులు కళ్ళలకు కట్టినంటు ఈ కథలో కథకుడు చెప్తారు.
పోరలు- గిరిజనులు సేకరించిన అటవి ఉత్పతుల క్రయ విక్రయ సంస్థలో పని చేసే ఉద్యోగి తాను స్వయంగా గిరిజనుడై గిరిజనుల పరిరక్షణలోని చింత చెట్టు ఫలసాయం అయిన చింతపండును తక్కువ తూకం చూపి మోసం చేస్తున్న విధానం ఈ కథలో కనిపిస్తుంది. చివరికి తన తండ్రి పడిన బాధలు, చుట్టున్న గిరిజనుల బాధలకు చలించిపోయాడు. డబ్బు అవసరం ఉన్న గిరిజన తాత దగ్గర చింతపండు తూకం తక్కువ చూపారు. కాని తాత డబ్బు సరిపోదు తూకం ఎక్కువనే ఉందని అంటూ మక్కుపట్టు పట్టి వెళ్లడూ అయితే ఎలాగో డబ్బు ఇచ్చి పంపివేస్తారు వసంతరావు కురవాళ్ళు. ఆఫీసు నుండి ఇంటికి వేళ్ళేప్పుడు హాస్పటలో ముసళ్ళమ్మ మరణించి పెద్దగా ఏడుస్తున్నారు. దారి మధ్యలో దీనిని గమనిస్తూన్న వసంతరావు ఆమె పక్కన ఉన్న పెద్దాయను చూసినట్లుంది. అది ఉదయం చింతపండు తూకం దగ్గర మోండిగా ఉన్న గిరిజన తాత. ఆమెకు మందులు తేలేకా, దానికి డబ్బులు సరిపోకా ముసలమ్మ మరణించింది అని తెలిసింది. దానితో వసంతరావు ఆ మరణించిన ముసలమ్మ తన తల్లేనని, ఆ తాత తన తండ్రేనని బాధపడుతాడు. ఉదయం లేచి తేల్లకాగితం పై రాసి సంతకం పెడతాడు. తన సెల్స్ మేనేజరు ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఈ కథలో గిరిజనులలో నిజాయితీ ఉందనీ, తప్పనిసరి పరిస్థితులలో కొన్ని పోరపాట్లు చేయాల్సిన అగత్యం పడుతుందని తెలుస్తుంది.
గాయం- జిల్కి మిలంతి ఇద్దరు కూడా గిరిజన బిడ్డలు వారి పండుగులకు వరి సంస్కృతిలో భాగంగా జరిగే పండుగలలో పాల్గోన్ని వారి వద్ద ఉన్న కళను ప్రదర్శిస్తూ ఎంతో సంతోషంగా ఆ గిరులు వెంట ఆ అడవిలో గిరిజన యువతి యువకులు లిద్దరు తిరుగుతూ ఒకరిని ఒకరు అనురాగాన్ని పెంచుకున్నారు. ఆ అడవిలో గిరిజనుల దైవం అలాగే వారి సంస్కృతిలో ఉన్నటువంటి ప్రకృతి ఆధారమైనా ఆరాధన విధానం. విత్తనం వేసినప్పుడు, పంట పండినప్పుడు, కోత కోసిన తర్వాత జరిగే పూజ సంబరాలను గిరిజనులు సామూహికంగా అందరు కూడా కలిసి చేసుకొంట్టారు. మిలంతికి టీచర్ ట్రైనింగుకు సీటు వచ్చింది. దానితో మిలంతిని చూడకుండా జిల్కి ఉండలేనని అంటూ ఉంటే మిలంతి ట్రైనింగు పూర్తైతే ఉద్యోగం వస్తుందని సర్థి చెప్పింది. రెండు నెలు ఉత్తరాల ద్వారా మాట్లాడుకొన్నారు. తర్వాత ఉత్తరాలు రావటం అగిపోయాయి. ఆమె సెలవులో ఇంటికి వచ్చి ఆరా తీస్తే పాస్టరు ట్రైనింగ్ వెళ్ళాడని తెలుసుకొంటుంది. ఆమె ఆశ్చర్యపోతుంది. జిల్కి జాకరమ్మ, గోడ్డలమ్మ ఉత్సవాలకు ఎంతో గొప్పగా తూడూం వాయిద్యం నైపుణ్యంగా వాయించేవాడు ప్రతి పండుగలో ఉత్సాహంగా పాల్గోని గిరిజన సంస్కృతి వన్నెగా ప్రవర్తించేవాడు. అటువంటి జిల్కి పాస్టరుగా అవ్వటం మిలంతికి ఏమి చేయాలో అర్థం కాలేదు.
ఈ కథలో మిలంతి జిల్కి తనను మతం మారి, చర్చిలో పెళ్లి చేసుకోమన్నాడు. అతడి దారి అతను చూసుకున్నాడు తనకు నచ్చింది అతను చేశాడు. ఇక తన నిర్ణయమేదో తనే తీసుకోవాలనుకుంది. తన సంస్కృతికి కట్టుబడి నిలిచిపోయింది. ఈ కథ పాఠకునికి ఎన్నో విధాలుగా ఆలోచింప చేస్తుంది. ఒకవైపు సంస్కృతి, మతం, సంప్రదాయం, ప్రేమ, గ్రామంలో వస్తున్న మార్పులు, మత ప్రచారకులపై దాడులు ఇలా ఎన్నో.. అందుకే అంటారు ఎ.కె. ప్రభాకర్ గారు అతని కథలు మనల్ని వొకపట్టాన వొదలవు. గుండెలోతుల్లోకి జోరబడి కల్లోలాన్ని రెపుతాయి. అంతరంగంలో అలజడి కలిగిస్తాయి. ఆత్మశోధనకు పురికొల్పుతాయి. అని ఆదివాసిని అడివికి దూరం చేస్తున్న శక్తుల గురించి జగదీష్ యింతకు ముందు శిలకోలలో సంధించిన ప్రశ్నలు మనల్ని యింకా వెంటాడుతూనే వున్నాయి అంటూ గురిలోని కథలను విశ్లేషిస్తూ అన్నారు. (ముందు మాట గురి కథల సంపుటి)
బాకు డుంబారి – ఆనందు, సోముడు తల్లిదండ్రులు ఎలా మరణించింది. జోగులు ద్వారా శ్రీధర్ మాష్టారు తెలుసుకుంటారు. ఆ పిల్లలు ఇద్దరు జోగులు దగ్గర రాత్రి చలిమంట కాచుకొంటు కథలను వింటావుంటారు. గిరిజనుల జానపద కథలో బాకు డుంబారి కథ ఒకటి ఎప్పుడు వింటుంటారు. అయితే ఈ కథ గిరిజనులను ప్రమాదంలో పడకుండా ఆత్మరక్షణ కథగా చేప్పవచ్చు. ఒంటరిగా వేళ్లడం వల్ల ఏదైనా ప్రమాదం ఎదురై ప్రాణాలు పోగోటుకుంటారని అడవి పట్ల భయం భక్తికి తార్కాణంగా ఈ జానపద కథను అర్థం చేసుకొవచ్చు. ఆ పిల్లలు ఇద్దరు ఈ కథ గురించే వింటు ఉండగా శ్రీధర్ మాష్టారు వచ్చి హాస్టలోకి ఆ పిల్లలను పంపివేసి ఆ జోగులు దగ్గర కుర్చుని మాటలో పడతాడు. ఆ పిల్లలు ఇద్దరు ఆనాథలని వారి కథను ఇలా చెప్పుతూ, కొండలను కాలి చేయించటానికి అంటు వ్యాధులు, సిల్లంగి పనులను కారణంగా చూపి, గిరిజనుల మరణాలను అవకాశంగా మలుచుకొని గిరిజన గ్రామాలను కాలి చేపించి అక్కడి ఖనిజ సంపదను హస్తగతం చేసుకునేందుకు మైనింగ్ కంపెనీలకు యాజమాన్య హక్కులు ఇవ్వడం ఈ కథలో గమనిస్తాము. సిల్లంగి పనులు చేశారని ఆనందు నాన్నను గిరిజనులు అనుమానించి మూర్ఖంగా కొట్టేశారు, దానితో అతను మరణించాడు.
ఇక ఆ ఊరిలో మరణాలు అగలేదు తర్వాత ఆనందు తల్లి పై అనుమానం వచ్చింది. అది తెలుసుకున్న ఆమె గ్రామం దాటిపోయింది. తాత ఆ ఆనందును పెచ్చిపోషించాడు. కొన్నాళ్ళకు అతను మరణించాడు. సోముల తండ్రి నెల్లూరు చేపల చెరువులో, కొళ్లఫామ్లో పని చేశాడు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే జబ్బుపడ్డాడు. అంటు వ్యాధులతో తల్లి కూడా పోయింది. ఈ విధంగా పిల్లలు ఆనాథలు అయ్యారు. శ్రీధర్, జోగులు బాకు డుంబారి కథల ద్వారా ఈ విషయాలు తెలుసుకొన్నాడు. గిరిజనులను కాపాడుకోవడానికి ఈ కథ ప్రచారంలో ఉందని అయితే గిరిజనులు అంటు వ్యాధుల ద్వారా, వారి అమాయకత్వం ద్వారా సిల్లంగి అంటు (మూఢవిశ్వాసాల వల్ల) మరణాలు ఒక కారణంగా వెతికి ప్రాణాలను, చివరికి నివాసాలను కోల్పోయారు. ఇక ఆ గ్రామంలో ఉంటే చనిపోతామని, అంతుచింకని రోగాలు వస్తాయని భయపడి ఊరు కాలి అవుతుంది. అంటు వ్యాధులప్పుడు మంత్రి వచ్చి చనిపోయిన వారికి ఘనంగా ఎక్స్ గ్రేషియా ప్రకటించి నీరు, వైద్య వసతి కారణం చూపి కొండ దిగువున ఉన్న ప్రాంతంలో నివాసం ఉండమని చేప్పుతారు. ఈ విధంగా గ్రామాని కాలి చేపిస్తారు. గిరిజన అస్తిత్వం ప్రశ్నర్థకమైనా ఈ సందర్భంలో డాక్టర్. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి గారి మాటలు స్మరనియం. నేను మానవుణ్ణి నేను ఆదివాసినీ, గోచి గుడ్డ, చేతిలో చుట్ట నాకు ఆనవాళ్లు. నాకు మతం లేదు. నాకు తల్లి ఉంది. ఆమె అడవి తల్లి. జగదీష్ కథల్లో గట్టి రాజకీయ కంఠ స్వరం వినిపిస్తుంది. విద్యా లోపాలను ఏలుగెత్తి చాటే నినాదం కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలోని ఆదివాసులను అభివృద్ధి పేరుతో తొలగించే విధ్వంసం ప్రతిబింబిస్తుంది. అడివితనాన్ని కోల్పోయిన గిరిపుత్రుల ఆవేదన కనిపిస్తుంది. మత మార్పిడి స్థావరంగా మారిపోయిన అడివి కనిపిస్తుంది. అభివృద్ధి అనే రాజకీయ ప్రహసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తాయి. స్థానికతను నిర్థిష్టంగా రచయిత ఉపయోగించాడు. కాలమేదైనా భూములు లాక్కోవడం, ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చేయడం ఇదే కదా చరిత్రా ఇదే కదా వర్తమాన కథ. ఒకటి భూసేకరణ, రెండు భూ ఆక్రమణ అంటూ మల్లిపురం జగదీష్ కథలను విశ్లేషణ చేశారు.
ముగింపు-
మల్లిపురం జగదీష్ కథల ద్వారా గిరిజనుల జీవితాలను ప్రాథమిక విద్య నుండి వారి జీవిత పర్యాంతం వివిధ సందర్భాల వరకు, పోడు వ్యవసాయదారులుగా, ఉద్యోగులుగా, వారి అమాయకత్వాన్ని, వారి సంస్కృతి సంప్రదాయాలను, వారిలో అభివృద్ధి పేరిట వచ్చిన సౌకర్యాలు అయిన టీ.వి. మోటారు సైకిలు, చెడు అలువాట్లు, రుణ భారం పోడు వ్యవసాయ రైతైనా, ఉద్యోగి అయినా అదే రకమైన జీవనం గడుపుతూ అనేక సమస్యలను ఎదుర్కోటున్నారు. వారి యదార్థ జీవిత గాథలనే కథలుగా మలిచారని తెలుస్తుంది. గిరిజనులు ఈ నాటికి వివక్షను ఎదుర్కోటుంనారు స్వయంగా విద్యావంతుడు సాహిత్యరంగంలో తనదైన ముద్రను కనబరిచిన కథకుడు అయిన మల్లిపురం జగదీష్ గారు కూడా ఒక సందర్భంలో తనుకు ఎదురైనా వివక్ష అనుభవం గురించి స్వయంగా ఆయన గోదావరి అంతర్జాల సాహిత్య మాసపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, మతపరంగా ఎన్నో సమస్యలు వారిని చుట్టుముట్టాయి. ఒక వైపు సాయుధ పోరాటదారులు, పోలీసులు, అధికారులు ఈ మొత్తం వ్యవస్థలన్నీ అడుగడుగున్న వారిని బాధిస్తూనే ఉన్నాయి. అన్ని వైపుల నుండి వారిని వారు రక్షించుకొంటూ వారి సంస్కృతి, భాష, సాంప్రదాయ జీవనం, నివాసాలను కాపాడుకొవలసిన అవసరం ఈ నాటికి ఉంది.
ఉపయుక్తగ్రంథ సూచిక-
1. ఆదివాసులు వైద్యం సంస్కృతి అణచివేత- కె.బాలగోపాల్, పర్ స్పెక్టివ్స్ –హైద్రాబాద్. అక్టోబరు-2015.
2. మా మంచి తెలుగు కథ కథా పరిచయ వ్యాసాలు- కోడూరి శ్రీరామమూర్తి-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైద్రాబాద్,- అక్టోబర్-2008.
3. లోచూపు సాహిత్య విమర్శనా వ్యాసాలు- రాసాని-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ -, ఫిబ్రవరి-2014.
4. శిలకోల- కథలు- మల్లిపురం జగదీశ్. – స్నేహకళాసాహితి ప్రచురణ-కురుపాం-పార్వతీపురం,జూలై-2011.
పత్రికలు
1. ఇప్పపూలు- శుక్రవారం-అగస్టు 2-2019 – తృష్ణ బ్లాగ్ పోస్టు.
2. గురి తప్పని కథలు- 13-06-2020 సాక్షి ఫామిలి పరిచయం-
డా. చింతపల్లి ఉదయ జానకిలక్ష్మి.
3. గోదావరి అంతర్జాల పత్రిక- జూన్-2020.
-డాక్టర్. పోలా బాల గణేష్,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~