అదొక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో స్పూర్తి అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుండి చదువంటే ఎంతో ఇష్టంతో శ్రద్దగా చదువుకునేది.ఒక్కరోజు కూడా తప్పకుండా పాఠశాలకు వెళ్ళేది. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్దగా వినేది మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నుండి వచ్చేసరికి ఇంటి పని మొత్తం చేసి చదువుకునేది .
చదువుపై స్పూర్తి కి ఉన్న ఆసక్తిని గమనించి ఉపాధ్యాయులు కూడా ఆమెను ప్రోత్సహించేవారు. కానీ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, వ్యవసాయ పనులు చేసేవారు కావడం వల్ల స్పూర్తి ని బడి వద్దు ఏమీ వద్దు,ఊరిలో నీ తోటి వారందరు వాల్ల అమ్మానాన్నలకి వ్యవసాయపనులల్లో సాయంగా ఉంటున్నారు. నువ్వేమో రోజూ బడి బడి అనుకుంటూ ఒక్కరోజు తప్పకుండ బడి కి పోతన్నవ్. అని తనను నిరుత్సాహ పరిచేవారు .
ఐనా కూడా ఇటు తల్లిదండ్రులకు పనిలో సాయంగాఉంటూ , అటు చదువులోనూ ప్రథమ శ్రేణిలో ఉండేది.ఇలా పదవ తరగతి కి వచ్చేసరికి మంచి పెళ్లి సంబంధం వచ్చిందని తల్లిదండ్రులు స్పూర్తికి వివాహం నిశ్చయించారు. పెళ్లి కొడకు ప్రభుత్వ ఉద్యోగే కానీ అతనికి స్పూర్తికి వయసు వ్యత్యాసము చాలా ఉంది.
స్పూర్తికి చదువంటే ఎంత శ్రద్దనో గమనించిన అతను పెళ్లి తర్వాత ఆమె ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని మాటిచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయిది చిన్న వయసు కారణంగా” చదివిస్తాను “అని అతను చెప్పిన మాటనే తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.పెళ్ళికి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం కూడా అదే. అలా వివాహం జరిగిన నాటినుండి ఆమెకు “కష్టపడి చదవాలి ఏదైనా సాధించాలి” అనే పట్టుదల మనసులో దృఢంగా నాటుకుంది. దానికి తన భర్త ప్రోత్సాహం కూడా తోడై నిలిచింది.అడుగడుగునా అన్నీ తానై నిలుస్తూ స్పూర్తి ని ముందుకునడిపించేవాడు తన భర్త.
అలా అతని ప్రోత్సాహంతో ముందుకెళ్తూ, చదివించిన భర్త పేరు నిలపాలని లక్ష్య సాధన కోసం రాత్రనక పగలనక కష్టపడి అటు సంసార భాద్యతలనునిర్వహిస్తూ, ఇటు విద్యలో రాణిస్తూ సివిల్స్ లక్ష్యంగా ప్రయాణాన్ని సాగించి, మొదటి ప్రయత్నంలో విఫలం అయినాకూడా నిరుత్సాహ పడకుండా సాధన చేసి రెండవ ప్రయత్నంలో విజయాన్ని సాధించింది.ఆమె పుట్టిపెరిగిన జిల్లాకే కలెక్టర్ గా వచ్చి అందరి చేత శభాష్ అనిపించుకొని సన్మానాలు, సత్కారలు అందుకుంది. కానీ ఈ సన్మానాలు సత్కారాలు అన్నీ కూడా తనకు ప్రోత్సాహాన్నిచ్చి వెన్నుదన్ను గా నిలిచిన తన భర్తకే చెందుతాయని సగర్వంగా చెప్పుకునేది.
“స్పూర్తి లాంటి మహిళలెందరో ఈ సమాజంలోఇప్పటికీ వంటింటికే పరిమితమై ఉన్నారు. వారికీ తగిన ప్రోత్సాహం లభిస్తే తప్పకుండా ఏదైనా సాధిస్తారు “అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం.
-గాలిపెల్లి తిరుమల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~