ఒక దశాబ్ద కాలం(2002-12 ) నిజామాబాద్ జిల్లాలో వచ్చిన “స్త్రీవాద కవిత్వం” -మున్నం శశి కుమార్

ISSN – 2278 – 478

shashi kumar స్త్రీవాద కవిత్వం:
తెలుగు సాహిత్యంలో స్త్రీల గొంతు వినబడటం ఆధునిక కాలంలో ప్రారంభమైంది. తెలుగు సాహిత్య రచనలో ప్రాచీన యుగం నుండి అనేక మంది కవయిత్రులు ఉన్నా, కేవలం స్త్రీ సమస్యల గురించి చర్చించే కవయిత్రులు- కవిత్వము చాలా ఆలస్యంగానే ప్రారంభమైంది. వివిధ కవిత ఉద్యమాల్లో స్త్రీల సమస్యలను చర్చించిన వారి కవితలు పూర్తిగా స్త్రీల పక్షాన నిలబడలేదు. ఈ ప్రపంచాన్ని స్త్రీ దృక్పథం నుంచి దర్శించిన కవిత్వ ఉద్యమాన్ని స్త్రీవాద కవిత్వంగా చెప్పుకోవచ్చు.

తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావం చూపిన కవితా ఉద్యమాల్లో స్త్రీవాద కవితా ఉద్యమం కూడా ఒకటి. ఇది 1975 తరువాత ప్రారంభమై, 1985 తర్వాత స్థిరపడింది. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలకు క్రమంగా కవిత్వోద్యమం విస్తరించింది. స్త్రీవాదాన్ని ‘ఫెమినిజం’ అని పిలుస్తారు. ‘స్త్రీ విముక్తి’, ‘స్త్రీ విమోచన ఉద్యమం’ లేదా ‘స్త్రీ స్వేచ్ఛ ఉద్యమం’ పేర్లు ‘ఫెమినిజం’ అనే పదానికి సమానార్థకాలుగా నేడు వాడబడుతున్నాయి.

స్త్రీవాద కవిత్వం ప్రస్తుత వ్యవస్థను ప్రశ్నించడంతో ప్రారంభమైంది. ఇది స్త్రీ-పురుషుల సమానత్వాన్ని కోరింది. స్త్రీ నేటి సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షతను ప్రశ్నించింది. ప్రస్తుత వ్యవస్థను ధిక్కరిస్తూనే కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసే పనిని స్త్రీవాద కవిత్వం చేపట్టింది. అణచివేతకు, పీడనకు గురవుతున్న స్త్రీల జీవితాలను, అనుభవాలను వస్తువుగా చేసి రాసిందే ‘స్త్రీవాద కవిత్వం’ అని డాక్టర్. ఆచార్య కాత్యాయని విద్మహే వివరించారు. వీరి మాటల్లో “స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉన్నాయని, వాటి కారణంగా కుటుంబంలోనూ సమాజంలోనూ స్త్రీలు అణచివేతకు, పీడనకు గురవుతున్న అని తెలిసి ఆ విధమైన స్త్రీల జీవితాలను, అనుభవాలను వస్తువు గా చేసి రాస్తే అది స్త్రీవాద కవిత్వం”( తెలుగులో కవిత్వం ఉద్యమాలు- పుట 186) అని స్త్రీ వాదాన్ని పై విధంగా నిర్వచించింది.

స్త్రీవాదం ఆరంభం:
ఫ్రెంచి విప్లవంలో భాగంగా ఫ్రెంచ్ మహిళలు తమ హక్కుల కోసం పోరాడే పోరాటం ప్రారంభించారు. రష్యన్ విప్లవంలో ‘స్త్రీ విముక్తి’ అంశానికి చోటు దొరికింది. పారిస్ అంతర్జాతీయ సమావేశంలో స్త్రీపురుషుల సమానహక్కుల గురించి చర్చించారు. చైనా విప్లవంలో కూడా స్త్రీలు అనేక కార్మిక పోరాటంలో పాల్గొన్నారు. తదనంతరం అమెరికాలో స్త్రీల హక్కుల ఉద్యమాలు తీవ్రరూపం దాల్చాయి. స్త్రీ హక్కుల గురించి చర్చించిన మొట్ట మొదటి పుస్తకం “విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్”. దీన్ని రాసింది ఇంగ్లాండ్ రచయిత్రి మేరి హల్ స్టోన్ క్రాఫ్ట్. స్త్రీల హక్కుల గురించి పోరాడిన అమెరికాకు చెందిన మరో కవయిత్రి బెట్టి ఫ్రీడన్.

తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం:
తెలుగు సాహిత్యంలో స్త్రీల అంశాలనూ ఉదారంగా చిత్రించిన వారిలో చలం ఒకరు. చలం, కొ.కు. లాంటి చాలామంది కవులు స్త్రీల పక్షాల వారి గొంతును వినిపించారు. అయినప్పటికీ స్త్రీవాద కవిత్వానికి ఒక రూపు ఏర్పడిన తర్వాత ఈ వాదాన్ని కవయిత్రులు, రచయిత్రులు మాత్రమే వినిపించడం సరైనాదనే భావన, స్వభావాన్ని ఈ ‘ధోరణి’ ఏర్పరచుకుంది. అప్పటి నుండి ఇక స్త్రీలు స్వేచ్ఛగా తమ సమస్యలను తమ రచనలలో పొందు పరిచారు. సమాజంలో వారికి జరుగుతున్న అన్యాయాలను, నేటి స్త్రీని సమాజం చూస్తున్న కోణాన్ని, వారి కవితల్లో, రచనల్లో ఆవిష్కరించారు.

స్త్రీవాదం లోని ప్రధాన అంశాలు:
పురుషాధిక్య భావజాలంపై తిరుగుబాటు, లైంగికత్వాన్ని చర్చించడం, సెక్స్ కు- జెండర్ కు ఉన్న తేడాను స్పష్టం చేయడం, సంతానోత్పత్తిని ‘ఉత్పత్తి’ లో భాగంగా చేయడం, పితృస్వామ్య వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించడం, ఎత్తి చూపడం, స్త్రీలపై అమలు కాబడుతున్న ఆంక్షలను ప్రస్తావించడం, స్త్రీని తను పోషించే ‘పాత్ర’ ల ద్వారా కాకుండా, ఒక ‘వ్యక్తి’గా స్త్రీ ఉనికిని గుర్తించడం లాంటి అంశాలకు స్త్రీవాదం ప్రధానంగా చోటిచ్చింది.

స్త్రీవాదంలోని ధోరణులు:
స్త్రీవాదం ప్రధానంగా నాలుగు రకాల ధోరణులను కలిగి ఉంది. ఉదారవాద స్త్రీ వాదం, రాడికల్ స్త్రీవాదం ,మార్క్సిస్ట్ స్త్రీవాదం మరియు సోషలిస్టు స్త్రీవాదం. వ్యవస్థలో మార్పులు అవసరం లేకుండానే ఆడవాళ్ళకు సమాన హక్కులు, అధికారాలు ప్రయోజనాలు నెరవేర్చాలనేది ‘ఉదారవాద స్త్రీవాదం’. “స్త్రీ వ్యక్తిగతం అంతా రాజకీయమే” అని భావించేది ‘రాడికల్ స్త్రీవాదం’. దీనిలో స్త్రీ శ్రమను,. లైంగికత్వాన్ని, పునరుత్పత్తి శక్తిని ఒక పద్ధతి ప్రకారం ఎదిరిస్తున్న పితృస్వామ్య, పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. సమ సమాజాన్ని కోరుకునేది ‘మార్క్సిస్ట్ స్త్రీవాదం’. పునరుత్పత్తి సంబంధాలను కూడా ప్రధానంగా పరిశీలించాలని చెప్పేవారే ‘సోషలిస్టు ఫెమినిస్టులు’.

తెలుగు సాహిత్యంలోని ‘స్త్రీవాద కవిత్వం’ లోని ప్రధాన ధోరణులు:
ఆచార్య కాత్యాయని విద్మహే ప్రకారం –“ స్త్రీల ఉనికికి సంబంధించిన కవిత్వాన్ని సృష్టించడం, కుటుంబ సంబంధాల్లో తమ స్థానాన్ని గురించిన వివేచన కవిత్వం, కుటుంబం నుంచి బయటకు వచ్చినప్పుడు తనకు సంబంధించి సమాజంలో వచ్చిన స్పందనను దాన్ని చిత్రించే కవిత్వం, సామాజిక పరిణామాలు సామాజిక సమూహాలు స్త్రీని చూసే పద్ధతి కి సంబంధించిన కవిత్వం అనే ప్రధాన ధోరణుల్లో స్త్రీవాద కవిత్వం సాగుతుంది”*(*తెలుగులో కవిత్వోద్యమాలు- పుట-186).

స్త్రీవాద కవిత్వం లోని ప్రధాన వస్తువులు:
వ్యక్తిగా, రచయిత్రిగా తమ ఉనికిని చాటడం, మాతృత్వం అనే అంశాన్ని చర్చకు పెట్టడం, లైంగిక వివక్షను చిత్రీకరించడం, శారీరక స్పృహ కోణంలో వచ్చినవి, వాః వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపే కవితలు, కుటుంబంలోని హింసను చిత్రీకరించే కవితలు,సామాజిక జీవితంలో స్త్రీ, ప్రపంచీకరణ కోణంలో స్త్రీ. ఇలా పరాయీకరణ, కుటుంబ హింస ,కుటుంబంలో అధికార సంబంధాలు, అత్యాచారాలు మొదలైనవన్నీ స్త్రీవాద కవిత్వం లో ప్రధాన వస్తువులు గా మనకు కనిపిస్తాయి.

నిజామాబాద్ జిల్లా వచన కవిత్వంలో ‘స్త్రీవాద కవిత్వం’:
స్త్రీ రోజువారిజీవితంలో ఎదురుకొనే కష్టాలను చాటుతూ…. కవయిత్రి కిరణ్ బాల… “ఒకపక్క ఋతుచక్రపు బాధల్ని భరిస్తూ/ ప్రకృతి ధర్మంతో పాటు గృహస్థధర్మాన్ని/ శిరసా వహిస్తూ – నా మట్టుకు నేను../ బహు పాత్రపోషణలు/ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను/ అయినా… ఎందుకో/ రక్తి కట్టడం లేదంటున్నారు/ నేనైతే నటించడం లేదు…./ జీవిస్తున్నాను మరి!?”.( నా కలల ప్రపంచంలో. పుట-39) అంటూ కవయిత్రి ప్రతి స్త్రీకీ ప్రకృతి సిద్ధంగా ఋతుచక్ర బాధల్ని తట్టుకుంటూ నే ప్రతి స్త్రీ గృహిణిగా తన విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించడంలో ఎంత అలసిపోయినా, నిజాయితీగా తన పాత్రను నేటికి నిర్వర్తిస్తూనే ఉన్న విషయాన్ని మన ముందు ఉంచుతుంది కవయిత్రి. అయినా తన సొంత కుటుంబం మరియు సమాజం స్త్రీ పడే బాధని మాత్రం కనీసం అర్థంచేసుకునే స్థితిలో లేకపోవడం నిజంగా శోచనీయం అని బాధపడుతూ రాసిన పంక్తులివి. కుటుంబ సంబంధాల్లో తమ స్థానాన్ని తెలిపే కవిత ఇది. ఇందులో కుటుంబంలో తన ఉనికి ఎక్కడ? అని కవయిత్రి సమాజాన్ని ఈ కవితలో ప్రశ్నిస్తుంది.

నేటి ‘ప్రపంచీకరణ’ కారణంగా ప్రతి దేశానికి ఉన్న సొంత నాగరికత సంస్కృతి నేడు విషతుల్యమైంది. విదేశీ సంస్కృతులు ప్రతి దేశంలోకి చొచ్చుకువెళ్ళి, ఆదేశ ఆచార, సంప్రదాయాలను కూకటివేళ్లతో పెకలలించి వేస్తున్నాయి. ‘అందాలపోటీల’ను తన వస్తువుగా గ్రహించి, కవిత మల్లవరపు విజయ రాసిన పంక్తులలో… “విష సంస్కృతి మోజులో పడి కొట్టుమిట్టాడుతున్న/ ఆధునిక మహిళ నడి వీధిన అందాల ఆరబోసి/ ఫోజులు ఇస్తూ విశృంఖలంగా నర్తిస్తుంటే/ ఎక్కడికి వెళుతుంది నాగరికత?/ ఏమవుతుంది భారతీయత/ ఆడది అంగట్లో అందాల ఆట బొమ్మా?”.. (రెటీనా-పుట-17) అని నేటి సమాజాన్ని/ సూటిగా ప్రశ్నిస్తోంది కవయిత్రి. నేటి సమాజంలో స్త్రీని, వారి అందాలను సొమ్ము చేసుకొనే ఒక దుర్మార్గపు క్రీడగా అందాల పోటీలను కవయిత్రి విమర్శించడాన్ని బట్టి, స్త్రీ తన శరీరాన్ని తాకట్టు పెట్టినట్టుగా అవుతుందనే కోణంలో ఈ కవితా పంక్తులు రాసినట్టు మనం భావించవచ్చు. స్త్రీ స్థాయి దిగజార్చే అందాల పోటీలను, స్త్రీని మార్కెట్ వస్తువుగా చూపే కోణంలో కవయిత్రి స్వీకరించింది.

ఒక స్త్రీకి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా జరిగిపోయే తంతు ‘పెళ్లి’. స్త్రీ వివాహం అనేది కేవలం కుటుంబం ఇష్టాలతోటే ముడిపడి ఉంటుంది. అంతేకానీ ఆ అమ్మాయి ఇష్టంతో ఆ కుటుంబానికి పని ఉండదు. అందుకే కవయిత్రి అలివేణి తన కవితలో.. “నేను మీరు కని పెంచిన మొగ్గను/ నను మీ చేతులతో నలిపేస్తారా? రోజు బుగ్గన చుక్క పెట్టావు కదమ్మా ../ మరి ఈరోజు నా జీవితమే ఓ పెద్ద చుక్క/ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు/ నన్ను మీ నుండి వెలి వేస్తున్నారు/ నన్ను ‘ఆడపిల్ల’ అని ఎవరు అన్నారో/ తెలియదు కానీ../ నేను ‘ఈడ పిల్ల’నే…మీ వాడ పిల్లనే”..( పంపా తరంగాలు – పుట. 47) ఇది నేటి వివాహ వ్యవస్థపై కవయిత్రి సంధించిన కవితా బాణం. అమ్మాయికి ఒక వయసు రాగానే, భారంగా భావించే తల్లిదండ్రులు ఇంకా ఉండడం బాధాకరం. నేటి పురుషాధిక్య సమాజంలో స్త్రీ జీవితాన్ని ఇంటి పెద్దగా తండ్రి నిర్ణయిస్తాడు. పెళ్లీడుకొచ్చిన తన కూతుర్ని ఒక భారంగా భావిస్తాడు తండ్రి. ఈ అంశాలనే చర్చకు పెట్టింది కవయిత్రి.

చిన్నతనంలో అల్లారు ముద్దుగా వుండే తన ముఖంలోని బుగ్గపై చుక్క పెట్టిన వీరు, పెళ్లి పేరుతో ఏకంగా తన జీవితానికే పెట్టిన చుక్కను ఒక రకంగా తన ‘స్వేచ్ఛకు నిలుపుదల’గా కవయిత్రి భావిస్తోంది. ఎందుకంటే చుక్క నిలుపుదల లేదా తగ్గి పోవడానికి సంకేతం. అందుకే దాన్ని ప్రతీకగా గ్రహించి తన కవితలో స్త్రీ స్వేచ్ఛనూ ప్రశ్నిస్తోంది కవయిత్రి.

స్త్రీలపై జరిగే దాడులను అమానుష చర్యలను కుటుంబ హింసను ప్రధానంగా వస్తువుగా గ్రహించి కవయిత్రి డాక్టర్. శారదా హన్మండ్లు… “కట్నం చాలలేదనో/ తల్లి కాలేదనో/ అందంగా లేదనో/ అనుమాన దయ్యం తోనో/ తనవారే పగవారై/ రక్షించే వారే/ భక్షించే వారై / కత్తి పోట్లనో, సజీవదహనాన్నో/ ఉరి తాడునో, విషపు మందునో/ బహుమానంగా ఇస్తుంటే/ ఈ అమానుషత్వం భరించేదెలా/ రాబంధువులను శిక్షించేదెట్లా ?”..( మనో దర్పణం-పుట.33) అని రాసిన తన కవితా పంక్తులలో అత్తవారింట్లోని స్త్రీ ఇక్కట్లను హృద్యంగా చిత్రీకరించింది కవయిత్రి. పునరుత్పత్తిని, స్త్రీ శరీరాన్ని అంశంగా స్వీకరించి, దాని చుట్టే తన కవితను అల్లింది. స్త్రీ సమస్యలను చిత్రించింది.

స్త్రీ జీవితాన్ని వివాహం తర్వాత ఎలా పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నారనే విషయాన్ని చెబుతూనే, నేటి సమాజపు స్త్రీలని హింసించే అరాచక పద్ధతులను ఇక్కడ వర్ణించింది. సజీవ దహనాలు, విషపు హత్యలు, ఉరి వేసి చంపడం లాంటివి స్త్రీలపై జరిగే దాడులలో నిత్యకృత్యాలు. తనవారని నమ్మిన వారే ఆ స్త్రీ పాలిట యముడిగా మారడం జీర్ణించుకోలేని కవయిత్రి, స్త్రీ సమాజపు కుటుంబ బాధలను, స్త్రీ అనుభవించే అరాచకాలను తన కవితలో చక్కగా వర్ణించింది. ఈ కవితలో సాటి స్త్రీల పట్ల ఆర్తి మరియు కవయిత్రి ఆవేదన మనకు స్పష్టంగా కనిపిస్తాయి.

వివాహవ్యవస్థలో స్త్రీ శరీర హింసకు, మనసుకు ఉన్న సంబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించింది తుర్లపాటి లక్ష్మి అనే కవయిత్రి తన “తలెత్తి” అనే స్త్రీవాద కవితా సంపుటిలో.. “అత్యాచారాలు, అఘాయిత్యాలు చేయటం/ నిత్యాచారంగా పెట్టుకున్నావు కదా/ నీ పశు బలంతో, పాశవికతో/ నిస్సహాయంగా అలమటిస్తున్న శరీరాన్ని/ విచ్చలవిడిగా, వివేక హీనంగా/ కర్కశంగా కబళిస్తున్నావు కదా!/ ఆ క్షణంలో/ మార్చురీలో శవాన్ని”..( తలెత్తి.- పుట.17).. అని పదునైన పంక్తులలో స్త్రీని ఒక భోగవస్తువుగా భావించే నేటి పురుషాధిక్య సమాజపు ధోరణిని ఖండిస్తుంది కవయిత్రి. వివాహ నేటి స్త్రీకి ఒక శిక్షగా మారింది అని చెప్పే ప్రయత్నం చేసింది. రచనా శైలిలో సూటిదనం, ఘాటుదనాన్ని మనం స్పష్టంగా మనం పరిశీలించవచ్చు.

భర్త హోదాలో పురుషులు చూపే దౌర్జన్యకరమైన శారీరక హింసను ప్రతిఘటించే స్త్రీ సమాజపు ప్రతినిధిగా కవయిత్రి నిలిచే ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఇది ‘శారీరక స్పృహ’ను వర్ణించే కవిత. ప్రతి స్త్రీకి ‘మనసు’ ఉంటుంది అనే విషయాన్ని మరిచి, కేవలం ‘శరీరాన్ని’ కోరుకునే పురుషులకు ఉంచే స్త్రీవాద కవిత్వపు చురకలే ఈ పంక్తులు. నిజామాబాద్ జిల్లాలో స్త్రీవాద కవిత్వాన్ని ప్రధానంగా వినిపించిన కవయిత్రి తుర్లపాటి లక్ష్మి. వీరు ఏకంగా “తలెత్తి..” అనే ఒక స్త్రీ వాద కవితా సంపుటాన్ని రాయడాన్ని బట్టి జిల్లాలోని ప్రధాన స్త్రీవాద కవయిత్రులలో ఒకరిగా వీరిని భావించవచ్చు. స్త్రీవాదంలో ఉండే దాదాపు అన్ని అంశాలను వీరు తమ కవితా సంపుటంలో చిత్రీకరించే ప్రయత్నాన్ని చేశారు. మిగతా కవయిత్రులకు, రచయిత్రులకు మార్గనిర్దేశం చేశారు.

స్త్రీ ఉనికిని చాటుకునే తన కవితలో వి.శాంతి ప్రబోధ అనే కవయిత్రి.. “నన్ను నేను రక్షించుకుంటూ మానవ మనుగడకు/ ప్రాణం పోస్తూనే ఉన్నా/ గుమ్మం ముందు ఉండే డోర్ మ్యాట్ లానో/ బండెడు చాకిరీ చేసే పని మనిషిలానో/ వారసుల్ని అందించే మరమనిషిలానో/ సతమతమవుతూ జీవన సమరాన్ని సాగిస్తూనే ఉన్నా”…( మీతో మేమున్నాం..- పుట. 17) తో అని రాయడంలో స్త్రీ జీవితాన్ని సాగించే క్రమాన్ని కవయిత్రి ఆవిష్కరించింది అని చెప్పవచ్చు. ఒక స్త్రీ తన జీవితంలో పోషించే పాత్రలు, వైవిధ్యాన్ని, కష్టాలను ఇక్కడ కవయిత్రి మన ముందు ఉంచుతోంది.

స్త్రీగా వివిధ పాత్రల్లో అందరికీ సేవలు చేస్తూ, కరుగుతున్న కొవ్వొత్తిలా మారిపోయే స్త్రీ జీవితాన్ని కవయిత్రి ఇక్కడ వర్ణించే ప్రయత్నం చేసింది. స్త్రీ జీవితాన్ని ఒక బతుకు ‘సమరం’ గా వర్ణించింది. నిజానికి కూడా నేటి సమాజంలో స్త్రీని ఇంటి చాకిరీ చేసే ఒక పని మనిషి గాను, పిల్లల్ని కనే ఒక యంత్రంగానూ భావించడం చాలా సహజం. ఈ ధోరణినే తన కవితలో గర్హిస్తొంది కవయిత్రి. మన సమాజంలోని కుటుంబాలలో వివాహ వ్యవస్థలో అంతర్లీనంగా దాగున్న స్త్రీకి చెందిన అపరిష్కృత అంశాలను లేవనెత్తి, స్త్రీ జీవితం ఎలా కరిగిపోతోందనే విషయాన్ని వర్ణించే ప్రయత్నం చేసింది.

వివాహ వ్యవస్థలో దాగి ఉన్న అసలు రహస్యాన్ని విప్పే ప్రయత్నం చేసింది కవయిత్రి అయాచితం అరుణకుమారి తన కవితా పంక్తుల్లో ఇలా.. “కళ్ళు తెరచి చూసే సరికి/ అలసిన పాదాల కింద/ అలుక్కొని పోయిన ముగ్గు/ అయ్యో! ఆ కలర్ రంగులు ఏమయ్యాయి?/ కన్నీటి ప్రవాహంలో కరిగిపోయాయి/ కోరికల చుక్కలు పరిమితుల గీతల్లో కలిసిపోయాయి/ ఆత్మీయతాలతలన్నీ ఆమె తలరాతలయ్యాయి/ అక్కడ ఏముంది హద్దులు చాటే వట్టి గీతల ముగ్గు/ సామాన్య కన్యల తలరాతల నిగ్గు” (అరుణ కిరణాలు – పుట 2).
పై పంక్తులలో వివాహ ఆనం తరపు అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఒక సామాన్య స్త్రీ కి ఎదురయ్యే నిజమైన అనుభవాలను తన కవితలో కవయిత్రి అరుణకుమారి. వివాహ జీవితం లోని చేదు అనుభవాలను, స్త్రీగా తనపై ఉండే ఆంక్షలను ముగ్గులోని చుక్కలు, గీతలు మరియు పద్మాలు లాంటివాటితో పోల్చుతూ తన జీవితము ఇక పురుషాధిక్య సమాజపు ఆంక్షల లో ఉండబోతోందని వర్ణించే ప్రయత్నం చేసింది. ముగ్గులోని అంచులు స్త్రీ యొక్క హద్దులను చాటుతున్నాయి చెప్పడంలో చక్కటి నిగూఢత దాగి ఉంది. ముగ్గులు ప్రతీకగా తీసుకొని నా జీవితంలో స్త్రీపై ఉండే కట్టుబాట్లను వర్ణించేందుకు ప్రయత్నించింది కవయిత్రి. ఇది కుటుంబ జీవితంలో ప్రశ్నించే చక్కటి ప్రతి ప్రతీకాత్మక కవితగా మనం అభివర్ణించవచ్చు.

నేటి వరకట్నపు వరుని వారి నైజాన్ని వస్తువుగా చేసుకొని దానిని ఒక విచిత్ర సంత గా అభివర్ణిస్తూ కవయిత్రి ‘ బినా ‘ రాసిన పంక్తులలో… “ఇదేంటి వీడు/ పక్కింటి కెళ్ళి నా శీలం సంగతి ప్రశ్నిస్తున్నాడు/ సరుకులు కల్తీ ఉందో లేదోనని/ కొనుక్కునే నేను చూడాలి/ వీడు అమ్మకానికి నిలబడ్డప్పుడే/ వాడి శీలం గంగలో కలిసింది/ కొనుక్కో లేను / నాకొద్దు ఈ ఎద్దులతో వేగలేను/ ఈ వరకట్నాల సంతలోకి రాలేను”..( మీతో మేమున్నాం – పుట.8)… ఇంతటి ఆధునిక సమాజంలోనూ అమ్ముడుపోయె వరులను వ్యంగ్యంగా విమర్శిస్తోంది. సమాజపు పోకడలను తప్పుపడుతోంది.

ఇంకా వరకట్నం తీసుకోవడం అంటే ఒకరకంగా కాబోయే భార్యకు అమ్ముడుపోయినట్లు లెక్క అనే కవిత్వంలో కవయిత్రి ‘బినా’ తెలిపే ప్రయత్నం చేసింది. వరకట్నం అనేది ఈ దురాచారం సమాజంలో ఉన్న ఒక రుగ్మత. ఇది నేటికీ ఇంకా రూపుమాపబడలేదు. పెళ్లి చూపుల పేరుతో స్త్రీని, స్త్రీ శరీరాన్ని(శీలాన్ని) స్త్రీ మనసుతో, ఇష్టాయిష్టాలతో, సంబంధం లేకుండా అంచనా వేసే ఒక దుర్మార్గపు పద్ధతిని తన కవిత్వంలో సూటిగా చిత్రీకరించింది కవయిత్రి. ఇలా స్త్రీ వాదంలో వివాహ వ్యవస్థ లో కి బలవంతంగా నెట్టి వేయబడే ఒక అమాయకపు స్త్రీ తరఫున తన గళాన్ని వినిపించింది కవయిత్రి బినా. వరకట్నపు వ్యవస్థను ‘వరకట్నపు సంత’ గా పోల్చడంలో ఈ వ్యవస్థపై సన్నగిల్లుతున్న స్త్రీ సమాజపు వైఖరులను స్పష్టపరిచింది కవయిత్రి. ఇందులో వివాహ వ్యవస్థను ఏర్పరిచిన తీరుపై స్పష్టమైన తిరుగుబాటు కనిపిస్తుంది.

ఇలా నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే లైంగిక వివక్ష, వివాహ వ్యవస్థలోని ఇబ్బందులు, శారీరక స్పృహ, ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీ, స్త్రీల ఉనికి, పురుషాధిక్య సమాజపు కఠిన ధోరణి లాంటి అనేక అంశాలను కవితా వస్తువుగా చేపట్టి జిల్లా కవయిత్రులు చక్కటి స్త్రీవాద కవిత్వాన్ని తమ రచనల ద్వారా ప్రకటించారు. జిల్లాలో స్త్రీవాద కవిత్వానికి శాశ్వత స్థానాన్ని కల్పించారు. తద్వారా తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కవిత్వం లో తమ ఉనికిని చాటుకున్నారు.

-మున్నం శశి కుమార్

ఆధార గ్రంథాలు:
1.తెలుగులో కవిత్వొద్యమాలు- తెలుగు అకాడమీ-హైదరాబాద్-పునర్ముద్రణ సం.-2011.
2. నా కలల ప్రపంచంలో…- కిరణ్ బాల – జులై .2011
3. రెటీనా(క. సంకలనం)- మల్లవరపు విజయ- చిన్నయ్య -2011
4. పంపా తరంగాలు(క. సంకలనం)- పంపా సాహితీ పీఠం -సంపాదకులు:డి. శ్రీహరి రామం-2010
5. మనో దర్పణం- డా. శారదా హన్మండ్లు -2010
6.తలెత్తి…. – తుర్లపాటి లక్ష్మి – 2002
7. మీతో మేమున్నాం..(క,సంకలనం)- సమన్వయ కర్త : కె. ఎన్. రావ్ -2008
8. అరుణ కిరణాలు – అయాచితం అరుణ కుమారి -2002.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో