చేనేత వృత్తి పురాణం – దేవాంగ పురాణం (సాహిత్య వ్యాసం )-రావిలాల లక్ష్మీకాంతం

ISSN-2278- 478
దేవాంగపురాణం వృత్తిపురాణాలలో విశిష్టమైనవిగా చెప్పవచ్చు. ఈ వృత్తి పురాణం ఒక క్రమ పద్ధతిలో దేవతా సంబంధం కలిగి ఉండి ఒక పవిత్రమైన కార్యాన్ని సిద్ధించడం కోసం రూపొందించబడిందని చెప్పవచ్చు. వస్త్ర నిర్మాణం సృష్టి జరిగి దేవ, మానవ, రాక్షస దేహాన్ని కప్పి ఉంచి దిగంబరంగా సంచరించే పరిస్థితిని తప్పించి సమస్త త్రిలోక జనులకు మాన, ప్రాణ రక్షణను కల్పించింది ఇదే అనే విషయాన్ని దేవాంగపురాణం ద్వారా మనం గ్రహించవచ్చు.

ఆ చేనేత వృత్తి కళాకారులు దేశం మొత్తం వ్యాపించి ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత కార్మికులు విస్తారంగా జీవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చేనేత కులాలలో 18 దాకా ఉపకులాలు ఉన్నాయి. వీరిలో దేవాంగులు, పద్మశాలీయులు, కుర్నీ శాలీయులు, స్వకుల శాలీయులు, తొగట వీర క్షత్రియులు, చేనేత కుల వర్గాలలో ప్రధానమైనవి. ఇంకా మిగతా చేనేత వృత్తి కార్మికులలో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. ప్రధానంగా వీరి కులవృత్తి చేనత. వీరి ప్రధాన పరికరాలు మగ్గం మరియు రాట్నం. కాని వీరందరి సంస్కృతి సాంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో వీరు ఆరాదించే దేవతుల, దేవతారాధనల్లో తేడాలు ఉంటాయి. వీరి మూలపురుషుల వృత్తాంతాలు కూడా వేరువేరుగా ఉంటాయి. వీరు దేవతాపురుషుల జన్మవృత్తాంతాలను తమ కులపురాణాలుగా చెప్పుకుంటారు.

కుల పురాణాలు – స్వరూప స్వభావాలు:
భారతీయులు సమాజానికి పట్టుకొమ్మలు కులాలు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి. సామరస్య ధోరణి అలవర్చుకోవడానికి, సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి వృత్తులను నిర్ణయించడం జరిగింది. ఒక్కోరకమైన వృత్తిని చేపట్టిన ప్రజలను ఒక వర్గంగా నిర్ణయింపబడినారు. ఈ వర్గమే కులవిభజనకు
కారణమని చెప్పవచ్చు.

కులపురాణం:
ప్రతి కులానికి ఒక కుల కథ ఉంటుంది. ఈ కుల కథనే కులపురాణాలు అంటారు. ఈ కుల పురాణాన్ని ఆయా కులాల వారు పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఆ కులాల వారు తమ కులం, వంశం దైవానుగుణం వల్ల ఏర్పడిందని భావిస్తారు. ఈ కులపురాణాల్లో ప్రతి కులం, కులపురుషుడ్ని దైవాంశ సంభూతినిగా వర్ణిస్తుంది. కులం అనేది వరం చేతగాని లేదా దేవతల అవసరం కోసం కాని ఏర్పడిందని భావిస్తారు. ఈ కులపురాణాల్లో ప్రాచీన కాలానికి చెందిన వీరున్ని సాంస్కృతిక అంశాల్ని మత సంబంధమైన నమ్మకాన్ని వివరించడం వల్ల ఈ విశ్వాసాలు నేటికి సడలిపోకుండా నిలిచి ఉన్నాయి. వీటిలో స్పష్టమైన కుల ఆధారాలు ఉన్నాయి. కులంలోని వారు ఎవరైనా తమ కుల ఆచారాన్ని అధిగమిస్తే కుల బహిష్కరణకు కూడా గురవుతారు. ప్రతి ప్రధాన కులానికి ఒక ఆశితకులం ఉండటం కులపురాణాల్లో చూస్తూ ఉంటాము. ఈ ఆశిత కులం ప్రధాన కులం వారికి దేవతవరం వల్ల ఆశ్రయ కులంగా మారడమో లేదా తమ కులంలోని ఒకరు మిగతా కులం మొత్తానికి వినోదాన్ని కలిగించటం కోసమో కులపురాణ ప్రచారం కోసమో ఈ ఆశ్రయ కులం ఏర్పడటం జరుగుతుంది. ఇలా దేవాంగ కులానికి ఆశయ కులంగా ‘సింగం’ కులంవారు ఉన్నారు. వీరిని జాతిబిడ్డలు, సింగం వారు, జంగం వారు అని పిలుస్తారు.

కులపురాణం ప్రయోజనం:
కులపురాణాల వల్ల కులచరిత్ర, కులవృత్తి స్థానాన్ని సాహిత్య ప్రాధాన్యతను, చిత్రకళను, సంస్కృతిని తెలుసుకోవడమే కాకుండా కులానికి సంబంధించిన కథలు, సామెతలు, పొడుపు కథలు, కులం పేరులో ఉ న్న తిట్లు, ఓట్లు మొదలైనవి తెలుసుకోవచ్చు. ఈ కులం యొక్క ఆచార ఆచార సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు. జాతి యొక్క గౌరవ ప్రతిష్టలకు ప్రధానపురాణం ఏవిధంగా ఇనుమడింపజేస్తుందో అదే విధంగా కులం యొక్క గొప్పతనాన్ని కులపురాణం తెలియచేస్తుంది అంతే కాకుండా కులం యొక్క ప్రతిష్టను సంఘంలో పెంచుతుంది మరియు గుర్తింపును కలగజేస్తుంది. కులపురాణాల్లో దేవాసురప్రవృత్తులు, మృత్యువు, పరలోకాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, పబ్బాలు మొదలైనవిజ.. కథలు, గాథలుగా ప్రచారమై జనాలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రధానపురాణాలకులాగే కులపురాణాలకు పవిత్రత ఆపాదించబడి మతవిశ్వాసాల్లోను, వంశచరిత్రలోను ప్రధానపురాణాల లాగే కులపురాణాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కుల పురాణాలు ఆయా కులంలోని ప్రజల మనోభావాలను చాటేందుకు తోడ్పడుతాయి.

దేవాంగ పురాణం:
పూర్వం కైలాసవాసులైన పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ కోరిక మేరకు ఒక వస్త్రకారుడి సృష్టికి ఆలోచన చేయవలసి వచ్చింది. తత్ఫలితంగా పరమేశ్వరుని సజోజాత ముఖసహస్రాకార ముఖ కమలం నుండి వెలువడిన జ్యోతిర్లింగమే దేవలుడు అనే మహర్షి. దేవలుని భార్య సూర్యభగవానుని సోదరి దేవదత్త. ఒకనాడు దేవలుడు పరమశివుని వల్ల గాయత్రి మంత్రోపదేశం పొంది తరువాత విష్ణుమూర్తి నుండి సూత్రరాశి ఉండే నూలును సేకరించి భూలోకంలో తనకు నీయమితమైన ‘సగర’ దేశానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో కొందరు రాక్షసులు ఆ మహర్షిని అడ్డుకొని నూలును దొంగలించబోతారు. ఆ సమయంలో దేవల మహర్షి ఆ రాక్షసులతో పోరాడలేక శక్తి సన్నగిల్లినవాడై అంబ ఇచ్చిన అభయం గుర్తుకు వచ్చి జగదాంబికను ప్రార్ధిస్తాడు. జగదంబిక రూపి అయిన పార్వతీదేవి ఆదిపరాశక్తియై చౌడేశ్వరిదేవిగా మహర్షికి సాక్షాత్కరిస్తుంది. రాక్షసులను దనుమాడి మహర్షి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆమె ఇచ్చిన దివ్యమణి కంకణాన్ని ధరించి అక్షయంగా వస్తోత్పత్తి చేసాడు దేవల మహర్షి. దేవల మహర్షి వలనే భువిలో, దివిలో దిగంబరత్నం తొలగిపోయినది అని చెప్పారు. ఈ విధంగా దేవ, మానవ, రాక్షస త్రిలోకాలలోని జనులకు వస్త్ర సృష్టి చేసి వారి మానాలను కాపాడి దేహలకు రక్షణ కల్పించినవాడు దేవలుడు. అందుకే దేవలుడు వస్త్ర సృష్టి చేసిన తొలి వస్త్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ఆ దేవల మహర్షి సంతానమే దేవాంగులు. దేవలుడికి సహజంగ సిద్ధించిన సత్తో జాతప్రవర ఋగ్వేదనాభ అశ్వలాయన సూత్రం. మగర్షుల గోత్రాదులు ఇలా మహర్షి సంతానమైన దేవాంగులకు పరంపరలుగా సిద్దించాయి. దేవలుడికి సహాయం చేయడానికి వచ్చిన పరమేశ్వరి చౌడేశ్వరిగా భూలోకంలో దేవాంగుల పూజలందుకుంటూ జ్యోతిస్వరూపిణిగా నిలిచిపోయింది. ఆ జ్యోతి స్వరూపిణికి చేసే ఉత్సవమ్ జ్యోతి ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది.

చౌడేశ్వరి దేవి:
చౌడేశ్వరి దేవి దేవాంగుల కులదైవం. దేవలుడు దేవలోకం నుండి వస్త్ర ఉత్తత్తికి కావలసిన వస్తు సామాగ్రిని తీసుకుని వస్తుండగా రాక్షసులు ఆ వస్తుసామాగ్రిని దొంగిలించడానికి పూనుకొన్న సమయంలో దేవలుడు వారితో పోరాడలేక అసక్తుడై పార్వతిదేవిని మనసులో తలచుకుని సహాయం కోరతాడు. పార్వతీదేవి ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి మహాంకాళి అవతారరూపమై సంహరించింది. అపుడు ఆమె శాంతించడం కోసం ఆమెలో దాగి ఉన్న శక్తిని జ్యోతిరూపంలోకి మార్చి చౌడేశ్వరి దేవిని దేవాంగులు ప్రతియేట చైతమాసంలో జ్యోతి ఉత్సవాలు జరిపి పూజిస్తారు. ఈ జ్యోతి ఉత్సవాలను దేవాంగులు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చౌడేశ్వరిదేవిని శాంతిపరచడానికి భక్తులు తమ దేహాన్ని గాయపరుచుకుని రక్తాన్ని దేవతకు అర్పణ చేస్తారు.

రక్తాన్ని అర్పించడానికి చారిత్రక నేపధ్యం:
మేచ్చ జాతులు దండయాత్రలలో పూర్వం ఉత్తర భారతదేవం కంపించింది. ఆ తరుణంలో మన హైందవ సంస్కృతిని పరిరక్షించడంలో దక్షిణ భారతరాజులతో పాటు దేవాంగ సామంతులు కూడ ఎంతగానో కృషి చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాకతీయ రాజులు, విజయనగరరాజులకు ఈ దేవాంగ సేనాదిపతులు కుడిభుజంగా నిలిచారు. వీరయుద్ధనైపుణ్యం ఆనాడు రాజులకు ఎన్నో విజయాలను అందించింది. అయితే ఆనాటి యుద్దబడ్డాలు ప్రస్తుతం అవసరం లేదు కాబట్టి ఆయా కుటుంబాల వారంతా వంశపారపర్యంగా వస్తున్న ఆ ఆయుధాలను వారివారి గ్రామాలలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో భద్రపరుస్తారు. ఇక అమ్మకు జరిగే జ్యోతి మహెూత్సవంలో ఆకత్తులను వెలుపలకు తీసి శుభ్రం చేసి అవాహనచేసి పూజలు చేస్తారు. తమ వీరత్వానికి గుర్తుగా తన శరీరాన్ని ఆకత్తులతో గాయపరుచుకుని అమ్మకు రక్తం తర్పణ చేస్తారు.

జ్యోతి తయారీ విధానం:
అమ్మవారికి చైత్రమాసంలో జరిగే ఉత్సవంలో జ్యోతిని దేవి భక్తుని ఇంటిలో తయారుచేస్తారు. ఆరుబయట ఆవు పేడతో అలికి తయారుచేయడం ఒక పవిత్రమైన యజ్ఞంలా ఉంటుంది. ఈ జ్యోతిని తయారుచేసేవారు. మంగళస్నానంతో శుచియై నూతన వస్త్రదారులై పరమభక్తితో జ్యోతిని తయారుచేస్తారు. ఈ జ్యోతి తయారికి 8 కేజిలు బియ్యాన్ని ఉపయోగిస్తారు. ఈ బియ్యాన్ని మెత్తగా దంచి జల్లెడ పడతారు. మెత్తటి పిండిని బెల్లం పాకంలో కలుపుతారు. దీనిని ముద్దగా చేసి 4 పలకులుగా ఉండి అరమీటరు ఎత్తున్న 30X20 సెంటీమీటర్లు ఎత్తుగల ఒక కుదురుకు కడతారు. రంగు రంగుల కాగితాలను కుదురు చుట్టూ అంటిస్తారు. ఒక ఇనుప కడ్డీకి వస్త్రం చుట్టి ఒత్తిగా చేసి ఈ కుదురు మధ్యలకో నెయ్యిపోస్తారు లేదా నూనె పోస్తారు. ఈ కుదురును ఇత్తడి పళ్లెంలో పెడతారు. తరువాత చౌడేశ్వరి ఆకారంలో రతిపోస్తారు. అక్కడే అమ్మవారికి నిమ్మకాయలు కోసి పప్పు బెల్లాలతో నైవేధ్యం పెడతారు. ఉత్సవ సమయంలో భక్తులు వెలిగించిన జ్యోతులను నెత్తిమీద పెట్టుకుని నృత్యం చేస్తూ వీదుల్లో కదులుతారు.

జ్యోతి నృత్యం ప్రదర్శించే తీరు:
ఈ పవిత్ర జ్యోతిని తలమీదకు ఎత్తుకునే భక్తులు అంగి, దోవతి నడుముకు ఎర్రని వస్త్రాన్ని కట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. మెడలో దేవిహారాలు వేసుకుంటారు. నుదుట బండారుబొట్టు పెట్టుకుంటారు. జ్యోతి ఊరేగింపు అర్ధరాత్రిపూట జరగుతుంది. మొదటిగా పార్వతిపుత్రుని పరమేశ్వరుని సూడ ఎలుక వాహనమెక్కి వెళ్ళే తన వేడ్క అమరంగబెనకయ్యను ఆత్మలో తలచేరు సంతోషమును గల్గు సకల జనులకును అంటా మొదట ఏ విజ్ఞాలు కలుగకుండా చూడమణి గణేశుడ్ని పూజిస్తారు. తరువాత జనమంతా జ్యోతి చుట్టూ చేరతారు. వీరిలో పాటలు పాడేవారు తాళాలు వేస్తూ నాట్యం చేస్తూ వీరావేశంతో జ్యోతిని ఎత్తుకుని కళ్ళు పెద్దవి చేసి చౌడమ్మలా కనిపిస్తారు. జ్యోతులు ఎత్తుకున్న వ్యక్తులు ఇలా పాడుతారు. కదిలేనే చేడమ యంత తోడను గాంభీర్య నామములతో రంతులనే మగరాడు చేడమరానువు కదివేను రమ్యముతో ఎప్పుడు మనకు ఇచ్చిన వరములు యే కొదువాలేదు తప్పక కొలవండి దారుని లోపల దైవంబసలే చేడమ్మ ఇలా చేడమ్మ గూర్చి ఆమె గొప్పతనాన్ని గూర్చి వేనోళ్ళు పొగడుతూ అనేక గేయాలు పాడుతూ జ్యోతిని మోసుకెళతారు.

ఈ జ్యోతి ఊరేగింపుకు ముందు భాగానే దేవాంగులు వీరావేశంతో ఖడ్గాలు ధరించి శరీరాలను గాయపరుచుకుంటూ నృత్యం చేస్తూ చౌడేశ్వరి దేవిసి స్తుతిస్తూ విన్యాసాలు చేస్తారు. కొందరు ఊరేగింపులోనే జ్యోతి ముందు దవడలకు దబ్బనాలు పొడుచుకుని నోటి లోపలి భాగంలోని చెంపవెలుపలకు వెళ్ళదీస్తారు. ఇలా భక్తి పారవశ్యంతో రక్తం వోడుస్తూ భయానకంగా విన్యాసాలు చేస్తూ చిందులు తొక్కుతారు. ఇలా తెల్లవారు జాముకి చౌడేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించి ఆ జ్యోతుల్ని గుడి దగ్గర అర్పకుండా ఎక్కడ తయారుచేశారో అక్కడ జ్యొతుల్ని ఆర్పుతారు.

జ్యోతి ఉత్సవంలో జరుపబడే వివిధ ఆచారాలు:
అనపూజ, ఆనవిడుపు, అలుగుసేవ, ఊయల, దృష్టి చుక్క పెట్టడం, గుండం తొక్కడం మొదలైన ఆచారాలను పాటించడం జరుగుతుంది.

ఆనకట్టడం :
ఆనకట్టడం అంటే ఉత్సవాల సమయంలో ఎ దుష్టశక్తులు గ్రహాలు, గ్రామంలోకి ప్రవేశించకుండా ఎటువంటి విఘాతాలు కలుగకుండా వాటిన బంధన కట్టడం, వరిగడ్డితో తాడు పేని దానికి వేపమండలు, కట్టి పొలిమేరల్లో రెండు గుంజలను పాతి, వేపమండలు కట్టిన తాడు కొనలను ఈ గుండలకు కడతారు. తాడుకు పసుపు కుంకుమలు పూస్తారు. సాయంకాలం ఆరుగంట కాలంలో ప్రొద్దుగుంకడానికి ముందు ఆనకడతారు. ఇది మొదటి రోజు సాయంత్రం చేస్తారు. ఊరికి నాలుగు దిక్కుల్లోని పొలిమేరల్లో ఈ విధంగా కడతారు.

కలశం తయారుచేయడం:
గ్రామంలోని శివాలయంలోని కోనేరు నుండి బిందెతో నీళ్ళు తీసుకుని వచ్చి కలశం తయారుచేస్తారు. ఈ కలశాన్ని పెండ్లికాని యువకుని నెత్తిమీద పెట్టి ఊరేగింపుగా అమ్మవారి స్తోత్రాలు పాడుతూ వినాయకుని గుడివద్దకు తీసుకుపోతారు. అక్కడ పూజ అయిన తరువాత ఈ కలశాన్ని అమ్మవారి గుడి వద్దకు తీసుకువెళతారు. సాయంత్రం ఆరు గంటల తరువాత అనగా ఆనకట్టడం అయిన తర్వాత ఆ తంతు జరుగుతుంది.

కుంభం పోయడం:
తరువాత 12 గంటల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి కుంభం పోస్తారు. స్తోత్రాలు పాడుతూ పూజలు నిర్వహిస్తారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. దీనితో మొదటి రోజు తంతు ముగుస్తుంది. మొదటి రోజున అమ్మ చౌడేశ్వరి అవతారంతో ఉంటుంది.

దృష్టి చుక్క పెట్టడం:
దృష్టిచుక్క పెట్టడం అంటే ఆది పరాశక్తి మూడవ కన్నును తెరిపించడానికి సూచనగా ఈ దృష్టి చుక్కను పెడతారు. దీనికి ఎవరని పడితే వారిని ఉపయోగించరు. కేవలం విశ్వబాహ్మణ కులస్తుణ్ణి ఈ పనికి ఉపయోగిస్తారు. ఇది వంశపారంపర్యంగా వర్తిస్తుంది. అయితే ఎవరైతే దృష్టిచుక్క పెడతారో వారు కాని ఆ వంశంలోని వారు కాని మరణానికి గురౌతారని ఒక నమ్మకం ఉంది. అందువలన ఈ దృష్టి చుక్కను దత్తత తీసుకున్న వారిచే పెట్టిస్తారు. జ్యోతి ఊరేగింపు మొదలయ్యే ముందు దృష్టి చుక్కపెట్టేవారు. ఒంటరిగా ఎవరు లేని సమయంలో చౌడేశ్వరి ఆలయానికి వెళ్ళితడి కుంకుమను అమ్మవారి నుదుటిన పెట్టి వెనుకకు చూడకుండా ఆలయం బయటకు పరుగెడతారు. వెంటనే ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆలయం ఎదుట ఒక బొప్పను ఉంచి గుడి తలుపులు తెరుస్తారు. అమ్మవారి మూడవ కన్ను సోకిన మరుక్షణమే బొప్ప కాలిబూడిదై పోతుందని భక్తుల నమ్మకం.

గుండం తొక్కడం:
చాలా శివాలయాల ముందు, శకీయాల ముందు హెూమగుండాలను ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తుంటాము. జ్యోతి ఉత్సవం రాత్రి చౌడేశ్వరి ఆలయానికి వచ్చిన భుక్తులు, నిప్పుల గుండాలను పూజించి హెమ గుండాలను తొక్కడం జరుగుతుంది. భక్తులు నిప్పులపై అటు ఇటు తిరుగుతారు. జ్యోతిని ఎత్తుకున్న భక్తులు సమగుండంలో వీరావేశంతో నడుస్తారు. భక్తులు పూర్వం తమ వంశీయుల త్యాగాలకు గుర్తుగా నివాళి అర్పిస్తూ హెూమ గుండం తొక్కడం జరుగుతుంది. జానపదులు చేసే ఏ కార్యమైనా ఏదో ఒక శాస్త్రీయతను తనలో ఇముడ్చుకునే జరుగుతుంది అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని తిలకించినప్పుడు.

అలుగు సేవ:
రెండవ రోజున అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఉంటుంది. (మహిషాసురమర్ధిని అవతారం అమ్మవారి దగ్గరకు వెళ్ళే భక్తులు జ్యోతిని నెత్తిన పెట్టుకుని నడుస్తూ ఉండే తొగట వీరులు దేవాంగులు తమ దేహాలను గాయపరుచుకుంటూ తమ వీరత్వానికి గుర్తుగా రక్తాన్ని చిందిస్తూ ముందకు సాగుతారు. తరువాత ఈ గాయాలపై వేపబండారం రాసుకుంటారు. వేపబండారం అంటే వేపాకును నూరి దానిలో పసుపు కలిపి గాయాలపై రాసుకుంటారు. దీనిలో కూడ శాస్త్రీయత దాగివుంది. వేప ఆకు పసుపు మంచి రోగ నిరోదకాలు ఇవి సెప్టిక్ కాకుండా కాపాడతాయి. ఈ రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. బాణసంచాను కాలుస్తారు. వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలే కాకుండా భోజన వసతిని కూడా కల్పిస్తారు.

ఊయల సేవ:
మూడవరోజు ఊయల సంబరం జరుగుతుంది. ఈ ఉత్సవంలో సాయంత్రం 6 గంటల తరువాత వసంతోత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవంలో చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ ఆనందంలో ఈ వసంతోత్సవాన్ని జరుపుకుంటారు.

ముగింపు:
ఇలా ఈ జ్యోతి ఉత్సవాన్ని చౌడేశ్వరి భక్తులైన తొగట వీరక్షత్రియులు, దేవాంగులు, ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత కోలాహలంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి రెండు కళ్ళు చాలవన్నట్లుగా ఆ ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటే సంబరాలుగా కనిపిస్తాయి.

-రావిలాల లక్ష్మీకాంతం
అసిస్టెంట్ ప్రొఫెసర్ , తెలుగు విభాగం
ఎస్.ఆర్ &బి.జి.యెన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ఖమ్మం , తెలంగాణ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో