తిలక్ కవిత్వంలో నేటి సమాజపు ఆనవాళ్ళు(సాహిత్య వ్యాసం )-డా.మల్లె భాగ్యలక్ష్మి

‘‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు..’’ అని తెలుగు సాహిత్యంలో తన కవితా దృష్టిని ప్రకటించిన కవి తిలక్.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు. తిలక్ కవితలలో మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన వస్తువుగా తీసుకుని కవిత్వాన్ని అందించాడు.

మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు.
తిలక్ రచనలలో అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి ఒకటి. ఈ కవితా సంపుటిలో ముద్రిత, అముద్రిత , అసంపూర్ణ కవితలలో కలిపి మొత్తంగా 93 కవితా ఖండికలున్నాయి.

తిలక్ మంచి కవి అచ్చమైన కవి. మానవతావాది.వచన కవిత్వానికి పుష్టి కలిగించాడు.పి.సుమతి నరేంద్ర చెప్పినట్టు “అత్యంత లోక ప్రియుడైన కవి . భావాభ్యుదయ కవితా సేతువు బాలగంగాధర్ తిలక్ “అంటారు.”(తెలుగు సాహిత్య చరిత్ర ..ద్వానా శాస్త్రి -428 )

1.దేశ పరిస్థితులు :

తిలక్ కవిత్వం ఆనాటి దేశ పరిస్థితలను ఉద్దేశించి రచించిన కవిత్వమైనా నేటి పరిస్థితులకు సరిపోతుంది. దేశంలో ఉన్న దౌర్జన్యాలు , దొంగ బాబాలు , మోసాలు రకరకాల కుట్రలు , రాజకీయ నాయకుల స్వార్ధ పూరిత చట్టాలు అన్నింటితో దేశంలోని సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వాటి నుంచి రక్షించమని “ప్రార్ధన” కవిత లో తిలక్ ఇలా అంటాడు.

“దేవుడా రక్షించు నా దేశాన్ని
పవిత్రుల నుండి పతివ్రతల నుండి
పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి “ (అమృతం కురిసిన రాత్రి పుట-92 ) అంటూ దేశంలోని సామాన్య ప్రజలు గురించి ఆలోచిస్తాడు.

“ప్రాతః కాలం” అనే మరోక కవితలో దేశంలో ప్రజలు ఆకలి కేకలు , వారి దైన్య స్థితిని ప్రస్తావిస్తూ దేశంలోని విభిన్న వ్యక్తులు వివరించాడు.
“దేశభక్తులూ , ధర్మపరుషులూ
చిట్టి తల్లులూ , సీమంతినులూ
ముద్దు బాలురూ , ముత్తేదువలూ
కూడియాడుచు కోకిల గళముల
పాడిన శుభాభినవ ప్రభాత
గీత ధవళిమవా ! “ (అమృతం కురిసిన రాత్రి పుట-5 )

2. సైనికులు :
ప్రజలు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి కారణం దేశ సరిహద్దుల్లో నిరంతరం రక్షణగా ఉండటమే. అటువంటి దేశ సైనికుడు తన వారికి రాసిన ఉత్తరంగా రచయిత సైనికుని ఉత్తరం కవిత రచించాడు.

“పోదు నాలో భయం మళ్ళీ రేపు ఉదయం
ఎదార్లూ నదులూ అరణ్యాలూ దాటాలి
ట్రెంచెస్ లో దాగాలి
పైన ఏరో ప్లేను , చేతిలో స్టెన్ గన్
కీ యిస్తే తిరిగే అట్ట ముక్క సైనికులం
మార్చ్ !
వన్ టూ త్రీ ఘాట్ డేడ్ ఎవడ్ “(అమృతం కురిసిన రాత్రి పుట- 21)
అంటూ సైనికుడు దేశ సరిహద్దుల్లో ప్రతి నిత్యం దేశ పౌరుల కోసం చేస్తూన్న సాహసాన్ని తెలియజేసాడు.

అక్కడ నిరంతరం తన ప్రాణాలని ఫణంగా పెడితేనే మనం యిక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాము అనడానికి ఆ సైనికుడి ఉత్తరం కవితే నిదర్శనం.

దేశం కోసం తమ కుటుంబాన్ని , ఊరిని వదిలి ఎందరో సైనికులు సరిహద్దుల్లో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. తన ఇంటికి, కుటుంబానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటారు. అలా సైనికుని కుటుంబంలోని వారు వాళ్ల కోసం పడే ఆరాటం ,ఎదురు చూపులను తిలక్ “ అమ్మా , నాన్న ఎక్కడికి వెళ్ళాడు ? అనే కవిత లో రచించాడు.

“అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు ? ఇంకా రాడెం ?
అని అడిగాడు నాలుగేళ్ల పిల్లవాడు మరోసారి –
అలవోకగా వాడి తలనిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు –
అం ఎకల్లల్లో విమానాల రెక్కలు కడలిన నీడలు
ఆమె గుండెల్లో మరఫిరంగులు పేలిన జాడలు
కాశ్మీరు సరిహద్దుల్లో కమ్ముకొన్న నల్లని పొగల మధ్య “(అమృతం కురిసిన రాత్రి పుట-89)
అంటూ సైనికుడు దేశ సరిహద్దుల్లో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. యిక్కడ వారి కుటుంబ సభ్యులు వాళ్ల కోసం ఎదురు చూడటం, ఏ నిమిషం ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందో అని భయంభయంగా జీవితాన్ని గడుపుతారు.

3.మానవతావాది :
మానవత్వం మనిషి మనుగడకు అత్యవసరం. ఈ భూమి మీద ఉన్న జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే ఆలోచించే జ్ఞానం ఉంటుంది.మనిషి మాత్రమే ఏది మంచి, ఏది చెడు , ఎదుటి వారికి హాని కలగడం వంటి వాటి గురించి ఆలోచించగలదు. కాని సమాజంలో స్వార్ధపూరితమైన ఆలోచనలత జీవిస్తున్నారు. ఎక్కడ జాలి, దయ,

“పిలుపు” కవితా ఖండికలో ఈ భూమి మీద జరుగుతున్న దౌర్జన్యాలకు , అరాచకాలను మీరు ఎప్పుడైనా చూశారా, వాటి గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించారా అంటూ ప్రశ్నిస్తాడు తిలక్.

“కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే
మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దీన దృశ్యం
మీరెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా “(అమృతం కురిసిన రాత్రి పుట-32) అంటూ జరుగుతున్న దీనస్థితులను తెలియజేసాడు. అలానే దేశంలో కాపలా కాస్తూ ప్రాణాలు వదిలిన సైనికుల కన్నుల్లో కనిపించే నిజాలు మీరు గమనిచడం లేదని వాటి గురించి ఆలోచించాలని ప్రబోధిస్తాడు.

తిలక్ కవిత్వం ఒక్క మన దేశ కాలానికి , పరిస్థితులకే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాల సమకాలీన సమస్యలను అద్దంపడుతుంది. మన పొరుగు దేశం అప్ఘనిస్తాన్ పరిస్థిని అద్దం పట్టే కవిత ప్రకటన్. నేటి కాలంలో ఈ కవిత ఆదేశానికి సరిగ్గా సరిపోతుంది.

“ప్రకటన” కవితలో దేశంలో జరుగుతున్న అల్లకల్లోలాలు ,దౌర్జన్యాలు వాటి వలన సామాన్య ప్రజలు పడుతున్న పాట్లును వివరించాడు. ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వేరే ప్రాంతాలకు వలస పోవడం , నిరంతరం భయం గుప్పెట్లో జీవనం సాగించడం వంటి శాంతి స్థాపన కోసం వెతకడం కనిపిస్తుంది.

“ప్రజలు తడోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు
విజ్ఞాన వేత్తలు నాగరికత పైతోలు వోలుస్తున్నారు
మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు “(అమృతం కురిసిన రాత్రి పుట- 41) అంటూ ఎలాంటి అరాచాకాల్ని సృష్టిస్తున్నారో, వాట్ని వలన సామాన్య ప్రజలు పడుతున్న బాధలను వివరించాడు.

మరో కవిత “ఆర్త గీతం” కవిత మానవతా వాదానికి నిలువెత్తు నిదర్శనం. మనిషి జీవితంలోని ఒక చిన్న పిల్లవాడిని, బాలింతను, ముసలివాడిని ప్రతీకలుగా తీసుకుని ఆర్త గీతం కవిత రాశాడు తిలక్.

“నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు
కింద మరణించిన ముసలివాణ్ణి
నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెనకింద
నిండు చూలాలు ప్రసవించి మూర్చిలిన దృశ్యాన్ని !
నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక
ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు
తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ల పసి బాలుణ్ణి “ అని ఆవేదనని కళ్ళకి కట్టినట్లు రచించాడు. “(అమృతం కురిసిన రాత్రి పుట- 44) దేశంలో ఆ సంఘటనలు నేటికి మనకు కనిపిస్తూనే ఉంటాయి.

ఒక వైపు ధనవంతులు , మరొక వైపు కనీసం తిండి లేని పేదవాళ్ళు ఇలా రెండు వర్గాలు లేకుండా అంత సమానమే అని , కనీస అవసరాలు తీర్చుకునే విధంగా ప్రజలు ఉండాలని ఆకాంక్షించాడు. అందుకే ఇలా అంటాడు తిలక్.

“ఒక్క నిరుపేద ఉన్నంత వరకు ,
ఒక్క మలినాశ్రు బిందు వోరిగినంత వరకు
ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు
ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు ?
ఏ రాజకీయ వేత్త గుండెలను
స్పృశించగలదు ఏ భోగవంతుని
విచలింప చేయగలదు ? ఎ భగవంతునికి
నివేదించు కొనగలదు ….? “(అమృతం కురిసిన రాత్రి పుట-45) అని తన అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు తిలక్.

“ముసలివాడు” కవితా ఖండికలో తిలక్ కరుణరస పూరితమైన మనిషిని వివరించాడు.తిలక్ తను చూసిన ఒక వృద్దుణ్ని , ఆకలితో అలమటించిపోతున్న వాణ్ని వివరించాడు.

“అప్పుడు భవిష్యత్తు రంగురంగుల వల
ఈనాడు గుండెలో మెదిలే పీడకల
నేడు కనుల సందుల నిరాశమసి మసిగ పాకిపోయే
కసికసిగముసలివాణ్ణి నాతనలారా ముసలి వాణ్ణి “(అమృతం కురిసిన రాత్రి పుట-19) ముసలివాడి ఆర్తనాదంలో అటువంటి వ్యక్తుల బాధలను తెలియజేసాడు.

పైన ఉదాహరించిన కవితలను పరిశీలిస్తే నేటి కాలానికి మన దేశానికే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల పరిస్థితులకు అన్వయించవచ్చు. తిలక్ కవిత్వం ఎప్పటి సజీవం అనడంలో అతిశయోక్తి లేదు.

-డా.మల్లె భాగ్యలక్ష్మి ఏం.ఎ ,పి హెచ్.డి.
విశాఖపట్నం.

ఆధార గ్రంధాలు :
బాలగంగాధర్ తిలక్ దేవరకొండ – అమృతం కురిసిన రాత్రి
నాగేశ్వర శాస్త్రి ద్వాదశి – తెలుగు సాహిత్య చరిత్ర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

=

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో