తెలుగు టివి సీరియల్స్- నాడు నేడు(పరిశోధన వ్యాసం )-సరస్వతీప్రదీప్

ISSN 2278 – 478

టెలివిజన్ లేని ఇల్లు, సీరియల్ చూడని కన్ను మనకు కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. ఎంతో శక్తివంతమైన మాధ్యమం టెలివిజన్. అటువంటి టివి, ప్రజల్లోకి చొచ్చుకుని పోయి, వారి జీవితంలో భాగమైపోయింది. 1986 లో తెలుగు టివి సీరియల్స్ అంకురార్పణ జరిగింది. ప్రతి శుక్రవారం ధారావాహికగా దూరదర్శన్ లో ప్రసారమైన “అనగనగా ఒక శోభ” శ్రీ ప్రభు దర్శకత్వం లో రూపుదిద్దుకుంది. తొలి తరం హీరో ప్రదీప్, హీరోయిన్ శిల్ప నటించిన ఈ సీరియల్ కేవలం జంట నగరాల వరకే పరిమితమైంది.

1987 జనవరి 13వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 42 ఎల్ పిటి ( low power transmitters) తక్కువ శక్తి ట్రాన్స్ మీటర్స్ అన్నింటిని దూరదర్శన్ సంధానం చేయడం తో తెలుగు రాష్ట్రం మొత్తం తొలిసారిగా దూరదర్శన్ కార్యక్రమాలు చూడగలిగింది. అలా అనుసంధానం జరిగిన తరవాత ప్రసారమైన తొలి తెలుగు సీరియల్ శ్రీ ప్రదీప్ దర్శకత్వం లో వచ్చిన “బుచ్చిబాబు”. సాయంత్రం 7 గంటలకి రెండు నిమిషాల ముందే ఇంటిల్లి పాదీ హాల్లో టివి ముందు చేరేవాళ్లు. వీధికి ఒక ఇంట్లో మాత్రమే టివి వుండే రోజులవి. ఇంట్లోవారితో పాటు పక్కింటివారు, ఎదురింటివారు, పిల్లలు అంతా టివి వున్నవారింట్లో చేరేవారు. టివి సీరియల్స్ ప్రారంభమైన రోజులు. ఇంటిపైన యాంటెన్నా, ఇంటిలోన డైనోరా టివి వుంటే ఆ ఇల్లు కళకళలాడేది. రోజుకి అరగంట మాత్రమే సీరియల్స్ ప్రసారమయ్యేవి. తెలుగు వారి హక్కు తెలుగు టివి అన్నట్టు చూసేవారు. TRP రేటింగ్స్ (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) లేవు, బ్రేకుల గోలలు లేవు.

టివి సీరియల్స్ అప్పట్లో సినిమాల కన్నా బాగుండేవి అంటే అతిశయోక్తి కాదు. దూరదర్శన్ ఒక్కటే ఛానెల్ కావడం తో టివి సీరియల్ నిర్మాణం లో ఆసక్తి వున్న నిర్మాతలకు, దర్శకులకు సాధ్యమైనంతవరకు అందరికీ అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశం తో 52 వారాల సంవత్సరాన్ని 4 భాగాలుగా విభజించి ప్రతి సీరియల్ కి 13 వారాలు ప్రసారమయ్యేలా 13 భాగాలకి అనుమతి ఇచ్చేవారు. ఆ సీరియల్ చాలా బాగుండి, ప్రేక్షకాదరణ పొందితే మరో 13 వారాలకు పొడిగింపుకు అనుమతి ఇచ్చేవారు. అందుకే దర్శక నిర్మాతలు కధలని సినిమా స్థాయిలో సృష్టించేవారు. 13 వారాలు, 13 భాగాలు, ప్రతి భాగం 22 నిమిషాలు, వెరసి 286 నిమిషాలు అంటే దాదాపు ఐదు గంటల నిడివి, రెండున్నర సినిమాల తో సమానమైన కధ. ప్రతీవారం ఒక సంఘటన, ఒక ఉత్కంఠ రేపే ముగింపుతో సీరియల్ ని రూపొందించడం తో వచ్చేవారం వరకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి తో ఎదురుచూసేవారు.

ఆరంభ దశలో సీరియల్స్ లో ఎన్నుకున్న కధా వస్తువు ఎంతో ఉన్నతమైన అంశంతో వుండటమే కాకుండా అత్యున్నతమైన ప్రమాణాలతో రూపొందించబడేవి. అప్పటి సీరియల్స్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి అంటే కారణం మంచి కధ, కధనం, పాత్రల్లో లీనమై నటించిన నటీనటులు అనే చెప్పవచ్చు. మొట్టమొదట దూరదర్శన్ లో ప్రారంభమైన సీరియల్స్ విలువలకు కట్టుబడి, సంభాషణల్లో కానీ, వస్తువు విషయం లో కానీ ప్రామాణికతను పాటించేవి. ఖచ్చితంగా సందేశాత్మకంగా, సామాజిక ప్రయోజనంతో కూడుకుని వుండేవి.

‘ బుచ్చిబాబు’, ‘మనిషి’ , ‘ మర్యాద రామన్న కధలు’, ‘స్త్రీ’ ‘ ఆగమనం’ వంటి వందల సంఖ్య లో సీరియల్స్ నేటికీ ప్రేక్షకుల కి గుర్తుండిపోయాయి. వినోదం, వ్యాపారంతో పాటు సమాజ శ్రేయస్సుకి కూడా ప్రాధాన్యత వుండేది.

నేడు వారాంతపు సీరియల్స్ నుండి రోజూవారి ధారావాహికలుగా సీరియల్స్ విరాజిల్లుతున్నాయి. టివి రంగం ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగింది. దానితోపాటుగా వ్యాపారాత్మక ధోరణి కూడా పెరిగింది. గమనిస్తే గత పదేళ్ళలో ఈ విపరీత ధోరణి మరీ ఎక్కువైంది. మీడియా ఎంత శక్తివంతమైన సాధనమో అందరికీ తెలుసు. అందులో టెలివిజన్ ప్రభావం సమాజంపై ఎంత ఎక్కువగా వుందో వేరే చెప్పనవసరం లేదు. ఒక రకంగా ఈ పరిశ్రమ ఎదగడం ఎంతో మందికి ఉపాధినివ్వడం హర్షించదగిన విషయమే అయినా ఈ అభివృద్ధి ఏ దిశలో సాగుతోంది అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. అవసరానికి మించిన పాత్రలు, మాటలు, విలనిజం, కక్షలు, కుట్రలు, వస్త్రధారణ, బరువైన నగలు, విపరీతమైన మేకప్, ద్వంధార్ధాలతో సహజత్వానికి భిన్నంగా విచిత్రమైన పోకడలు చోటుచేసుకుని కుటుంబమంతా కలిసి చూసే సీరియల్స్ వినోదభరితంగా, సమాచారపరంగా, చైతన్యవంతంగా, ఆదర్శవంతంగా కనిపించడం లేదు. పైపెచ్చు హాస్యాస్పదంగా మారుతున్నాయి.

సీరియల్ అంటే ప్రాణాలు పెట్టే స్థాయి నుండి సీరియల్స్ గురించి చులకనగా మాట్లాడే స్థితికి వచ్చింది. నిజానికి సీరియల్స్ చూడటం ఎవరూ మానలేదు. కానీ చూసేవారు కూడా సీరియల్స్ చూస్తున్నాం అని చెప్పడానికి నామోషీ గా భావిస్తూ వాటిని విమర్శిస్తూ వుంటారు. ఇంక యువత సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. టివి సీరియల్స్ బోర్ , మేము చూడము అంటూ ఇంస్టాగ్రాం, రీల్స్, యూ ట్యూబ్ OTT ల వైపు మళ్ళిపోయారు. సీరియల్స్ కేవలం ఇంట్లో వుండే మహిళలు, రిటైర్ అయిన వాళ్లు, పెద్దవాళ్ళకు మాత్రమే పరిమితమైపోయాయి. వారు కూడా వందల కొద్దీ ఎపిసోడ్స్, తరతరాలు సాగే స్క్రీన్ ప్లే లు, ముందుకు సాగని కధలతో విసుగెత్తిపోయారు.

ఆరంభం లో మంచి కధావస్తువులతో సీరియల్స్ రూపొందించేవారు. స్త్రీలను హింసించగూడదు, మద్యం సేవించడం ఉండకూడదు, క్రూరమైన, హింసాత్మకమైన సన్నివేశాలు చూపించగూడదు ఇత్యాది నియమాలు ఉండేవి. 1986 నుండి 1996 మధ్యకాలం లో దూరదర్శన్ లో ప్రసారమైన “బుచ్చిబాబు”, “తెనాలి రామకృష్ణ “,‘పరమానందయ్య శిష్యుల కధ”, “ రాజశేఖర చరిత్ర”, “సాధన”, “మనిషి”, “ఋతురాగాలు” లాంటి చక్కటి కధాంశాలతో కూడుకున్న సీరియల్స్ నేటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచాయి.

1996 నించి సాటలైట్ ఛానెల్స్ జెమిని, ఈటివి వచ్చిన తరవాత కూడా ఉన్నతమైన కధాంశాలతో సీరియల్స్ వచ్చాయి. “అంతరంగాలు..అనంత మానస చదరంగాలు” అంటూ మహిళ అంతరంగాన్ని ఆవిష్కృతం చేసిన “అంతరంగాలు”, విధిని ఎదిరించి గెలిచిన మహిళ జీవితాన్ని ప్రతిబింబించే “విధి” సీరియల్స్ ఈటివి సీరియల్స్ లో ఆణిముత్యాలుగా నిలిచాయి. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రఖ్యాత నవల “మందాకిని” అదే పేరుతో సీరియల్ గా జెమిని టివిలో ప్రసారమైంది. స్త్రీ హృదయపు లోతుని గోదావరి నది తో పోల్చి చూపే ఈ కధాంశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.

అదే వరుస లో అనేక ఆణిముత్యాల లాంటి సీరియల్స్ “మమతల కోవెల”, “చక్రవాకం”, “మొగలిరేకులు” , “ముద్దుబిడ్డ”, “ఆలుమగలు “ “చి.ల.సౌ. స్రవంతి”, లెఖ్ఖకు మించి ప్రసారమై ప్రేక్షకాభిమానం పొందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కలం ఆగదు, కాలమూ సరిపోదు.

నేడు వెలుగునీడల మధ్య తెలుగు టివి ఊగిసలాడుతోంది. అర్ధం పర్ధం లేని కధలు, పాత సినిమాలను కాపి కొట్టే దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్నాయి. 1960 కాలం లో వచ్చిన తెలుగు సినిమాలని వాటి టైటిల్స్ తో సహా యదాతధంగా కాపీ కొట్టడం, వందలకొద్దీ ఎపిసోడ్స్, సాగతీసే స్క్రీన్ ప్లే లు, 24 గంటలూ పట్టు చీరలు, నగలతో విలనిజం చూపించే స్త్రీ పాత్రలు ఆనవాయితీగా మారింది. ఉమ్మడి కుటుంబం పేరుతో ప్రతి సన్నివేశం లో పది మంది వుండటం, అవసరం లేకపోయినా ప్రతి పది భాగాలకీ ఒకసారి ఏదో ఒక వేడుక చేసుకోవడం, సినిమా పాటలు పెట్టడం, నలుగురి ముందు గొడవలు పడటం, సాధారణమైపోయింది. కధకోసం సన్నివేశం కాదు, సన్నివేశం కోసం కధలో మార్పు జరుగుతుంది. 6 నెలల పాటు ఒక సీరియల్ చూడకపోయినా చాలా సులభంగా కధని అర్ధం చేసుకోవచ్చు, ఎందుకంటే కధ తొందరగా ముందుకు జరగదు కాబట్టి అని విమర్శకులు వ్యంగ్యాస్త్రాలను కూడా వదులుతూ ఉంటారు.

యువతకు స్ఫూర్తినిచ్చే కధలు, ఉద్యోగం చేసే మహిళల సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటికి పరిష్కారం చూపే కధలు, పెరిగిపోతున్న break ups కి సమాధానాలు, ఇత్యాది కధాంశాలతో సీరియల్స్ రావాలి. అత్తా కోడళ్లు, ఆడపడుచుల ఆరళ్లు, మహిళా విలన్ల తో వచ్చే కధలకు స్వస్తి చెప్పాలి. లేకుంటే టివి సీరియల్ అంటే నిన్నటి చరిత్ర అనుకునే పరిస్థితి వస్తుంది. సమాజం లో మంచి మార్పు తీసుకురావాలని, కుళ్ళుని కడిగేయాలని, రోజురోజుకీ పెరిగిపోతున్న క్రిమినల్ మనస్తత్వాలని తుడిచేయాలని ప్రయత్నం చేయడం పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా సమాజం పై అత్యంత ప్రభావం చూపే సీరియల్స్ ని తమ సామాజిక బాధ్యతగా భావించి, సొంత లాభం కొంత మానుకుని, చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనే రీతిగా కాకుండా వ్యాపారంతో పాటు, సమాజ హితవు కోసం కూడా, సీరియల్స్ నిర్మిస్తున్న చానెల్స్, నిర్మాతలు, దర్శకులు సంకల్పిస్తే టివి సీరియల్ కి పునర్వైభవం తప్పకుండా వస్తుంది.

-సరస్వతీప్రదీప్,
టివి వ్యాఖ్యాత, వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో