“ఇందూరు కవయిత్రుల తెలంగా(ణ)నం”(పరిశోధక వ్యాసం )-మున్నం శశికుమార్

 

 

 

ISSN – 2278 – 478 

తెలంగాణ తొలిదశ ఉద్యమం (1969)లో భాగంగా మరియు మలిదశ ఉద్యమాల్లో సమాజం పాత్ర ఎంత ఉందో, దానిలో భాగమైన కవులు, కవయిత్రుల పాత్ర కూడా అంతే ఉంది అని చెప్పవచ్చు. అయితే సాహిత్య సృష్టిలో ఆది నుండి కవుల పాత్రే అధికంగా ఉన్నప్పటికీ గత కొన్ని ఏళ్లుగా కవయిత్రుల పాత్ర పెరుగుతూ రావడం గర్వించదగ్గ విషయం.

కవయిత్రులు వివిధ ప్రక్రియలు చేపట్టి, వివిధ ధోరణుల్లో సాహిత్య సృష్టి ని కావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ మలిదశ ( 2008 – 2014) పోరాట కాలంలో తమ వంతు పాత్ర పోషిస్తూ అనేక విధాలైన సాహిత్య సృష్టి కావించారు. ఉద్యమంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తూనే, పరోక్షంగా తమ కలం ద్వారా తమ వాణిని వినిపించారు. అందులో భాగంగానే తెలంగాణలోని వివిధ జిల్లాల కవయిత్రులు కలిసి సంకలనంగా వెలువరించిన ఉద్యమ సాహిత్య సృష్టి కి సంభందించి న “గాయాలే గేయాలై” అనే కవితా సంకలనం తార్కాణంగా నిలుస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఈ సంకలనంలో సుమారు పదిహేను మందికి పైగా ఇందూరు (నిజామాబాద్) జిల్లాకు చెందిన కవయిత్రులు పాల్గొని తెలంగాణ సాహిత్య సృష్టి వైపు వారి దృష్టి ని మరల్చి అద్భుత మైన కవితలు సృష్టించారు. సీమాంధ్ర పాలకుల తీరుపై తమ కవితా బాణాన్ని ఎక్కుపెట్టారు. అందులో కొన్ని మనం పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమం పట్ల వారికున్న విశేషమైన అవగాహన, దీక్షా దక్షతలు మరియు సాహితీ ప్రతిభను అంచనా వేసే అవకాశం కలుగుతుంది.

తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా కవులు మరియు సమాజం లేవనెత్తిన అంశం ఉద్యోగాల్లో వలస పాలకుల దోపిడీ ఒకటి. ఈ అంశాన్ని చేపట్టి ఉద్యోగాల్లో మన వెనుకబాటుతనాన్ని ప్రస్తావిస్తూ –

“సెక్రటేరియట్ లో ఉద్యోగం ఆంధ్ర అన్నయ్యకి! /
ఇహ ఓ చిన్న జిరాక్స్ సెంటర్ నాకు…” 1
(గబ్బిలాలు- “గాయాలే..గేయాలై!” -పుట.76) అని వాపోతోంది ‘వి.ప్రభాదేవి’ అనే కవయిత్రి.

తెలివి పరులకి, అమాయకులకు ఈ మధ్య పొత్తు ఏనాటికీ కుదరదని”
“ఇరుకింట్లో… పాముల మధ్య సహజీవనమా?” 2 (ఒంటె-ఓనరు -“గాయాలే..గేయాలై!”-పుట .29) అని సూటిగా ప్రశ్నిస్తుంది ‘కవితా దివాకర్’ అనే కవయిత్రి.

“తెలంగాణ మాకెందుకు అంత అది” అనే శీర్షికన రాసిన కవితలో, తెలంగాణ ఎందుకు అవసరమో చెప్తూ
“నాది… గొంతెండి పోతున్న నా పిల్లలదని/
నీది ‘కడుపులో చల్ల కదలని’ నీ పిల్లలదని!” 3
(అంత అది-ఇంత ఇది-గాయాలే గేయాలై -పుట.51) తెలంగాణ పిల్ల డొక్క ఎండిన ఆత్మ క్షోభ కాగా, వలస వాదులది కడుపు నిండిన పరిస్థితి అని స్పష్టం చేస్తోంది ‘వసంత వివేక్’ అనే మరొక కవయిత్రి.

తెలంగాణ ప్రజలలో కలుగుతున్న సామాజిక చైతన్యాన్ని చాటుతూ “చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలం/ కీలెరిగి వాత పెడతాం!” 4 (కీలెరిగి- గాయాలే..గేయాలై!- పుట.71) అని ‘విజయ’ అనే కవయిత్రి ఈ హెచ్చరికను చేస్తోంది.

పూర్తిగా తెలంగాణ, అందునా ఇందూరు మాండలిక పదాలతో ‘సంగీత రాణి’ అనే మరొక కవయిత్రి ప్రజలకు ధైర్యాన్ని ఇలా నూరిపోసింది… “పోరగాడు కెల్లి ముసలవ్వ దన్క / తెలంగాణంటే తెల్సి పోయినంక…/ తెలంగాణ రాకుండా యాడికి పోతది?” 5(హిమ్మతి తోని-గాయలే..గేయాలై!-పుట.145) ధైర్యంగా చాటుతోంది. ఇంకా తెలంగాణ భాష పై దాడిని ఖండిస్తూ “మా కూడు తిని… బలిసిన అహం / భాషను యాసనవట్టె” 6 అని తెలంగాణవాదిగా ఈ ‘శారదా హనుమాండ్లు’ (సావకు బిడ్డా-గాయలే.. గేయాలై!-పుట. 143) అనే కవయిత్రి.

ఇక పదవులు పట్టుకొని వేలాడే వారిని గర్హిస్తు, “వనిత గాజుల గలగల లో…/ వారికి యమ వాహన ఘంటికలు వినిపిస్తున్నాయి” 7(గాయలే..గేయాలై!- పుట.142) అని నాయకుల యొక్క కాలయాపన ను స్వార్థచింతనను దునుమాడుతూ స్త్రీ చైతన్యాన్ని చాటుతూ చురకలు అంటిస్తూ ఉంది ‘చాడా లలితాదేవి’.

అనేక రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం కాబడి, ఇంకనూ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ “మా ముల్లు గర్రలు మిమ్మల్ని పొడవక ముందే…./కొడకా మంచిగా ఎళ్ళిపొండ్రి..” 8 (తుర్లపాటి లక్ష్మి- గాయాలే.. గేయాలై !-పుట.114)అని విప్లవ ఆవేశాన్ని ప్రదర్శిస్తోంది ‘తుర్లపాటి లక్ష్మి’ అనే కవయిత్రి.

‘అందని ద్రాక్ష’ గా ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును సాధించే దిశగా అందరూ కదిలి ” కమ్మ కత్తి చేత బట్టి కొమ్మవంచి…/ ద్రాక్ష గుత్తి అందుకుందాం -!” 9 (తెలంగాణ పిలుస్తోంది- గాయాలే.. గేయాలై!-పుట .94) అంటూ ఉద్యమకారులుగా మారాలని ఈ ప్రజానీకానికి పిలుపునిస్తోంది ‘సుజాత’ అనే కవయిత్రి.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు సహ ఆచార్యురాలిగా పని చేస్తున్న ‘డాక్టర్ వి.త్రివేణి’ అనే మరొక కవయిత్రి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ‘బతుకమ్మ’ ను వస్తువుగా గ్రహించి “బతుకమ్మ పూల ముద్ద కాదు /కడలి కన్నీటి ముగ్డరాలు!/ తెలంగాణ ప్రజల నిండు జీవితం” 10 ( తెలంగాణ పండుగొచ్చింది- గాయాలే.. గేయాలై!-పుట.91) అని, బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనాన్ని తన కవితా పంక్తులలో చాటుతోంది.

ఇక ఉద్యమానికి మద్దతుగా నిలబడడమే కాకుండా, తనకు తెలంగాణ పట్ల ఉన్న స్వచ్ఛమైన అభిప్రాయాన్ని నిర్భీతిగా ప్రకటిస్తూ ‘మారుబడి సుజాత’ అనే కవయిత్రి, తన కుటుంబానికి, ఆంధ్ర రాష్ట్ర మూలాలు ఉన్నప్పటికినీ ” నేను పుట్టింది నిజాంబాద్ లో…/ బోధన్ కి నన్ను కోడలు చేశారు/ నేను ఇక్కడే సెటిలై తెలంగాణ వాసినయ్యాను!” 11 (తెలంగాణ ..నే మెట్టిన గడ్డ- గాయలే.. గేయాలై!-పుటలు. 88-89) తన అభిమానాన్ని చాటుకుంది గర్వంగా.! తెలంగాణ కోసం ఎదురుచూపులు ఇక చాలు అని చెబుతూ “ఏళ్లకు ఏళ్లుగా తప్పుకుంటున్న ఈ దిగుడు బావి /ఎన్ని కన్నీటి తటాకాల్ని /లోలోపల కుదించుకుంటుంది?” 12 (ఎదురు చూస్తూ- గాయాలే..గేయాలై!- పుట.45) అని ‘స్వాతీ శ్రీపాద’ అనే కవయిత్రి ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తోంది.

ఇక తెలంగాణ నవతరానికి చారిత్రక సత్యాలను గుర్తు చేస్తూ, కాకతీయుల కాలపు వీరులను కీర్తిస్తూ, జాతీయ అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని మేల్కొల్పుతూ
“అల్లాఉద్దీన్ ఖిల్జీ ని అడ్డుకొని /
మేడ రాజ్య రక్షణను పాటుపడియే పడిగిద్దరాజు…” 13
( కాకతీయుల ప్రతాపం-సమ్మక్క సారక్కల శౌర్యం- ‘గాయాలే..గేయాలై !”-పుట.63) అనే చారిత్రక సత్యాన్ని ఆవిష్కరిస్తోంది తెలంగాణ యూనివర్సిటీలో, తెలుగు సహాయ ఆచార్యురాలుగా పని చేస్తున్న డాక్టర్ ‘కె.లావణ్య’. చారిత్రక పురుషుల సాహసాలను ఉటంకిస్తోంది.

సీమాంధ్ర పాలకుల బుజ్జగింపు ధోరణి ఎండగడుతూ,
“ఖబర్దార్ మమ్మల్ని ఇంకా జో కొట్టాలని చూడొద్దు మీరు /
మాకు ఏ కమిటీలు వద్దు /
మాక్కావాల్సింది ప్రత్యేక తెలంగాణ’!” 14
(‘జో’ కోడ్తారు జాగ్రత్త !-గాయాలే .. గేయాలై!-పుట.83 ) అని వలసపాలకుల కపటబుద్ధిని బహిర్గతం చేస్తోంది ‘కె. విజయలక్ష్మి’ అనే కవయిత్రి.

ఇక ‘సుజాత’ అనే మరొక కవయిత్రి సీమాంధ్రతో తెగదెంపులు ఇక అత్యావశ్యకం అని బాహాటంగా ప్రకటిస్తూనే ఇలా చెబుతోంది.
“మాది ఎక్కాలు చదివే వయసు కాదు- లెక్కలు వేస్తున్నాం /
తెగేదాకా తెలంగాణాని లాగింది మీరే…!” 15
(తెలంగాణ పిలుస్తోంది -గాయాలే..గేయాలై! .పుట 95) అని బాహాటంగా ప్రకటిస్తోంది ఉద్యమఆవేశంతో!. తెలంగాణ రాష్ట్రం తప్పక సిద్ధిస్తుందని ఆశయాన్ని ప్రకటిస్తూ, తెలంగాణలో ఇక మరెవ్వరూ అమరులు కారాదని బాధపడుతూ చెబుతూనే అభ్యుదయ ధోరణిలో…
“రణానికైన… మరణానికైనా…/
తెలంగాణ వీరుడు భయపడడు! /
చావు కోసం చేసే ఈ తెగింపు…. బతుకు కోసం చేస్తామని ఓట్టేయండి! /
పోరాడి సాధిద్దాం! రండి! రండి!.” 16
(ఆ రోజుల కోసం- గాయాలే.. గేయాలై!-పుట.40) అని యువతరంలో నిరాశను తరిమికొడుతుంది ‘కిరణ్ బాల’ అనే కవయిత్రి ఆశావాదాన్ని నింపుతూ..!
ఈ విధంగా నేటి వనితలు వంటింటికే పరిమితం కాకుండా, సమకాలీన సమాజ సమస్యలను స్పృశిస్తూ, కలం ద్వారా తమ తమ గళాన్ని వినిపించడం ముదావహం. పై అన్ని కవితలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు.

వీరంతా తమ సాధారణ మరియు వృత్తి జీవితాన్ని గడుపుతూనే, తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ తెలంగాణా పౌరులుగా , కవయిత్రులుగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి , తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించి, శాశ్వతంగా తెలుగు సాహిత్య చరిత్రలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారని నిస్సందేహముగా చెప్పవచ్చు.

ఆధార గ్రంథం:
1. ‘గాయాలే.. గేయాలై!’ ( మే – 2010)
( తెలంగాణా కవయిత్రుల కవితా సంకలనం)
రజనీ పబ్లికేషన్-నిజామాబాద్.

-మున్నం శశికుమార్
పరిశోధక విద్యార్థి
తెలుగు శాఖ-ఉస్మానియా విశ్వ విద్యాలయం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో