రంగీన్ దునియా(కథ )-నసీన్ ఖాన్

‘యా అల్లా…! ఆడ పిల్లలను పుట్టించకు. పుట్టించినా… ఏ మహల్ లోనో పుట్టించు. లేకుంటే మానసికంగా బాగా ఎదిగి ఉన్న మనుషుల మధ్య పుట్టించు. అంతే కానీ మిడిమిడి మెదళ్లతో మనుషులు మెసిలే చోట అస్సలు పుట్టించకు’ సబిహా మనసు లోలోనే అల్లాను వేడుకుంటున్నది.

ఎర్రబారిన ఆమె కళ్లు జార్చుతున్న కన్నీటిని ఆమె నఖాబ్ దాచేస్తున్నది. సన్నగా వస్తున్న వెక్కిళ్లు బస్సు శబ్దంలోనే కలగలిసిపోవడంతో ఆమె వేదన ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. సీటులో తన పక్కనే తల వెనక్కు ఆనించి కళ్ళు మూసుకుని ఉన్న చాచీ సుల్తానాకే తెలియదు తను ఏడుస్తున్నట్లు. ఇంక వెనుక మగవాళ్ల సీట్లలో కూర్చొని ఉన్న అన్న ఒమర్‌కు ఏం తెలుస్తుంది? అందుకే తను స్వేచ్ఛగా ఏడవగలుగుతున్నది. వేళ కాని వేళ చేస్తున్న ఈ ప్రయాణం ఆమెకు అనవసరమైనదని అనిపిస్తుంది. మనసంతా చిరాకు నిండి ఉన్నది.

‘నేనేమన్నా ఎగ్జామ్ రాయడానికి పోవాల్నా? ఉద్యోగం చేయడానికా? ఈ రెండూ కాకుండా నిద్ర పాడు చేసుకుని నేనెందుకు పోవాలి చెప్పు?’ అంటూ అంతకు గంట క్రితమే తల్లి రెహానాతో వాదించింది.

‘బతికినన్ని రోజులు మీ అబ్బా ఇట్లనే సతాయించుక తిన్నడు. ఇప్పుడు నువ్వు తయారైనవ్. పోకపోతే… అన్ని మన కాళ్ల ముందటికి వస్తాయా ఎట్లా?’ రెహానా పట్టు విడవలేదు.

‘నా గురించి మాట్లాడు. మహ్రూమ్ ను ఎందుకు తెస్తున్నవ్ మధ్యలోకి?’ కసురుకుంది సబిహా.

‘నువ్వు పోకపోతే మీ అబ్బా లెక్కనే నేనూ చచ్చిపోతా’ బెదిరించింది.

అట్లా మిర్యాలగూడ నుంచి హైదరాబాదు బయలుదేరింది. కలత చెంది ఉన్న ఆమె మనసు తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఏ పరిణామాన్ని ఓర్చుకోనీయడంలేదు. తన దురదృష్టానికి కుంగిపోతూనే బలవంతంగా బస్సు ఎక్కింది.

                                                                       XXXX

‘మలక్ పేట్ చమన్ దాటి బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నప్పుడే మూల తిరగంగనే ఆపమని డ్రైవరకు చెప్పు. అక్కడ ఆటోలు ఉంటయి. చీకటైందని ఎక్కువ అడుగుతరు. బేరమాడి ఎక్కండి. మధ్యల డౌట్ వస్తే నాకైనా, భాయ్ జాన్ కైనా కాల్ చెయ్’ ఒమర్ కు ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది ఆపీ నౌరీన్.

నౌరీన్ పెద్ద బాబాయ్ హుసేన్ రెండో బిడ్డ సబిహా, రెండో కొడుకు ఒమర్. రెండో బాబాయ్ భార్య సుల్తానా. ఎన్నో రోజుల తరువాత వీరంతా వస్తున్నరన్న ఉద్వేగం ఆమెను నిలవనీయడం లేదు. ఎట్లనైనా తన కోరిక నెరవేరాలని ఎంతో ఆశగా దువా చేస్తూ వారి రాకకోసం ఎదురు చూస్తున్నది. వారిని హైదరాబాద్ బయలుదేరదీసింది కూడ నౌరీనే కావడంతోటి వాళ్లు వచ్చి పోయేదాంక బాధ్యతగ అన్ని పనులు చక్కబెడుతున్నది.

డిసెంబర్ నెల చలి వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఎప్పటిలాగే చీకటి పడే సమయానికే వంట చేసి ముందుగా తన ఎనిమిదేళ్ళ కొడుకు అఫ్ఫాన్ కు తినిపించి హెూమ్ వర్క్ చేయించింది. తను కూడా భర్త మహమూద్ తోపాటు ఎనిమిదింటికల్లా భోజనం చేస్తున్నప్పుడే అఫ్ఫాన్ నిద్రపోయాడు.

రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చినప్పుడు కాల్ చేయమని తమ్ముడు ఒమర్ మిర్యాలగూడలో బస్సు ఎక్కేముందే చెప్పి పెట్టింది. పదకొండు గంటల సమయంలో వారు ఫిల్మ్ సిటీ దాటుతున్నామని ఒమర్ కాల్ చేసి చెప్పాడు. అప్పుడు ఆ ముగ్గురికోసం వంట మొదలు పెట్టింది. వాళ్ళు ఇల్లు చేరుకునే సమయానికి వంట పూర్తి చేసి వారి రాక కోసం ఎదురు చూడ సాగింది.

ఫోన్ల పలకరింపులు కాకుండా చాన్నాళ్ల తరువాత కలవడంతో నలుగురూ ఒకరినొకరు సలాం చేసుకుని, ఆత్మీయంగా అలయ్ బలయ్ తీసుకున్నరు. వాళ్లు ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా డైనింగ్ టేబుల్ పై అన్నం, కూరలను వేడివేడిగా అమర్చింది. అప్పటిదాకా వాళ్ళకోసం ఎదురు చూసిన మహమూద్ గాఢ నిద్రలో ఉండడంతో డిస్టర్బ్ చేయకుండా వీరు మాత్రం ఎక్కడెక్కడివో కబుర్లు కలబోసుకుంటూ సరదాగా భోజనం ముగించుకున్నరు. విపరీతమైన అలసటతోటి అప్పటికే సిద్ధం చేసి పెట్టిన పడకలపైకి చేరి, నిద్రలోకి జారుకున్నారు.

                                                                  XXXX

అఫ్ఫాన్ వచ్చి నౌరీన్ ను చుట్టుకునేదాకా తెలవలేదు తెల్లారిందని. నౌరీన్ హడావుడిగా లేచి పనులు మొదలు పెట్టింది. సమయం ఆదా కోసం అందరికీ గోధుమ రవ్వ ఉప్మానే చేసి పెట్టింది. ఉప్మా తింటూ ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నరు. అంతట్లనే రెండు రోడ్డులకు అవతల పెద్ద తమ్ముడి ఇంట ఉంటున్న నౌరీన్ తల్లి సఫియా కూడా వచ్చింది.

అయితే ఒక విషయం మాత్రం నౌరీన్ ను కలవర పెడుతున్నది. సబిహా ముఖంల, కండ్లల్ల కనబడాల్సిన మెరుపు ఎందుకు కనిపిస్తలేదనేదే ఆ కలవరం. కానీ, ఎట్ల అడగాల్నో అర్థంగాక కొంత, వంట పనులల్ల కుదరక కొంత అప్పటికి వాయిదా వేసుకుంది.

‘మధ్యాహ్నానికి జోహర్ నమాజ్ తరువాత వస్తరంట’ ఫోన్ చేతుల పట్టుకుని చెప్పిండు మహమూద్. ‘వాళ్లిచ్చే టైంకు మనం రెడీగుండాలే. పోయి స్నానం చేయి’ అని సబిహాకు చెప్పింది నౌరీన్.

మోకాళ్ళ కింది దాంక ఉండే జుట్టు ఆరబెట్టుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. సబిహాకు ఇది పెద్దతంతే. ఆ బాధ తనకూ అనుభవమే కావడంతోటి అందరికంటే ముందు సబిహానే కదిల్చింది.

‘అక్కాచెల్లెళ్ళకు ఇంత పొడుగున భలే జడలున్నయే’ అని ఆశ్చర్యపోతుంటరు రిష్తేదార్లు.

సాదా అన్నం, చికెన్ వండేటప్పటికి ఒకరి తరువాత ఒకరు స్నానాలు చేసి, లంచ్ కు రెడీ అయిపోయారు. ఆ టైం కల్లా నౌరీన్ వాళ్ల అబ్బా అబ్దుల్లా కూడా వచ్చేసిండు. అందరూ గుమిగూడటంతోటి ఇల్లంత సందడి సందడిగ ఉండి ‘ఈద్ చేస్తున్నట్లే ఉంది’ అంటూ సంబరపడింది నౌరీన్. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, పరిహాసాలు ఆడుకుంటూ భోజనాలు ముగించి రావలిసినవారి కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు.

ఎవరన్న ఇంటికొస్తున్నరంటెనే తెగ టెన్షన్ పడుతుంటది నౌరీన్. అసలే సబిహాకు రిష్తా మాట్లాడిందాయె. ఏమన్న లోటుపాట్లుంటే మంచిగుండదు అని ఒకటే హడావుడి చేస్తున్నది. హవేదాన్ నుంచి కప్పులు, సాసర్లు, పెద్ద కస్తీలను ఒమర్ తోటి తీయించింది. ‘టైంకు కామ్ వాలే హాత్ దేదేతే’ అనుకుంటనే అన్నీ శుభ్రం చేసి, చాయ్ కోసం కావల్సిన పాలూ, బూందీ, బిస్కట్లు, స్వీట్లు తీసుకురమ్మని మహమూద్ కు ఆర్డరేసింది.

‘సాలీ,సాలా ఇద్దరుండీ నాతోని పనిచేయించుకుంటరా?’ అని ఒమర్ తోటి మజాఖ్ మొదలుపెట్టిండు మహమూద్.

‘మా ఏరియాకు రా భాయ్ జాన్. నిన్ను దూలా లెక్క సూడకుంటే అప్పుడడుగు. ఇప్పుడు మాత్రం సాలాను గులాబీల్లో పెట్టి చూసుకో బావా’ అనుకుంట మహమూద్ ను కౌగిలించుకున్నడు ఒమర్.

వాతావరణమంతా తేలికగా నవ్వులమయమయింది. అంతలోనే మహమూద్ కి ఫోన్ వచ్చింది.

‘అచ్ఛా… అచ్ఛా… కిత్నేలోగ్….?’ అని ఫోన్ ఆఫ్ చేసిండు.

‘ఏంది విషయం, బయల్దేరినరంటనా?’ అడిగిండు అబ్దుల్లా.

‘నాలుగైదింటికి వస్తరంట. బడీ బేటీ సలీమా డ్యూటీ నుంచి రాలేదంట!’ మహమూద్ జవాబు.

‘జల్దీ ఆతేతో జల్దీ నికల్ సక్తే నా…’ అన్నది సుల్తానా మరుసటి రోజు డ్యూటీ గుర్తొచ్చి.

‘అందరూ రావాలె కదా చచ్చీ’ అని సముదాయించి,
‘ఎట్లనైన లేట్ అయితది. రాత్రి నిద్ర లేదు. నేను కొద్దిసేపు నిద్రపోత’ అనుకుంట లోపలికి పోయింది నౌరీన్.

అప్పటికే మంచంపై వాలి కళ్ళు మూసుకుని ఉన్న సబిహా కంటి కొలుకుల నుంచి కన్నీరు జారినట్లు తడితడిగా కనిపిస్తుంది. ఆమె పక్కనే పడుకున్న నౌరీన్ అది గమనించింది.

‘క్యా హువా రే’ ఆదుర్దాగా అడిగింది.

‘బాబా ఉంటే బాగుండేది ఆపీ’ అని వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెను దగ్గరకు హత్తుకుని పడుకుంది నౌరీన్.

                                                                 XXXXX

సరిగ్గా పదకొండు నెలల క్రితం. తెల్లారగట్ల నౌరీన్ సెల్, మహమూద్ సెల్ ఒకదాని తరువాతొకటి వరుస పెట్టి మోగుతున్నయ్. మగత నిద్రల్నే కళ్ళు నలుపుకుంట లేచి టీవీ క్యాబినెట్ పైనున్న సెల్ అందుకుంది. అప్పటికే పది మిస్ట్ కాల్స్ ఉన్నాయి. చూస్తే అన్నీ అబ్దుల్లా, చిన్న చాచా షరీఫ్ చేసినవే.

‘ఈ టైంల ఇన్ని కాల్స్ ఏందీ?’ అని కంగారుగ అబ్దుల్లాకు రింగ్ చేసింది. ఇంతలోనే మహమూద్ మొబైల్ కు షరీఫ్ నుంచి కాల్ వస్తనే ఉంది. ఏం వినాల్సొస్తుందోనని భయపడుకుంటనే లిఫ్ట్ చేసింది.

‘హలో చాచా, అస్సలామలేకుమ్…’ అంది బాబాయ్ గొంతు ఏ రూపంలో ఉందా అని అంచనావేస్తూ.

‘అమ్మా! బాబా చాచా నైహెరే’ అని బావురుమన్నడు షరీఫ్.

‘క్యా హువా చాచా, ఐసా కైకు బోల్రే?’ అంది ఏడుపు పొంగుకొస్తుండగ.

‘హార్ట్ ఎటాక్. అబ్ హాస్పటల్ మేయ్ చ్ హూఁ. అబ్ ఖతమీయ్చ్ హెూగయా’ అని ఏడుస్తనే ఉన్నడు.

‘అబ్ కిధర్ లేకేజారే చాచా, హమ్ లోగ్ నికల్తే. అబ్బాకు బోలే?’ అడిగింది దుఃఖిస్తూనే.

మూడేళ్ళ కిందట్నే అబ్దుల్లాకు బై పాస్ సర్జరీ అయింది. చిన్నప్పట్నుంచీ ఒకళ్ళకొకళ్లు తోడు-నీడగ ఉన్న అన్నదమ్ములు, జీవితాల్ల ఒడిదుడుకులు ఎదురైనా జంటగుండి ఎదుర్కొన్నోళ్ళు, ఇప్పుడు సడన్గా పెద్ద తమ్ముడు లేడంటే ఎట్ల తట్టుకుంటడా అని భయంతో కంపించి పోయింది.

‘అబ్బాకు తెలుసు. నేనే చెప్పిన. వాడి ఇంటికే తీసుకెళ్తాం’ అని ఫోన్ పెట్టేసిండు.

వెంటనే మహమూద్ ను నిద్రలేపి విషయం చెప్పింది. అబ్బాకు ఫోన్ చేసింది. ఎప్పట్నుంచి ఏడుస్తున్నాడో… గొంతు బొంగురు పోయి ఉంది. అందరూ రెడీ అవుకుంటనే గుర్తొచ్చిన ప్రతి బంధువుకూ ఫోన్ చేసి విషయాన్ని చేరవేస్తున్నరు అందరూ.

అబ్దుల్లా, సఫియాలను తన ఇంటివద్దకే రమ్మని చెప్పి, తాను అఫ్ఫాన్ కోసం ఏర్పాట్లు చేయసాగింది. అబ్దుల్లాకు డయాబెటీస్ కూడా ఉండడంతోటి మధ్య మధ్యలో తినడానికి ఖీరా, క్యారెట్ లాంటివి ఒక సంచీలో సర్ది, అఫ్ఫాన్ ను ఆపా రహ్మత్ పిల్లలు నిసా, నొమాన్ లకు అప్పగించి, అందరూ కలిసి కారుల బయలుదేరారు. మాల్ మీదుగా నిడమనూరుల ఉండే పెద్ద బాబాయి ఇంట్లనే మౌతా అని తెలుసు కాబట్టి అదే రోడ్డు మీదుగ పోతున్నరు. దారి పొడుగూతా ఆ చాచా జ్ఞాపకాలే మెదులుతున్నాయి అందరిల. భారమైన మనసులతోటి మధ్యాహ్నంకల్లా చేరుకున్నరు. అప్పటికే నౌరీన్ మూడో చాచా తస్లీం, చిన్నమ్మలు, మేనత్త, మేనమామలు దగ్గరపట్ల ఉన్న వాళ్ళ పిల్లలు చేరుకున్నరు. ఇల్లు శోక సంద్రంలాగ ఉంది.

దాదీమా హాజరా బేగంను చూస్తే ఎవరికీ దుఃఖమాగడం లేదు. చెట్టంత కొడుకు, నీడలెక్క ఉండాల్సినోడు విగత జీవిగా పడి ఉంటే తొంభయ్యేళ్ళ ఆ ముసలి గుండె ఎట్ల తట్టుకుంటున్నదో అనే దిగులు అందరిని ఆవహించింది.

హుసేన్ జనాజా చుట్టూ చేరి బోరు బోరున విలపిస్తున్నరు పెద్ద చాచీ రెహానా, వాళ్ళ నలుగురు పిల్లలు. పెద్ద బిడ్డ యాస్మీన్ షాదీ ఒక్కటే అయింది. మిగిలిన ఇద్దరు కొడుకులు ఖదీర్, ఒమర్‌తోపాటు చిన్న బిడ్డ సబిహా కూడా ఉంది.

మౌతా కాంగనే ఇల్లు శుభ్రం చేయడం, ఇరుగు పొరుగు వారు భోజనాలు తీసుకురావడం, తినడం వెంటవెంటనే జరిగిపోయినయి. తిన్నవారు చీకటి పడితే బస్సులు దొరకవని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన్రు. దగ్గరోళ్ళు మాత్రం ఉండి, మూడోరోజు చేసే జియారత్ ఎట్ల చేయాల్నని చర్చించడం మొదలు పెట్టారు. షాదీలైనా అయ్యుంటే ఇప్పుడు ఆడదాని మీద ఇంత భారముండేది కాదని రెహానాపై జాలి పడినరు.

‘కనీసం ఆడపిల్ల షాదీ అన్నా చేసి ఉంటే బాగుండేది. మొగపిల్లలకు ఎట్లనన్న చేసేది’ అని దిగులుపడింది సఫియా.

హుసేన్ బ్యాంకు క్యాషియర్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యేలోపట షాదీ చేయాలనుకుంటున్న సంగతి అందరికీ తెలిసే ఉండటంతోటి ఎవ్వరు గూడ ఏం మాట్లాడలేదు.

అప్పటి నుంచీ నౌరీన్ మదిల హుసేన్ చాచా పిల్లలు మెసులుతనే ఉన్నరు. ఎవరు తన ఇంటికి వచ్చినా, ఏ ఫోన్లలో మాట్లాడినా సబిహా షాదీ గురించే చర్చ. మౌతా అయిన ఇంట్ల ఏడాదిలోపట షాదీ చేయాల్ననే పట్టుదలల ఉన్నరు.

‘మంచి రిష్తా రాకపోతే ఎట్ల చేస్తం?’ వాళ్ళందరినీ నౌరీన్ అడుగుతున్న ఒకేఒక సవాల్ ఇది. ఒకరోజు షరీఫ్ చాచా ఫోన్లో మాట్లాడుతుంటె మల్లా అడిగింది.

‘నిజమే. కానీ మనం వెతకాలి కదరా.
దొరికితే వెంటనే చేద్దామని ఈ తొందర. హుసేన్ చాచా ప్రాణాలు విడిచే ముందు కూడా సబిహా షాదీ గురించే మాట్లాడతా ప్రాణాలు విడిచిండు. పైగా చావు జరిగిన ఇంట్ల ఏడాది లోపట శుభకార్యం జరగాలని వాళ్ళమ్మ నమ్ముతున్నది’ అని గుర్తు చేసుకున్నడు.

‘నువ్ చెప్పింది నిజమే చాచా. కానీ ఆమెకు నచ్చిన రిస్తానే పక్కా చేద్దాం’ అని చెప్పింది ఖరాఖండీగా.

అప్పట్నుంచి తెల్వకుండానే సబిహా షాదీని బాధ్యతగనే తీసుకుంది. ఎక్కడెక్కడ పరిచయాలున్నయో, గుర్తొచ్చిన ప్రతొక్కచోట అబ్బాయిల గురించి ఆరా తీస్తనే ఉంది.

ఒక రోజు సడెన్ గ నౌరీన్ మదిల మెదిలిందొక ఆలోచన. మహమూద్ వాళ్ళ చాచా ఖుదాబక్ష్ చనిపోయి మూడేండ్లయింది. ఇద్దరు బిడ్డల షాదీలు అయిపోయినయ్. కొడుకు రెహాన్ షాదీ చేసి బరువు దించుకోవాలనుకుంటుంది జమీలా అని రిప్లైదార్ల నుంచి వింటనే ఉంది. ఈ మధ్య ఆరోగ్యం కూడా సరిగ్గుంటలేదని, షాదీకి తొందరపడుతుందని గూడ విన్నది.

సబిహాకు రెహాన్ కు షాదీ చేస్తే ఈడూ జోడూ బాగుంటదనిపించింది. ఇదే విషయాన్ని సాయంత్రం మహమూద్ రాంగనే చెవిన వేసింది సంతోషంగా.

‘రెండు వైపులా మనోళ్ళే కాబట్టి మనలోనే ఉండిపోతరిద్దరూ. మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. బాంధవ్యాలు ఇంకాస్త చిక్కబడతాయి’ అని అనుకున్నరిద్దరూ.

‘మనం మంచే చేస్తున్నంగనీ, మా చాచా పెద్ద బిడ్డ సలీమా ఒప్పుకుంటదా అని? వాళ్ళాయన ఆయనదే చెల్లాల్నని వెయ్యిన్నొక్కవంకలు పెడ్తడు కదా?’ ఆలోచించుకుంట అన్నడు. నౌరీన్ ఆలోచనల పడింది.

‘అంతేనంటవా? ఆమె ఒప్పుకోకుండ ఉండటానికి పెద్ద కారణాలైతే ఏమీలేవు. బీకాం కంప్యూటర్స్ చేసింది. ఇప్పుడు టీటీసీ కూడా పూర్తయింది. తెలివైనది. బాగ చదువుకుని, జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యం ఉన్న పిల్లను ఎవరు మాత్రం కాదనుకుంటరు? పైగా అర్థం చేసుకుని, మసులుకునే అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగుందో నీకు తెల్వనిదా? చాచీని సరిగా చూసుకోమని వేరే అమ్మాయిలకైతే మనం చెప్పలేమేమో గాని మన పిల్ల కాబట్టి హక్కుగ చెప్పుకోవచ్చు’ వివరించింది.

‘ఇదైతే వాస్తవమే. కానీ షాదీ అయినప్పటి నుంచీ ఆస్తి పిచ్చి పట్టింది సలీమాకు. చిన్నంతరం, పెద్దంతరం లేకుండ మాట్లాడుతుందని గాదు మొన్న మా పెద్దత్త కొడుకు రెహ్మాన్ చెప్పింది?

చాచీ కూడా బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందేగా?’ అన్నాడు మహమూద్ కాస్తంత విచారంగా.

‘ఆస్తులదేముంది చెప్పు? సలీమా భర్త ఏమన్న సంపాదించిన ఆస్తా? ఆమె సంపాదించిన ఆస్తా? చూసుకొని మురవడానికి.!? ఆయన తండ్రి నుంచి వారసత్వంగా నలుగురు అన్నదమ్ముల్లో ఈయనకు వచ్చిన యాభై గజాల జాగా. అంతే కదా? అంతకుముందు చాచీ వాళ్ళింట్ల ఉన్నామెనేనాయె. ఆమె పరిస్థితి మనం చూడనిదా? కిరాయింట్లనే పుట్టింది. కిరాయింట్లనే పెరిగింది. కిరాయింటి నుంచే అత్తింటికి పోయింది. ఇప్పుడు సొంతిల్లే అయినా నలుగురు పోతే కూసోలేరు, నిలబడలేరు. మనమెప్పుడన్న నజరందాజ్ చేసినమా?’ బాధపడుకుంట అన్నది.

‘నువ్వు చెప్పేది నిజమే. కానీ ఇప్పుడు ఆ పాత సలీమా కాదు. తల్లిగారింటిని అసహ్యించుకుంటున్నది. ఏడాదికోసారి కూడా వచ్చి చూడట్లేదని కదా మా చాచీ బాధపడుతున్నది’ అని గుర్తు చేసిండు.

‘పోనీలే. ఇప్పుడు అవన్నీ కాదు కానీ, పన్నెండేళ్ల ముందు మీ చెల్లెలికి ఇస్మాయిల్ పైగామ్ ఆలోచన తెచ్చింది మాత్రం నేను కాదా?’ అంది నౌరీన్. ,

‘ఆ తరువాత ఆమె షాదీ వరకు నడిచింది మనమే కదా’ తృప్తి వెలిబుచ్చాడు మహమూద్.
మల్ల తనే చెప్పిండు.
‘నువ్వు చేసిన ఇంకోపని కూడా నాకు గర్వంగా అనిపిస్తుంటుంది.

‘చాచీ మెషీన్ పై పెట్టీకోట్లు కుట్టి షాప్ లకు వేస్తున్నప్పుడూ వాళ్ళ కుటుంబం అంతంతమాత్రంగానే ఉండే. నువ్వు జాబ్ లో భాగంగా వాళ్ళింటికి పోయినప్పుడు కదా వాళ్ళకు పబ్లిక్ ఫోన్ పెట్టమని చెప్పి, చాచాను తీసుకొని టెలిఫోన్ ఆఫీసుకు తిరిగి కనెక్షన్ ఇప్పించినవ్. దానితోపాటు కిరాణా షాపు పెట్టించి, చాచీ మసక చూపుకు విశ్రాంతినిచ్చినవు. నా వాళ్ళను కూడా అంత బాగా చూసుకునే పెద్ద మనసు నీది. ఇప్పుడు చాచీ చూడు ఇద్దరు ఆడపిల్లల షాదీలు చేసింది’ మెచ్చుకోలుగా నవ్విండు.

‘మనమిద్దరం ఒక్కటైనప్పుడు నీ వాళ్ళూ, నా వాళ్ళూ అని విడివిడిగా ఉండరు. అటోళ్ళకూ, ఇటోళ్ళకూ మనమిద్దరమూ వారధులమే మిస్టర్. అందరూ మనవాళ్ళే. సంఝే’ అని చురచురా చూసింది నౌరీన్.

‘నీలోని ఈ నిరాడంబరతే నాకు ఇంకా నచ్చుతది. ఎంతమంది కోడళ్లు నీ లెక్కుంటరు చెప్పు?’ అని మెచ్చుకోలుగా చూసిండు మహమూద్.

‘సరే సరే… ఈ మాటలేనా, ఫోన్ చేసి ఏమైనా చెప్పేదుందా?’ అని తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేసింది.

మహమూద్ వెంటనే జమీలాకు ఫోన్ చేసి విషయం చెప్పిండు. ఆమె ఎంత సంతోష పడుతున్నదో ఫోన్లో మాట్లాడుతున్న మహమూద్ మాటల్ల గమనిస్తనే ఉంది నౌరీన్. అదే ఆనందంల చెల్లెళ్ళిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పమని హుకూం జారీ చేసింది.

‘బయోడేటా రెడీ చేయించి, ఫొటోస్ తెప్పించి వాట్సప్ పంపిద్దాం వాళ్ళిద్దరికీ’ ఉత్సాహపడుతూ అన్నది నౌరీన్.

‘సరే’ అని తలూపి తన పనిల పడిపోయిండు.

నౌరీన్ ఫొటోల కోసం ఫోన్లల్ల హడావుడి మొదలు పెట్టింది.

వెంటనే సబిహా ఫొటోలు ఖదీర్ నుంచి తనకు వాట్సాప్ చేయించుకుంది. ఆ ఫొటోలు నౌరీన్ కు నచ్చలేదు. ఫొటోషాప్ చేసినవి వద్దు అని చెప్పి, మల్ల స్టూడియోకు తీసుకపోయి మేకప్ లేకుండా సింపుల్ గా తీయించమని సలహా ఇచ్చింది. అయితే టీటీసీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండడంతో, పరీక్ష అవగానే ఫొటోలు దిగుతానని చెప్పింది సబిహా. ఈలోపు బయోడేటాలు రాయడానికి కావలిసిన వివరాలన్నీ తీసుకుంది. ఇస్లామిక్ పద్దతిల బయోడేటా తయారు చేసింది. అదే కాపీని మార్పు చేర్పులకోసం సబిహాకు పంపింది. అన్ని స్పష్టంగా ఉన్నాయని తృప్తి పడింది సబిహా.

అదే తరహాలో రెహాన్ ఫోటోలనూ, బయోడేటాను నౌరీనే సిద్ధం చేసింది. ఫేస్ బుక్ నుంచి నచ్చిన ఫొటోలు తీసుకోమని చెబితే, వాటిని చెక్ చేసి బాగున్నయనుకున్న ఫొటోలు డౌన్ లోడ్ చేసి, వాట్సప్ లోనే సబిహాకు, షరీఫ్ చాచాకు, జమీలాకు పంపింది. అందరూ అబ్బాయి బాగున్నడు, అమ్మాయి బాగుంది అని సంతోషపడిన తరువాతనే చూసుకునే కార్యక్రమం మొదలైంది.

నౌరీన్ మాత్రం అమ్మాయి, అబ్బాయి ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి ఇద్దరినీ అడిగింది.

ఇద్దరూ ఇష్టం చూపుకున్నరు ఒకరి పట్ల మరొకరు. దాంతోటి సంతోషం పట్టలేకపోయింది.

ఈ క్రమంల ఉండంగనే ఒక రోజు సందెయాలకు జమీలా నుంచి మహమూద్ కు కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతుంటేనే మహమూద్ ముఖంల రంగులు మారడాన్ని గమనించింది. ఫోన్ ఆఫ్ చేసిన తరువాత…

‘సలీమాకు, ఆమె భర్త ఇస్మాయిల్ కు నచ్చితేనే షాదీ చేద్దాం అని చెప్తుంది చాచీ’ అని చెప్పిండు. మల్ల తనే కంటిన్యూ చేసిండు దిగులు ముఖంతో…

‘ఏమో! నేను అప్పుడే చెప్పిన్నా? సలీమా వాళ్ళు ఏదోకటి వంక పెట్టి ఆపేస్తరని, ఆమెకు తనకంటే ఎక్కువ చదువు, అందం ఉంటే సహించే గుణం లేదని’ అసహనంగ అన్నడు.

‘ఠీక్ హై. ముందైతే చూడనీ. అమ్మాయి, అబ్బాయి నచ్చుకుంటే, చాచీ కూడా ఓకే అంటే సలీమాతో మనం మాట్లాడదాంలే’ సముదాయించింది.

‘ఆమె షాదీ అయినప్పటినుంచి బాగనే ఘమండ్ చూపుతున్నది. ఆమెకు ఇష్టం లేకుండ షాదీ చేస్తే కనీసం పిల్లలను కూడా పంపదు అని చాచీ భయ పడుతున్నది’ దిగాలుగ అన్నడు.

‘ఈ ఏర్పాట్లు కాకముందు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు చెప్తుంది మీ చాచీ’ విచారంగా అంది నౌరీన్.

అంతలోనే చాచీ నుంచి మహమూదు ఫోన్. ‘అమ్మాయిని చూద్దాం అని సలీమా చెప్పిందంట’ అని సంతోషంగ చెప్పిండు.

‘ఆమె ఒక్కమాట పక్కాగా చెప్తలేదెందుకో’ సందేహంగ అన్నది నౌరీన్.

‘ఏం చేస్తాం? ఇక్కడికే అమ్మాయిని రప్పించి, మనింట్లనే అందరికీ చూపెడదాం. ఈ ఉద్యోగాలోల్లు ఎటూ కదలరనుకుంట. దూర భారం ఎవరికీ ఇబ్బంది కలగకుండ చూద్దాం’ అన్నడు మహమూద్.

‘సరే’ అని తలూపి వెంటనే షరీఫ్ చాచాకు ఈ విషయం చెప్పేసింది. జమీలా, సలీమా ఖరారు చేసిన తేదీని తన వారికి చేరవేసింది. వాళ్లు చెప్పిన ఆదివారం రానే వచ్చింది.

                                                               XXXX

అలసిసొలసి ఎక్కడివాళ్ళక్కడ నిద్రపోవడంతోటి ఇల్లంత నిశ్శబ్దం అలుముకుని ఉంది. మహమూద్ మొబైల్ శబ్దానికి ఒక్కసారిగ మేల్కొన్నరు అందరూ. నౌరీన్, సబిహా గదిలో ఉండడంతోటి వాళ్ళకు వినిపించలేదు. మహమూద్ హడావుడిగా వచ్చి వాళ్ళను నిద్ర లేపిండు.

నౌరీన్ లేచి బయటకు వచ్చేసరికే వచ్చినోళ్ళందరూ ఇంకో గదిలకి పోయి బుర్భాలు విప్పుతున్నరు. మగవాళ్ళందరూ హాలుల కూసోనున్నరు. అందరికీ సలాం చేసి, చేతులు కలుపుకుంట, కుశల ప్రశ్నలు కాంగనే కిచెన్లోకి వెళ్ళి మంచి నీళ్లు కస్తీలలో సర్ది, ఒమర్ చేతికి ఇచ్చి తను టీ చేయడంల పడిపోయింది.

ఈలోపు సుల్తానా సబిహాకు చక్కగా జడ అల్లి రెడీ చేసింది. ఆ తరువాత బట్టలు మార్చుకున్న సబిహాను జమీలా, సలీమా, చిన్నబిడ్డ షమీమ్ ఉన్న గదిలకి తీసుకుపోయారు. నౌరీన్ చాయ్ రెడీ చేస్తూనే, ఖారా, స్వీట్లు, బిస్కెట్లు చిన్న చిన్న ప్లేట్లలో సర్దింది. వాళ్ళు తింటున్న సమయంలోనే అల్లుళ్ళకు కూడా చూపించమని సఫియా ఒమర్ కు చెప్పి పంపింది.

టీ ఇస్తున్న టైంలనే ఇద్దరు అల్లుళ్ళు కూడా సబిహాను చూసేసారు. ఆ తరువాత వెంటనే వెళ్ళిపోయారు. సాయంత్రం ఏడు గంటలప్పుడు సబిహా, ఒమర్, సుల్తానా కూడా వెళ్ళేందుకు రెడీ అయిపోయారు. ఎంతగా ఆపే ప్రయత్నం చేసినా, సోమవారం డ్యూటీ అని వెళ్లిపోయారు. అర్థరాత్రి ఒకటిన్నరకు చేరుకున్నమని అన్వర్, నౌరీన్ కు కాల్ చేసి చెప్పిండు.

సబిహాను చూసి వెళ్ళినప్పట్నుంచి తనకు అమ్మాయి నచ్చిందని షమీమ్ వాట్సప్ నుంచి నౌరీన్ కు మెసేజ్ లు చేస్తనే ఉంది. అక్క ఫోన్ చేసిందా, నచ్చినమన్న విషయం చెప్పిందా? అని అడుగుతనే ఉంది. లేదు అనే జవాబ్ నౌరీన్ ఇస్తనే ఉంది.

ఇంకో దిక్కు షరీఫ్ చాచా ఫోన్ చేస్తున్నడు. ఈ నెలలనే షాదీ పెట్టుకుందామని, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నరని, ఆళ్ళందరికీ నచ్చిందని చెప్తున్నరని.

ఒకదానెంట ఒకటి తెలుస్తుంటే నజియాకూ నమ్మకమేర్పడింది. సబిహాకు ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్పింది. తలలో నాలికలా మెలగాలని, అమ్మలాగే అత్తను చూసుకోవాలని తనకు తెలిసినవి చెప్పింది. వాళ్ళు తనను చూస్తున్న
సమయంలో అబ్బాయి తల్లి జమీలా తనకు బాగా నచ్చిందని సబిహా కూడా చెప్పింది. మిగతా వాళ్ళందరూ తనను ఎగాదిగా చూస్తుంటే అట్లా చూడొద్దని వారించిందని సంతోషంగా చెప్పింది.

‘చాచీ ఇస్లామ్ ప్రకారం నడుస్తుంది. ఆమె నమాజ్ పాబందీ’ అని నౌరీన్ తన సంతోషం ప్రకటించింది.

రెండు వారాలు గడుస్తున్నా ఎటువంటి జవాబ్ రాకపోవడంతోటి తానే సలీమా ఇంటికి పోయింది. విషయం కదిలించి, ఆమె నోటి వెంట వచ్చిన మాటలు విని మొద్దుబారిన మెదడుతో వెనుదిరిగింది.

ఈ అమ్మాయి గురించేనా ఇస్మాయిల్ కు ఎన్నో మంచి మాటలు చెప్పి షాదీకి ఒప్పించింది. అంటే తాను అబద్ధం చెప్పిందా? ఇస్మాయిల్ ఇంట్లో వారెవ్వరికీ సలీమా అంటే ఇష్టం లేకపోయినా ఆమెలో ఉన్న మంచి విషయాలు వెతికి మరీ వివరించి చెప్పి మరీ షాదీ చేసింది? అంటే ఆ అబ్బాయిని, వాళ్ళ ఇంటి వాళ్ళను తాను మోసం చేసిందా? ఇస్మాయిల్ కన్నా ఈమెనే తేడానా? తననుతానే ప్రశ్నించుకుంటూ ఇంటికొచ్చి కూలబడింది.

‘ఊరి పిల్ల ఎందుకు భాభీ. అయినా ఊరోళ్లు బాగనే కట్నం ఇస్తరుగా. వీళ్లేంది దాని గురించి ఒక్కమాటా చెప్పరు? ఏం బాగుంది అమ్మాయి?’ అని రకరకాల ప్రశ్నలు కుమ్మరిస్తూంటే ఈమె గురించి ఒకనాడు ఇట్లనే కదా అనుకున్నరు.

‘అమ్మాయి పొట్టిగా ఉందంటున్నరు బాజీ’ అని ఆమె షాదీ ప్రస్తావన సమయంలో ఒకనాడు ఇస్మాయిల్ చెప్పిన మాట గుర్తొచ్చింది.

‘బచ్చీ కాలీ హై భాభీ’ అని ముక్తాయింపు కూడ ఇచ్చింది.

నౌరీన్ ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. ఒకప్పుడు అడిగినంత ఇచ్చుకోలేమని తల్లిదండ్రులు సతమతమైపోతుంటే కళ్ళారా చూసిన ఈ అమ్మాయేనా దహేజ్ గురించి మాట్లాడుతున్నదీ. తన మూలాలు ఇంకా ఊర్లో ఉన్నాయన్న విషయం మరిచి మరొకరిని ఊరోల్లు అని ఎత్తి చూపుతుంది. ఆమె ఇంటిల్లిపాదిలో ఒకరిద్దరు తప్ప ఎవరైనా ఏం బాగున్నరని? చివరకు ఆమె భర్త నలుపే కదా. తండ్రీ నలుపే కదా. తమ్ముడూ, చెల్లెలూ నలుపే కదా. అంతదాకా ఎందుకు ఆమె ఇద్దరు పిల్లలు చామన ఛాయలనే ఉన్నరు. ఏ దావత్ లనైనా ఆ పిల్లలు కనబడితే పాపం. రిస్తేదార్లు
‘క్యా రే చైనీస్, క్యా రే జపనీస్, మీ అమ్మ లాగనే ఉన్నరేంట్రా? అని ఆట పట్టించడంలేదా? వీటిని తానేమీ పట్టించుకోలేదే. అంటే తాను అమాయకురాలా? మనిషిని మనిషిగా చూసే తాను తెలివి తక్కువదా? గురువిందల లోకంలో తనలాంటి వారు మెసలడం అంటే పందొమ్మిదో శతాబ్దం మొదటికి పోవాలన్నమాట…’ అని గుర్తు చేసుకుని నవ్వుకుంది.

‘తనలాంటి మరో అమ్మాయికి ఇన్ని వంకలు పెట్టడానికి మనసెట్లా వచ్చిందో కదా?’ అని మథన పడింది. అయినా సబిహా రంగేమీ నలుపు కాదు.

చామనఛాయ కంటే ఇంకా మెరుగైన రంగే. పైగా ఎంత కళగా ఉంటుందనీ? సలీమా వాళ్ళింట్లో ఏ ఒక్కరూ సబిహా అందానికి సరితూగరన్న విషయం వారికీ తెలుసు. ఒడ్డూ పొడవూ, ముక్కూ ముఖం ‘బాపూ బొమ్మలాంటి అందం నా చెల్లెలి సొంతం’ ఇంక ఆ అబ్బాయి అర్హతలను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు కానీ పోల్చి చూస్తే తనకన్నా తక్కువ చదువుకున్నోడే. ఎన్నోసార్లు ఫెయిల్ అయినోడే’ అనుకుంది మరొకసారి సలీమా మాటలు శూలాల్లా గుచ్చేస్తుంటే.

‘అసలు చూడాల్సింది. బుద్ధినా, రంగునా? అయినా కాపురం చేసుకునేటోల్లకు ఇష్టమైనప్పుడు ఇంతమంది మధ్యల రావడమెందుకు?’ అని ఎప్పుడూ వాదనకు దిగే నౌరీన్‌కు ఆ సలీమాను గట్టిగా దులిపేయాలనుంది. మహమూద్ ముఖం చూస్తూ తమాయించుకుంటున్నది.

ఎంతగానో బాధపడుతూ ‘ఇంక వదిలేయమని’ అందరికీ ఫోన్ ద్వారా చెప్పేసింది. సబిహాకు ఏమని చెప్పగలననుకుని మౌనంగా ఉండిపోయింది. కానీ, షరీఫ్ చాచా ఫోన్ చేసి చెప్పిన విషయమొకటి ఆమెకు మళ్ళీ ఆనందాన్నిచ్చింది. సబిహా షాదీ గురించి అందరూ పడుతున్న ఆరాటానికి చిరాకు పడిపోయిందట.

‘నేనిట్లా ఉంటే మీకేం బరువవుతున్నాను? నాకేమన్నా వయసైపోయిందా? చదివి ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకుంటుంటే షాదీ షాదీ అని ఒత్తిడి చేస్తున్నరెందుకు? నాకు నచ్చినోళ్లు దొరికితెనే చేసుకుంటా. లేకుంటే వదిలేయండి. ఎవరన్నరు? చనిపోయిన ఇంట్ల ఏడాదిలోపట శుభకార్యం చేయాల్నని? అదే చేయాలంటే అందరినీ పిలిచి దావత్ ఇయ్యండి. నన్నెందుకు అవమానాల పాల్జెస్తున్నరు? నేను అట్లున్నా, ఇట్లున్నా అని నన్ను జడ్జ్ చేయడానికి వాళ్ళెవరు? నేను నల్లగనే ఉన్ననేమో. మా అబ్బాలాగ ఉన్న. నాకు చాలా సంతోషంగ ఉంది. నేనిట్లనే ఉంట. అందరికీ తెల్లతోలే కావాల్నంటే ఏ అమెరికా వాళ్లో వీళ్లకు తల్లులూ, తండ్రులై ఉండాలి. అమెరికన్లు ఇండియన్లందరినీ నల్లోళ్ళే అంటరు. అది తెలిసి చావదు ఈ జనాలకు. నాకైతే మన ఇండియన్ చాలు. నచ్చినోడే వస్తడు. అని ఆవేశంగా గట్టిగానే చెప్పేసింది’ అని చెప్పాడు.

ఆరోజు తన ఇంటికొచ్చిన టైంల సబిహా ముఖంల ఉన్న దిగులు ఇదే కావొచ్చనిపించింది నౌరీన్ కు. ఒక్కసారిగా మనసు తేలికపడింది. వెంటనే సబిహాకు ఫోన్ చేసింది.

‘మంచిపని చేసినవ్. నీకు నచ్చినప్పుడే నీ షాదీ. అప్పటిదాకా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. నిన్ను నిన్నుగా గౌరవించినోడికే ఇంపార్టెన్సియ్యాలె. రంగుల్లో బతికే చెత్త మొఖాలను దగ్గరకు రానీయకు’ అని చెప్పి మనస్ఫూర్తిగ వెన్నుతట్టింది నౌరీన్.

-నసీన్ ఖాన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో