అమ్మ అలిగింది… ఊహూ… అలుగుతూంది.
ఈ మధ్యలో… తరచుగా… ఎక్కువగా… అలుగుతూంది.
చరవాణి చేతికి రాలేదని
చలనచిత్రం చూడరాలేదని
కట్టుకున్నవాడి మీద… కన్నపేగు మీద… అలిగింది.
బీరకాయ బాలేదని “బజారున” తిట్టినందుకు…
మాగిన మామిడి కోసం మారాం చేసినందుకు… మూతి ముడుచుకుంటూ…
మాట మానుకుంటూ…. అలిగింది.
తండ్రిచావుకు పంపలేదని…
వాళ్ళమ్మ అలకను తీర్చలేదని..
వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ…
తిండి- తిప్పలు మానుకుంటూ….అలిగింది…
చంటోడ్ని చంకన చేర్చుకోనందుకు…
చందమామను చూపనందుకు…
చిట్టి మనసు చింతగా చప్పబడి అలిగినట్టు… అమ్మ అలగలేదు –
చిన్న పిల్లలా…చిరుచినుకులా…
అమ్మ అలిగింది-
పెను గాలిలా… కుండపోతగా…
పొయ్యిమీద సర్రున వేడెక్కిన పెంకలా…
సతీ-వియోగాగ్నిలో తాండవిస్తున్న పినాకిలా….
బొగ్గుమీంద చిటపట కాలుతున్న కంకిలా…
“కస్తూరి” రంగంటిన కసి కన్నులవెంట కన్నీరు కారుస్తూ అలిగింది….
“అలక”నంద ప్రవాహ ఝరిలా అశ్రువు జారింది…
మా అమ్మ అలిగింది.. అలుగుతుంది..
-ఐశ్వర్య లక్కాకుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to అమ్మ అలిగింది(కవిత ) -ఐశ్వర్య లక్కాకుల