ఆకాశానికి వేసిన నిచ్చెన కుదుళ్ళు
ఇంకా దగ్దమైపోలేదు
స్వతంత్ర గాలిపటపు దారం
మన చేతులనుంచీ జారిపోలేదు
జాతి యావత్తుపై నా వాళ్ళు కురిపించిన
ఆ కరుణరసం ఇంకా ఇంకిపోలేదు
ఆ స్వేచ్చా రేణువులు మన చుట్టూ
పరిభ్రమిస్తూనే ఉన్నాయ్
చూడూ..
కనులుండాలే కానీ, కమ్మని హృది ఉండాలే కానీ!
దేశాలు దాటి పోనీ, సంద్రాలు ఇంకిపోనీ
త్యాగధనులు వేసిన బాట, దారి చూపిస్తూనే ఉంది
మయూఖాల వెలుగు మనపై చిలకరిస్తూనే ఉంది
ఎన్నెన్నో బలిదానాల అమృత కలశం కదా అది
ఎన్నెన్నో ఆత్మకథల సమాహారమది
ఆ వసంతాల వేడుకలకు
ఏళ్ళకేళ్ళు గడిచిపోతూనే ఉన్నాయ్
శిశిరమై రాలిపోతున్న దేశభక్తికి
అలనాటి మట్టిని తెచ్చి మొదళ్ళలో మెత్తాలిప్పుడు
ఆ ఆకాంక్షల బలం చల్లాలిప్పుడు
ఆ చరిత్ర మడుగులలో
మనమొక్కసారి పయనించి రావాలి
ఆ సమర శంఖారావాన్ని నరనరాల్లో
పొదవుకుని పునరుత్తేజం పొందాలి
ఇప్పటికైతే మనం కోల్పోయిన
కోహినూర్ లు ఇంటింటికీ పుట్టి
నా తల్లిని ఓ మేలిమి వజ్రాల గనిగా
మారుస్తూనే వున్నాయి
రెండు శతాబ్దాల దుఃఖ చారలు
బానిస సంకెళ్లను
తునాతునకలు చేసిన
ఆ ఉక్కు సంకల్పం
ఆ మొక్కవోని దీక్ష
ఇప్పుడు మరోసారి పురుడు పోసుకోవాలి
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
నిత్య నినాదమై జాతిని చైతన్య పరచాలి
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!”
అని నేర్పిన నాదేశం
ఎందరో దేశభక్తులను, కన్న
కోటను కోట్ల దేహాల సమృద్ధి
ఇప్పటికీ ఎప్పటికీ చెక్కుచెదరని
కలకాలపు ప్రపంచ దిక్సూచి
ఆది మూలాలలోనుంచి మళ్లీ మళ్లీ జన్మిస్తూ
విభిన్నతా ఏకత్వంతో విశ్వ పటంపై
దేదీప్యమానమై వెలుగుతున్న దీపస్తంభం
ఎవ్వరికీ తలవంచని ధీర
సౌహార్ద స్నేహతత్వ చిహ్నాల చెర
వీరత్వ ప్రేమతత్వ
ధీరత్వ సత్యతత్వ
ఏకత్వ సమ్మిళిత క్షేత్రం
పరమ పావన దేశం
నాదేశం.. భారత దేశం
జై హింద్
-సుధామురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~