ఎవరికీ వారే సరి!(కథ) -తిరునగరి నవత

స్వేచ్ఛకి చిన్నప్పటి నుండి రెండు జడలు వేసుకొని రిబ్బన్ పైకి కట్టుకోవడం అంటే ఇష్టం. “మాడర్న్ స్కూల్లో పాత చింతకాయ పచ్చడి లాగ ఉంటావే, అందరు ఎగతాళి చేస్తారు” అని ఇంట్లో పెద్ద వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకొనేది కాదు. రోజు ప్రొద్దున్నే ఇంట్లో ఒక పెద్ద యుద్ధం తప్పదు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, పొద్దున అలారం మోగుతున్న ఏదో లోకంలో ఉన్నట్టు లేవకపోవటం, వాళ్ళమ్మ అరుంధతి మొత్తుకొని మొత్తుకొని నిద్రలేపడం, ఇవ్వన్నీ ఆ ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ ఇంటి చుట్టు పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అంతటితో యుద్ధం ఆగిపోతుందా అంటే అదీ కాదు, పళ్ళు తోమడం దగ్గర నుంచి షూస్ వేసుకోవడం వరకు ఒక రేంజ్లో కొట్లాట. ఇంక జడ వెయ్యడం అంటే భూకంపం, తుఫాను రెండు కలిసి వచ్చిన వాతావరణం అలుముకొంటుంది.

ఒక దిక్కు స్కూల్కి టైం అవుతుంటుంది. “నువ్వు చిక్కులు తీస్తుంటే ప్రాణం పోతుంది” అని స్వేచ్ఛ, “ఆ మాత్రం ఓపిక లేకపోతే మరి జుట్టు కత్తిరించుకోవచ్చు కదా” అని వాళ్ళమ్మ, “నాకు నా జడలు అంటే ప్రాణం, ఇట్లానే రెండు జడలు పైకి కట్టుకోవాలి” అని స్వేచ్ఛ, “పోవే పాత చింతకాయ పచ్చడి” అని వాళ్ళమ్మ… ఇట్లా మాటల్తో వాలీ బాల్ ఆడుకోవటం రోజు రొటీన్ అయిపోయింది. ఈ యుద్ధంలో మాకే పాత్ర లేదన్నట్టు ఇంట్లో మిగతా వాళ్లంతా తప్పుకొంటారు..ఆ తతంగం అయిపోయాకే అందరూ వాళ్ళ కలుగుల్లోంచి బయటకి వస్తారు..

ఇవ్వాళ అదే తతంగం. మొత్తానికి యుద్ధం ముగిసి ఇరు వైపుల శాంతి ప్రపత్తులు చేరుతున్నాయి అనే సమయానికి కరెక్ట్ గా ఆటో అతను ఇంటి ముందుకి వచ్చి వాలాడు.
“అమ్మమ్మ బాయ్” అని చెప్పి బుంగ మూతి పెట్టుకొని బయలుదేర పోయింది స్వేచ్ఛ.

“స్వేచ్ఛ ఇక్కడ రా” అని చెంప మీద ముద్దు పెట్టి “ఇవ్వాళ శుక్రవారం కదా, రాత్రికి సినిమా చూద్దాం సరేనా, మనమిద్దరమే! అమ్మతో కట్టి “ అని అమ్మమ్మ సరస్వతి అంటే స్వేచ్ఛకి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది..”సరే అమ్మమ్మ యు అర్ ది బెస్ట్” అని చెప్పి బయటకి పరుగెత్తింది.

                                                                       **************

స్కూల్ లొపలికి అడుగు పెడుతూనే రేఖ కోసం కలయ చూసింది స్వేచ్ఛ. చుట్టూ వెతికినా ఎక్కడా కనిపించట్లేదు . ఇంతలో బెల్లు మోగింది. “అయ్యో! మాథ్స్ బుక్ తెచ్చానొ లెదో “ అని సందేహం వచ్చి స్వేచ్ఛకి చల్ల చెమటలు పట్టాయి. “ఆసలే మాథ్స్ దుర్గ టీచెర్ అంటే అందరికి హడల్. సంజాయషికి తావు ఇయ్యకుండా తిట్టేస్తుంది. పొదున్నే ఒక 5 నిమిషాలు ముందు లేచి అన్నీ చెక్ చేసుకోమని అమ్మ ఎప్పుడూ కోప్పడుతూనే ఉంటది కూడా. నాకేమొ బద్దకం. రేపటి నించి తొందరగా లేస్తా promise!” అని తనలో తాను గొణుక్కొంటూ క్లాస్ చేరుకొంది. న్యుసెన్స్ బ్యాచు అప్పటికే బ్యాక్ బెంచీల్లొ చేరారు. “అసలు క్లాసుకి ఎందుకు వస్తారో ఏమో” అని మళ్ళీ తనలో తాను గొణుక్కొంటూ సెకండ్ బెంచ్లో సెటిల్ అయ్యి , ముందు బాగ్ తెరిచి పుస్తకాలు చూసుకొంది “హమ్మయ్య!అనవసరంగా టెన్షన్ పడ్డ, పుస్తకం ఇందులోనే ఉంది”

రేఖ లేటుగా వచ్చింది. దుర్గ మేడం పేరుకి తగ్గ అవతారం ఎత్తి తిట్ల దండకం వదిలింది. రేఖ అమాయకత్వం నటిస్తూ ఆ తిట్లన్నీ ఒక చెవితో వినట్టు విని ఇంకో చెవితో వదిలేస్తుంది. “మహా…నటి ! మహా..నటి ! సావిత్రమ్మ, కీర్తి సురేష్ ఇద్దరి టాలెంట్ కలిపితే మన రేఖ” అని తనలో తనే నవ్వుకుంది స్వేచ్ఛ.. క్లాసులు అన్ని అయిపోయాక ఒక సారి తనని కలవమని స్వేచ్ఛకి, రేఖకి చెప్పి దుర్గ మేడం వెళ్ళిపోయింది. తరువాత పీరియడ్ తెలుగు మాస్టర్ పద్యాలు/తాత్పర్యాలతో ముగిసింది. తరువాత హిస్టరీ, సైన్సు , ఇంగ్లీష్.. అన్ని క్లాసులు అయిపోయాయి!

టీచర్లు చెప్పే పాఠాలన్నీ మెదళ్ళలో, నోటుబుక్లో నోట్ చేసుకోవాలనే ప్రగాడ తాపత్రయం అమ్మాయిలిద్దరికి. ఇవేమి పట్టనట్లుగా వెనక బెంచి న్యూసెన్స్ బ్యాచ్ మధ్య మధ్యలో మొబైల్ ఫోన్లో ఏంటో చూసుకుంటూ కి…కి..కి అని ఒకటే వెకిలి నవ్వులు, గుస గుసలు. అప్పుడప్పుడు అనవసరమైన ప్రశ్నలు కూడా వేస్తూ సగం క్లాస్ సమయం వృధా
చేస్తూ ఉంటారు.

ఒక్క దుర్గ మేడం క్లాస్ లో మాత్రం ఆమె గొంతుకి భయపడి చుప్ చాప్ కూర్చుంటారు. “వీళ్ళకి ఫ్యూచర్ అంటే భయం లేదా, టీచర్స్ అంత ఓపికగా పాఠాలు చెప్తుంటే ఎట్లా టైం వేస్టు చెయ్యాలని అనిపిస్తుందో, ఛీ” అని కొంచం గట్టిగానే అంది స్వేచ్ఛ క్లాస్ అయిపోయాక బాగ్ సర్దుకొంటూ. రేఖ “వాళ్ళు వింటారే! జాగ్రత్త” అన్నట్లు కళ్ళతో సైగలు చేసింది . “వింటే నాకేంటి భయం, సరే పద” అని కొట్టేసింది స్వేచ్ఛ.

మేడం రూం వైపు కొంచం భయం భయంగానే నడిచారు. స్టాఫ్ రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయు.. మూడు సీలింగ్ ఫ్యాన్లు అదే పనిగా చక్కర్లు కొడుతున్నా చాలా ఉబ్బరంగా ఉంది. కిటికీ దగ్గరగా చైర్ వేసుకొని మేడం ఏదో పుస్తకం చదువుతున్నారు. ఏమంటారో ఏమో అని భయంతో రేఖ చెయ్యి పట్టుకుంది స్వేఛ్ఛ. రేఖకి కూడా భయంగానే ఉంది అనుకుంట, చెమటతో చెయ్యి చల్లగా తగిలింది. “గుడ్ ఈవినింగ్ మేడం” అని ఇద్దరు ముక్త కంఠంతో మేడంకి విష్ చేసారు.

“ఆ! గుడ్ ఈవెనింగ్, వచ్చారా, మీ గురించే ఆలోచిస్తున్న! ” అంటూ చిరునవ్వుతో కూర్చోమని ముందున్న కుర్చీల వైపు సైగ చేసింది. మేడం చిరునవ్వు చూసి వీళ్ళిద్దరికి కొంచం దైర్యం వచ్చింది.

“రేఖ, స్వేచ్ఛ! మీ ఇద్దరు తెలివైన పిల్లలు, క్లాసులో శ్రద్దగా వింటారు. బుద్ధిగా చదువుకొంటారు. ఇంకా కొన్ని చిన్న మార్పులు చేసుకొంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి కదా; టైంకి రావడం, పుస్తకాలు సరిగ్గా తెచ్చుకోవడం, హోంవర్క్ ఎప్పటికప్పుడు చేయడం- వీటి మీద ఇంకొంచెం శ్రద్దపెడితే బావుంటుంది.”

ఇప్పటి వరకు బాగుంది కానీ ఇంక మేడం తిట్ల దండకం మొదలు పెడుతుందేమో అన్నట్టు భయపడి తలాడిస్తూ నేలచూపులు చూడడం మొదలు పెట్టారు. వాళ్ళ మనస్సుల్లో ఏముందో పసిగట్టినట్టుగా, “నేను మిమ్మల్ని మందలించడానికి పిలవ లేదులే. మీ ఇద్దరు mathsలో చురుకుగా ఉంటారు కాబట్టి పిలిచా. ఇదిగో maths ఒలింపియాడ్ కాంపిటిషన్కి సంబంధించిన అప్లికేషన్స్. మన స్కూల్కి మంచి పేరు తెస్తారు అని నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. వచ్చే గురువారం ఆఖరి తేది, ఫిల్ చేసి నాకివ్వండి.”

“ఓకే మేడం” అని ముక్త కంఠంతో చెప్పి బయటపడ్డారు.

“అబ్బా టెన్షన్తో చచ్చిపోయా” అంటూ నవ్వుతూ రేఖని కావలించుకుంది స్వేఛ్ఛ.

“సరే లేవే ఇంక రిలాక్స్” అంటూ ఇద్దరూ హుషారుగా మెట్లు దిగి గేటు వైపు అడుగులు వేసారు.. ఇంతలో ఎక్కడి నించి వచ్చారో కానీ క్లాస్ న్యూసెన్స్ గ్యాంగ్ వచ్చి ఇద్దరినీ చుట్టుముట్టారు. ఒకడు స్వేఛ్ఛ జుట్టు రిబ్బన్ లాగి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, ఇంకొకడు తన చేతిలోని అప్లికేషన్ లాగి కింద పడేసి పరిగెత్తాడు.. ఏమయిందో రిజిస్టర్ అయ్యే లోపే ఆ వెకిలి గ్యాంగ్ లీడర్ ముందుకి వచ్చి “నీ పని నువ్వు చూసుకో, అనవసరమయిన కామెంట్లు చెయ్యాల్సినవసరం లేదు” అని కటువుగా మాట్లాడి వెళ్ళిపోయాడు..

                                                                            *********

షాక్ లో ఇంటికి చేరింది స్వేచ్ఛ. డోర్బెల్ కొట్టిందో లేదో వాళ్ళమ్మ అరుంధతి తలుపు తీస్తూ “వచ్చేసింది నా పిల్ల రాక్షసి” అని సరదాగా పలకరించబోయేదల్లా కూతురి వాలి పోయిన మొహం చూసి “ఏమైంది నాన్న” అంటూ దగ్గరకు తీసుకుంది.

అమ్మని చూడగానే స్వేచ్ఛ బాధంతా కన్నీటి రూపంలో బయటకి దూసుకు వచ్చింది. బోరుమని ఏడ్చేసింది. రెండు నిమిషాలు అరుంధతి ఏమి అనలేదు, అట్లానే కూతురి తల నిమురుతూ కూర్చుంది. “ఏమయిందో ఇప్పుడు చెప్తావా, ఇంకా కొంచం ఆగనా?”. అప్పటికి సరస్వతి, నాన్న-ముకుందు, తమ్ముడు-సాకేత్ కూడా హడావిడి విని వచ్చి చుట్టూ చేరారు. స్వేచ్ఛ ఏడ్చాక గుండెలో బరువు కొంచం తగ్గినట్టు అనిపించి విషయం మొత్తం పూస గుచ్చినట్లు చెప్పింది. చిరిగి పోయి మట్టి అంటుకున్న ఒలంపియాడ్ అప్లికేషన్ చూపించింది.

“చూడమ్మా స్వేచ్ఛ, ఈ చిల్లర గాంగుకి నువ్వు ఎట్టి పరిస్థితులోగాని భయపడవద్దు. వాళ్ళకి ఉన్న insecurities వల్లనే అట్లా ప్రవర్తిస్తుంటారు.. నువ్వు ధైర్యంగా వెళ్లి కంప్లైంట్ ఇవ్వు. ఇంకో సారి నీ జోలికి వస్తే చెవి మెలిపెట్టు. అంతే కానీ భయపడొద్దు. స్కూల్ management bullyingని చాలా సీరీయస్గా తీసుకొంటున్నారని చాలా సార్లు చెప్పారు.”

“అవును అమ్మ నాకే భయం లేదు, కొంచం ఎమోషనల్గా అనిపించింది అంతే, నేను వాళ్ళని handle చెయ్యగలననే నమ్మకం నాకు ఉంది.”

“అది! నా బంగారు తల్లి! అట్లా ధైర్యంగా ఉంటే ఏదైనా ఎదుర్కోగలవు” అంతా గమనిస్తున్న అమ్మమ్మ వచ్చి దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టింది. “సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా! మన సినిమా చూడాలి కదా“ అంటే “హూ సరే! తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తా”

స్వేచ్ఛ మూడ్ బాగవ్వటానికి ఇంట్లో అందరూ ఆ రోజు సపోర్ట్ వచ్చారు. తను తయారు అయ్యి వచ్చే వరకు అందరు రెడీగా ఉన్నారు. సాకేత్ బయటికి వెళ్లి పాప్కార్న్ ప్యాకెట్లు తెచ్చాడు। అమ్మ,అమ్మమ్మ కలిసి ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియన్ అప్పటికే తయారు చేసి పెట్టారు. నాన్న పుచ్చపండు కోసి ముక్కలన్నీ చల్లగా ఉండడానికి ఫ్రిడ్జిలో పెట్టాడు। స్వేచ్ఛకి సినిమా చూస్తూ పాప్కార్న్ తినడం అంటే సరదా , అది లేకపోతే ఏదో అసంతృప్తి! సినీమా ప్లాన్ అమ్మమ్మతో మాత్రం వేసుకొన్నా అందరితో కలిసి చూడాలని ఆశ కలిగింది. కుటుంబం అంతా కలిసి సినిమా చూడడం అనేది తరచుగా జరిగే విషయం కాదు, కానీ స్వేచ్ఛ కోసం వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి evening showకి ఉపక్రమించారు.

సాకేత్ “అక్క ! మహేష్ బాబు ‘సరిలేరు నాకెవ్వరు’ సినిమా బాగుందంటా మా అర్జున్ చెప్పాడు” అంటే

“సరే పెట్టు రా! అందులో విజయశాంతి కూడా ఉందంట కదా. అమ్మమ్మకి చాలా ఇష్ఠమైన నటి. చాలా రోజుల తరవాత మళ్ళీ కనిపిస్తుంది, పెట్టు” అంది.

మిగతా అందరూ కూడా ఆ సినిమాకే వోట్ వేసారు. సినిమా ఏంటి అన్నది ముఖ్యం కాదు అందరు కలిసి చూస్తున్నామా లేదా అనేది అవసరమయిన విషయం అని మనసులోనే సంతోషించింది స్వేఛ్చ. రెండున్నర గంటలు లాజిక్కులు, తెలివితేటలు అన్ని పక్కన పడేసి సినిమాలో లీనం అయ్యి చూసారు. అయిపోయే సరికి అందరిలో ఆత్మా రాముడు ‘ఆకలి…ఆకలి’ అని ఘోష పెట్టడం మొదలు పెడితే వెంటనే డైనింగ్ టేబులు చేరుకొన్నారు. అన్నీ తయారయ్యి ఉండడంతో అందరు లొట్టలేసుకొంటూ భోజనం మొదలు పెట్టారు.

“స్వేచ్ఛ, ఆ ఫ్రైడ్ రైస్ కొంచం అందించమ్మా “అంటూ సినిమా మీద విశ్లేషణ మొదలుపెట్టాడు ముకుందు “అయ్య బాబోయ్ ఎమన్నా సినిమానా? అసలు ఎం చెప్పాలనుకున్నారు ? ఒక నేపథ్యం అనేది లేకుండా కామెడీ, యాక్షన్ , దేశభక్తి , అమ్మాయిలని ఏడిపించడం దగ్గర నుంచి గుండాయిజం, రాజకీయాలు, అవినీతి వరకు అన్ని రకాల బట్టల్ని ఒకే సైకిల్ వాషింగ్ మెషీన్లో వేసి ఉతికి చింపేసారు కదా ”

“నాకయితే ఆ కామెడీ వాషింగ్ మెషీన్లో ఉతికిన్నట్లు కాదు బండ కేసి కొట్టినట్లు అనిపించింది” అని ఒక విసురు విసిరింది సరస్వతి.

“కరెక్టే అమ్మమ్మ, ఇవ్వాళ స్కూల్ లో జరిగిన సంఘటన ఒక రకంగా మరిచిపోయినట్లు అనిపించినా కొంచెం ఆలోచింపచేసింది. సినిమాల్లో అంటే హీరో అందరిని ఒక్క చేత్తో దులిపెయ్యడం. భారీ డైలాగులతో పరమ కిరాతకమయిన విలన్ని సైతం మంచి మనిషిగా మార్చెయ్యడం ఇవ్వన్నీ ఓకే. కానీ ఆ సినిమాలో లాగ ఏ మహేష్ బాబు కోసం వెయిట్ చెయ్యడం కాదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అనిపించింది” అంది స్వేచ్ఛ ముకుందుకి ఫ్రైడ్ రైస్ అందిస్తూ .

“బాగా చెప్పావ్ రా।” కూతురి ఆలోచనలకి అందులోని పరిపక్వతకు ఆశ్చర్య పోయింది అరుంధతి. “మన నిజ జీవితాల్లో అంత గుండాయిజం మన అదృష్ట వశాత్తు తగలదు అనే అనుకొంటున్న. స్కూల్ లో జరిగిన సంఘటన సులువుగానే పరిష్కారం అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. అంతకు ముందు కూడా స్కూల్ వాళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాగా సపోర్ట్ ఇచ్చారు”.

“అవునవును నేను రేపు ప్రొదున్నే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతా, ఇట్లాంటి వాటిని గోటితోనే తెంచాలి”, ముకుందు.

టాపిక్ మార్చడానికి సన్నద్ధమైంది అరుంధతి, “ఇంక సినిమాల విషయానికి వస్తే మా లాంటి ఆడవాళ్ళకి, స్వేచ్ఛ లాంటి అమ్మాయిలకి అన్వయించుకోగలిగే పాత్రలు ఉన్న సినిమాలు చాలా తక్కువ। మరి రచయితలు, దర్శకులు ఎక్కువగా మగవాళ్లే ఉండడం వల్లనేమో। “

ఆకలి మీద ఉన్నారో లేక ఆలోచనాల్లో తలమునకలై ఉన్నారో ఎవరూ ఏమి అనేక పోయే సరికి తనే “ఏమోలే అసలు సినిమా పరిశ్రమ ఒక పెద్ద చక్రవ్యూహం. అక్కడ ప్రతిభ కన్నా పక్షపాతం, రాజకీయాలు ఎక్కువ. ఈ మధ్య చాలా మంది కొత్త ప్రతిభావంతులైన నటులు, ఫిలిం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రాక పోలేదు, చాలా మంచి కంటెంట్ ఉన్న లఘు చిత్రాలు, ఇండిపెండెంట్ చిత్రాలు తీసుకు వస్తున్నారు. ఓ బేబి, మహానటి, ఫిదా, పెళ్ళి చూపులు ఇట్లా మంచి సినిమాలు రాకపోలేదు. కానీ ఇంకా చాలా మార్పు రావాల్సి ఉంది” అంది అరుంధతి.

ఒక కరకరలాడే గోబీ ముక్కని నోట్లోవేసుకొంటూ అమ్మమ్మ తన మౌనాన్ని భంగం చేసింది, “అవును మరి! ఈ సినిమా కథ మొత్తం మహేష్ బాబు కోసమే అన్నట్లు ఉంది. మొదట్లో చెంప దెబ్బ కొట్టడం, తరువాత ఠీవిగా కూర్చొని విలన్ని ఒక చూపు చూస్తూ డైలాగు చెప్పటం తప్ప విజయశాంతికి పెద్ద పీట వెయ్యలేకపోయాడు దర్శకుడు. పాత రోజుల్లో “కర్తవ్యం” “ప్రతిఘటన” “రేపటి పౌరులు” ఇట్లా అన్ని సినిమాల్లో ఒక ఊపు ఊపిన ఆమె ఈ సినిమాలో ఒక చిన్న సహాయ నటిగా మారడం ఏంటో? నాకయితే నచ్చలేదు. మధ్య తరగతి నిస్సహాయురాలిగా మారడం మింగుడు పడడం లేదు. మొగ దిక్కు లేక మేము ఈ స్థితి లో ఉన్నాము అంటూ గుండెని పిండేసింది కదా. ఆ మాత్రం దానికి విజయశాంతి అవసరం వచ్చిందా”

“అంటే మహేష్ బాబుకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా అమ్మమ్మ. ఆ మాత్రం ఫైట్లు, డైలాగులు లేకపోతే మరి థియేటర్లని తగలపెడతారేమో అని భయం” అన్నాడు సాకేత్.

“అంతేలే విజయశాంతి ఫాన్స్ సంఘాలు, సెలెబ్రేషన్స్, అట్లాంటివి తక్కువే కదా, మా లాంటి వాళ్ళకి సినిమా చూసి ఆనందించడమే కాని అంతకి మించి ఏం చేస్తాము, అయినా ఆమె ఏ మాత్రం నటనకి ఒప్పుకుందోలే। ఏది ఏమయినా స్త్రీలకి తగ్గ పాత్రలు రావడంలో మన చిత్ర పరిశ్రమ చాలా వెనకబడిందనే చెప్పాలి”

“అవును అమ్మ, ఇదొక్క సినిమానే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇట్లాంటివి కోకొల్లలు. హీరోయిన్‌కి రోమాన్స్ ట్రాక్‌, పాటల మినహా ఎక్కువ పాత్ర ఉండదు. ఇంక సహాయ నటులకి అంతంత మాత్రమే.”

“ముఖ్యంగా స్టార్ హీరోల సిన్మాల్లో. హీరోయిన్లు ఏమైనా తెల్లగా, నాజూకుగా ఉండాలి, వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ డాన్సులు వెయ్యగలగాలి. వీళ్ళు మూడు నాలుగు సినిమాల్లో కన్నా ఎక్కువ కనిపించరు. ఇంకా విజయ శాంతి నటించిన టైంలోనే నయం, చాలా సినిమాలు చేసింది. తరువాత తను రాజకీయ ప్రస్థానం చేసి కెరీర్ని ఆ దిశలో తీసుకు వెళ్ళింది అనుకో. మిగతా వాళ్ళు అమ్మ పాత్రలకి పరిమితం అవ్వటమో పూర్తిగా రిటైర్ అవ్వటమో జరుగుతోంది.”

“హు! ఏమోలే మొత్తానికి మన సాకేత్ గాడి చలవా అని ఈ కళా ఖండాన్ని చూసాము” అని ముకుంద్ అనే సరికి అందరు పెద్దగా నవ్వేసారు.

“నన్నేమి అనకండి అంతా మా అర్జున్ గాడి మహిమ.” అని చిన్నబోయాడు సాకేత్. “ఇంకో సరి వాడేదన్న సినిమా పేరు చెప్తే కొంచం జాగ్రత్త పడడం మంచిది. అక్క నువ్వు రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ న్యూసెన్స్ గాంగ్ని ఒక పట్టు పట్టేయి , అమ్మతో రోజూ పొద్దునే నువ్వు చేసే యుద్ధం చూస్తుంటాం కదా, నువ్వే ఖచ్చితంగా గెలుస్తావు, డౌట్ లేదు” అంటూ వెక్కిరించాడు

“ముందు నీ పట్టు పడతారా కోతి” అని వాడి తల మీద ఒక చిన్న మొట్టికాయ వేస్తూ గల గలా నవ్వింది స్వేచ్ఛ. అందరూ అదే నవ్వుతో శృతి కలిపి భోజనం ముగించారు.

◦-తిరునగరి నవత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

2 Responses to ఎవరికీ వారే సరి!(కథ) -తిరునగరి నవత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో