సినారె ‘ప్రపంచ పదులు’లో తత్త్వవివేచన.!(వ్యాసం)-ప్రవీణ్ యజ్జల

 

 

 

ISSN – 2278 – 478

‘‘మనసు తెలుసుకున్నవాడు మర్మజ్ఞుడు
తనను తెలుసుకున్నాడు తత్వజ్ఞుడు
అచ్చమైన ఆ తెలివికి అవధులేవి
అసలు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు
అన్ని తెలుసునన్నవాడు అల్పజ్ఞుడు’’. (ప్రపంచ పదులు. పుట:107)

రమణీయమైన శైలీ సౌందర్యాలతో పాటు తాత్త్విక దర్శనాన్ని కూడా కలిగివున్న కవిత్వం ఉన్నత స్థాయిని పొందే అవకాశం ఉంది. సమర్థవంతుడయిన కవి తన తాత్త్విక దృక్పథాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుతూ దానికి ప్రచారాన్ని తెస్తాడు.! మరి సినారె కవిత్వమే ఊపిరిగా బతికినవాడు.! ప్రాపంచిక అన్వేషణకు అక్షర రూపంగా సినారె కలం నుండి జాలువారిన ఆణిముత్యాలే ఈ ప్రపంచపదులు అనుకోవచ్చు.! మొదట ఇవి ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ఆ తరువాత 1991 లో పుస్తకం ముద్రించారు. సినారె రచనల్లో విశ్వంభర తర్వాత పేరొందిన అపూర్వ కవితా ప్రక్రియ ప్రపంచపదులు. ఇవి ఉర్దూ, ఫారసీ సాహిత్యాల్లోని రుబాయిని అనుసరించినా తెలుగు సాహిత్యాంలో మాత్రం ఒక వినూత్న కవితా సృష్టికి అంకురార్పణ చేసాయి. సినారె నాలుగు పాదాల రుబాయి ఛందో రూపానికి ఐదవ పాదాన్ని జోడించి ప్రపంచపదిగా నూతనంగా నిర్మించారు.! నాల్గవ పాదంలోని మెరుపును ఐదవ పాదం ప్రకాశం చేస్తుంది. అయిదు పాదాల్లో మధ్య పాదానికి అంత్య ప్రాసలేదు. అది పై కింద పాదాల భావాలను సమన్వయపరిచే వంతెనగా భాసిస్తుంది. ప్రపంచ పదుల్లోని పాదాలు వేటికవి విడివిడిగా లయ తప్పవు.! వీటిలో మానవ జీవితాన్ని చారిత్రక, తాత్త్విక నేపథ్యంలో దర్శించిన తీరు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.!

‘‘నింగి లోతును చూడగోరితె నీటి చుక్కను కలుసుకో
రత్నతత్వం చూడగోరితె రాతి ముక్కను కలుసుకో
అణువు నడిగితె తెలియదా బ్రహ్మాండమంటే యేమిటో
మౌనశిల్పం చూడగోరితె మంచు గడ్డను కలుసుకో
మనిషి మూలం చూడగోరితె మట్టి బెడ్డను కలుసుకో’’ (ప్ర. పుట: 15)

ఎవరైనా ‘నింగి ఎత్తు’ అంటారు. కానీ నింగి లోతు అని ప్రయోగించరు. లోతు అనే పదానికి వ్యవహారిక అర్ధంలో ‘దిగువ భాగం; ‘పై భాగం నుండి’ ‘కింది భాగం’ వరకూ అనే అర్ధాలున్నాయి. కానీ సాహితీ పరంగా దీన్ని ఒక విషయం మూలతత్త్వం లేదా దాని నిగూఢ తత్త్వం అనే అర్థాల్లో వాడుతున్నాము. నింగిలోతుని తెలుసుకోవడం అంటే ఆకాశపు మూలతత్త్వం తెలుసుకోవడం అన్నమాట.! ఆకాశం ఎంతో ఎతైనది. విశాలవంతమైనది. అనంతమైనతది. దాని తత్త్వాన్ని తెలుసు కోవడానికి అల్పాతి అల్పమైన నీటి చుక్క ఆధారం. నీటి చుక్క ఎంతగానో తపించి ఆవిరైనప్పుడే అది మబ్బుగా మారి నింగి నిర్మాణంలో ఒక భాగం అవుతుంది. ఇంత చిన్న నీటి చుక్క లేక పోతే అంత పెద్ద ఆకాశానికి అస్థిత్వం లేదు. ‘రత్నతత్త్వం చూడగోరితె’ చూడడం అనేది సాహిత్య పరిభాషలో క్రాంతదర్శనం అనే అర్థంలో వాడబడుతుంది. రత్నం ధగధగ లాడుతూ కనిపిస్తుంది. కానీ అది సానబెట్టినప్పుడు మాత్రమే ప్రకాశిస్తుంది. రత్నాలు రాళ్ళూ నేల నుంచే వస్తాయి. వచ్చినప్పుడు ఆ రెండు సాధారణ దృష్టికి ఒకేలా ఉంటాయి. రత్న తత్త్వాలకు గాని అసలు రత్నం ఏదో తెలియదు. నిజానికి రాళ్ళే భూమి పొరల్లోని ఉష్ణోగ్రత కారణంగా రత్నాలుగా పరిణమిస్తాయి. ‘రాయి అనుకున్నది ఒకనాటికి రత్నమౌతుంది’. అనేది లోకోక్తి. రాయి భూమి పొరల్లో భిన్న భిన్న ఉష్ణోగ్రతలకు లోనై రకరకాల కోతలకు గురైనప్పుడే రత్నంగా మారుతుందనేది భౌగౌళిక సత్యం. అందుకే రత్నానికి మూలాధారం రాయి. రాయేలేకపోతే రత్నం లేదు. కరిగిన మంచే నీరై ప్రవహించింది. నేలగా గట్టి పడింది. నేల అడుగు పొరలలో ఎన్నెన్నో ఔషధాలు సహజంగానే ఉద్భవించాయి. నీటి చుక్క మట్టిలోని ఈ ఔషధుల్లో కలిసినపుడు అక్కడ జీవం చిగురించి మొక్కగా మారి భూమిపైకి జీవమై తలెత్తింది. ఈ జీవం చతుష్పాదమై, ద్విపాదమై, మానవాకృతి పొంది మానవ చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇది హేతువాద దృక్పథంతో మానవ చరిత్రకు జరిగిన శ్రీకారం. ఇదే ప్రపంచ పదులకు శ్రీకారం. అణవులో బ్రహ్మండమూ, అణువుతనలో తాను అణగి ఉంటాయనే తత్త్వం తెలిసిన మానవుడే ముక్తిని పొందగలుగుతాడని వేమన చెప్పాడు.

‘‘అణువులోన నుండు అఖిలజగమ్ములు
అణువు తనదులోన నడిగి ఉండి
మనసు నిల్పునరుడు మరి ముక్తి చేరురా
విశ్వదాభిరామ వినురవేమ’’ (వేమన శతకం. పుట:18)

సినారె అణువును తెలుసుకున్న వారికి బ్రహ్మాండమంటే ఏమిటో అవగత మవుతుంది. అంటే ప్రపంచ మూలతత్త్వం పట్టుబడుతుందన్న మాట. కానీ వేమన యోగి కాబట్టి అతనికి గల పరమార్థ చింతనవేరు. అందుకే అతడు అణువును తెలుసుకుంటే ముక్తి లభిస్తుందంటాడు. అయితే సినారె మోక్షం ప్రసక్తి తీసుకొని రాక మూల తత్త్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటున్నాడు. జీవితం ఆశాశ్వతమైందని తెలిసినప్పటికీ ఆత్మవంచనకు లోనౌతూ మాయలోనే సుడులు తిరుగుతూ భ్రమలను ఒదిలించుకోలేక సామాన్యులు వెనుకబడిపోతారని సినారె ఒక పదిలో వివరించారు.

‘‘జరిగిపోయన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా
జారిపోయిన తారనింగికి చేరలేదని తెలిసినా
మంచుకమ్మిన బుర్రలను విదిలించుకొని పోరెందుకో
ఎండిపోయిన శ్వాసముందుకు ఉండలేదని తెలిసినా
ఆగిపోయిన శ్వాసముందుకు సాగిపోదని తెలిసినా’’ (నీతిశతకం, శ్లో. పుట:71)

అని ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితములు తెలుగు అనువాదంలో అంటాడు. భౌతిక ప్రమాణాలను అనుసరించి విరాట స్వరూపుడుగా లెక్కింపబడుతున్నాడు. అతడి కనుచూపు ప్రసారానికి మితిలేదు. అది మింటిని బంధించి వేయగలుగుతుంది. అతని సంకల్ప బలానికి లొంగనిది లేదు. ఇంతటి మానవ మూర్తిని ఏదో ఒక పరిధిలో బంధించే ప్రయత్నం అనావశ్యకమే కాక అనర్థకమని కూడా కవి అభిప్రాయం.

‘‘రాలిపోయే ఆకులను ఎవరాపినా ఏముందిలే
ఊడిపోయే జుత్తునెంతగ ఒత్తినా ఏముందిలే
ఒప్పకున్నా కొన్ని మార్పులు తప్పవేమో ప్రకృతిలో
కరిగిపోయే మంచునెంతగ కప్పినా ఏముందిలే’’ (ప్ర. పుట:9)

దీనిని సోమసుందర్ గారు ఇలా వ్యాఖ్యానించారు. ‘‘ఆకురాలు కాలం అనుశాసిస్తోంది. ఒకటోకటి ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఈదురు గాలిలో కాసింతసేపు వయ్యారంగా పల్లటీలు కొడుతున్నాయి. చివరికే మారుమూలకో ఒదిగి రూపరిపోతాయి. అలాంటి ఆకులనెవరో బుద్ధిశాలి అప్రయత్నిస్తే ఏం లాభం? వాటిని చెట్టు తిరిగి ధరిస్తుందా? తిరస్కృతపలిత పత్రాలను ఎన్నడూ స్వీకరించవు చెట్లు.! అలాగే మనిషి తలపై జుత్తు రాలిపోనారంభిస్తే ఎంత ఒత్తినా తిరిగి అతుకుకోదు. ఆనాటి వరకూ ముఖ సౌందర్యానికి చిగురు కిరీటం అమర్చింది. ఇప్పుడు తలబట్టి. రాలిపోనారంభించింది. దాన్ని తిరస్కరించక తప్పదు. నిన్నటి వరకూ శిరసున దాల్చి గౌరవించిందే కావచ్చు. స్నేహం కూడా అలాంటిదే! వివేక భ్రష్ట సంపాతంలో ఆత్మీయ మిత్రుడే ఈర్ష్యతో అమిత్ర వైఖరి అవలంబిస్తే గాలిలోకి ఊదేయక తప్పదని ఆలోచిస్తే లభించే వ్యంగ్యార్థమూ ఉంది.’’. (అనంత రత్న ప్రభాభూషితం. మండేకితాబ్. ఆంధ్రభూమి సోమవారం 17 జూన్ 1991). అని అంటారు. ఇందులో కవి పేర్కొన్న ప్రతీకలును బట్టి ఆకులు, జుత్తు, మంచు, వయసు, మృత్యువు అనివార్యమున్న సంగతి ప్రస్ఫటమవుతుంది.

‘‘చేదుసత్యం మింగ గలిగితే జీవితమే వేద్యాలయమనీ, కనులు తిప్పక చూడగిగితే అణువణువు తత్వాలయమనీ, కవి చెప్పిన మాటలు అతని తాత్త్వికతకు ప్రబలోదాహరణంగా చెప్పవచ్చు’’ (పు.పుట:12) ప్రపంచపదుల్లో ఎక్కడ చూచినా భౌతిక ప్రపంచం తాలూకా మూలతత్త్వం భాసిస్తుంది. మనిషి ప్రవర్తన, అతని ఆలోచన, లక్ష్యసిద్ధి మొదలైన అంశాలెన్నో తాత్త్విక దృష్టి నేపథ్యంగా కవి విశ్లేషించారు. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మరొక వ్యక్తి చేయవలసిన సహాయాన్ని చూపవలసిన కారుణ్యాన్ని గుర్తు చేసే పంచ పదిని గమనించండి.

‘‘వెళ్లితే కాదనను కాగే కళ్ల ఆవిరి చూసిపో
వీడితే కాదనను మూల్గేనాడి ఊపిరి చూసిపో
అన్ని తెలిసే తెంచుకొని పోతున్న నీకో విన్నపం
నవ్వినా కాదనను మునిగే నావ అలజడి చూసిపో
కాల్చినా కాదనను మంటను కాస్త నిలబడి చూసిపో’’ (ప్ర. పుట:22)

మన ప్రక్కన విలపిస్తూ ఉన్న మనిషిని చూడకుండా విడిచి వెళ్ళిపోవడం న్యాయం కాదు. ఒక్క క్షణం ఆగి, దు:ఖంతో కాగే ఆశోక మూర్తి కళ్ళలోని ఆవిరిని పరిశీలించినపుడు మన కర్తవ్యం ఏమిటో తప్పక స్ఫురిస్తుందని అంటారు కవి. ఒకవేళ అతనిని అలా విడిచి వెళ్ళిపోతే అతడు నడి సముద్రంలో చుక్కాని లేని నావలా మునిగిపోతాడు. లోకంలో దు:ఖితులూ, పీడితులూ ఎందరో ఉన్నారు. వారిని మరింతగా మనం హింసిస్తే వారు జీవిత కర్కశత్వానికి బలైపోతారు.! మనం కాస్త జాలిపడి ఒక్క క్షణం ఆగి ఆదృశ్యాన్ని చూస్తే జ్ఞానోదయం కలగక మానదు. ఈ సందర్భంలో శ్రీశ్రీ చెప్పిన‘‘పతితులార/ భ్రష్టులార/ బాధా సర్పదష్టులార’’(మహాప్రస్థానం. పుట:91). అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. స్వార్థంతో, నిర్లిప్తతతో, అజ్ఞానంతో, పిరికితనంతో జీవితంలో మనం ఎన్నో సందర్భాల్లో తోటి వారికి చేయూతనివ్వకుండా మన దారిలో మనం పోతుంటాం. అలాంటి సందర్భంలో కొంచెం సేపు ఆగి తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోమని కవి ప్రభోధిస్తున్నారు. మనిషన్న వాడికి కాఠిన్యమే కాదు. జీవకారుణ్యం అవసరం. అదిలేని నాడు సమాజ జీవనం కుంటుపడుతుంది. ఇక్కడ మనం ఆయా విషాద సంఘటనలను కళ్ళారా చూసి, చలించి జీవకారుణ్య మూర్తిగా మారిన గౌతమ బుద్ధుని స్మరించుకోవచ్చు.
గమ్యం చేరినప్పుడే గమనం సార్థకమవుతుందంటారు సినారె. మానవుని సార్ధక్యం కృషిలో కాక కృషి సాఫల్యం మీద ఉంది. ఎంతో కృషి చేసానని ఢంబాలు పలికినంత మాత్రాన అతడు గొప్పవాడు కాలేడు. ఆ కృషిని ఫలింప చేసుకోగలిగే ఏకాగ్రత, దక్షత ఉన్నప్పుడే అతడు ఉన్నతుడు కాగలడు. ఎత్తుకెదగడం అంటే ఔన్నత్యాన్ని పొందడం అని అర్థం.! మెట్లు ఎక్కడంటే దానికోసం కృషి చేయడం నీటిలో మునకలేయడం కంటే నీటి లోతును తెలుసుకోవడం ముఖ్యం. ప్రతిరోజు సభల్లో తరచుగా పాల్గనడం కంటే జ్ఞానాన్ని సముపార్జించడం ముఖ్యం. ఎన్నో గ్రంథాలు పఠించడం కంటే అందలి సారాన్ని గ్రహించడం ముఖ్యం. ఆశేలేకపోతే జీవితానికి అర్ధమే లేదంటారు కవి. ఆశనే ఊపిరిగా చేసుకుని లోకం జీవిస్తుందని కవి చెప్పిన మాటలు అక్షరసత్యాలు.

‘‘నిప్పులు వీచే యెడారి యెదపై నీటి చుక్క ఆశ
మరణం ముసరే సమాధి తలపై గరిక మొక్క ఆశ
ఆడదులే ఈలోకం ఊపిరి ఆశే లేకుండా
వెలుతురు చచ్చిన గగనం కంటికి వేగుచుక్క ఆశ
పక్కలు విరిగి ఉసూరను ఒంటికి పక్షిరెక్క ఆశ’’ (ప్ర. పుట:39)

నిప్పులుకక్కే ఎడారిలోనైనా ఎక్కడో ఒక నీటి చుక్క మనిషి ఆశకు ఊపిరి పోసి అతనికి బతికేలా చేస్తుంది. అంధకారంతో కూడిన ఆకాశానికి వేగుచుక్క కొత్త ఆశలు రేపుతుంది. వెలుగు బాటను చూపుతుంది. నిర్జీవ సమాధి మీద కూడా పచ్చని గడ్డి పరక చిగురుస్తుంది. జీవితం మోడు బారిపోకుండా ఆశ మానవుణ్ణి కాపాడుతుంది. రెక్కలు క్రుంగిపోయినా ఆకలితో అల్లాడినా ఆకాశంలో ఎగిరే పక్షి రెక్కలను చూసినప్పుడు శ్రమజీవి గుండెలో కొత్త ఆశ మొలకెత్తుతుంది. ఆశ చుట్టూ మానవ జీవితం విడదీయరానిదిగా అల్లుకొని ఉంటుందనే సత్యాన్ని ఈ పదిలో వ్యక్తపరిచాడు. మనిషిపైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా అతని మనస్సులో ఏవో సుడిగుండాలు ఉండనే ఉంటాయి. నిజానికి మానవుని మనస్సు కంటే సంక్లిష్టమైంది, మరొకటి ఈ సృష్టిలో లేదు. మహాజ్ఞాని అయినా మహర్షి అయినా ప్రజా నాయకుడైనా తన మనస్సు ముందు తాను ఓడిపోకతప్పదు. మనస్సును జయించిన మానవుడు ఈ సృష్టిలో కనబడడు. ఎంత చదివినా ఏమి సాధించినా ఎన్ని గెలుచుకున్నా అతని మనస్సు అతనికొక ప్రశ్నగానే నిలుస్తుందంటాడు సినారె.!

‘‘తర్క సముద్రాలీదిన జ్ఞానికి తన మనసే ఒక ప్రశ్న
జనన హేతువు మధించిన మౌనికి తన తనువే ఒక ప్రశ్న
తనకే ప్రశ్నలు లేవంటే ఆ మనిషినెలా నమ్మేది
జనవాహిని నడిపించే వానికి తన నడకే ఒక ప్రశ్న
దైవగతిని ప్రవచించే ధ్యానికి తన బ్రతుకే ఒక ప్రశ్న’’. (ప్ర. పుట:43)

తాను తర్కశాస్త్రంలో గొప్ప పాండిత్యం సంపాదించి జ్ఞానిగా పేరు తెచ్చుకోవచ్చు. తన మనస్సులో తలెత్తే ప్రశ్నలకు తర్కం పూర్తిగా ఓడిపోవచ్చు. తన మనసే తనకు ఏ తర్కశాస్త్రంలో సమాధానం దొరకని ప్రశ్నగా ఎదురుకావచ్చు.! జనన, మరణ రహస్యాలను తెలుసుకోవడానికై తపస్సు చేసిన యోగి తన బ్రతుకులోని చిక్కు ముళ్ళను తెలుసుకోలేని అయోమయంలో పడిపోవచ్చు. ఇది సహజమే. ఉదాహరణకు ప్రజానాయకుడై ప్రజలందరినీ నడిపించడానికి సిద్ధపడిన వాడు మొదట తన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి. తన ప్రవర్తనలోనే లోపాలున్నప్పుడు అతని నడకే అతనికొక ప్రశ్నగా తయారవుతుంది. ఇక్కడ ‘నడక’ అనే పదంలో శ్లేష ఉంది. విధికి భాష్యం చెప్పగలిగిన వానికీ ప్రజలు భవిష్యత్తును వ్యాఖ్యానించగలిగినవానికీ ఒక్కోసారి అతని బతుకే ప్రశ్నగా తయారవుతుందిని మనం గ్రహించాలి.! జనన మరణాల మధ్య సతమతమయ్యేదే మానవ జీవితం. భౌతికకాయాన్ని మించిన నైతికకాయాన్ని లేదా యశోకాయాన్ని పొందగలిగిన మానవుడే మృత్యువుకు మృత్యువై నిలుస్తాడు. జీవిత సార్థక్యం అంటే అదే అంటారు సినారె.

‘‘ఆయుస్సును పొడగించకపోతే ఔషధమా అది?
అక్రమాల నెదిరించకపోతే ఆయుధమా అది?
తన విలువెంతో చూపినప్పుడే ఉనికికి అర్ధం
మనసుకు ఊపిరి చుట్టకపోతే మారుతమా అది?
చావును ఇరుకున పెట్టకపోతే జీవితమా అది?’’. (ప్ర. పుట:45)

విషయానికైనా, వస్తువుకైనా, ప్రాణికైనా విలువ నిరూపితం కానప్పుడు బంగామైనా మట్టి కంటే హీనమే అవుతుంది. రోగాన్ని నయం చేయగలిగినపుడే ఔషధానికి సార్థక్యం.! అక్రమాలను ఎదురించనిది ఆయుధమేకాదు.! మనస్సుకి జీవచైతన్యాన్ని అందించలేనప్పుడు మారుతానికి విలువేలేదు.! మృత్యువుకు భయపడక దాన్ని గడగడ లాడించేదే నిజమైన జీవితం.! పై పంక్తుల్లోని అంశాలను రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు.! ఔషధం వ్యాధిని నయం చేయవచ్చు లేదా ప్రకోపింప చేయవచ్చు. ఇట్లే ఆయుధం అక్రమాలను అరికట్టడానికీ లేదా దుర్మార్గానికీ ఉపకరించవచ్చు. గాలిజీవికి ప్రాణ పదమైంది కావచ్చు. లేదా ఝంఝూమారుతమై మనుగడకే ముప్పుతేవచ్చు కానీ రోగాన్ని నయం చేయదగిందే ఔషధం. అక్రమాలను అరికట్టగలిగిందే ఆయుధం. ప్రాణభూతమై నిలిచిందే మారుతం. ఇట్లే మృత్యువును ఎదురించి నిలువ గిలిగిందే జీవితమని సినారె జీవన సారాన్ని నిగ్గుదేల్చి జీవనమూల తత్త్వాన్ని ఆవిష్కరించారు.! సత్యం, శివం, సుందరం అయిన సృష్టి సామాన్యుల దృష్టికి అందేదికాదు.

‘‘గుప్పిట్లో హాయిగా ఇమిడితే నిప్పుసైతం చందనం
కంటినిండా నిద్రనిండితే కాడుసైతం నందనం
నిలదీసి ప్రతివస్తుతత్వాన్ని నిర్ణయించేదెవరులే
మోజేదొ చూపులో ఒదిగితే మోడు సైతం మోహనం
మనసు అంచును తాకగిగితే మట్టిసైతం కాంచనం’’ (ప్ర. పుట:53)

కణకణమండే నిప్పులను సైతం పిడికట్లో ఒదిగించుకో గలిగే ధీశాలికి ఆ నిప్పే చందనంగా మారుతుంది.! బాధా సహిష్ణువై ఆత్మస్థైర్యాన్ని అలవర్చుకున్న మానవునికి ఏ కష్టాలూ రావు. ఏ అలజడులకూ లొంగక, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సుఖంగా నిద్రించటం అలవాటు చేసుకొన్న వారికి వల్లకాడు కూడా నందనవనమే అవుతుంది. ఆత్మస్థైర్యం, విశ్వాసం మొదలైన వాటి ముందు స్మశాన బీభత్సం కూడా ఓడిపోతుంది.! చూడగలిగే కన్నుంటే మోడులో సౌందర్య దృష్టితో చూసి పరవశించగలిగిన వారికి మట్టీ, బంగారమూ ఒకేలా కనిపిస్తాయి. వ్యామోహానికి అతీతమైన, సౌందర్య దృష్టితో చూసి పరవశించ గలిగిన వారికి మట్టీ, బంగారం ఒకేలా కనిపిస్తాయి.!

‘‘పెక్కు చదువులేలపెక్కు వాదములేల
నొక్క మనసుతోటి నుండెనేని
సర్వసిద్ధుడగుచు సర్వంబుతానగు
విశ్వదాభిరామ వినురవేమ’’. (వేమన శతకం. పుట:75)

సమదర్శనం కలిగిన వాడే పండితుడని భగవద్గీత చెప్తుంది.! పండిత స్సమదర్శినం: ప్రపంచ తత్వాన్ని గ్రహించగలిగిన మహాపురుషులకే అట్టి సమదర్శనం అలవడుతుంది.! నాణానికి బొమ్మ బొరుసూ రెండూ ఉన్నట్లే మానవ జీవితానికి ఒకవైపు వెలుగూ, మరో వైపు చీకటీ ఉన్నాయి. వెలుగులో జీవిస్తే అదే జీవితమని చెప్పడం అసంగతమే అవుతుంది. అందుకే రెండవ పార్శ్వాన్ని చూడక నిండు నిజం చెప్పడం కష్టమంటాడు కవి.

‘‘పూల నునుపు తెలుస్తుంది ముళ్లమొనలు ముడితేనే
వేకువవెల తెలుస్తుంది చీకటి తెర పడితేనే
రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా
సుఖం విలువ తెలుస్తుంది శోకంపై బడితేనే
జీవి అంతు తెలుస్తుంది బావులోతు తడితేనే’’. (ప్ర. పుట:59)

రాపిడితో కాని రవ్వలు రాలవు. సంఘర్షణతో కాని సత్యం ప్రకాశించదు. ముళ్ళు తాకి చిరిగినపుడే పూరేకు నునుపు మనకు అర్ధమవుతుంది. చీకటిని అనుభవించిన తరువాతనే వేకువ విలువ వ్యక్తమవుతుంది. కష్టసముద్రంలో మునిగినప్పుడే అతిస్వల్ప మైన సుఖం విలువ తెలుస్తుంది. అంతే కాదు మృత్యువు అంచులు దాకా వెళ్ళి వచ్చినపుడే జీవితం విలువ అవగతమవుతుంది అంటాడు. ఇలా సినారె తన ప్రపంచ పదుల ద్వారా ప్రపంచ తాత్త్విక పరమార్థాన్ని మనకందించారు. కన్నులు తిప్పకుండా చూడగలిగినపుడు ప్రతి అణువూ తత్వాలయమే అన్నారు. దీన్ని బట్టి కవి ప్రపంచ స్థితి గతులను పైపైన దర్శించిన వారుగా కాక లోతుల్లోకి వెళ్ళి గుర్తించినట్లు తెలుస్తుంది. నిజానికి అణువుతత్వం బోధపడినపుడే బ్రహ్మాండమంటే ఏమిటో అవగతమవుతుంది. సృష్టి ఎప్పుడూ ఉన్నట్లే ఉండటం కుదరని పని. ఎప్పటికప్పుడు మారడం దాని తత్వం అన్నారు. కర్మయోగి కాలానికి అధీనుడుకాక దాన్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడని ఎదురీదగలిగిన చేతులున్నప్పుడు ఏరు కూడా దారి ఇస్తుందని సినారె చెప్పిన మాటల్లో మనిషి వెనుదిరగక ధైర్యాన్ని అలవరచుకొని ముందుకు సాగవలసిన కర్తవ్యబోధ సువ్యక్తమవుతుంది.

ఆధార గ్రంథాలు:
1. అనుశీలన (వ్యాస సంకలనం), జి.వి. సుబ్రమణ్యం సం. ఎల్లూరి శివారెడ్డి, షష్టిపూర్తి ప్రచురణలు, హైదరాబాదు, 1996.
2. ఆధునికాంధ్రకవిత్వము సంప్రదాయములు – ప్రయోగములు. డా. సి. నారాయణరెడ్డి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1989.
3. ఆధునికత – సమకాలికత. (వ్యాస సంపుటి) ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ. చినుకు పబ్లికేషన్స్ గాంధీనగర్, విజయవాడ, 2016
4. ప్రపంచపదులు (కవితా సంపుటి) డా. సి.నారాయణరెడ్డి. మౌక్తిక ప్రచురణలు. హైదరాబాద్, 1991
5. ప్రపంచపదులు సామాజిక, రాజకీయ సాహిత్య నేపథ్యం. (ఎం. ఫిల్ సిద్ధాంత వ్యాసం) గొల్లపూడి గీతావాణి. హైదరాబాద్ విశ్వవిద్యాలయం.
6. ‘ప్రాపంచిక అన్వేషణకు అక్షరరూపం ప్రపంచపదులు’ (వ్యాసం) – అఫ్సర్. ఆంధ్రజ్యోతి 24 జూన్ 1991.

-ప్రవీణ్ యజ్జల
పరిశోధక విద్యార్థి, ఆంధ్రా యూనివర్సిటీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో