“పదకేళి”( కథ )-విజయభాను కోటే

వాడుకలో లేని పదాలు వ్యర్థమై, మరుగున పడిపోతాయి. వాటి స్థానాన నువ్వే పదాలను వాడుతావో, అవి నిత్యజీవితంలోకి చేరి చెలామణి అయిపోతాయి. మన భాష కష్టమని అనుకుంటే ఎలా? రైలుని ధూమశకటం అనాలి. అనరు. యూనివర్సిటీని విశ్వవిద్యాలయం అనాలి, అనరు. సౌలభ్యం, సరళత్వం, పరభాషా మోజు మాతృభాషను మింగేస్తోంది.”

ఏదో సినిమాలో( కాదు కాదు, ఏదో చలనచిత్రంలో) సుత్తి వీరభద్రరావు వాడే గ్రాంధిక తెలుగు భాష గుర్తుకు వచ్చింది దివాకర్ కి. అయినా ఏమీ మాట్లాడలేదు. మర్నాడు స్టేజీ మీద(కాదు కాదు, వేదిక మీద) బాబాయ్ ఏం మాట్లాడుతాడో అతనికి అర్థం అవుతూనే ఉంది.

ఆ మధ్య వచ్చిన తెలుగు చలనచిత్రంలో బ్రహ్మానందం “కిల్ బిల్ పాండే” వేషం గుర్తుకువచ్చింది. నవ్వు కూడా వస్తోంది. కానీ నవ్వితే అతగానికి నలభై ఏళ్లని కూడా ఆలోచించకుండా ముందరి పళ్ళు రాలగొట్టగల సమర్థుడు అతని బాబాయ్.

దివాకర్ నెమ్మదిగా ఆయన చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

“నా ఆవేశాన్ని చల్లబరచాలని చూడకురా అబ్బీ.. ఈ ఆంగ్లేయుల భాషతోనే నాకు పేచీ. ఆ భాష మన దేశంలోకి రావటం వల్లనే కదా ఈ దౌర్భాగ్యం..”

ఒక గంట పాటు ఆయన గయోపాఖ్యానం వింటూనే దివాకర్ తన బాల్యంలోకి తొంగి చూసుకున్నాడు.

“బాబాయే లేకపోతే నాకు ఇంత చక్కటి తెలుగు భాష అబ్బేది కాదు. ఇక్కడ తెలుగు బోధిస్తున్నాను అంటే ఆయన చలవే.” అనుకున్నాడు.

“విదేశీ మోజు నిన్ను కూడా అంటిందా?” అమెరికాలో ఉద్యోగం అనగానే బాబాయ్ వేసిన మొదటి ప్రశ్న.

“అక్కడైనా తెలుగు భాషనే బోధిస్తాను కదా బాబాయ్.” అన్న జవాబు ఆయనను సంతృప్తి పరచలేదని తెలుసు. తెలుగు భాషా ఉత్సవాలకు ఆయన్ని పట్టుబట్టి మరీ పిలిచిన ఇక్కడి అంతర్జాతీయ తెలుగు సంస్థ లో ప్రసంగిస్తున్నప్పుడు మాత్రం దివాకర్ వైపు చూశాడు ఆయన ఆప్యాయతగా. అప్పటి జవాబు ఇపుడు కాస్త స్వాంతన కలిగించిందేమో.

తెలుగు భాషా మహోత్సవం మొదటి రోజు ముగిశాక సంస్థ వాళ్ళు ఇచ్చిన విడిది నుండి ఇంటికి తీసుకువచ్చాడు దివాకర్. ఆయన జెన్నిఫర్ ని చూడడం ఇదే. ఈ పదేళ్ళూ దివాకర్ పంపిన ఛాయాచిత్రాల్లో చూడడమే! ఆమె చక్కటి తెలుగు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడాయన. ఆంగ్లం అంటే భయపడి ఒక్క వాక్యం సరిగ్గా మాట్లాడలేని దివాకర్ తెలుగు భాషా మహోత్సవానికి విచ్చేసిన కొందరు విదేశీయులతో అద్భుతమైన ఆంగ్లం మాట్లాడడం కూడా అంతే విస్మయాన్ని కలిగించింది.
ఆ తెల్లవారి వారి దినచర్యను గమనిస్తూ ఉండిపోయాడు దీనబాంధవ. అందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారు. వారి సంభాషణలలో కొన్ని పదాలు వింతగా అనిపించాయి. ఉదయం వేదను విశ్వవిద్యాలయంలో దిగబెట్టలేనని, తనకు వేరే పని ఉందని దివాకర్ అనగానే, “నేను ఏదో ఒక ప్రజాశకటం చూసుకుంటాను నాన్నా, మీరు వెళ్ళండి” అంటూ ఇల్లు దాటి పోయింది వేద. ప్రజాశకటం అంటే ఏమిటో అర్థమైన దీనబాంధవ వదనం వికసించి, మోములో ప్రసన్నత అంకురించింది. చిన్మయ పాఠశాలకు వెళ్తూ, “అమ్మా, నా శ్రవణసాధనం మర్చిపోయాను. మంచం మీద ఉన్నది. ఇస్తావా?” అని అడిగాడు. జెన్నిఫర్ తెచ్చి ఇచ్చిన సాధనాన్ని చూసి దీనబాంధవ బిగ్గరగా నవ్వకుండా ఉండలేకపోయాడు. అవి ఇయర్ ఫోన్స్.

రాత్రి భోజనాలు అయ్యాక ఒక కాగితాన్ని తాతగారి ముందు పెట్టింది వేద. చిన్మయ ఆయన ప్రక్కనే కూర్చున్నాడు. జెన్నిఫర్ కూడా బాబాయ్ ఎదురుగా కూర్చుంది.

“ఇది పదకేళి తాతగారు. మీరు ఈ పదకేళిని పూర్తి చేస్తే, నేను మీకో కానుక ఇస్తాను” వేద తాతగారి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చెప్పింది.

దీనబాంధవకు ఉత్సాహం వచ్చింది. పదకేళివైపు చూపు సారించాడు. చిన్మయ తాతగారి చేతికి పెన్సిల్ ఇచ్చాడు. నిలువు, అడ్డం సూచనలు ఉన్నాయి. చిత్రంగా కొన్ని చిత్రాలు వేసి ఉన్నాయి. ఉత్సుకతతో వేదవైపు చూసాడాయన.

“వినూత్న ప్రక్రియ తాతగారూ” రెండు చేతులూ ఆడిస్తూ కనుబొమ్మలెగరేస్తూ నవ్వింది వేద.
పదకేళిలో ఉదయం నుండి ఆయన విన్న పదాలే ఎక్కువ ఉన్నాయి.

1నిలువు- దీనితో రాస్తాం. రాసినది చెరపవచ్చు. ఇది చెక్కతో, సీసంతో తయారవుతుంది.
ఇది చూసి దీనబాంధవ పట్టికలో పెన్సిల్ అనే పదం రాయబోయాడు. కానీ అడ్డంలో ఇచ్చిన సూచనతో వచ్చే పదానికీ తాను అనుకున్న పెన్సిల్ కీ సరిపోలేదు. అవును కదూ.. పెన్సిల్ ని తెలుగులో ఏమంటారు? ఆయన తన తెలుగు పాండిత్యానికి పదును పెట్టేలోపే జెన్నిఫర్ తమ ముందు ఉన్న చెక్క బల్లను, తన చేతిలో ఉన్న కలమును చూపించింది. తెలివైన దీనబాంధవ పదాన్ని వెంటనే పదకేళిలో రాశాడు. “చెక్క కలం”.
ఇంకో పదాన్ని తెలికగానే పట్టుకున్నాడు.
8 అడ్డం- ప్రజలు వినియోగించే వాహనం. ప్రజావాహనం అనుకున్నాడు మొదట. కానీ ఉదయం బయటికి వెళ్తూ వేద వాడిన పదాన్ని గుర్తు చేసుకుని, ప్రజాశకటం అని రాశాడు. సరిపోయింది. ఇలా పదకేళి అంతా క్రొత్త తెలుగు పదాలే ఉన్నాయి. ఒక్కో పదాన్ని పూర్తి చేసిన ప్రతి సారీ చిన్మయ తాతగారికి ముద్దులు పెడుతూ ఉన్నాడు, వేద చప్పట్లు కొడుతూ ఉంది. మొత్తానికి పూర్తి చేసిన పదకేళితో దీనబంధవ గర్వంగా చూస్తూ ఉండగా వేద ఒక వ్రాత ప్రతిని ఆయన చేతిలో పెట్టింది.

“ఇదే తాతగారూ నేను మీకు ఇచ్చే కానుక. నాన్న ఎప్పుడూ మీ గురించీ, మీకు తెలుగు భాషపై ఉన్న మక్కువ గురించీ చెప్తూ ఉంటారు. ఆయన చదువు, ఈ ఉద్యోగం అన్నీ మీ చలవే అనీ, తెలుగు భాష అంతరించిపోతుందేమో అన్న మీ బెంగ గురించీ చెప్తూ ఉంటారు. మాకు చిన్నప్పటి నుండి తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేశారు. అలా అని పరభాషపట్ల విముఖత లేకుండా నచ్చిన భాషలను నేర్చుకోమన్నారు. అమ్మ తెలుగు నేర్చుకుంది. ఈ పదేళ్ళ సహచర్యంలో తెలుగు పద్యాలను రాయడం నేర్చుకుంది. నాన్న తెలుగు బోధిస్తూనే, ఆంగ్ల సాహిత్యాన్ని చదివారు. నేను ఫ్రెంచ్, ఫిన్నిష్ నేర్చుకున్నాను, చిన్మయ సంస్కృతం నేర్చుకున్నాడు. ఎన్ని నేర్చుకున్నా ఇంట్లో తెలుగు, ఆంగ్లం రెండూ మాట్లాడుతాం. ఇది అమ్మ రాసిన పద్యాల ప్రతి. మీరు తెలుగు పండితులు, రచయిత కదా.. చదివి, బావుంటే మీ చేతితో ప్రచురిస్తారని అమ్మ ఆశ.”

భార్య మరణంతో క్రుంగిపోయిన దివాకర్ కు ఆమె మరణించక ముందు దరఖాస్తు చేసుకున్న అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడి ఉద్యోగం వచ్చింది. పిల్లల్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఏడాదికి జెన్నిఫర్ ని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరికీ ఆమె ముందు నేస్తమయింది. ప్రేమగా అక్కున చేర్చుకుని అమ్మ అయింది.

దీనబాంధవకు గొంతులో సుడి తిరుగుతున్న ఉద్వేగాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో తెలియలేదు. జెన్నిఫర్ ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.

వేద తన చరవాణి తీసుకువచ్చి, అందులో తాను నడుపుతున్న తెలుగు పదప్రయోగ వెబ్ పుటను చూపించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు, పెద్దలు ఆ పుటలో క్రొత్త తెలుగు పదాలను సృష్టించి వాడుతున్నారు. ఆ పదాలు సరళంగా, వాడుకునే వీలులో ఉన్నాయి. అచ్చు చెక్కకలంలానే.
“కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు ప్రత్యామ్నాయాలు లేవు బాబాయ్. వాటిని అలాగే వాడుతూ ఉంటాం. మేము వాటికి క్రొత్త తెలుగు పదాలు సృష్టిస్తూ ఉంటాం. అవే పదాలను ఇంట్లో వాడుతూనే, మా పరిధిలోని తెలుగు వాళ్ళతో కూడా సంభాషిస్తూ ఉంటాం. మొదట్లో అదొక హాస్యకృత్యంలా అనిపించేది. నవ్వులాటగా మొదలైనా, ఆ పదాల వాడుక దినచర్యలో భాగం అయింది.” అని దివాకర్ చెప్తూంటే దీనబాంధవ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.

వారం రోజుల తర్వాత భారతదేశానికి తిరుగు ప్రయాణమౌతున్న దీనబాంధవ చేతిలో ఒక కాగితాన్ని పెట్టాడు దివాకర్.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా దివాకర్ నియామక ఉత్తర్వులు అవి!

 

-విజయభాను కోటే

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో