అర్థరాత్రి చప్పుడవుతుంది
మనసు తెరచుకుంటుంది
తలాపున ఎవరూ ఉండరు
దీపం గుడ్డిది కాదు
రేపే గుడ్డిదేమో..!
సాలె గూటిలోకి తనకు తానుగా దూరే
చీమ
ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది
బాకు శరీరంలో దిగదు
రక్తం నీళ్ళలాగా కురుస్తుంటుంది
తనది కాని దుఃఖమైనా
చలికాలపు వణుకులాగా
వేదన ఆవరించి దుప్పటి కప్పుకొని
మొహాన్ని దాచుకోమంటుంది
మాటలు రావు
ఉండచుట్టుకున్న తీగల మధ్య
రోజా మొగ్గ ఒకటి మొలిచి
తెల్లవారి తృణదళం మీద
ముత్యపు చినుకును కలకంటుంది
రాత్రి కరుగుతున్న చప్పుడు
కెంజావి రంగై పరదా కడుతుంది
దుప్పటి నిండా పేరుకున్న ఉప్పుగళ్ళు
మూటగట్టి పెన్నులో సిరా చేయబడతాయి
రాయబడిన అక్షరాలు
కొన్ని నలుపు రంగులోనూ..
కొన్ని ఎరుపు రంగులోనూ..
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~