
శాంతి
చెట్టుకింద చేరిన మగమేక కూనిరాగాలు తీస్తున్నది.
ఆడమేక నిన్న చూసిన బోనాల పండుగను నెమరువేసుకుంటున్నది.
గాడిద ఆయాసపడుతూ వచ్చి మిత్రుల చెంత చేరింది. పెద్ద తేనుపు రావడంతో హమ్మయ్య అనుకుంది.
“ఏమైంది మిత్రమా.. అంత ఆయాసపడుతూ ఉన్నావ్” అడిగింది మగమేక
“చానా రోజుల తర్వాత సుష్టుగా తిన్నగా .. భుక్తాయాసం” అంటూ నవ్వేసింది గాడిద.
“అనగా అనగా రాగం తినగా తినగా రోగం” అన్నది ఆడమేక అతిగా తిన్న గాడిదను ఉడికిస్తూ ..
“అన్నీ సాగితే రోగమంత భోగం లేదులే.. “నవ్వింది మగమేక.
“మీరు ఏమైనా అనుకోండి. నాకైతే చాలా హాయిగా ఉంది. ఇట్లా పండుగ ఎప్పుడు ఉంటే ఎంత బాగుండు” చాటంత మొహం చేసుకు అన్నది గాడిద.
“అబ్బా .. ఆశ” అన్నది ఆడమేక
“ఇంతకీ ఏ పండుగ జరుపుకున్నావేంటి” ఆరా తీసింది మగమేక
“ఈ రోజుల్లో ఇంకేమి పండుగలున్నాయి .. బోనాలు” నవ్వుతూ అన్నది గాడిద.
“ఓ బోనాల కాడికి పోయొచ్చావా .. జోగిని రంగమెత్తి చెప్పిన భవిష్యత్ వాణి బోనాల ప్రత్యేకత అట కద, విన్నావా?
నేను నిన్న పోయాను. భవిష్యవాణి చెప్పనేలేదు. ఈ ఏడాది ఏం చెప్తారో.. ” ఆసక్తిగా ఆడమేక.
ఏమో .. అదంతా నాకెందుకు .. నాకు కావలసింది దేవులాడుకోవడంతో, కడుపు నింపుకోవడంతో సరిపోయింది ” అన్న గాడిద ఏదో గుర్తొచ్చినట్టు ఒక్క క్షణం ఆగి,
“ఆ.. జన్మకో శివరాత్రి అన్నట్లు ఇవాళ రంగమెక్కింది జోగు స్వర్ణలత. భక్తుల నమస్కారాలు అందుకున్నది . దీవెనలు ఇచ్చింది. భయభక్తులతో భక్తులు ఇచ్చిన కానుకలు అందుకుంది. రేపటి నుండి నాలా గాడిద బతుకే ..” అన్నది గాడిద.
“అవునవును, జోగిని రంగమెక్కకుండా, భవిష్యవాణి చెప్పకుండా బోనాలు పండుగ జరగదని విన్నాను” అన్నది ఆడమేక .
“అదేంటి అలా అంటావ్ మిత్రమా. జోగిని రంగమెక్కి భవిష్యవాణి చెబుతుంటే ప్రజలు ఆమెను ఎంతో గౌరవించడం చూశాను. ఎంత భయ భక్తులతో మెసులుకుంటారు. తమ మనసులో ఉన్నది చెప్పుకుంటారు .. అమ్మవారు వంటి ఆమెకు గాడిద బతుకు అంటావేంటి బుద్ధి లేకుండా” మందలింపుగా అన్నది మగమేక .
“అయ్యో .. నువ్వెప్పుడూ జోగినీల ఇళ్ల వైపు వెళ్లలేదా..
ఒకసారి అటు వెళ్లి చూడు వాళ్ళ గోస గోస కాదు. వాళ్ళు కట్టు బానిసత్వంలో బతుకుతున్నారు. ఏ జోగిని కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే, వ్యధలే” అన్నది గాడిద
నిజమా .. ఆశ్చర్యపోయింది మగమేక.
“అవును, జోగిని అంటే అమ్మవారి (దేవత) భార్య కదా .. ఆమెకు వేరే మొగుడుండడు. కానీ పిల్లలుంటారు. ఆ పిల్లలకు తండ్రి ఉండడు. తండ్రెవరో తెలియక, తండ్రి పేరు చెప్పలేక గాయపడిన పసి హృదయాలెన్నో ఈ కళ్ళతో చూశాను. 2009 నుండి తల్లి పేరు రాయడం మొదలైంది. బడికి పోతున్నారు జోగినుల పిల్లలు. కానీ నలుగురిలో కలవలేక నలిగి పోతున్నారు” విచారంగా అన్నది గాడిద.
“అయ్యో .. ఇదేమి చోద్యం, దేవతతో పెళ్లి ఏంటి?
ఒక ఆడ, ఒక మగ పెళ్లి చేసుకోవడం రివాజు. దేవత అంటే ఆడ కదా .. మరి ఆడ దేవత తో పెళ్లి..విచిత్రంగా.. సృష్టికి వ్యతిరేకంగా అనిపించడం లేదా ” వ్యాఖ్యానించింది మగమేక.
“అంటే జోగినీల గురించి నీకు తెలియదా .. మీ ప్రాంతంలో వాళ్ళు లేరా ..” ఆశ్చర్యపోయింది గాడిద
తెలియదన్నట్టు తలూపింది మేకల జంట.
“జోగిని అంటే ఆచారం పేరుతో చిన్నప్పుడే వేసిన పెద్ద శిక్ష.
అభం శుభం ఎరుగని పిల్లల జీవితాలను నాశనం చేసే ఆచారం.
పెళ్లి అంటే తెలియని వయసులో గ్రామ దేవతతో నీ పెళ్లి అయిపొయిందని చెప్పే భూస్వామ్య వ్యవస్థ అవశేషం.
మత ఆచారాల్లో దాగిన దురాచారం ” ఆవేశపడిన గాడిద కొన్ని క్షణాల తర్వాత చెప్పడం మొదలు పెట్టింది
“తమ కుటుంబంలో జన్మించిన మొదటి ఆడపిల్లను వతనుగా గ్రామ దేవతకు భక్తితోనో భయంతోనో సమర్పిస్తారు. అప్పటి నుంచి ఆమె ఊరందరి శారీరక కోరికలు తీర్చే మనసులేని బొమ్మ. ఆమెకు పుట్టే పిల్లలకు తండ్రెవరో తెలియదు. ఆ పిల్లలు బడికి పోవాలంటే తండ్రి పేరు కావాలి. తెలియని తండ్రి పేరు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలరు .. ఇక ఆ పిల్లలు బడి గంటకు దూరంగా ఉన్నారట. 2009 నుండి తల్లి పేరుతో బడిలో చేరుతున్నారట . బడి మెట్లు ఎక్కినప్పటికీ వారికి ఎన్నో అవమానాలు. తండ్రెవరో తెలియదని గెలిచేసే పిల్లలు, పెద్దల మధ్య ఇమడలేక బడి మానేసిన వారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని తల్లులు నరకయాతన పడేవారట.” తను ఎప్పుడో , ఎక్కడో విన్న విషయాలు వివరించింది గాడిద.
” దేవుడి పేరుతొ ఆచారం పేరుతో ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగించడం, నూరేళ్ళ జీవితాన్ని శాసించడం ఎంత అన్యాయం” ఆవేదనగా అన్నది ఆడమేక
“మనుషుల్లో ఇంకా ఇంత మూఢత్వమా ..” అన్నది మగమేక
“సంఘ సంస్కర్త హేమలతా లవణం, లవణం దంపతుల కృషితో జోగిని , బసివి , మాతంగి వంటి వ్యవస్థల, దురాచారాల నిర్ములనకు చట్టం వచ్చిందట.
ఈ ఆచారాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 1987లోనే చట్టం తెచ్చిందట.
కానీ ఆ ఆచారంలో భాగమైన రంగం ఎక్కి భవిష్యవాణి చెప్పడం మాత్రం ఈ నాటికీ సజీవంగానే కొనసాగుతున్నది.
గుడిపెద్దలు స్వర్ణలత ఇంటికి పోయి ఆలయానికి రమ్మని ఆహ్వానించడం, ఆమె కిన్నెర చేతపట్టుకొని మహంకాళి ఆలయానికి పోవడం చూశాను.
అక్కడ గుడివాళ్లే బట్టలు , పసుపుకుంకుమలు , బియ్యం ఇస్తారట. అప్పుడామె మీదకు అమ్మవారు పూనుతుంది. పచ్చి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది.
అప్పుడు ఆమె ఎప్పుడు కనిపించే జోగిని లాగా ఉండదు. అచ్చం అమ్మవారే మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుందని జనం మాటల్లో తెలిసింది.
బోనాల పండుగ ఆదివారమైతే , ఆ తెల్లారి సోమవారం నాడు రంగమెక్కి భవిష్యవాణి చెబుతుంది. ఆ రెండు రోజులు ఆమె ఎంతో నిష్ఠతో ఉంటుంది. ఒక్కపొద్దు ఉంటుంది . హడావిడిగా ఉండే ఆమెకు ఆకలిదప్పులు తెలియవట. అక్కడి జనం అనుకోగా విన్నాను .
కొబ్బరి చిప్పలు, రకరకాల ఆహారం దొరికిందనే సంబరంలో నేనున్నా. అందుకే అక్కడ ఏం జరుగుతున్నదో, భవిష్యవాణి ఏమి చెప్పిందో నేనైతే పట్టించుకోలేదు” వివరించింది గాడిద
అంతా విన్న ఆడమేక మనసంతా బాధతో నిండిపోయింది. ముక్కు మొహం తెలియని జోగిని మహిళ జీవితం పట్ల ఆవేదన కలిగింది. చట్టాలు చేసిన ప్రభుత్వం వాటిని ఎందుకు ఆచరించడం లేదో, అమలు చేయడం లేదో అర్థం కాలేదు.
“గొప్పింటి బిడ్డలు ఎవరైనా జోగిని గా ఉన్నారా ..” గాడిదను ఉద్దేశించి అడిగింది ఆడమేక.
“నా ఎరుకలో నేనైతే చూడలేదు “అన్నది గాడిద.
“ఓసి పిచ్చి మొహమా… పెద్దింటి పిల్లలకు ఇవన్నీ ఉండవు . అన్నీ అట్టడుగున ఉన్న వాళ్ళకే. ఒకవేళ పై వాళ్లలో ఈ ఆచారం ఉంటే ఇన్నేళ్లు ఇట్లా ఉంచుతారా .. ఎప్పుడో నామరూపాల్లేకుండా చేసేవారు ” ఆలోచనగా అన్నది మగమేక
“ఏంటో ఈ మనుషులు. అందరూ నిలబడేది ఈ నేలపైనే. అందరు పీల్చేది ఈ గాలినే. అందరు తినేది బుక్కెడు బువ్వే. కానీ మనిషికి మనిషికి మధ్య ఎంతో దూరం పెంచే కులం, మతం , ప్రాంతం, ఆస్తి , అంతస్తు , చదువు, ఆడ-మగ … ఇలా ఎన్నో … కదా .. ఇవేమీ లేకుండా మనలాగా బతకలేడా .. ఇవన్నీ లేకుండా చేయలేరా ..” అన్నది ఆడమేక
“మన జంతు జాతిలో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయా లేవు. వాళ్లకి వాళ్ళ పూర్వీకులు చేసిన ఆచారాలు ఉన్నాయి. వాటిని నిలుపుకోవాలి కదా” అన్నది గాడిద
“ఏయ్ .. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావ్. నువ్వేగా జోగిని బతుకు బుగ్గి అవుతన్నదని చెప్పావ్ . మళ్ళీ ఆచారం బతికించుకోవాలంటావ్?” కస్సుమన్నది ఆడమేక .
“నేను కొత్తగా ఏమి చెప్పలేదు. జరుగుతున్నదే చెప్పా.. మహంకాళి బోనాల పండగంటే ప్రజలేనా .. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు , పార్టీ నాయకులు , అధికారులు అందరూ కలిసి నడిపిస్తున్నది కదా ఈ తంతు. ఇక జోగిని ఆచారం ఆపేదెవరు ?
ఇంకో విషయం తెలుసా మీకు , ఇవాళ రంగ మెక్కిన జోగినికి పిల్లలు లేరు కాబట్టి ఆమె మేనకోడలు ఆ కుటుంబం నుండి జోగినిగా మారుతుందట. అది ఆ ఇంటి ఆనవాయితీ అట ” అన్నది గాడిద
“ఇదిగో ఇక్కడే ఇటువంటి విషయాల్లోనే నాకు ఈ మనుషులపై మా చెడ్డ కోపం వస్తున్నది. మనసు కలత చెందుతున్నది.
పండుగల్లో జోగినిని దేవతను చేసి, నిత్యసుమంగళీ అని కీర్తించడం, ఆమె ఊపిరి ఉన్నంత వరకు ఊరందరి అంగడి బొమ్మను చేయడం మనుషుల ద్వంద ప్రవృత్తి ఎంత వికృతంగా ఉన్నది.
చదువు సంధ్య లేని ఆమె తల్లిదండ్రులు తెలియనితనంతో జోగిని గా మార్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పెద్దల బుద్ది ఏమైంది ?
రోజూ కాళ్ళకింద నలిపేస్తూ ఒక్కరోజు నెత్తి మీద పెట్టుకుంటే సరిపోతుందా?
పెంచుతున్న మూఢనమ్మకాల్ని , అన్యాయమైపోతున్న ఆమె జీవితాన్ని పట్టించుకోవడం లేదు సరి కదా..
ఏడాదికొకసారి జరిగే జాతరలో జోగిని రంగమెక్కడం, దేవుడి తరపున భవిష్యవాణి చెప్పడం గురించి టీవీల్లో, పేపర్లలో మా గొప్పగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదేదో ఘనకార్యం అన్నట్టు సెలవిస్తున్నారు. అంటే జోగినీ వ్యవస్థను ప్రోత్సహించి నట్లే కదా ..
జోగిని వ్యవస్థను ప్రోత్సహించే వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించాలి కదా.. అంటే బోనాల పండుగలో జోగిని ప్రవేశాన్ని ఆహ్వానించే పెద్దలను దోషులుగా చేసి శిక్షించాలి కదా.. ఇటువంటి అవగాహన ప్రజల్లోనూ, జోగినుల్లోనూ కలిగించాలి కదా..
కానీ వీళ్ళు అలా చేయరు. ఊహూ.. అస్సలే చేయరు.
ఎవరో వీళ్ళ బతుకుల చూసి చలించారు. పోరాడారు. వారి వత్తిడి మేరకు చట్టాలు చేస్తారు. కానీ ఆచరణ ఉండదు. వారికే గనుక చిత్తశుద్ధి ఉంటే ఆ అభాగినుల బతుకుపై శ్రద్ధ ఉంటే మరోసారి ఇటువంటి పండుగల్లో ఆమెను భాగస్వామ్యం చేయరు. ఆమె కు మంచి బతుకుదెరువు చూపిస్తారు. ఆమె తర్వాత కుటుంబంలో ఎవరు జోగినిగా రాకుండా చూస్తారు.
ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు జోగిని ఆచారాన్ని ప్రోత్సహించే వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తేనే ఇటువంటి దురాచారాలు నామరూపాలు లేకుండా పోతాయి
అసలు, రంగమెక్కి భవిష్యవాణి చెప్పే ఆ అక్కకు తన భవిష్యత్తేంటో తెలుసా .. ” అన్నది ఆడమేక
“విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న ఈ నగరానికి మాయని మచ్చలు ” అన్నది మగమేక
అవునన్నట్టు తలాడించింది గాడిద.
-వి. శాంతి ప్రబోధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~