మాయామృగం(కథ )- అనువాదం -శాఖమూరు రామగోపాల్‌

కన్నడ భాషలో దివంగత పూర్ణచంద్ర తేజస్విగారు రచించిన ”మాయామృగ” అనే కథను యథాతథరూపంగా తెలుగులోకి అనువదించారు శాఖమూరు రామగోపాల్‌.

”ఔనండి! దెయ్యంకు ఒక రూపం ఉండాలి కదా” అంటూ షా నన్ను ప్రశ్నించాడు.
”రూపం ఎందుకు?”
”మరిక నరమనుషుల కళ్ళకు కనబడేది ఎలా?”

ఆ ప్రశ్నకు నేను అప్పుడు యోచించాను. ”ఔను కదా!” అన్పించింది. మనిషికి బయట లోకంలో ఏదైనా వాస్తవం తెల్పాలంటే పంచేంద్రియాల మూలంగానే కదా! రూపమో, వాసనో, శబ్దమో… ఎలాగో ఒకటి భౌతిక రూపంగా వస్తేనే మాత్రం అది దెయ్యం కావొచ్చని మనకు గుర్తౌతది. ”మీరు చెపుతుంది సరేనండి! దెయ్యం మన కళ్ళకు కనబడాలంటే దానికొక ఆకారం తప్పని సరిగా కావాల్సే ఉంటది” అని చెప్పాను షాతో.

”అది సరే! ఇప్పుడు ఇక్కడున్న కళేబరంకు ఏదో ఒక రూపం ఉందని చెప్పుకొన్నా, ఏదో ఒక రూపం ధరించి వచ్చిందని అనుకొన్నా, దెయ్యం ఫలానా ఈ రూపంలోనే వస్తదని అప్పుడు మనం తెల్సుకొనేది ఎలాగ?” అంటూ షా మరు ప్రశ్న వేసాడు.

”అది చాలా తేలికండి. ఇప్పుడు దెయ్యం ఒక యువతి రూపంలో వచ్చిందని భావించుకోండి. ఈ నడిరాత్రి అమావాస్య వేళలో ఈ స్మశానంలో మన వద్దకు ఈ యువతి వచ్చింది ఎందుకయ్యా అనే అనుమానం కలిగేది మనలో ఉండదా? తక్షణమే మనకు తెలుస్తది ఇది దెయ్యం చేష్టే అని”.

”అదేనండి నేనూ యోచిస్తుంది. దెయ్యం యువకుల్ని చూస్తే యువతిరూపంలో, యువతుల్ని చూస్తే యువకుడి రూపంలో వస్తదనేదంతా మన ఊహే కదండి! ఇదేంటి కలాశాల విషయమా? ఇది స్మశానం కదండి! ఒక బర్రె రూపంలోనో, ఒక గాడిద రూపంలోనో వస్తే?”

”అప్పుడు కూడా మనకు అనుమానం వస్తది కదా… ఇదేందయ్యా వారసులు లేని బర్రెగా స్మశానంలో ఎందుకు తిరుగుతుంది అని?”

”ఔనండి… ఈ ప్రశ్న అంత సులువుగా లేదని తెల్సుకోండి! మీ వేషాన్ని వేసుకొని నా ఎదురులో వస్తే? నా వేషంలో మీ ఎదురు నిలబడితే అప్పుడు ఏమి చేయాలి?”

”అయ్యో రానీయండి చూద్దాం! వచ్చినప్పుడు కదా ఈ సమస్యంతా” అని నేను ఉదాసీనంగా చెప్తూ నా చేతిలో ఉన్న కట్టెనుంచి చితి మీదున్న బూడిద కుప్పను కెలకసాగాను.

”థు…! థూ…!! దాన్నెందుకు కెలుకుతారు” అన్నాడు షా.
”ఏదైనా ఒక మహిళ శవాన్ని దహించితే, ఆ శవంకు ఉండే ముక్కుపుడక లోని ముత్యం, వజ్రాల చెవికమ్మలు దొరుకుతవేమో అని కెలుకుతున్నానండి” అని అన్నాను.

”వాటన్నిట్ని విప్పి, ఆ తర్వాతే చితికి నిప్పు పెట్తారు కదా!” అని నాకు జ్ఞాన బోధ చేసాడు షా.
బూడిద కుప్ప నుంచి కొన్ని మూలిగెలు బయట పడినవి. ఎవరిదో కళేబరాన్ని సరిగా తగలబెట్టనే లేదు కదా అని అనుకొంటూ, నా చేతిలో ఉన్న కట్టెనుంచి మూలిగెల మీద రెండు వేట్లు వేసా! నిప్పు సెగకు ముడుచుకుపోయిన ఆ మూలిగెలు పుళక్కనే విరిగి బూడిదైనవి.

ఆకాశమంతా దట్టంగా మేఘాలనుంచి కప్పబడి ఉంది. దూరానున్న వీధి దీపాల వెలుగుల నుంచి ఊరు అస్పష్టంగా కనబడుతుంది. నేను మరియు షా… ఇద్దరం స్మశానంలో దెయ్యాలు కనబడుతవేమో అని పరీక్షించేందుకు ఈ అమావాస్యలోని అపరాత్రిలో ఇక్కడికి చేరుకొన్నాం. మా సంగీత మేష్టారైన దాసప్పగారు అమావాస్య నడిరేయిలో స్మశానంకు వెళ్తే దెయ్యం తప్పకుండా కనబడుతదని, ధైర్యం మాలో ఉంటే తప్పని సరిగా వెళ్ళండని సవాలు చేసాడు.

ఎంతసేపు వేచి ఉన్నా మాకేమి కనబడలేదు. దెయ్యాన్ని పిచ్చిపిచ్చిగా రేగించితే, అప్పుడు అది కోపించుకొని మాకు కనబడొచ్చని ఊహించి నోటికొచ్చినట్లుగా అశ్లీల తిట్లనుంచి తిట్టాడు షా. ఎలాగెలాగున బూతు పురాణం విప్పినా అవేవి దెయ్యానికున్న మర్మస్థానంకు తాకినట్లుగా కనబడలేదు. నేను షా గారి బూతు మాటల పంచాంగంకు కలాత్మకంగా తల ఊపుతూ కూర్చున్నాను. చివరికి షా గారి తిట్ల పురాణంలోని అంబుల పొది ఖాళి అయ్యింది. నోరు నొప్పి పెట్టినందున షా ఇప్పుడు మిన్నకుండిపోయారు.

ఆ స్మశానంలో శవ దహనం కని మూడు వేదికల్ని బండరాళ్ళనుంచి కట్టారు. బహుశః మూడు వర్ణాలోళ్ళకు అనువుగా మూడు వేదికలు ఉండాలని కట్టారో ఏమో! ఆ మూడు వేదికల మీదా బూడిదరాశి ఉంది. కొంచం దూరాన పూడ్చిపెట్టి శవ సంస్కారం చేసిన సమాధులున్నవి. వాన రభసనుంచో లేకపోతే కొత్తగా వచ్చిన శవాల్ని పూడ్చేటప్పుడు బయటపడిన ఎన్నో మూలిగెలు, పగిలిన కపాలంలు అక్కడంతా చెల్లాచెదురై పడియున్నవి. కొంచంసేపు నేను ఏమి మాట్లాడకనే ఉత్తిగనేఅక్కడంతా చెల్లాచెదురై పడియున్న వాట్ని అవలోకిస్తూ కూర్చున్నాను. పుట్టినోళ్ళందరూ చిట్టచివరికి రావాల్సి ఉన్న ఈ స్థలం గురించి నాలో ఏవేవో విచిత్ర భావాలు విజృంభించి రాసాగినవి. అప్పుడే ఆ సమయానే ఆరంభమైంది షాలో ఒక భావన. దెయ్యం ఏదైనా ఒక రూపంలో వస్తే దాన్ని గుర్తించేది ఎలాగున అనే సంశయం? కొంచం సేపు గడిచిన తర్వాత షా గారి అనుమానాలు నా మనస్సునూ ఆక్రమించుకోసాగినవి.

”దెయ్యాలు మన మానవుల రూపంలోనే వచ్చి మనకి కష్టాలు ఇచ్చేందుకు ప్రారంభాల్ని చేసే మొదలే, మనం ఈ స్మశానం నుంచి వెళ్ళిపోయేది మంచిదేమో కదా షా?” అన్నాను నేను.

”నేనూ దాని గురించి యోచిస్తూ ఉంటే, ఇప్పుడొక ఉపాయం నాలో మెరుస్తుంది. దాని ప్రకారం మన రూపాల్నే ధరించి వచ్చే తుంటరి దెయ్యాలు మనల్ని మోసగించనట్లుగా వాట్ని నిలపొచ్చు… చూడండి నిశితంగా నా యోచనను” అన్నాడు షా.

”ఏమిటండి మీ యోచన?”

”చూ బిట్సిం: కుంట్సుఫు” అన్నాడు షా. అలాగున పలుకగా అది ఏమిటనేది తెల్వక ఎంతగానో గలిబిలి అయ్యి, వారి ముఖాన్నే చూడసాగాను.

”అది ఏ మంత్రం అండి? మేడ్‌ ఇన్‌ జపాన్‌ మంత్రంలా ఉంది కదా! జపాన్‌ భాషలోని మంత్రమా అది?”

”ఇది మేడ్‌ ఇన్‌ చైనా మంత్రం అండి! ఈ మంత్రం మన ఇద్దరికీ సంకేత పదాలుగా ఉపయోగపడుతవి. నేను మిమ్మల్ని పిల్చిన తక్షణం ”చుం బిట్సిం” అంటూ ఆ తర్వాతే మీరు మిగిలిన మాటల్ని ప్రారంభించాలి. మీరు నన్ను పిలిస్తే ”కుంట్సుఫు” అని నేను అంటాను. ఈ మంత్ర సంకేతంను మనం ఉచ్ఛరించక పోతే అది దెయ్యమే; నేను కాదు అనే అర్థం కలుగుతది” అన్నాడు షా. ”ఇదెందుకు చైనా పదాల్నే పలకాలి? మరేదైనా కన్నడందో, సంస్కృతంలోని పదాల్నో ఉచ్ఛరించేది మంచిదేమో కదా!” అన్నాను నేను. కంటి రెప్పల్ని కొట్టాను. షా నా వైపుకు విచిత్రంగా కఠోరంగా చూస్తున్నట్లుగా కనబడింది. సరైన సమయానికి షా అప్పగించిన ఈ దరిద్ర చైనా సంకేత మంత్రం నా మెదడు నుంచి తప్పించుకొంది కదా! షా చేతిలో కట్టె పట్టుకొని, దాన్ని ఝుళిపిస్తూ నా వైపుకు తిరిగి దెయ్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నోడిలాగ ”ఓయ్‌, ఓయ్‌… నీ మాయ నా దగ్గర నడ్చేది లేదు. నీ వేషంగీషం అంతా కట్టేసుకో. చెప్పు నువ్వెవరో” కర్కశ స్వరం నుంచి అడిగారు. ఇప్పుడు ఈ కథను చదువుతుంటే మీ కందరికీ నవ్వు వచ్చినా, ఆ స్మశానంలో నడిరాత్రిలో బడిత కర్ర పట్టుకొని షా అలాగున అంటుంటే నాకు నిజంగానే దిగులైంది. ఊర్లలో భూత వైద్యులు దెయ్యాలు పట్టినోళ్ళను దెయ్యం వదిలేందుకని బడితకర్రతో బాదేదాన్ని ఎంతోమంది మానసిక రోగుల్నుంచి చూసి ఉన్న నా కిప్పుడు దిగులైందాన్లో అస్వాభావికం ఏమి లేదండి!.

అయితే ఎంతోసేపు మననం చేసుకొన్నా ఆ దరిద్ర సంకేత పదంను, నేనెన్నడూ దాన్ని వినలేదన్నట్లుగా ఇప్పుడంతా పూర్తిగా మరిచేపోయాను కదా దాన్ని! షా ఇంకేంటి బడితకర్ర నుంచి బాదుతాడేమో అనుకొంటుండగా ఆ సంకేత పదం నా తల లోపలున్న జ్ఞాపక శక్తిని హరించి అది బయటకు రానట్లుగా నశించిపోయింది. జ్ఞాపకం చేసుకొనేవరకూ కొంచం నిధానించండి అని చెప్పేందుకు సంజ్ఞె చేయాలని చేతిని ఎత్తాను.

”హుం చెప్పు నువ్వెవరివో” అంటూ షా మరొకసారి ఘర్జించి ఒక అడుగు ముందుకు వేసాడు.
”ఓహో! పరిస్థితి ఎందుకో చేజారుతుంది; ఇద్దరి మీదా దెయ్యాలు ప్రభావం చూపెట్తున్నవి. మేమిద్దరం అకస్మాత్‌గా ఇక్కడేమైనా కొట్లాడుకొని తలలు పగులగొట్టుకొని చస్తే రేపు ఉదయంలో మా ఇద్దరి కళేబరాల్ని చూసిన జనం ఎలాగెలాగో భావించుకొనేది ఇక కచ్చితమేనని తలపోస్తూ తొందరగా ఏదైనా చేయాల్సి ఉంది” అని యోచిస్తుండగా షా మరొక అడుగు ముందుకే వేసాడు మరలా.

”వద్దు; వద్దు! దీన్ని మొన్న భాషాశాస్త్రం మీద పాఠం చెప్తూ మన మాష్టారు చెప్పారు కదా! మన వాడుక భాషలో ఉన్న పదాలైతే దెయ్యాలు సైతం తెల్సుకొని దురుపయోగం చెయొచ్చు” అన్నాడు షా.
అప్పటికి మా కెదురైన సమస్యకు ఒక ఉపాయం చూపించారు షా. అయితే షా గారు చైనా భాషలోనిదని చెపుతున్న ఈ సంకేత పదాలమీద నాకంతగా రుచించలేదు. చుం బిట్సిం మరియు కుంట్సు ఫు పదాల్ని మరవకనే ఉండేందుకని నేను వాట్ని పదే పదే మననం చేసుకొంటూ బట్టి పెట్టసాగాను.

షా ఒంటేలు పోసుకొని వచ్చేందుకు లేచాడు. ఇక ఇప్పుడు నాకేమో నా సంకేత పదం జ్ఞాపకంకు వస్తే వారికుండే సంకేత పదంను మరిచిపోయినట్లుగా ఉంది. ఒకసారి వారి సంకేత పదం జ్ఞాపకంకు వస్తే, నాది మరిచినట్లుగా ఉంది. ఇద్దరి సంకేతపదాలు జ్ఞాపకంలోకి వస్తే ఎవరివి ఏఏ సంకేత పదాలు అనేదాన్ని మరిచిపోతున్నాను. భగవన్నామ స్మరణ చేస్తూ జపం చేసినోడిలాగ జపించసాగాను ఆ పదాల్ని. పరిచితమైన పదాల్నేమైనా సంకేత పదాలుగా చెప్పియున్నట్లైతే నాకు బాగుండేది. ఇప్పుడు ఇక్కడ ఈ స్మశానంలో దెయ్యాన్ని అన్వేషించేందుకు వచ్చినోడ్ని, దాన్ని వదిలి ఈ మేడ్‌ ఇన్‌ చైనా పదాల్ని పఠిస్తూ కూర్చున్నాను కదా!

అంతలో నా వెనక సప్పుడైంది. షా వెనుదిరిగి వచ్చియుండొచ్చని తల తిప్పి చూసాను. షా నిలబడి ఉన్నాడు. ”ఏమిటండి?” అన్నాను. ‘కుంట్సుఫు’ అని ఉచ్ఛరిస్తూ నా సంకేత పదం పేరు పెట్టి పిలిచారు. బహుశః దెయ్యం వచ్చినప్పుడు పలకాల్సిన విధంలో రిహార్సల్‌ చేస్తున్నట్లుగా షా నుంచి కనబడింది నాకు.

షా కొన్ని నిమిషాల క్రితమే చెప్పిన సంకేత పదంను అదెంతగానో బట్టి పెట్టినా పూర్తిగా ఆ క్షణాన మర్చిపోయాను దాన్ని. మొత్తం ఆ సంకేత పదంను అటుండనీయండి, దాన్లోని మొదటి అక్షరం సైతం ఇప్పుడు నా జ్ఞాపకంకు రావట్లేదు. నేను ఉక్కిరి బిక్కిరై ఆ సంకేత పదాన్ని తలలోపల వెతుకుతూ షా వైపుకు పిలిపిలిగా”ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పిన ఆ దరిద్ర చైనా మంత్రం ఎందుకో నా తలలో మెరవట్లేదు ఇప్పుడు” అని భయంతో నిండిన స్వరం నుంచి అరిచాను. నా ఈ చివరి వాక్యంను విన్న షా ”అయ్యయ్యో మీరేనా! థూత్‌” అని తాత్సారంగా పలికాడు. నేను దెయ్యం కాదు, ఒరిజినల్‌ మనిషినే అని తెల్సుకొన్న షా గారికి ఇప్పుడు ఆశాభంగమై ఉండొచ్చు!

షా మరలా వారి దరిద్ర చైనా సంకేత మంత్ర పదాల్ని నాకు చెప్తుండగా మూడో వేదిక వద్ద పటపట సప్పుడై ఒక చిన్న పొగలోని మేఘం పైకొచ్చి ఆకారం పొందసాగింది. పిల్ల చేష్టలన్నట్లుగా ఆరంభమైన మా దెయ్యాల సంశోధన మెల్లగా బిగుసుకు పోతున్నప్పుడు ఈ సంగతి జరిగింది. ఆ పొగే ఇప్పుడు దెయ్యంగా రూపాంతరం చెందుతుందనేది ఊహించి భయపడ్తూ చూడసాగాం. అయితే ఆ పొగ ఏ రూపం చేసుగోకనే మరలా చితిమీదున్న బూడిదరాశి మీదే దిగి అంతర్థానమైంది. ఇంకా నిప్పులున్న ఏదో కట్టెనో, నిప్పు కణికో చటపటగా పగిలి పొగను రేపిందని ఊహించాము. అయినా దాన్ని సరిగా పరీక్షించకనే ఉండేది సరికాదని అక్కడికి వెళ్ళి చూసాం. గజ్జి పట్టిన ఒక నాటు కుక్కపిల్ల అక్కడ ఆ చితిలో ఉన్న బూడిద కుప్ప మీద పడుకొని నిద్రపోతుంది. వెచ్చగా ఉన్న ఆ బూడిద కుప్ప దానికెంతగా అప్యాయమానంగా ఉందంటే మా వైపుకు అది ఒకసారైనా తిరిగి చూడకనే ముడుచుకొని చచ్చిన శవంలాగ నిద్రపోతుంది. ఇది ఇలాగే పడుకొంటే ఎవరైనా శవాన్ని కాల్చేవారు దీన్ని చితాగ్నికి సమర్పిస్తారేమో అని నాకు అన్పించింది.
”ఇది ఎటువంటి స్మశానం అండి! ఒక పెద్ద దెయ్యం కూడా ఇక్కడ స్థిర నివాసం చేసుకొన్నట్లుగా లేదు. నడవండి వెళ్ళిపోదాం. ఆ సంగీత మేష్టారు విప్పసారా తాగి ఏదాన్ని దెయ్యంగా భ్రమించారో ఏమో!” అంటూ షా వెనుదిరిగి వెళ్ళే నిర్ధారంను ఘోషించాడు.

నాకూ షా తీర్మానం సరేనని అన్పించింది. దెయ్యాలు ఉండేదాని గురించి, అవి మనుషులకు కనబడుతవనే దాని గురించి మాకు సుతరాం నమ్మకంలేదు. అయితే దెయ్యాల్ని నమ్మేది లేనందుకూ, భయంకూ ఏ సంబంధమూ లేదనికనబడుతుంది మాకు. మేము ఆలోచిస్తుండగా నాస్తికులుగా, విచారవాదులుగా అవుతూ ఆ కారు చీకట్లలోని ఒంటరితనంలో హృదయంలో దాగిన సుషుప్త భావనల్ని గుర్తుకు తెచ్చుకొంటున్నప్పుడు మరో పార్శ్వంలో దెయ్యాలు ఉంటవేమో అనే అనుమాన పకక్షులుగా మారుతున్నాం కదా!

మా సంగీత మేష్టారు వీణలోని ప్రభేదాల్ని చెప్తూ సరస్వతివీణ, రుద్రవీణ, గోటువాద్యం, విచిత్రవీణ మొదలైనవాట్ని ప్రస్తావించి చివరిగా కిన్నెరవీణ అనేది ఒకటి ఉంటదని, గద్దలకు ఉండే ఎముకల్నుంచి తయారు చేసిన దీన్ని మ్రోగించితే ‘మోహిని దెయ్యం’ ఎక్కడున్నా శీఘ్రమే వచ్చి నర్తిస్తదని చెప్పారు. అప్పట్నుంచి మొదలైంది మాకు వారికీ దెయ్యం గురించి వివాదం. భారతీయ సంగీతంకూ… దైవభక్తి, మూఢ నమ్మకం, దెయ్యం, భూతం… వీటి నడుమ ఏదైనా నికట సంబంధం ఉందో ఏమో! ఎందుకంటే నేను చూచిన ఎంతోమంది సంగీత మాష్టార్లు ఈ విధంలోని సంగీతం గురించి నమ్మలేని కట్టు కథల్ని చెప్పి రోమాంచనం కల్గించేదాన్లో నిపుణులు కదా! బర్కతుల్లాఖాన్‌ సితార నుంచి దీపక రాగంలోని ఆలాపన ఆరంభించిన తక్షణమే ఆస్థానంలోని కుర్చీకి నిప్పు అంటుకొందని, కరీంఖాన్‌సాబ్‌ మల్హార్‌ రాగం పాడుతుండగా వాన వచ్చి జల ప్రళయమే అయ్యిందని, అల్లాదియాఖాన్‌ సాబ్‌ సరోద్‌ వాద్యం నుంచి ఆడాణ రాగం ఆరంభించిన తక్షణమే వారి సరోద్‌ వాద్య పరికరం విస్పోటనమైందని…. ఇలాగున ఒకటొకటి కట్టుకథలు చెలామణిలో ఉన్నవి కదా! చివర చివరికి వీట్నుంచి మాకు సంగీతం మీద ఆసక్తి రేకెత్తేది బదులుగా దెయ్యం, పిశాచాలగురించే ఆసక్తి కల్గి మా విద్యాభ్యాసంకు ఏ సంబంధమూ లేని దెయ్యాల అన్వేషణకని రాత్రివేళ ఊరి బయట ఉండే స్మశానంలో వామాచారులన్నట్లుగా కాలం గడపాల్సి వచ్చింది కదా.
                                                                     *****

మేము ఊర్లోకి తిరిగి వచ్చినప్పుడు గూర్ఖా కర్రనుంచి కరెంట్‌ స్థంభాన్ని మొట్టుతున్నాడు. మమ్మల్ని చూసి ”కౌన్‌ హై” అంటూ ఏవేవో మాటల్ని హింది భాషలో గొణుగుతూ గదిరించాడు. ఊర్లోకి మేము చేరుతుండగా మా భావనలలోని యోచనాలలో మార్పులు కలగసాగినవి. స్మశానంలోని మృత కళేబరాల గంభీరజగత్తునుంచి మరలా గలిబిలిగా ఉండే పరిచితమైన జీవన్మయ జగత్తుకు వచ్చినట్లుగా అన్పించి మా విచార శక్తిలోని చైతన్యాలు జాగృతం కాసాగినవి. స్మశానంలో మాకు కొద్దిగానైనా భయం కాలేదని చూపించేందుకు దెయ్యం మీద తాత్సారంగా మాట్లాడు కోసాగాం. ఒక అర్థంలో దెయ్యం ఉందని, అయితే దాన్ని మేము కేర్‌ చేసేదే లేదన్నట్లుగా మా మాటల ధోరణి ఉంది కదా!

”చూడండి… దెయ్యమైతే ఉందిలే! అయితే స్మశానంలో కాదు” అన్నాడు షా.
”అలాగైతే ఊర్లో ఉంటవని అంటారా?”
”అక్కడా కాదు”
”అలాగంటే”
”మన తలలలోనే అండి”
”మన తలలలో ఉండేది మెదడు కదా…”

”కరెక్ట్‌! దాన్లోపలే దెయ్యం ఉంటది. మొన్న తనంతతనుగానే ఈ విషయం నాకు తెల్సి వచ్చింది. రాత్రి ఒక్కడ్నే సైకిల్‌ తొక్కుతూ వస్తున్నా! రాత్రి సుమారు పదిగంటలు! సుయ్యో అన్నట్లుగా ఈత వనాల్నుంచి గాలి వీస్తుంది.

అప్పటికప్పుడే అలాగే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడొక దెయ్యం నా సైకిల్‌ క్యారేజ్‌ మీద కూర్చుంటే అని. నేను ఎంతగా ఆ కల్పనను విరోధించినా దాన్నుంచి తప్పించుకొనేందుకు సాధ్యం కాలేదు. ఆ దెయ్యం తలకు వేసుకొన్న ముసుగు తీసేసి బయటకు రానే వచ్చింది. నిధానంగా నా క్యారేజ్‌ మీద ఎవరో కూర్చున్న తూకం పడసాగింది. అది అటు ఇటు కదుల్తూ నా సైకిల్‌ బ్యాలెన్స్‌ ఏరుపేరైనట్లుగా చేయసాగింది. నాలో వెనుదిరిగి చూసేందుకు భయం ఉంది. చూసినప్పుడు అది కూర్చొని ఉంటే ఏమి చేయగలం? వెనక్కి సైతం తిరగకనే మణుగుమణుగుల బరువుతో ఉన్న ఆ దరిద్ర దెయ్యాన్ని కూర్చోబెట్టుకొని చెమట కార్చుతూ ఎత్తులో సైకిల్‌ తొక్కుతున్నోడిలాగ తొక్కానండి! నేను దాని బరువుకూ, అటు ఇటు అది కదిలే దాన్కి బెదరనిది చూసిన ఆ దెయ్యం అప్పుడేమి చేసిందో చెప్పనా! చెమటకార్చుతూ పళ్ళ బిగువున సైకిల్‌ తొక్కుతుంటే నా చంక వెనుక చక్కిలిగిలి చేసేది మొదలు పెట్టింది. చూడండి ఎలాగుందో ఆ దెయ్యం పీడ! ఇక మాత్రం సాధ్యంకాదు దాని చేష్ట భరించేది అని అన్పించింది. క్యారేజ్‌ మీద కూర్చుని ఏదో మన సినిమాలలో చూపిస్తుండే సన్నివేశంలాగ ప్రియురాలు ప్రియరమణుడికి చక్కిలిగిలి పెట్తున్నట్లుగా ఉంటే ఎలాగున నేను సైకిల్‌ తొక్కేది? బ్రేక్‌ వేసి సైకిల్‌ నుంచి ఎగిరి కిందకు దూకాను” అంటూ షా తనకైన దుఃస్వప్నం లాంటి అనుభవం ఒక దాన్ని చెప్పారు.
”దెయ్యం అప్పుడేమి చేసింది?”
”ఎక్కడ దెయ్యం? దెయ్యం మరిక నా తలలోపలకు వెళ్ళి మాయమైంది. ఆ తర్వాత ఈ గొడవే వద్దనుకొని సైకిల్‌ నెట్టుకొంటూ బయల్దేరాను. సైకిల్‌ ఎక్కితే మరలా అది గ్యారంటీగా క్యారేజ్‌ మీదకు వచ్చేదుంది.”
మనిషిలోని మనః శక్తి మీద అపారమైన సాధ్యతల్ని నాకు వివరించి భయాన్ని కల్గించాడు షా. నేను ఒకరోజు రాత్రి ఒక్కడ్నే అద్దంలో చూస్తూ నిలబడ్డాను. అప్పటికప్పుడు నేను నవ్వకనే ఉన్నా అద్దంలో నా ప్రతిబింబం నవ్వితే అనేది అన్పించగా భయం కలగసాగింది. అద్దంలో ఉన్న నా ప్రతిబింబం ఇంకేంటి నవ్వే తీరుతది అని అన్పించి దిగులై అద్దంనుంచి దూరంగా జరిగాను. షా చెపుతుంది ఒక విధంలో నిజమేనని అన్పించింది.

ఊర్లోని వీధిలో నడుస్తున్నాం. ఇదెంతటి అక్షయ రోడ్‌! దారి సాగేదే లేదు మానుంచి అని అనుకొంటున్నాను. తెల్లారేది లేదన్నట్లుగా ఆ చీకటికి అంతమే లేనట్లుగా కనబడుతుంది. వీధి దీపాల మంద వెలుగు ఒకటే కొంచెం ధైర్యాన్ని ఇస్తున్న సంకేతంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు సప్పుళ్ళు లేనట్లుగా స్తబ్దుగా పడి యున్నవి. బహుశః అందరూ కలలను కంటుండొచ్చు.! లేకపోతే నేనే కలకంటున్నానా? ఖాళి రోడ్‌, సప్పుళ్ళే లేని ఇళ్ళు, తల భాగంను అస్తవ్యస్తంగా వాల్చిన వృక్షాలు? ఏది ఉండొచ్చు కలగా నాలో? వీధి దీపం వెలుగుకు గోడ మీద పడుతున్న మా నీడ ఆ దారిమీద పడుతూ, గోడమీద మరలా పడిలేస్తూ చెట్టుమీద చెంగు చెంగునే ఎక్కుతూ దిగుతూ, మేమునడుస్తుంటే ఆ నీడ వికటనృత్యం చేస్తుంది. అలాగే మా నీడను మేము చూడాలని అనుకొంటుండగా మరొక చిన్న నీడ మా నీడ వెనకే వస్తుంది కనబడింది.

”అరే! ఇదేంటిది?” అనుకొంటూ మేమిద్దరం వెనుదిరిగి చూసాం. గజ్జిపట్టిన చిన్న కుక్కపిల్ల అది!.
మమ్మల్ని చూసి స్నేహంతో ఉంటానన్నట్లుగా తోక ఆడిస్తూ పటపటగా ఒకసారి వళ్ళు విరుచుకొంది. దానివంటినుంచి ఒక చిన్న బూడిదరాశి పొగ బయటపడి గాలిలో లీనమైంది.

”స్మశానంలో నిద్రపోతుంది ఈ కుక్కే అది కదా!” అన్నాడు షా. ”చి ఛీ నడవండి వేగంగా” అంటూ నేను జోరుచేసి రాయి తీసుకొనేవాడిలాగ వంగాను. కుక్కపిల్ల పారిపోయి చీకటిలో మాయమైంది.

”ఇదెప్పుడు మనల్ని అనుసరించి వచ్చింది?” అంటూ షా ఆశ్చర్యపడ్డాడు. అది మా ఇద్దరికీ కనబడినందున అది మాలో ఎవరో ఒకరి మనస్సులోని భ్రాంతి కాదని మాకు కచ్చితమైంది.
”పాడు ముండాకొడుకులు! చిన్న పోరలు చేస్తుండే పని ఇది. కుక్కపిల్లలు నెలల వయస్సులో ముద్దు ముద్దుగా ఉంటవి. మోజుపడి ఇళ్ళకు తీసుకెళ్ళి కొన్నిరోజులు సాకి ఆ తర్వాత గజ్జి గిజ్జి తగిలితే ఇంటినుంచి బయటకు పారద్రోలుతారు. అప్పుడవి కంత్రి కుక్కలుగా మారి ఊరి వీధులలో తిరుగుతూ ఉంటవి” అంటూ ఆ కుక్కపిల్ల మాజి యజమానికి శాపం పెట్టాడు షా.

మేము మాట్లాడుకొంటూ ముందుకే నడుస్తున్నాం. అయినా మాలో అనుమానం ఒకటుంది! మేము ఎవర్నుంచి వెంబడించ బడుతున్నాం అనేది మాలో ఉంది. ఒక మలుపులో వెనక్కి తిరిగి చూడగా మా కాళ్ళక్రిందే నిలబడింది ఆ కుక్కపిల్ల.

”టామీనో, టైగరో… అనేవి దీనికి పేర్లై ఉండొచ్చు కదండి! దాని పేరు పెట్టి పారద్రోలండి… పారిపోతది” అని నేను షాకు చెప్పాను. ”టామి కాదు టైగర్‌ కాదు! దాని పేరు డెత్‌; సావు; మృత్యువు కదా! అందుకే అది స్మశానంలో రాజ్యమేలుతుంది. దాన్ని ఇప్పుడు ఊరి లోపలికి తీసుకొచ్చి తప్పు చేసాం” అన్నాడు షా.
”మీరు చెప్పేది అటుండనీయండి. ఈ కుక్క పిల్ల ఇప్పుడు మనల్ని అనుసరిస్తూ వస్తుంది కదా”
”ధర్మరాజు పరలోకంకు వెళ్తుండగా అతని వెనుక ఒక గజ్జికుక్క వెంబడించి వెళ్ళిందట. దాని సంతానమే కదా ఇది” అన్నాడు షా.

ఇంతటి అమావాస్య రాత్రిలో నిర్జీవమైన దారిలో నడుస్తూ షా అపశకునమైన జోకుల్ని వేస్తుంది నాకు మంచిగా కానరాలేదు. ఈ దరిద్ర కుక్కపిల్ల సాహసమే వద్దని నిర్ధరించుకొని అక్కడే లైటు స్థంభం పక్కనున్న డస్ట్‌బిన్‌ (కసువుతొట్టి) లోపలికి దాన్ని విసిరాను. వేగం వేగంగా దూరంకు సాగి, అది ఆ డస్ట్‌బిన్‌ నుంచి బయటపడి మరలా ఏమైనా మమ్మల్ని వెంబడిస్తుందేమోనని చూసాం. కుక్కపిల్ల కుంయ్‌ కుంయ్‌ అంటూ కసువు తొట్టిని ఎక్కాలని ప్రయత్నిస్తుంది. అది బయటకు వచ్చేలోపే మేము మరింత దూరంకు వెళ్ళిపోదామని పోస్టాఫీసు వరకూ పరిగెత్తాం. అలుపు వచ్చింది. విశ్రాంతి చేసుకొంటూ వెనక్కి చూసాం! మానుంచి ఐదో వీధి లైటు వెలుతురులో కుక్కపిల్ల పరిగెత్తుకొంటూ వస్తుంది కనబడింది. దాన్ని భయపెట్టి పారద్రోలో లేకపోతే మేమే పారిపోయి దాన్నుంచి తప్పించుకొనేది సాధ్యంకాదని మాకు అన్పించింది.

”మనం స్మశానంకు వెళ్ళకుండా ఉండాల్సింది. ఈ కుక్కపిల్ల పీడనుంచి ఒకసారి తప్పించుకొనేది వీలుకానట్లుంది” అని నేను గొణిగాను.
”దెయ్యమే గజ్జి కుక్కపిల్లగా వేషం చేసుకొని అక్కడ ఆ స్మశానంలో పడుకొందని అనుకొంటున్నానండి” అన్నాడు షా.

”మీరు చెప్పేదంతా నవీన కాలంలోని సాహిత్య రచన అన్నట్లుగా ఉంటదండి. సరిగా తార్ఖికంగా వైజ్ఞానికంగా ఆలోచించండి. దీని పేరు డెత్‌ కాదూ చావూ కాదు. కేవలం ఇదొక చిన్న కుక్కపిల్ల మాత్రమే! దానికి తిండి పెట్టి పోషించే యజమాని అవసరం ఉంది. అందుకే అది మన వెనకబడింది. దీన్ని ఎలాగైనావదిలించుకొనే ఉపాయం చేయండి. ఒకసారి దీని మూతి చూడండి! కుక్క పిల్లే అని చెప్పేందుకు కుదురుతదా? ఒక మంచి గుంటనక్క తరహాలో ఉంది. చిత్తకార్తెలో స్వజాతి ప్రాణి దొరకనందున కుక్కకూ నక్కకూ మైథున క్రీడ జరిగి పుట్టియుండొచ్చు ఇది” అంటూ నాలో ఉద్భవించిన అసహనం నుంచి గొణిగాను.

”ఒక నిమిషం ఆగండి. నా కొక ఉపాయం తట్టింది” అంటూ షా కుక్క పిల్లను పట్టేందుకు దూసుకెళ్ళాడు. అదేమో మరలా తనను కసువు తొట్టిలో విసిరి పడేస్తారేమో అని భావించి దూరంగా పారిపోయింది. అయితే మేము ముందు కెళ్తున్న తక్షణమే మమ్మల్ని అనుసరిస్తూ వస్తుంది. మరలా దాన్ని పట్టుకొనేందుకు షా వెళ్ళగా అది దూరంగా పారిపోతుంది.

దాన్ని పట్టేందుకని ప్రయత్నించి విఫలుడైన షాకు అలుపొచ్చి, ”చూడండి దీన్ని. ఇది గ్యారెంటీగా డెత్తే కదండి! స్మశానంలో ఉండే పిశాచమే ఇది. రాతమూలంగా రాసిస్తాను అది ఏంటోనని కావాలంటే! యువతి వేషం ధరించి మన వద్దకు వస్తే డేంజర్‌గా భావించి గజ్జి కుక్కపిల్ల వేషం ధరించి మన వద్దకు వచ్చింది” అని తిట్టసాగాడు షా.

ఆ తర్వాత ఆ కుక్కపిల్లను పట్టుకొని పారద్రోలే ప్రయత్నాన్ని విరమించుకొన్న షా, చేతివేళ్ళ నుంచి చిటికెలేస్తూ, ప్రేమగా అభినయిస్తూ దాన్ని పిల్చాడు మాయల పకీర్‌లాగ. అప్పుడు మాత్రం షా లోని విశ్వాసపూరితమైన నాటక అభినయంకు మోసపోయి దగ్గరకు వచ్చింది ఆ కుక్కపిల్ల. షా దభాల్నే దాని గొంతు దగ్గర ఉన్న చర్మం పట్టుకొని దాన్ని ఎత్తి పక్కనున్న ఇంటి వద్దకు తీసుకెళ్ళారు. కాంపౌండ్‌ ఉన్న ఇల్లు అక్కడ అది ఒకటే ఉంది. ఆ కాంపౌండ్‌ లోపలకు సప్పుడు కానట్లుగా దాన్ని వదిలి పెట్టి చేతుల్ని దులుపుకొన్నారు. అప్పటికి ఇక మాకు విసిరిన కట్టెనుంచి తప్పించుకొన్నాం అనేంతగా సమాధానమైంది. మాకు పట్టిన శని వేరెవరికో దాటించినట్లుగా సంతోషమైంది.

మేము అక్కడ్నుంచి నాలుగంటే నాలుగు అడుగులు నడవలేదు. కుక్కపిల్ల కాంపౌండ్‌ లోపల్నుంచి కుంయ్‌ కుంయ్‌ అంటూ లయబద్ధంగా అరుస్తుంది. ”ఎవరది” అంటూ ఇంట్లోంచి ఎవరో గడుసు కంఠంనుంచి అరిచాడు. మేముకొంచం దూరం జరిగి చీకటిమాటున నిలబడి ముందేమౌతదో అని చూసాం. కుక్కపిల్ల కుంయ్‌ కుంయ్‌ అంటూ భజనను ముందుకే సాగించింది. ఇంటిలోపలి దీపాలు వెలిగినవి. ఎలుగుబంటులాగ వళ్ళంతా రోమాలమయమైన నల్లటి వ్యక్తి ఒకరు నిద్రాదేవి జోరుకు తూలుకొంటూ బయటకొచ్చి వాకిలి వద్ద లొల్లి పెడ్తున్న కుక్కపిల్లను కసువు పోగు అన్నట్లుగా ఎత్తి బయటకు విసిరి సరసరా లోపలికి నడిచి వెళ్ళాడు.

దీపం ఆరింది. కుక్కపిల్ల పరిగెత్తుకొని మరలా మా వద్దకు వచ్చి తోక ఊపింది. అప్పుడు మేమిద్దరం పరస్పరంగా ముఖాల్ని చూసుకొన్నాం.

”ఎవరండి అతను?” అడిగాను నేను. ”ఎవడో యమధూతై ఉండొచ్చేమో కదండి! కొద్దిగా నిధానించండి… ఒక తమాషా చేస్తాను” అంటూ షా మరలా కుక్కపిల్లను ఎత్తికెళ్ళి ఆ ఇంటి కాంపౌండ్‌ లోపల వదిలి వేగం వేగంగా వచ్చి చేరాడు నేను నిల్చిన చోటుకు.

మరలా అదే గడుసుధ్వనిలోని అదే ఘర్జన వినబడింది. కుక్క పిల్లను గేట్‌ బయటకు విసిరి లోపలికి వెళ్తున్నోడు బయటకొచ్చి గేటును తెరిచే వెళ్ళాడు. బహుశః చుట్టూ ఉన్న ఇళ్ళలాగనే తనకూ కాంపౌండ్‌ లేకుంటే బాగుండేదేమో అని అతనికి అన్పించి ఉండొచ్చు. కుక్కపిల్ల పరిగెత్తుకొని వచ్చి మా చెంత నిలిచింది.

”ఇది మరణ శునకం కదండి! పిశాచమే ఇది! ఇప్పుడైనా తెల్సిందా మీకు” అంటూ షా మరలా దాన్ని పట్టుకొని అతని ఇంటివైపుకే నడిచాడు. కుక్కపిల్లను మరలా లోనే పడేసి ఆ ఇంటి యజమాని తెరిచి ఉంచిన గేటును మూసేసి పరిగెత్తుకొని వచ్చి నా చాటుకు చేరాడు.

ఈసారి నాకు నిజంగా భయమేసింది. ఎప్పడూ మృదు హృదయంతో వినోద ప్రియుడిగా ఉండే షా ఇప్పుడెందుకు ఇంత క్రూర వినోదంలో నిమగ్నమైయ్యాడు? అనేది నా మదిని తొలుస్తుంది. అయితే ఇకముందు జరగబోయే దాన్ని చూడాలనే కుతూహలం నన్ను మంత్రం మంత్రించినట్లుగా అక్కడే నిల్పింది. మరలా కుక్కపిల్ల నుంచి సప్పుడు ఆరంభమైంది. ఈ సారి ఆ ఎలుగు గొడ్డు లాంటి ఆ మనిషిలో సహనం పూర్తిగా నాశనమైందని నాకు కనబడసాగింది. ధడార్‌ ధడార్‌ అన్నట్లుగా ఇంట్లో తలుపులన్నిట్నీ తెరిచి బయటకు వస్తున్న అతడ్ని చూసాం. అతను బడిత కర్రతోపాటుగా బయటకొచ్చిన తక్షణమే మాలో ఉన్న ఝంగాబలమే నశించి వణుకు ఆరంభమైంది. మూసిన గేటును చూసి ధడాల్నే దాన్ని తెరిచాడు. అతని చేతిలో ఉన్న బడితకర్రను చూసి ఎక్కడో ఒక మూలలో దాక్కొన్న కుక్కపిల్ల, అతను అటు ఇటు భాద్యతగా చూపుల్ని విసురుతుండగా గోడసందు నుంచి దూరి చీకట్లో చీకటిగా మారి మా వద్దకు చేరి నిలిచింది. ఆ ఇంటి యజమాని బడితకర్ర ఊపుతూ తన ఇంటి జాగాన్నంతా పరీక్షగా చూసాడు. నాకైతే ఇతను ఈ ఒకసారి ఇంటిలోపలికి వెళ్తే చాలయ్యా అన్నట్లుగా అన్పించింది. అయితే ఆ ఇంటి యజమాని గేట్‌వద్దే నిలబడి ఆలోచించసాగాడు. అతనికీ ఇది పిశాచం పనే అన్నట్లుగా అనుమానం వచ్చిందేమో కదా!

అయితే అతనికేదో మరో అనుమానం ఉన్నట్లుంది. దెయ్యం చేష్టే ఇది అని నమ్మేందుకు సంశయం ఉంది అతనిలో. ఈ పని వెనుక ఏదో బుద్ధివంతిక ఉందనే అనుమానం! గేట్‌ వేసిన అతను లోపలికి వెళ్ళకనే గేట్‌మీదే తల వాల్చుకొని వేచి చూడసాగాడు.

డెత్‌ మా ఎదురు కారుచీకటిలో చీకటిగా మారి తోక ఊపుతూ నిలబడింది. మేము అటు ఇటు కదిలాడేది లేదు. ఆ ఎలుగుబంటు మనిషికి కొద్దిగా జాడ దొరికినా చాలు మా తల పగలకొట్తాడు. సమాధుల లోపల పూడ్చిన శవాల తరహాగా ఆ అమావాస్య చీకటిలో కదలక మెదలకనే నిలబడ్డాం. అయితే ఎంతసేపు నిలబడగలం. ఆ ఎలుగుబంటు మనిషి సూర్యోదయం వరకూ నిలబడి ఉండేందుకు తయారై ఉంటే, ఓరి నాయనో మా గతేంటి?

”ఇదంతా మీ నుంచే అయ్యిందండి… చూడండి ఎంత కష్టాన్ని తెచ్చిపెట్టారో” అంటూ మెల్లగా షాను శపించాను.

”నానుంచే ఎలాగండి, ఈ పిశాచి ముండ (కుక్కపిల్ల) ఉందని, దీన్ని మీరే ఎలాగైనా పారద్రోలమని చెప్పారు కదా నాతో! నిధానించి చూద్దాం… ఎంతవరకు నిలబడుతాడో… అతనికీ నిద్రరాదా?” అన్నాడు షా. పంచె ధరించిన ఆ ఎలుగుబంటు మనిషి లోపలికి వెళ్తాడేమోనని ఎదురుచూస్తూ నిలబడ్డాం. ఎంతోసేపైనా ఆ మానవుడు కదలకనే స్థాణువై నిలబడి ఉన్నాడు. అతను ఉన్నప్పుడే ఇక్కడ్నుంచి తప్పించుకొని పారిపోయేది ఎలాగని ఒకసారి యోచించాను. అయితే ఆ ఎలుగుబంటు మనిషి మాకన్నా వేగంగా పరిగెత్తే వాడైతే? అతను విసిరే బడితకర్రలోని ఒక వేటు చాలు… మేము వదిలివచ్చిన స్మశానంకు వాపస్సైయ్యేందుకు!

అతను ఎంతసేపైనా కదలక మెదలకనే గేటుకు ఒరిగికొని నిలబడినదాన్ని చూసిన షాకు అనుమానం ఆరంభమైంది.

”అతను అక్కడే నిద్రపోయేందుకు ప్రయత్నించినట్లుంది. లేకపోతే నర మానవులకు ఇంతసేపు ఆ భంగిమలోనే నిలబడేందుకు ఎలాగున సాధ్యపడుతదండి?” అన్నాడు షా.

ఏమి చేయాలనేది నాకు తోచలేదు. నిలబడి నిలబడి నా కాళ్ళు నెప్పట్టుతున్నవి. కుక్కపిల్లకూ నిలబడి నిలబడి విసుగేసినట్లుగా కనబడుతుందో లేకపోతే మాకన్నా ఆ ఎలుగుబంటు మనిషే మంచివాడేమో అని దానికి అన్పించిందో లేకపోతే మేము ఇక్కడ దొంగలలాగ నిలబడ్డామని ఆ ఎలుగు బంటు మనిషికి మా జాడ తెల్పాలనుకుందో ఏమో… మెల్లగా అతనున్న వైపుకు తిరిగి అతని వద్దకు అడుగుల్ని వేయసాగింది. మాకు ఇక పరిగెత్తాలో నిలబడాలో ఏమి తెల్వనట్లుగా భయం కలిగింది. ఆ ఎలుగుబంటు బడితకర్ర నుంచి ఒకే దెబ్బకు ఆ కుక్కపిల్లను యమలోకంకు పంపేదాన్ని ఊహిస్తూ నిలబడ్డాం. కుక్కపిల్ల అతని ముందుకు వెళ్ళి ఆగింది. నిద్రకు శరణమైనట్లుగా ఉన్న అతని దేహంలో ఏ కదలిక కనబడనే లేదు. అతని చేతిలో ఉన్న బడితకర్ర కిందున్న బండమీద పడిన సప్పుడైంది. అప్పటికప్పుడే అతని దేహం ఆ గేటుకున్న తలుపు ముందు వేసిన నాపరాయి మీద బారుగా దభీల్నే పడింది. డెత్‌ (కుక్కపిల్ల) అతడ్ని దాటుకొని నిర్భయంగా అతని ఇంటిలోపలికి వెళ్ళింది.

అతనేమైనా నిద్రకు జారాడో! మూర్ఛపోయాడో!! లేకపోతే చనిపోయాడో!!! ఇంటిలోపలినుంచి ఆ కుక్కపిల్లను పారద్రోలుతూ ఇంటి పరివారం బయటకొచ్చి అతడ్ని చూసేలోపే, ఆ స్మశానంలోని పిశాచి (కుక్కపిల్ల) వెనుదిరిగి మాచెంతకొచ్చేలోపే, సూర్యోదయం అయ్యే ముందే మేము అక్కడ్నుంచి పారిపోయే అవసరం ఉంది.

ఆ కారుచీకట్లో సావు భయం నుంచి పారిపోతున్నోళ్ళలాగ మేమిద్దరం గోడదూకి పారిపోయాం.

                                                       -శాఖమూరు రామగోపాల్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో