మేకోపాఖ్యానం 7- ఆడపిల్ల బాల్యానికి భరోసా కావాలి -వి. శాంతి ప్రబోధ

సన్నని చిరు జల్లులు పడుతున్నాయి. గబగబా వచ్చి పొడిగా ఉన్న ప్రదేశం చూసి మర్రిచెట్టు కింద చేరింది గాడిద. అప్పటికే మేకల జంట, కుక్క, మరి కొన్ని జీవాలు అక్కడ చేరాయి.

కాస్త తడిచిందేమో “ఛీ ఛీ ….. ఈ వానాకాలం ఎప్పుడు పోతుందో ..అంతా బురద బురద అయిపోయింది” ఒళ్ళు విదుల్చుకుంటూ అరిచింది గాడిద మేకల జంట నవ్వుతూ మొహాలు చూసుకున్నాయి.
వానాకాలం వానలు పడక ఎండలు కాస్తాయా .. నిన్నటి వరకు ఎండల్ని తిట్టిపోశావు .. ఇప్పుడు వానల్ని ఆడిపోసుకుంటున్నావు ‘ వెటకారంగా కుక్క అన్నది

అదేమీ పట్టించుకోని గాడిద తమని దాటి ముందుకు మోటార్ సైకిల్ పై వెళుతున్న వాళ్ళని చూస్తూ ” ఇంతకీ ఏం చేశారో .. ” ఆరాగా అన్నది
అర్థం కానట్లు చూసింది మేకల జంట.

” ఇప్పటికే జలుబు ఇక వాన చినుకుల్లో తడిస్తే ఏమవుతుందో నని వచ్చేశా గానీ .. ” గాడిద
“అస్సలు నువ్వేమంటున్నావో నీకేమైనా అర్ధమవుతుందా..” అడిగింది కుక్క.

” ఆ మూల ఉంది చూడు.. ఆ ఇంటి పిల్లల పెళ్లి వచ్చే వారమే. పెళ్లి ఆపేయమని వాళ్ళ ఇంటికి ఆ బైక్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళ మీదకి ఎగబడ్డారు. మాకు కూడు గుడ్డ లేకపోతే ఒక్కడు మొకం చూడడు గానీ .. శుభమాని పెళ్లి చెయ్యబోతే ఆపుతారా..?

అయినా మీరెవరు మా ఇంట్లో పెళ్లి ఆపడానికి? మా పిల్లలు. మా ఇష్టం అంటూ పెద్ద లొల్లి చేస్తున్నారు. చివరాఖరికి ఏం చేశారో.?! ” అన్నది గాడిద.

“పదకొండేళ్ల పిల్లకి పెళ్లంటే ఒప్పుకోరు కదా.. పోయిన నెలలో ఆ చివరి వాడలో అలాగే ఓ పెళ్లి ఆపారు. వాళ్ళు చైల్డ్ లైన్ నుంచి వచ్చారట. పెళ్లి కూతురికి ఆ పెళ్లి ఇష్టమేనట. ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆ తర్వాత పిల్ల తల్లిదండ్రులకు, పెళ్లి పిల్లవాడి తల్లిదండ్రులకు, పెళ్లి మాటలు చేసిన ఇతర పెద్దలందరికీ పిల్లలకు పెళ్లి చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.

చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006 కింద పెళ్లి చేయడం నేరమట. అందుకే 18 లోపు పిల్లలకు పెళ్లి చేయమని చెప్పి స్టాంప్ కాగితం పై సంతకాలు తీసుకున్నారు .

ఆ తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉందో ఫాలో అప్ వచ్చి చూస్తున్నారు. లేదా ఫోన్ కాల్ చేస్తున్నారు. ఆ పిల్ల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు.

ఓ సారి ఆ పిల్ల ఏం చెప్పిందో ఏమో..! ఆ అమ్మాయిని వాళ్ళతో తీసుకుపోయారు. జిల్లా కేంద్రంలో ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టారు. అక్కడ ఆమె చదువుకుంటున్నదట” తనకు తెలిసిన విషయం చెప్పింది కుక్క.

మేకల జంట, గాడిద ఆ మాటల్ని శ్రద్దగా విన్నాయి. అంతలో ముందుకు వెళ్లిన మోటార్ సైకిల్ వెనక్కి వచ్చి చెట్టు కింద ఆగింది. అక్కడ సేద తీరుతున్న జీవులన్నీ నిశ్శబ్ద మయ్యాయి.

“ఆ కుటుంబ పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. మహమ్మారి పుణ్యమాని పెద్దలకి చేతిలో పని లేదు. పిల్లలకు బడులు మూసేసారు. మధ్యాహ్న భోజనం లేదు. ఓ పూటైనా కడుపునిండా తిండి తినే వారు. ఇప్పుడు అది కరువైంది. వారి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది.

దానికి తోడు కరోనా ఎప్పుడు ఎవరిని తీసుకు పోతుందో తెలియని పరిస్థితి. దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టు తాను ఉండగా పెళ్లి చేసేయాలని, ఆడపిల్ల పెళ్లి చేసి బరువు దించు కుందాం అనే ధోరణి పెరిగిపోయింది” అన్నాడు మోటార్ సైకిల్ వెనక కూర్చున్న వ్యక్తి.

“మీరు ఏమైనా అనుకోండి సర్. 14 ఏళ్ల పెద్ద పిల్లకి పెళ్లి చేయడమే నేరం అంటే 11 ఏళ్ల రెండో పిల్లకి కూడా పెళ్లి చేయాలనుకోవడం మరీ అన్యాయం.. ” ముందు కూర్చున్న వ్యక్తి తల మీది హెల్మెట్ తీసి తడి తుడుస్తూ.

“నిజమే, మన దృష్టిలో బాల్య వివాహం నేరం. కానీ వాళ్ళ దృష్టిలో కాదు. వెళ్లిన చోట బిడ్డకు అంత ముద్ద దొరుకుతుందనో, పెళ్లి ఖర్చు కలిసొస్తుందనో ఆశ.

కట్నం అడగలేదనో, ప్రేమ పేరుతో ఎవరితో వెళ్ళిపోతారోనని భయమో.. ఇరుగుపొరుగుల ప్రోద్భలమో, పేదరికమో, చదువులేని తనమో, చిన్న వయసులో పెళ్లి చేయడం నేరమని తెలియకపోవడమో, ఇవన్నీ కలిసో వాళ్ళ నిర్ణయానికి కారణం అయి ఉండొచ్చు’ అన్నాడు వెనక కూర్చున్న వ్యక్తి బండి దిగుతూ ..

“మగపిల్లల్ని బడి మాన్పించి పనిలో పెడుతున్నారు. ఆ విషయం పట్టించుకో రెందుకో” పక్కనున్న కుక్క కేసి చూస్తూ గొణిగింది గాడిద.

అదేమీ పట్టించుకోని కుక్క చెవిన పడుతున్న మాటల పై దృష్టి పెట్టింది.
“చిన్న పిల్ల చురుకైనది సార్. లేకపోతే పెళ్లి ఇష్టం లేదని కాపాడమని 1098 కి ఎందుకు ఫోన్ చేస్తుంది” అన్నాడు మొదటి వ్యక్తి బండి దిగకుండానే .
“అవునోయ్చదివిస్తే పైకి వస్తుంది” అన్నాడు రెండవ వ్యక్తి జేబులోంచి దస్తీ తీస్తూ

‘వీళ్ళు చైల్డ్ లైన్ వాళ్లే ..అందుకే పెళ్లి ఆగిపోయింది” గుసగుసగా చెప్పింది కుక్క

“చైల్డ్ లైన్ వచ్చింది. పెళ్లి ఆగిపోయింది. కుటుంబ సభ్యుల్ని కౌన్సిలింగ్ చేశారు. పిల్ల పెద్దయి ఆమె పెళ్లి వయసు వచ్చాకే ఆమెకు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తామని సంతకం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. నాలుగు రోజులాగి పెళ్లి చేస్తే ఎవరేమి చేయగలరు?” ఆడమేక ప్రశ్న

“నిజమే, చేస్తే చేసేయ్యొచ్చు. కరోనా నిబంధనల సమయంలో పెళ్లి చేస్తే పెళ్లి ఖర్చు తక్కువ. తూతూమంత్రంగా పెళ్లి చేసి బరువు దించేసుకోవచ్చని ఆ తల్లిదండ్రులు అనుకుంటే..” మగమేక

“పైకి చదవాలనుకున్న ఆడపిల్లల ఆశలు గాలిలో కలిసిపోతున్నాయి. వారి హక్కులు ముక్కలు అయిపోతున్నాయి..

ఆన్ లైన్ క్లాసుల వల్ల పిల్లలకు అవసరమైన స్మార్ట్ ఫోన్ కొనివ్వలేక బడి మాన్పించేసారు కొందరు. కొన్ని సార్లు పిల్లలే ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. పెద్దల నిర్ణయాలు పెద్దలు చేసేస్తున్నారు. మొత్తం మీద బాల్యం ఆవిరై పోతున్నది” ఆవేదనతో మొదటి వ్యక్తి

“పెళ్లి వయసు 18 నుంచి 21 కి పెంచారు. ఏం లాభం ?'” పెదవి విరిచాడు రెండో వ్యక్తి .

“ప్రపంచంలో చిన్నారి పెళ్లికూతుర్లు అత్యధికంగా ఉన్న దేశం మనది , ప్రపంచంలో జరిగే బాల్య వివాహాల్లో మూడొంతులు మనదేశంలోనే అవుతున్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల వాటా తక్కువేమీ కాదు సర్ ” మొదటి వ్యక్తి

అంతలో వర్షం చినుకులు ఆగాయి. “బయలుదేరదామా ..” అన్నాడు రెండో వ్యక్తి

“ప్చ్ .. పాపం.., పేద కూలీ జంట. కర్ఫ్యూ వల్ల, లాక్ డౌన్ వల్ల కూలీ పనులు లేవు. పిల్లలకు బడి తిండి లేదు. రేషన్ కొనడం కష్టమై పోతున్నది.

కుటుంబంలో ఒకరి బరువైన తగ్గించుకోవాలని పెద్ద బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నారు. అందివచ్చిన సంబంధంతో రెండో పిల్లకి కుదుర్చుకున్నారు. వీళ్లు వచ్చి అంతా కింద మీద చేసారు ” సానుభూతిగా అన్నది గాడిద.

“దేశమంతా ఓ పక్క మొదటి వేవ్ పోయి రెండో వేవ్ పాండమిక్ తో సతమతం అయింది. మూడో వేవ్ వస్తుందంటున్నారు. ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. ఇప్పుడు ఈ పెళ్లిళ్లు అవసరమా ..” మూతి మూడు వంకర్లు తిప్పుతూ కుక్క “బాల్య వివాహాలకి పెద్ద ఎత్తున సామాజిక మద్దతు ఉంది. ఆమోదం ఉంది కాబట్టే జరుగుతున్నాయి. పేదరికం, చట్టాల అమలులో నిర్లిప్తత, బలహీనమైన చట్టాలు, కుటుంబంలో పితృస్వామిక కట్టుబాట్లు, పద్ధతులు, జెండర్ అసమానతలు, వివక్ష, ఆడపిల్ల భద్రత (జరగరానిదేమైనా జరుగుతుందేమోనన్న భయం, ఆ తర్వాత పిల్ల పెళ్లి కావడం కష్టం అన్న భావన ) వల్లే ఎవరెన్ని చెప్పినా బాల్యవివాహాలు జరుగుతున్నాయని అనిపిస్తుంది ” అంటూ ఆడమేక కేసి చూసింది మగమేక

“అవును, నువ్వన్నది నిజమే కావచ్చు. అయితే, బాల్యవివాహాల నిరోధానికి ఏళ్ల తరబడి చేస్తున్న కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతూన్నది. పాండమిక్ పరిస్థితులు అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి. ఆడపిల్ల జీవితం పెనం మీంచి పొయ్యిలోకి పడిపోతున్నది ” ఆవేదన పడింది ఆడమేక .పెళ్లి ఆలస్యమైతే ఆడపిల్ల పరిస్థితి ఎట్లా మెరుగవుతుంది ” అన్నది గాడిద. అదేం ప్రశ్న అన్నట్లు చూసింది కుక్క.

“బాల్య వివాహం వల్ల పోషకాహార లోపం, పునరుత్పత్తి ఆరోగ్యం దెబ్బతింటాయి. ఈ బాల్య పెళ్లిళ్లు ఆగాలంటే సమాజంలో సరైన అవగాహన అవసరం. పిల్లలందరూ ఎక్కువ సంఖ్యలో బడిలో అడుగు పెట్టాలి. చదువుకోవాలి. కుటుంబాలు ఆడపిల్ల చదువు ప్రోత్సహించాలి.

18 ఎల్లా తర్వాతే పెళ్లి చేయాలి. సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు పెరగాలి, విద్య ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి. తమకు కావాల్సిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఈ విషయాల్లో బడిలో పిల్లలతో పాటు, తల్లి దండ్రులకు ఆ అవగాహాన పెంచాలి. అప్పుడు కానీ అవి తగ్గుముఖం పట్టవు.
అప్పుడు ఆమె బాల్యానికి భరోసా ఉంటుంది. ఆమె అభివృద్ధి, ఎదుగుదల బాగుంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఆమె పరిస్థితి ఎంతో మెరుగవుతుంది. అండ ఉంటే కొండలు దాటవచ్చు ” అందరి కేసి చూస్తూ ఆడమేక.

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో