జ్ఞాపకం- 61– అంగులూరి అంజనీదేవి

అదిచూసి “సౌండ్ తక్కువగా పెట్టుకుని విను వినీ! ఎవరు పిలిచినా నీకు వినిపిస్తుంది. ఇలా అయితే వినిపించదు” అని ఎన్నోసార్లు నచ్చచెప్పాడు.

యాక్సిడెంట్ కాకముందు నడిచేవాడు కాబట్టి దగ్గరకి వెళ్లి చెవులకి వున్న హెడ్ సెట్ ని నెమ్మదిగా తీసి, వస్తున్న కోపాన్ని సాధ్యమైనంతవరకు పైకి ప్రదర్శించకుండా “నువ్వేమైనా చిన్నపిల్లవా! ఈ ఇంటి కోడలివి. పెళ్లికి ముందు అమ్మగారింట్లో ఎలా వున్నా ముద్దుగానే వుంటుంది. ఎవరూ ఏమీ అనరు. పెళ్లయ్యాక మారాలి. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో కీలకమైన వ్యక్తివి. ఇలా వుండకూడదు” అని అనేవాడు.
ఒక్కోసారి హెడ్ సెట్ ని లాక్కుని దాచేస్తాడని దొరక్కుండా పరిగెత్తేది. అలా పరిగెత్తడంలో సంలేఖ నాటుకున్న మొక్కలన్నీ తొక్కేసేది.

మొక్కల్ని తొక్కినందుకు ఏమంటాడో ఏమో అని “ఏం నేను పాటలు వినకూడదా? ఎప్పుడు చూసినా వంట ఇంట్లో, లేదంటే పొలంలో పనులు చేస్తూనే వుండాలా? మరీ విశ్రాంతి లేని ఉద్యోగం అయింది నాది. అయినా కోడళ్ళు హెడ్ సెట్ పెట్టుకుని ఇంట్లో తిరిగితే వచ్చే పాపమేంటి? అత్తగారి ముందు, మామగారి ముందు, చివరకు మీముందు కూడా హెడ్ సెట్ పెట్టుకోకూడదా? నేను మీ చెల్లెలి కన్నా కొద్దిగానే పెద్దదాన్ని. పెళ్లయినంతమాత్రాన ముసలిదాన్నేం కాదు. వెదవ రూల్స్ పెట్టి చంపకండి!” అంటుంది.

ఆమెతో ఏం మాట్లాడినా కష్టమే. ఏం మాట్లాడాలో తోచేదికాదు. తలకొట్టుకుంటూ అక్కడ నుండి వెళ్లేవాడు.
కానీ ఈ మధ్యన మరీ ఎక్కువగా హెడ్ సెట్ పెట్టుకుని ఏ గోడచాటు కో వెళ్లి కూర్చుంటుంది. కన్పించదు. తనేమో మంచం దిగి నడవలేడు. ఆమె వున్న దగ్గరికి వెళ్లలేడు. ఎంత పిలిచినా ఆమెకు విన్పించదు. ఏది చెప్పుకోవాలన్నా చెప్పుకోలేడు. ఏడుపొక్కటే తక్కువగా వుంటుంది.

అప్పటికీ ఒకరోజు అన్నాడు “ఒకప్పుడు నువ్వెలా వున్నా సర్దుకుపోయాను. ఇప్పుడు నా పరిస్థితి అలా లేదు. నేనెంత నిస్సహాయస్థితిలో వున్నానో చూస్తున్నావుగా. నన్ను నువ్వు బాధ్యతగా చూసుకోవాలి. అందరూ వున్నా నాకెందుకో అన్నీ నువ్వే చూసుకోవాలనిపిస్తుంది. నన్నూ, నా స్థితిని అర్థం చేసుకో! అటూఇటూ వెళ్లకు. నా దగ్గరే కూర్చో. నాతో కబుర్లు చెప్పు. నువ్విచ్చే ధైర్యంతో, ఆనందంతో త్వరగా కోలుకుంటానేమో!” అని.

ఆ మాటలు వినగానే వలవలా ఏడ్చింది. ఆ ఏడ్పు చూసి తనేం తప్పుమాట్లాడాడో తెలియక అలాగే చూశాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, ముక్కు చీదుకుంటూ అతని చేతుల్ని పట్టుకొని నిమిరిన దగ్గరే నిమురుతూ నాకు మాత్రం మీరు త్వరగా కోలుకుని, స్కూల్ కి వెళ్తే ఫుల్ శాలరీ వస్తుందన్న ఆశలేదా? వుందండీ! అందుకే నేను వీలైనంతగా మీ దగ్గరే వుంటున్నాను. కానీ మీకు ఇది తెలియదు. టాబ్లెట్లు వేసుకోవడంవల్లనో ఏమో మీరెప్పుడూ కళ్లుమూసుకుని పడుకొనే వుంటున్నారు. ఆ టైంలో మీ అవసరాలను నేనే చూస్తుంటాను. తిలక్ ని, అత్తయ్యని రానివ్వటం లేదు. ఇదిగో ఇప్పుడే అలా వెళ్లాను” అంటుంది.
ఆ అబద్దానికి అతను ఆశ్చర్యపోతూనో ఉదాసీనంగానో చూస్తే “మీరు నమ్మరు. నా ఖర్మ! మీరిలా అయినప్పటినుండి నేను పడే బాధలోంచి నాక్కొంచెం ఆనందం దొరికేది ఈ పాటల వల్లనే. లేకుంటే ఏముంది నాకు? అందరిలా ఓ సంతోషమా పాడా!” అంటుంది మళ్లీ ఏడుస్తుంది.

రాత్రివేళలో కూడా నిద్రలేచి చూస్తే నిటారుగా పడుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎటో చూస్తూ కాలు మీద కాలు వేసుకొని గడ్డిపోచ గాలికి వూగినట్లుగా కాళ్లను కదిలిస్తూ వుంటుంది.

ఒక్కోసారి అలాగే పాటలు వింటూ హెడ్ సెట్ ను తియ్యటం మరచిపోయి నిద్రపోతుంది. ఆమెను అలా చూస్తుంటే తలకి కరెంట్ వైర్లు పెట్టించుకొని, షాక్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వ్యక్తిలా అన్పిస్తుంది. ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు బాధ.

                                                                            *****

తెల్లవారి తల్లీ, దండ్రి లేని సమయం చూసి “వినీలా! నువ్వు రాత్రుళ్లు పాటలు వింటూ అలాగే నిద్రపోతున్నావు. హెడ్ సెట్ తియ్యటం మరచిపోతున్నావు. ఇలా అయితే నువ్వు పెట్టుకునే సౌండ్ కి. నీకు వినికిడి శక్తి తగ్గిపోతుంది. వైబ్రేషన్స్ వల్ల పీస్ ఫుల్ గా వుండలేవు. నేను నీ మంచికే చెబుతున్నాను” అన్నాడు.

“నాకు తెలుసు నా ఆనందాన్ని మీరు చూడలేరు. అందుకే అలా అంటున్నారు. నేను పాటలు వినటంలోపడి మిమ్మల్ని సరిగా చూడటం లేదేమోనని మీ అనుమానం. అలాంటిదేం పెట్టుకోకండి! మీరు నడవలేకపోయినా నేనుండేది మీకోసమే! ఇది మీరు గ్రహించాలి. లేకుంటే ఎప్పుడో మా కొండాపురం వెళ్లేదాన్ని” అంటుంది.

కొండాపురం వెళితే వాళ్ల పెళ్లికాని అన్నయ్య రోజూ తాగి వచ్చి తల్లిమీద పెట్టి తనను తిడుతుంటాడన్న విషయం బయటికి రానివ్వదు. మా అన్నయ్య ఇంతవాడు, అంతవాడు అంటూ గొప్పలు చెబుతుంది.

“నేనంటే ప్రాణం మా అన్నయ్యకి, మా ఇంటికెళ్తే నేను అక్కడ మహారాణిని” అంటుంది.
అతను ఎటోచూస్తూ మౌనంగా వుండటం చూసి వుడికిపోయింది.

“నేనంటే మీకు నచ్చనిది ఈ హెడ్ సెట్ వల్లనేగా!” అంటూ దాన్ని నేలకేసి కొట్టబోయింది.
ఎవరో వస్తున్నట్లనిపించి ఆగి, దాన్ని పేపర్లో చుట్టి, ఎవరికీ కన్పించకుండా దాచేసింది.

వాళ్లను పలకరించి భర్త పక్కన కూర్చోబెట్టింది.
వాళ్లు రాజారాంని చూడాలనివచ్చారు.
ఈ మధ్యన అలా వచ్చేవాళ్లు ఎక్కువయ్యారు.

వాళ్లు చూసే జాలిచూపులు, చూపించే సానుభూతిని రోజురోజుకి తట్టుకోలేకపోతున్నాడు.
అయినా తప్పడంలేదు. ఒక్కోసారి ఈ పరిసరాలకి దూరంగా వెళ్లిపోతే బాగుండుననిపిస్తుంది. ఎటూ వెళ్లలేని స్థితి. వచ్చినవాళ్లు వెళ్లిపోయారు.

వినీల ఇప్పుడు కూడా హెడ్ సెట్ పెట్టుకుని ఎక్కడో కూర్చునే వుంటుంది. రావాలనుకున్నప్పుడే తన దగ్గరకి వస్తుంది. కన్పించాలనుకున్నప్పుడే కన్పిస్తుంది అని మనసులో అనుకున్నాడు.

అక్కడే వున్న పత్రిక పట్టుకుని సంలేఖ రాసిన కథ చదువుతుంటే రాజారాం కళ్లు అప్రయత్నంగానే చెమర్చాయి.

(ఇంకా ఉంది)

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో