ఇదొక విచిత్రమైన మూలికతీగ కథ! దీని గురించి ఉండే అబద్దాలు, నిజాలు, కల్పనలలోని కథలు… వీటన్నిట్ని మీరి ఈ తీగ గురించి సత్యాంశంలోని కొన్ని విషయాల్ని తెల్సుకొనేందుకు నాకు ఇరవైసంవత్సరాలు పట్టిందని చెప్తే మీకు ఆశ్చర్యం కావచ్చునండి! అయితే నేను చెప్పేది ముమ్మాటికి నిజమేనండి!
ఒకసారి మాతోటలో కాఫి మొలకల్ని పాతే పాదులకు పందిరి వేస్తున్నాం. పందిరికి పాదులకు మధ్య పాతిన చిన్న కర్రల్ని కల్పి కట్టేందుకు అడవిలో ఉండే తీగలు కావాల్సి ఉంది. అడవికి వెళ్ళి పట్టుకురా అని సణ్ణయ్యకు చెప్పాను. సణ్ణయ్య అడవిలోపలికి వెళ్ళి ఎన్నో తీగల్ని, లతల్ని పీకి వాట్ని ఒక పెద్ద మోపుగా మోసుకొని తెచ్చాడు. ఆ మోపును విప్పి, ఆ తీగల, లతల ఆకుల్ని దూసి, పాదులకు కట్టేందుకు తాడులన్నట్లుగా వాట్ని సిద్ధం చేస్తున్న మారడు, వాటిలో ఉన్న ఒక తీగను చూసి ”అయ్యయ్యో నీ కొంప పాడుగాను… దీన్నెందుకు పీకి తెచ్చావురో?” అంటూ సణ్ణయ్యను తిట్టాడు. అప్పుడు అక్కడకు నేను వెళ్ళి ఎందిరో లొల్లి (గొడవ) అని విచారించినప్పుడు అది ”ఔషధతీగ” అని మారడు చెప్పాడు. సణ్ణయ్యేమో ఆ తీగలు అడవిలోపల కావాల్సినంతగా ఇంకా మరెన్నో ఉన్నవని చెపుతుంటే మారడు తక్షణమే ”ఎక్కడున్నవి ఆ తీగలు… చూపించు” అని సణ్ణయ్యను అడవిలోపలికి మళ్ళీ వెంటేసుకొని వెళ్ళాడు. కుతూహలం కనే కేవలం నేను కూడా బయల్దేరాను వారితోపాటుగా. ఈ ఔషధ తీగలోని మొదటి పరిచయం నాకు అయ్యింది అలాగుననే!
సణ్ణయ్య మారడికి ఆ తీగను చూపించిన తక్షణమే మారడు దాన్ని తీసుకొని శీఘ్రంగా పక్కనున్న ఒక పెద్ద చెట్టుకు మనం నడుంకు వేసుకొనే తోలు బెల్టులాగ దాన్ని చుట్టి కట్టి పడేసాడు భద్రంగా. మారడి వ్యవహారం చూసిన నాకు ఆశ్చర్యమైంది.
”ఎందుకు మార, ఆ తీగను చెట్టు నడుంకు అంటగట్టావు?” అని ప్రశ్నించాను.
”సార్… అది దొంగ ముండ! అది అక్కడే ఆ చెట్టుకే అంటుకొని పడియుండనీ అని కట్టి పడేసాను!” అన్నాడతను.
”ఎందుకు మారా, అదెక్కడికి పారిపోతది?”
”అయ్యో… ఈ తీగలోని విచారం మీకు పూర్తిగా తెల్వదు సార్! ఇది అవసరపడినప్పుడు ఎంతగా కావాలని వెతికినా, అది దొరకకనే తప్పించుకొని దాగుంటది సార్. ప్రాణం పోయినా అది దొరికేది లేదు. అందుకే అది ఎక్కడైనా మన కళ్ళలో పడినప్పుడు దాన్ని పట్టుకొని ఏదైనా పెద్ద చెట్టు నడుంకు కట్టిపడేయాలి; ఉండిపో శాశ్వతంగా అక్కడే అని” అంటూ మారడు వివరణ ఇచ్చాడు.
తమలపాకు తీగకు ఉన్నట్లుగా చిన్న చిన్న ఆకులతో, ద్రాక్ష తీగకు ఉన్నట్లుగా గుత్తులగుత్తులుగా కాయలతో ఉండే తీగ ఇది. వానలు పడిన తక్షణమే పుడమినుంచి పైకి లేచి తొందరగానే పూలు పూసి కాయలు కాసి చనిపోతది. ఆ తర్వాత మరలా జీవం పొందేది ముందొచ్చే వానాకాలంకే. అందుకే దీన్ని ఎలాగైనా జ్ఞాపకంలో పెట్టుకొనేందుకని దీని మీద ఒక జానపద కథను కట్టి, దాన్ని చెట్టుకు కట్టేస్తారనేది కనబడుతుంది. మారడు చెపుతున్న ఈ జానపద కథ థ నుంచి అతను చెపుతున్నదాన్లో ఏది సత్యమో ఏది అసత్యమో నాకైతే తెల్వదు. ఈ పరిస్థితి, ఈ రోజు మారడినుంచి వచ్చిన జనపదుల మాటలకు మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలోని సాంప్రదాయక (నాటు) వైద్య పద్ధతికి నిరూపణ చేయలేని దుస్థితి దాపురించి ఉంది కదా!.
మాస్తి, బైర, అప్పణ్ణ, సణ్ణయ్య, మార… మొదలైనోళ్ళతో ఈ సహ్యాద్రి అడవి అంతా తిరిగి నేను తెల్సుకొన్న అనేక విషయాలలో గిడ మూలికల విషయాలు కొన్ని ఉన్నవి కదా! ఇప్పుడు అడవులు నశించి పోతున్నవి. ఈ మూలికల విషయాలు తెల్సిన నిష్ణాతులు (పల్లెజనం) ఒకరొకరుగా నిష్క్రమిస్తున్నారు ఈ లోకం నుంచి. అడవి ఉనికి మరియు దాని లోతుపాతులు, మహిమలు తెల్సిన నిష్ణాతులు…. ఈ రెండిటిలో ఏ ఒకటి లేకపోతే మరొకటి నిరుపయుక్తమవుతది. ఈ విషయాలన్ని ఎవరికైనా ముందు తరాలోళ్ళకు తెల్పితే మంచిదిగా ఉంటదని నాలో తహతహగా ఉంటుండేది. అయితే నేను పామరుల నుంచి తెల్సుకొన్న ఈ మూలికల అసాధారణ గుణాల గురించి నా వైద్య మిత్రులతో ప్రస్తావించినప్పుడు వారు కోపించి నన్ను అజ్ఞాని అని తిట్తూ తగాదా పడుతుండేవారు.
నాటువైద్యులు కూడా ఈ ఆలోపతి వైద్య శిఖామణుల మీద అంతే తిరస్కార భావంతో మాట్లాడుతుండేవారు. ఈ నాటు వైద్యాన్ని చేయించుకొనే మారడిలాగ తాము చేయించుకొనే ఈ వైద్యంకు అనేక గుడ్డి నమ్మకాల్ని, ధార్మిక మనోభావాలను కలగలిపినందున అలోపతి వైద్యులు వీళ్ళను ఎగతాళి చేసేది, తిరస్కారంగా చూసేది సులభంగా ఉంటుండేది అన్ని చోట్లా. దాంతోపాటుగా నాటు మందులలోని గుణం తెల్సిన మారడిలాంటోళ్ళకు తమ మాటల్ని ఇతర వర్గం వాళ్ళు గంభీరంగా పరిగణించి గణనలోకి తీసుకోవాలనే అగత్యం వీరిలో వీసమెత్తైనా లేదు. తాము తెల్సుకొన్న పరిసరాలలో దొరికే వైద్య విజ్ఞానంను తమతోపాటుగా గోరీకి (బొందలగడ్డకు) తీసుకెళ్ళేందుకు వాళ్ళు ఎప్పుడూ తయారయ్యే ఉండేవాళ్ళు. అనేకులకు పెరటి వైద్యంలోని అద్భుత ఔషాధాల గుణం తెల్సియున్నా కావాలనే వాట్ని ఎవరికీ చెప్పకనే ఇహలోకం త్యజించేవారు. ఇప్పటికే మనుకులాన్ని పట్టి పీడిస్తున్న అనేక మారణాంతిక రోగాలకు ఎక్కడో కొన్ని చోట్లే దొరుకుతుండే మూలికలు ఇలాగున కనుమరుగై మానవాళికి అపారనష్టం అయ్యిందని నేను దృఢంగా నమ్ముతుండేవాడ్ని. మానవుడు చంద్రమండలంకు వెళ్ళివచ్చినా మూఢ నమ్మకాల్ని, కక్షుద్ర బుద్ధిని దాటేందుకు సాధ్యంగావట్లేదు.
ఆ రోజు మారడు ఆ ఔషధ తీగను చెట్టుకు కట్టేసి, అది కాలినుంచి తలవరకూ (అడినుంచి ముడివరకూ) ప్రతి యొక మానవ శరీర భాగంకు ఔషధమని పొగిడాడు తప్పితే అది నిర్థిష్టంగా శరీరంలోని ఏ భాగంకు ఔషధని కచ్చితంగా తెల్పలేదు. ఆ జ్ఞానంను కావాలనే నాకు తెల్పలేదో లేకపోతే అతనికీ దానిగురించి సవిస్తారంగా గుర్తులేదో చెప్పేందుకు నాకైతే తెల్వదు. నేనైతే బలవంతం చేయలేదు అతడ్ని. పొద్దు పొడిస్తే చాలు… రోమాంచకమైన ఎన్నో కట్టుకతల్ని అతను చెపుతున్నందున ఔషధ తీగను చెట్టుకు కట్టేది అటుండనీయండి, దాన్ని (ఆతీగను) గొంతుకు ఉచ్చుగా వేసుకొన్నా అతడ్నెవరూ గంభీరంగా పరిగణించే స్థితిలో లేరు.
అయితే మా మారడి కథలు కట్టుకథలైనా ఎంతో గొప్పగా ఉంటుండేవి.
ఒకసారి మారడు గడ్డి తెచ్చేందుకు అడవిలోకి వెళ్ళాడట. వెదురు పొద సందులలో చేయి వేసి గడ్డి కోస్తున్నప్పుడు చేతికి కత్తి తగిలి బలమైన గాయం అయ్యింది. రక్తనాళమే తెగిపోయి రక్తం చిమ్మింది. పక్కన ఉన్నోళ్ళు భయపడి రక్తం బయటకు కారనట్లుగా ఆపేందుకని ఏదో చెట్టు ఆకు తెచ్చి గాయం మీద పెట్టి, కట్టుకొన్న ధోవతి చించి బ్యాండేజ్ కట్ట్యారు. మారడు తన చేతికి అయిన గాయంను కదిలించకుండా జాగ్రత్తగా చేతిని పట్టుకొని సరిజేయించుకొనేందుకని వైద్యం తెల్సిన ‘హులిహందలు’ దొర వద్దకు వెళ్ళాడు. దొర ఔషధి బాటిల్, దూది, గాయంమీద వేసే పొడి… అన్నిట్ని రెడి చేసుకొని, మారడి గాయంకు చుట్టిన బ్యాండేజ్ గుడ్డను విప్పి, గాయంమీద మూసి పెట్టిన ఆకును తీసాడట. ఆశ్చర్యం!లోనెక్కడా గాయంలేదు! గాయం అయిన జాడాలేదు. దొరకు మారడు మీద కోపం వచ్చి, ”ఏమిరా భాడకోవ్! నాతో తమాషా చేస్తున్నావా?” అంటూ రేగిపడ్డాడట! మారడు తన వంటికి, చేతికి అంటిన రక్తంను, కత్తికి అంటుకొన్న రక్తం చారికల్ని చూపించి తాను కచ్చితంగా నాటకం ఆడట్లేదని మొర పెట్టాడు. దొరకు ఆ రుజువులన్నీ చూసిన పిమ్మట నమ్మకం కలిగింది. మారడి గాయంమీద ఉంచిన ఆకును పట్టుకొని, ”ఈ ఆకు ఉండే చెట్టు ఎక్కడుందో చూపించు. నాతోట మొత్తం నీకు రాసిస్తాను సంతోషంగా అని అడిగాడు. మారడు దొరను వెంట బెట్టుకొని అడవిలోపలికి వెళ్ళాడు. పొద్దుట్నుంచి సాయంకాలం వరకూ ఆ అడవినంతా గాలించినా, ఆ ఆకును పోలే ఆకులతో ఉండే చెట్టు జాడ దొరకలేదు.
దొరకేమో మారడు కావాలనే ఆ ఔషధి చెట్టును చూపించకనే ఈ విధంగా అడవిలో తిప్పుతున్నాడని, మొత్తం తన తోటనంతా ధారాదత్తం చేస్తానని చెప్పినా మారడికి తృప్తి కావట్లేదని కోపం చేసుకొన్నాడు. తుపాకి తెచ్చి, ”చూపిస్తావా లేకపోతే నిన్ను దీనితో కాల్చి చంపనా?” అని రోషంగా అన్నాడట. అప్పుడు మారడిలో జంఘాబలమే ఉడిగిపోయి భోరునే ఏడుస్తూ దొర కాళ్ళ మీదపడి తనకు కచ్చితంగా ఆ చెట్టు జాడ తెల్వదని చెప్పినదానికి కుపితుడైన దొర ‘గెటౌట్’ అని తిట్టి మారడ్ని పారద్రోలాడట.
”నీది భలే కట్టుకథ మారా… నీ చేతికి గాయం చేసుకొన్న ఆ వెదురు పొద చెంతనున్న అన్ని చెట్లనూ వెతికి ఉంటే, ఆ ఔషధి ఆకు చెట్టు కనబడకుండా ఉండేది సాధ్యమా?” అని అతను చెప్పిన కథను విని నేనూ తిట్టాను అతడ్ని. ఆ గిడ మూలిక ఏమిటనేది ముంగీసకూ, కెంబూత పక్షికి మాత్రమే గుర్తని, పాముల్ని అవి వేటాడేందుకు వెళ్ళినప్పుడు, ఒకవేళ పాము కాటేస్తే అవి తక్షణమే ఈ ఔషధి చెట్టు ఉండే చోటుకు వచ్చి, ఆ మహత్తరమైన ఆకును తీసుకొని ఔషధంగా వాడుకొంటవని మరొక వింతైన కథను కలగల్పి చెప్పాడు.
మారడికి కుడివైపు దవడలో దంతాలు లేవు. అన్నం, రొట్టెల్ని ఎడం వైపున ఉండే దవడలోని దంతాల్నుంచే నమిలి, మింగేదుంది. వయసైన అతనికి దంతాలు పోయింది సహజమైనా ఎందుకు ఒక వైపునుంచే దంతాలు ఊడిపోయినవనేది నాకు కుతుహలంగా ఉంటుండేది. ఒకరోజు మారడ్ని ”ఎందుకు నీకు ఒకవైపునే దంతాలు ఊడినవి” అని అడిగాను. నానుంచి ప్రశ్న విన్న తక్షణమే ఒక సారస్యమైన కథ చెప్పాడు.
ఆ దంతాలు ఊడిపోయింది వయస్సైనందున కాదని, ఎన్నో సంవత్సరాల క్రితమే అవి ఊడిపోయినవని చెప్పాడు.
కుందేళ్ళకని ఒకసారి మారడు అడవి లోపల వల వేసాడు. ఆ వలలో రాత్రివేళ కుందేళ్ళు చిక్కుకోగా ఇతనికన్నా ముందే ఎవరైనా వాట్ని చూస్తే వలనుంచి విడిపించుకొని దొంగతనంగా వాట్ని తీసుకెళ్తారేమోనని మారడు ప్రభాత కాలంలోనే మేల్కొని అడవిలోకి వెళ్ళాడు. వలలో ఏ ఒక్క కుందేలు పడలేదు. అక్కడ చిన్న వాగు ఒకటి పారుతుంది. వాగువద్దే మారడు ముఖం కడుక్కొని ఇంటికి రిక్తహస్తాలతో తిరిగి వెళ్దాం అని వాగు ఒడ్డునున్న చెట్టునుంచి చిన్న ముఖం పుల్ల ఒకదాన్ని విరిచి, దాన్ని నమిలి బ్రష్‌లాగ చేసుకొని కుడివైపు నుంచి పళ్ళు రుద్దేందుకు మొదలు పెట్టాడు. రెండుసార్లు రుద్దుకొనేటప్పటికి నోరంతా ఒకరీతిగా అయ్యిందట. ఈ పుల్ల ఎందుకో సరిగా లేదని భావించుకొంటూ దాన్ని అటెటో విసిరి, మరొక పుల్లను తీసుకొందామనే ముందు నోరు పుక్కలిద్దామని వాగు నీళ్ళలో నోరును కడుక్కొని పుక్కళించాడంతే! ఆ మొదటి పుల్ల నుంచి ఒకవైపు రుద్దుకొన్న దంతాలు ఒకటొకటిగా జారి ఊడినవట!
”దేవుడి దయనుంచి అప్పుడు ఆ చెడు పుల్లతో రెండో దవడలో ఉన్న పళ్ళను రుద్దుకోలేదు సార్! అందుచేతే బతికిపోయాను! లేకపోతే అన్నం తినేందుకూ నా నోట్లో ఒక దంతమూ ఉండేది లేదు సార్” అన్నాడు మారడు.
”ఓయ్ మారా, అబద్దాలు చెప్పినా నమ్మేంతగా అబద్దాలు ఉండాలికదయ్యా” అని అతను చెప్పిన కథను విన్న మీదట గదిరాను నేను.
”అబద్దాల్ని ఎందుకు చెప్పేది ఉంటదయ్యా నాకు? అంతగా పళ్ళు ఒకవైపునే ఊడినవి మీకు కనబడట్లేదా?”
”అలాగైతే ఆ చెట్టు ఏదో చూపిస్తావా?”
”మన సహ్యాద్రి కనుమలలోని ఈ ఘోరారణ్యంలో ఎన్నో రకాల చెట్లు ఉన్నవి కదా సార్! వాట్లో ఏ చెట్టు అది అని మీకు చూపించగలను అయ్యా? ఒక పని చేయండి. ఈ అడవిలో ఉన్న అన్ని చెట్ల పుల్లల్ని విరిచి పరీక్షకని రుద్దుకొని చూడండి. ఆ చెట్టు ఏదని అప్పుడు కనుక్కోవచ్చు” అని అన్నాడతను.
”నేనెందుకు నువ్వు చెప్పినట్లు కనుగొనేది ఉంటది? ఇప్పుడు కట్టుకథను అల్లినోడివి నువ్వే కదా! నువ్వే మరోమారు రుద్దుకొని దాన్ని కనుక్కో”
”అయ్యయ్యో… పెద్ద పరీక్షే పెట్తున్నారు మీరు! ఇక్కడ ఈ దట్టడవిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నవికదా! వాటి పుల్లల్ని దంతాలమీద రుద్దుకొని, ఆ చెట్టేదో కనుక్కొనే ఆయుష్యు నాలో ఉందా?”
”ఔను మారా, అదేదో మరోజాతి పుల్లను రుద్దుకొని దంతావధానం ముగిస్తే అకస్మాత్‌గా నీ అదృష్టంకు దంతాలు మళ్ళా కొత్తవి పుట్టేలాగ చేసే వనమూలిక ఏదైనా దొరకొచ్చేమో చూడు”
‘‘ఏ మంచి చెట్టుపుల్ల చేతికి దొరికిందని ఎలా చెప్పగలను సార్? ఒకవేళ అకస్మాత్ నా గ్రహచారం చెడి ప్రాణం తీసే చెట్టు పుల్ల చేతికి చిక్కితే అప్పుడు నా గతేంటి?”
”అలాగైతే నాకెందుకు చెప్పావు… నన్నే కనుక్కోమని?”
”మీరేకదాసార్… నేను చెప్పిందంతా అబద్దమేనని అన్నారు కదా? నేను చెప్పినదాంట్లో మీకు నమ్మకమే లేదు”
”ఓయ్ మారా అకస్మాత్‌గా నిన్ను యువకుడిగా మార్చే ఔషధ మూలిక దొరికితే ఏమి చేస్తావు?”
”అది దొరికినా నాకు వద్దుసార్! యువకుడిగా మారితే మరోసారి వివాహం చేసుకొనేదుంటది. అది అటుండనీయండి. అటువంటి మహిమాన్వితమైన మూలిక మన సహ్యాద్రి అడవిలో లేదని అనుకోండి” అని నూతనంగా మరొక కట్టుకథను తన అంబులపొదినుంచి బయటకు తీసాడు.
వెనకెప్పుడో మారడు మరియు అతని దోస్త్ చేరి అడవి గొర్రెకని వలవేసి పట్టుకొన్నారట. దాన్ని ఇద్దరూ చెరి సగం చేసుకొనేదుంది. వాగు వద్దకు వెళ్ళి, అక్కడదాని చర్మం వల్చి మాంసంను ముక్కలు ముక్కలుగా చేసుకొని పంచుకొన్నారట. ఆ ఇద్దరూ తమ తమ పాలును ఒక పెద్ద ఆకులో చుట్టుకొని ఇళ్ళకు చేరారట.
ఇంట్లో మసాలా నూరి, పాత్ర రెడి చేసి, నీళ్ళు సలసల కాగేందుకు పొయ్యిమీద పెట్టి, మాంసంను పాత్రలో వేసేందుకు ఆకు విప్పారట. ఆశ్చర్యం! ఆ ఆకులో ఒక సజీవమైన గొర్రెపిల్ల పడుకొని ఉందట. మారడ్ని చూసిన ఆ గొర్రె పిల్ల తక్షణమే చెంగునేలేచి తలుపు సందునుంచి దూకి పారిపోయిందట! మారడేమో ఆ గొర్రె పిల్లను పట్టుకొనే ఆత్రంలో ఉండగా మారడి పెళ్ళాం ఆ ఆకును తీసుకొని కాలుతున్న పొయ్యిలో పడేసిందట.
ఇప్పుడు ఇక మారడు చెప్పిన ఈ కథకు మాత్రం నేను వివరణను గాని, ప్రశ్నల్ని గాని అడిగేందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇది ఈ కథ మారడి కల్పనలోని అతిరేకంలోని పరమావధిగా ఉంది. ఇంతటి ప్రచండ మూలికకని తన ఆస్తి అంతా రాసిస్తానని ‘హులిహందలు’ దొర అడిగేది ఉంటే అందులో ఆశ్చర్య పోయేదేమి ఉండదుకదా!.
ఇప్పుడు నేను ‘హుయిసోళలు’లో ఉండే ఆ తోట (ఎస్టేట్) అమ్మింది, మారడు చనిపోయింది ఎన్నో సంవత్సరాలు అయినవి కదా! మారడి మాటల్ని కట్టుకథలగా కొట్టి పడేద్దామనుకొంటే కుదిరేది లేదు. చివరికి ఏదో ఒక శాతం మా అంతఃకరణంను పెనవేసుకొనేందుకు ఆ కథలు మాలో ఉండిపోతవి. అబద్దం చెప్పనీ, నిజం చెప్పనీ, మమ్మల్ని నమ్మించనీ, నమ్మించకపోనీ… మాలోని తర్క బుద్ధిని మరింతగా పెంపొంధించుకొనేందుకైనా మారడి కట్టుకథలు మా మస్తిష్కంలో నిలబడిపోవాల్సే ఉందిలే.
ఎన్నో సంవత్సరాల తర్వాత మారడు చెప్పిన ఔషధ తీగ సంగతి మరలా పైకి లేచి వచ్చి మా ముందు నిల్చింది. ఈ సారి అప్పణ్ణ ఆ తీగను అడవిలో చెట్టుకు కట్తున్నాడు. ఇది ఏరోగ నివారణకు ఔషధంగా ఉపయోగపడుతదని అడిగాను. దాని మహిమ చనిపోయిన మారడిలాగ అతనికి సరిగా తెల్వదు. దీని ఆకుల్ని పాలలో పిండితే ఆ పాలు పెరుగులాగ తక్షణమే గట్టిపడుతదని చెప్పాడు. బహుశః ఈ ఆకులో పులుపు పదార్థం ఉండొచ్చు. దీని పసరును పిండినప్పుడు పాలు పెరుగుగా తక్షణం రూపాంతరం చెందుతున్నందున దీన్ని ఔషధ తీగగా భావించుకొంటున్నారేమోనని భావించి, ”దీన్ని పిండినప్పుడు చూసావా నువ్వు?” అని అడిగాను. ”అలాగని చెప్పుకొంటారండి. ఆ ప్రయోగం చేసి చూచేందుకు పాలను నేనెక్కడ్నుంచి తెచ్చేది సార్?” అని బదులిచ్చాడు అప్పణ్ణ.
ఈ ఔషధ తీగ చుట్టూ అలుముకొన్న కట్టుకథకు ఏదైనా ఆధారాలు ఉన్నవా? అలాగైతే ఈ ఔషధ తీగ ఆకుల పసరును పాలలో పిండి చూద్దాం అని ఆలోచించాను. వాళ్ళను వీళ్ళను అనవసరంగా మూర్ఖులన్నట్లుగా విమర్శించే బదులు నేనే ప్రయోగం ద్వారా దాని పసరును ఎందుకు పరీక్షించి చూడరాదు అని భావించుకొన్నాను.
ఈ ఔషధ తీగలోని కొన్ని ఆకుల్ని పీకి, స్నేహితుడైన పెథాలజిస్ట్ చంద్రు వద్దకు ఆ ఆకుల్ని తీసుకెళ్ళి, ఆ ఆకులోని పురాణమంతా చెప్పాను. దీని మీద ఇప్పుడు ఒక ప్రయోగం చేసి చూద్దామని నిర్ణయం చేసి, ఒక లీటర్ పాలు పాడైపోయినా పర్వాలేదని పాలు తెప్పించుకొన్నాం. మిగిలిన సైంటిఫిక్ మిత్రులు కట్టుకథల్ని నమ్మి పాలను పాడు చేస్తున్నారని మామీద నవ్వుకొంటున్నారు. మేము మూర్ఖులుగా అయ్యేందుకు తయారైనప్పుడు ఎవరు ఏ విధంగా నవ్వితే మాకేంటి? ఆకుల్ని పాలను మిక్సిలో వేసి తిప్పి నీళ్ళు పోసాం. ఆతర్వాత ఆ మిశ్రమంను ఒక పాత్రలోపోసి పాలు విరుగుతవో లేకపోతే గట్టిగా గడ్డ పెరుగుగా అవుతదోనని చూస్తూ కూర్చున్నాం. ఒకట్రెండు నిమిషాలు గడిచినవి. పాలు విరగనూ లేదు, గట్టిగా పెరుగుగానూ మారలేదు. మిక్సినుంచి పాత్రలో పోసినప్పుడు ఎలాగుందో అలాగే ఉంది. సరేలే ఒక లీటరు పాలు వ్యర్థమైనవని తీర్మానించుకొని చేతినుంచి ఆ మిశ్రమాన్ని ముట్టిచూసాను. పాలు రబ్బర్‌లాగ గట్టిగా ఉంది! పాత్రను బోర్లించగా పాత్ర ఆకారంలో ఉన్న ఒక గట్టి ముద్ద బయటకు వచ్చింది.
ఓహో! ఈ ఔషధ తీగకు నిజంగానే ఏదో మహత్వమైన ఔషధ గుణం ఉండొచ్చనే అనుమానం నాలో ప్రారంభమైంది.
ఇదంతా ఈ ప్రయోగం మానుంచి జరిగినా ఇది దేనికి ఔషధంగా ఉపయోగపడుతదనేది మాత్రం నాకు తెల్వలేదు. తెల్సేది, తెల్వకపోయేది అటుండనీయండి… దీన్ని చూసినోళ్ళందరూ మారడిలాగనే ‘పడుండు అక్కడ’ అని ఆ తీగను సమీపాన ఉన్న ఏదో చెట్టుకు బిగువుగా కట్టేస్తున్నారు తప్పితే ఇటువంటి జబ్బుకు ఇది నివారణ ఔషధంగా భావించి దాని ముడి విప్పి వాడేందుకు తీసుకెళ్ళే వాళ్ళను నేను చూడలేదు ఇప్పటివరకూ.
ఇలాగున కాలం గడుస్తుండగా, మారడు చెప్పిన ఆ ఔషధ తీగ నా జ్ఞాపకం నుంచి కనుమరుగైంది.
పూర్వం నా వద్ద నౌకరి చేసిన కృష్ణ మొన్న నా వద్దకు వచ్చాడు. ఆరోగ్యంగా గట్టిపిండంగా ఉండే ఇతను ఇప్పుడు ఎదురు రొప్పులు పెట్తూ ముడుచుకొని నీరసంగా నిలబడియున్నాడు. కాఫి ఎస్టేట్‌లో పని చేసేదాన్ని వదిలి, ఎక్కడో దూరానున్న జిల్లా కేంద్రంలో రిక్షా తొక్కేదాన్ని చేస్తున్నాడట. అప్పట్నుంచి అతనికి మలవిసర్జనతో పాటుగా గుదం నుంచి రక్తం కారేది మొదలైందట. ఇప్పుడు దాని పీడ విపరీతమై ఆయాసం, దగ్గు, ఉబ్బసం… అన్నీ ఒకదానికొకటి పెనవేసుకొని ప్రారంభమైనవని చెప్పాడు. అతని వివరణ నుంచి అతని జబ్బు మూల వ్యాధి కావొచ్చని అన్పించింది నాకు. నాకు తెల్సినట్లుగా అలోపతిలో శస్త్ర చికిత్సే దానికి పరిహారం. కూలినాలి చేసి బతుకుతున్న కృష్ణలోని కష్టంచూసిన నాకు దుఃఖమైంది. ఇంట్లో భార్య, చిన్న చిన్న పసిపిల్లలు, ఎన్నో రోజులు ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకొనేది అతనికి ఎలాగబ్బా అని యోచించాను.
కృష్ణ నాదగ్గర కొద్దిగా డబ్బు చేబదులుగా తీసుకొని ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడుండే ప్రభుత్వ డాక్టరు నేను అనుకొన్నట్లే శస్త్ర చికిత్సే మార్గమని తెల్పారు. కృష్ణ భయపడ్డాడు.
కృష్ణకు ఒక మళెయాళ స్వామి తెల్సు. వెనకెప్పుడో కృష్ణకు వంటిమీద పొక్కులు పొక్కులుగా చిన చిన్న కురుపులు వళ్ళంతా వ్యాపించినప్పుడు, ఏదో చెట్టు బెరడు ఇచ్చి, దాన్ని మెత్తగా నూరి బాతుగుడ్డు సొనతో మిశ్రమంగా చేసి పదిరోజులు తినమని ఆ మళయాళస్వామి చెప్పాడు. ఆ స్వామి బోధపరిచినట్లుగానే కృష్ణ ఆ మందు తిన్నమీదట ఒకే ఒక కురుపూ మచ్చుకైనా వంటిమీద లేకుండా మాయమైనవి. కృష్ణ ఈసారి కూడా ఆ స్వామి దగ్గరకు వెళ్ళాడు. ఆ స్వామి ఇప్పుడు ఎంతో వయస్సైనోడిగా కాలధర్మం నుంచి మారి ఉన్నాడు. ”నీకు ఔషధ తీగను వెతికి ఇచ్చేందుకు ఇప్పుడు నాలో శక్తి లేదు. నేను ఆ తీగకుండే లక్షణాల్ని వివరిస్తాను. ఆ తీగను వెతికి, దాన్ని గడ్డను నూరి, ముద్దగా చేసుకొని, విరిగిన పాలలో కల్పి ఐదు రోజులు త్రాగు” అని చెప్పాడట.
నేను కృష్ణను మళ్ళా చూసినప్పుడు అడవిలోపల ఆ తీగ మూలంకని వెతుకుతున్నాడు. దాని వివరణ విన్నప్పుడు అది మారడు మరియు అప్పణ్ణ ఆ ఔషధి తీగను తమ నుంచి పారిపోరాదన్నట్లుగా చెట్టుకు కట్టిన మూలిక తీగే అదని నాకు స్పష్టమైంది. కృష్ణకు ఆ ఔషధి తీగను చూపించి దాని మొదల్ని తవ్వాము. ఎంతో లోతులో దాని గడ్డ ఉంది.
దాన్ని నూరి, దాని రసాన్ని బాతుగుడ్డు సొనతో కలగల్పి విరిగిన పాలలో కల్పి తాగగా ఒకే ఒక రాత్రికి కృష్ణలోని మూల వ్యాధి నయమైంది. ఐదు రోజులు దాన్ని స్వామి చెప్పినట్లు తాగగా పూర్తిగా నయమైంది మూలవ్యాధి! కృష్ణ రిక్షా తొక్కేపని మానుకొన్నాడు.
దీనికన్నా మరొక తమాషా సంగతి ఏమిటంటే కృష్ణ ఆ ఔషధతీగలోని గడ్డను తవ్వితీసినప్పుడు, ఆగడ్డలోని ఒక ముక్క విరిగిపడగా ఏమి రుచి ఆ గడ్డలో ఉందని తెల్సుకొనేందుకు ఆ ముక్క భాగంను నేను నోట్లో వేసుకొని నమిలి తిన్నాను. కొంచం చిరు చేదుగా ఉంది అంతే!
నా కుడి కాలులోని పాదం ఎన్నో నెలలనుంచి బాధపెట్తుంది. ఎక్కువ దూరంకు నడిస్తే చాలు, కుంటుతూ నడవాల్సి వచ్చేది. దీనితో పాటుగా ఇప్పుడు నా కాలిపిక్కకున్న ఎముక పక్క నిమ్మకాయ పరిమాణంలో ఒక గడ్డ పుట్టింది. డాక్టరేమో దాన్ని శస్త్ర చికిత్స చేసి తీయాల్సి ఉంటదని చెప్పారు. కృష్ణ దగ్గర ఆ ఔషధ తీగ గడ్డలోని ఒక చిన్న ముక్క తిన్న మీదట రెండు రోజులకే చూడగా నా కాలి వెనుక పుట్టిన గడ్డ ఇంతకు మునుపు ఎక్కడుండేదో తెల్వనట్లుగా మటుమాయమైంది కదా!
ఇది ఔషధ తీగలోని ప్రభావం అని నేను ఎలాగున సైంటిఫిక్‌గా కచ్చితంగా చెప్పగలను? కేవలం ఆకస్మికంగా ఉన్నా ఉండొచ్చు. లేకపోతే మూలికలోని ఔషధ గుణ ప్రభావమనే అనుకొన్నా మనుషుల దేహంలో పుట్టే గడ్డలలో అనేక రకాలు ఉంటవి. వీట్లో కొన్ని గడ్డలమీద మాత్రం ఈ ఔషధ తీగ ప్రభావం పడిందేమో! వీటన్నిట్నీ ఎవరు సంశోధిస్తారు? మారడు లాంటోడు సంశోధించి ఫలితం కనుగొంటే అతనికి వచ్చేది ఏమి లేదు సమాజం తరుపున. మళయాళ స్వామి సైతం తన వృద్ధాప్యంలోని నిత్రాణ స్థితినుంచి కృష్ణకు ఆ తీగ గురించి వివరించి చెప్పి దాని వేరు మూలంలో ఉండే గడ్డను తవ్వి తీసుకో అని చెప్పాడు తప్పితే, ఒకవేళ ఆరోగ్యం బాగుంటే ఆ స్వామే గోప్యంగా వెళ్ళి ఆ గడ్డను తవ్వి తెచ్చి ఇచ్చేవాడు కదా! ఈ నాటు వైద్యులలోని బలమైన ఒక నమ్మకం ఏమిటంటే ఔషధి ఏమిటనేది తెల్పితే ఔషధంలోని గుణం బలహీనమై నష్టపడుతదనే భావన వాళ్ళలో బలంగా పాతుకుపోయి ఉంటది. ఈ పిచ్చి నమ్మకం థనుంచే ఇప్పుడు భారతదేశంలోని నాటు వైద్య పద్దతిలోని మహిమంతా నష్టపడిపోతుంది కదా!
కన్నడ భాషలో దివంగత పూర్ణచంద్ర తేజస్విగారు రచించిన ”మూలికె బళ్ళియ సుత్త” అనే కథను యథాతథరూపంగా తెలుగులోకి అనువదింరు శాఖమూరు రామగోపాల్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~