మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
పుట్టక ముందే గిట్టిపొయేలా చేసే
మానుష-కర్కశత్వాన్ని కాదని
జీవించే అవకాశం మాకు దక్కేది
మా బలగం మరికొంత పెరిగేది !
మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
నాలుగక్షరాలు నేర్చి
ఈ ప్రపంచాన వెలుగులు నింపి
ప్రగతి పథాన పరుగెత్తించే వాళ్లం !
మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
ఈ ‘కట్టు’ బానిసత్వాన్ని కాదని
స్వయం సమృద్ధులమై, మా జీవికను
గౌరవంగా ఆర్జించుకునే వాళ్లం !
మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
దురాశాపరులను
చరిత్ర హీనులను వలదని
సజీవ దహనాలకు బలికాక సురక్ష
జీవనం సాగించే వాళ్లం !
మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
పకడ్బందీ కుటుంబ నియంత్రణ
పథకాలతో ఈ భువిని
‘జన విస్ఫోటం’ నుండి కాపాడి
సుసంపన్నం చేసే వాళ్లం !
మరి కాస్త సహకారం మాకందుంటే
సమాజంలో మానవత్వాన్ని పెంచి
నిస్సహాయ, నిరాశ్రయ స్త్రీ మూర్తుల
బలవన్మర ణాల నంతమొందిచ్చే వాళ్లం !
మరి కాస్త తర్కం మీకుండి,
మాకు చేయూత నిచ్చుంటే
అమానుషపు కట్టు బాట్లు,
మూఢాచారాలు
అంధ విశ్వాసాల వధ్యశిలల నుండి
అతివలెందర్నో తప్పించే వాళ్లం!
కానీ, ఆశించినంతనే ఏ వెలకూ
అందని ‘స్వేచ్ఛ’ ను
ఎవరైనా ఎందుకిస్తారు నేస్తం ?
కాలాతీతం కానీకు – ‘శ క్తి’
సమీకృత గా ఎదిగి-సాగిపో
నీ జీవన యానం జయకేతనాలతో
ప్రభవిస్తుంది !!
-వేంకట చండీశ్వర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`