సమ్మెట ఉమాదేవి కొత్త కథా సంపుటాల పరామర్శ – MVS పద్మావతి

ఒక్కో పుస్తకం చదివినప్పుడు, రచయిత/రచయిత్రికి తగిన గుర్తింపు ఇంకా రాలేదనిపిస్తుంది.. అంత గొప్ప గొప్ప కథలనందించిన వారు మనలో ఒకరుగా తిరుగుతున్నారంటే సంభ్రమంగా అనిపిస్తుంది.

“జమ్మిపూలు” పేరు వినగానే తెలంగాణా గుర్తొస్తుంది. లోపలి పేజీల్లోకెళ్ళి కథలను చదవడం మొదలెట్టగానే మన మనసు తెలంగాణా నేలమీద వాలుతుంది. అక్కడి యాసతో, అక్కడి ప్రజల జీవితాలను మన కళ్ళముందుంచిన తీరు ఉమాదేవి గారు ఆ నేలతో ఎంత మమేకమైపోయారో విశదపరుస్తుంది. ఆ మట్టి వాసన, ఆ పల్లె/తండా ప్రజల ఊపిరి ఆమె శ్వాసలో కలిసిపోయింది.
కొత్తగా ప్రచురించబడి విడుదల అయిన పుస్తకం కాబట్టి కథలను వివరించను.. ఎవరికి వారే చదివి ఆ ఆనందాన్ని, మంచి కథలు చదివామన్న తృప్తినీ ఆస్వాదించాలని నా ఆశ.

ఈ కథల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది తండాల్లో విరిసిన ప్రకృతి వర్ణన. ఉమాదేవి గారిని ఇదివరకు కలిసినప్పుడే ఆమె సునిశిత దృష్టికి, ఆమె గమనింపునకు, ఆమె రోజూ బడికి పోయే రహదారి వెంట ఆమె కళ్ళు ప్రతి చెట్టునీ, ఆకునీ ఎలా గుర్తుపెట్టుకునేవీ గమనించి ఆశ్చర్యపోయాను. పూసిన ప్రతి మొగ్గా, మారాకు వేసిన ప్రతి మొక్కా ఆమెకు జ్ఞాపకమే.. పిల్లలను, ప్రకృతినీ సమానంగా ప్రేమించగల నైజం ఆమె సొంతం. కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటోకి పైన ఆమె ఇచ్చే వ్యాఖ్య ( caption ) కు ఫిదా అయి నేను ఆమెకు రిక్వెస్ట్ పెట్టాను.. ఇవాళ ఏం ఫోటో పెట్టారో, దానికి వ్యాఖ్య ఏం వ్రాసారో అనే ఉత్సుకత చాలా ఉండేది.. ఆ తర్వాత కొన్నాళ్ళు “మా ఊరు-మా వాళ్ళు” పేరిట ఆమె తిరిగిన తండాల ప్రజల చిత్రాలు చూస్తుంటే, ఏ జాతీయ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్లకూ ఆమె తీసిపోరనిపించేది.

ఆ తర్వాత వాళ్ళ బడి పిల్లల ఫోటోలయితే, చెప్పనే అక్కర్లేదు. ఆమె మనసు ఎంత సున్నితమో, ఎంత విశాలమో, ఆమె పిల్లలను, ఉద్యోగాన్ని ఎంత ప్రేమించగలరో ఆ ఫోటోల వ్యాఖ్యల్లో అర్ధం అయ్యేది. ఇటువంటి ఉపాధ్యాయులకు అసలు రిటైర్మెంట్ లేకుండా చేస్తే, బడులు, వాడలు బాగుపడతాయి అనిపించేది.

ఇక కథల విషయానికి వస్తే, 15 కథల సంపుటి “జమ్మిపూలు” . ఇందులో పల్లె ప్రజల జీవితాలను అంత అద్భుతంగా ఆవిష్కరించారంటే, వారితో ఈమె ఎంత మమేకమైపోయారో అర్ధం అవుతుంది. ఏ మెరుగైన సౌకర్యమూ లేని పల్లేల్లో బడి ఈడు పిల్లల చదువులు ఎలా ఉంటాయో, వారిని అభివృద్ధి పథం లోకి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో చాలా వివరంగా అర్ధం అవుతుంది. 

కొన్ని కథలు చదువుతుంటే, ఈ దునియాల ఎన్ని తీర్ల నౌకరీలు ఉన్నాయో సమఝైతుంది. సాఫ్ట్వేరు, బ్యాంకులు, డాక్టర్లే కాదు, బతకడానికి ఎన్నో పనులున్నాయని జ్ఞానోదయం అవుతుంది.. గౌరవంగా బతకడానికి ఏ పనైతేనేమి అనిపిస్తుంది. ఈ కథలను చదివిన మర్నాటినించి, రోడ్డు మీద మనకు కనబడిన బిచ్చగాడు, రైల్లో నేల తుడిచే పిల్లవాడు, టీ అమ్మే నడివయస్కుడు, పాటలు పాడే అమ్మాయి, పెళ్ళిళ్ళలో వడ్డన చేసే అబ్బాయిలు, ద్వారం దగ్గర గులాబీ పువ్విచ్చి స్వాగతం పలికే అమ్మాయిలూ, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో తోటమాలి, కుక్కల ఆలనా పాలనా చూసే కుర్రాడు, ఇంట్లో పెద్దవాళ్ళని కనిపెట్టుకుని ఉండే ఆయా– వీరందర్నీ చూడగానే మన పెదవుల మీద చిరునవ్వు మొలుస్తుంది. వాళ్ళు ఎప్పటినుంచో పరిచయమైనట్టు కనబడతారు.

ప్రభుత్వ సౌకర్యాలు లేని మారుమూల పల్లెలకు మనం వెళ్ళడం తటస్థిస్తే, అవసరాలకు ఆరుబయలుకు వెళ్ళే అమ్మాయిలు ఏ కష్టసుఖాలను తనవారితో పంచుకోవడానికి వెళ్తున్నారో అనిపిస్తుంది. కనుచూపుమేరలో వాళ్ళ అమ్మనాన్నలో, వదినెలో ఉన్నారేమో అని మన దృష్టి అటు వైపు సాగుతుంది కూడా.

బ్రతకలేక భయపడి ప్రాణాలు తీసుకున్న కుటుంబాలను గురించి విన్నప్పుడు ఓ సత్తెక్కో, బోజ్యానో వీళ్ళను ఆదుకోవడానికి రాలేదా అని కన్ను చెమరుస్తుంది. ద్యాలిని, చంప్లీ ని చూసి మనం కొన్ని బతుకు పాఠాలు నేర్చుకుంటాం కూడా. ఇహ కావేరి కళ్ళల్లో మెరుపు అలాగే ఉండాలని మనసారా కోరుకుంటాం.
కల్మషం లేని పల్లె ప్రేమలు, ఆలుమగల అనురాగాలు, సహజ స్వభావం కొద్దీ ఆరళ్ళు పెట్టినా, అంతలోనే ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అత్తలు, అరమరికలు లేని మనసులు, పైకి ఓమాట, లోపల ఓమాట తెలియని అమాయకత్వం — ఇన్ని మాటలెందుకు, ఈ పుస్తకం చదివిన చాలా రోజులు మనం కూడా ఆ పల్లెవాసులం అయిపోతాం. ఇహంలో మన ఇంట్లో మనం ఉన్నా, మన ఆత్మ ఆ పల్లెల్లోనే ఉండిపోతుంది, ఆ మనుషుల చుట్టూ, ఆ పరిస్థితుల చుట్టూ.. ఆ బడి, ఆ పిల్లలు, ఆ కష్టాలు, కన్నీళ్ళు, ఆనందాలు, సంబరాల చుట్టూ..

ఈ కథలను చదివిన తర్వాత, మనసు నిండిపోతుంది.. ఇన్నాళ్ళూ మనం చదివినవన్నీ కథలే కావనిపిస్తుంది. కథలు వ్రాయడం ఎంత కష్టమో అనిపిస్తుంది. ఇంతకు మించిన సమీక్ష వ్రాయలేకపోయానంటే ఇంకో కారణం కూడా ఉంది.

“మనసు నిండిపోయాక మౌనమే బాగుంటుంది.. మాటల కన్నా కూడా.. మౌనంగా ఇప్పటికే ఆస్వాదిస్తూనే ఉన్నా ఆ జీవితాలను, జమ్మిపూలు పరుచుకున్న ఆ పల్లె రహదారులను..”

సమ్మెట ఉమాదేవి కథానికలు: 

పద్నాలుగు కథల ఈ సంపుటిలో వేటికవే ప్రత్యేకం. ఓ మహిళగా మహిళా ప్రధానమైన ఇతివృత్తాలు తీసుకోవడంలో అసహజత్వం ఏమీలేదు. స్త్రీ మనసులో రేగే వివిధ సంఘర్షణలను ఉమాదేవి అద్భుతం గా ఆవిష్కరించారు.. మహిళల జీవితాలన్నీ అడుగడుగునా ఆపదలమయమే. తండ్రితో, భర్తతో, తోటి ఉద్యోగులతో , నిరంతరం సమరమే. బతుకు సాగించడానికీ, బాధ్యతలు సవ్యంగా మోయడానికీ పడే తపనలో ఒక్కోసారి ఆడది కర్కశంగా కూడా మారిపోతోంది.. ఆమె కఠినత్వం వెనుక ఆమె పడిన వేదనలెన్నో.. చర్విత చర్వణం, పితృదేవోభవ, నా కంటి నీటి ముత్యమా, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు కథలు వివిధ సందర్భాలలో స్త్రీ ఆవేదనను అక్షరయవనికపై సాక్షాత్కరింప చేస్తాయి. సంసారంలోని సరిగమలు స్వరం తప్పితే వాటిని మళ్ళీ సరిచేసి అనురాగరాగం పలికించడానికి ఒక గృహిణి పడే తపన మలచిన తీరు ఓ అద్భుతం.

రెండు వేర్వేరు మతాలవారి మధ్యన గల ఆప్యాయత, ప్రేమతో కూడిన చనువును మనం కూడా అనుభవిస్తాం. నిత్యావసరాలకు కరువొస్తే మనుషుల్లో వచ్చే మార్పు , వారి పోకడలు , మనఃస్థితి వర్ణించిన తీరు మనల్ని మనమే కథలో చూసుకున్నట్టు అనిపిస్తుంది.

ఉమాదేవి గారి కథల్లో రాజకుమారులు, జమీందారు బిడ్డలూ ఉండరు. కథల్లో పాత్రలు నేల విడిచి సాము చేయవు. మన చుట్టూ ఉన్న మనుషులు ప్రవర్తించే తీరు, మధ్యతరగతి జనాల రోజువారీ జీవితాలు, అందులోని ఘర్షణలూ, జీవన పోరాటం — మన కథే మనం చదువుతున్నామా అనుకునేటట్లు ఉంటాయి. అందుకే ఈ కథలు మనసులోకి తొందరగా ఇంకిపోతాయి.. పాత్రలన్నీ చదువరుల మనసు గదుల్లో ఓ మూలన సర్దుకుంటాయి.. అలాంటి మనుషులనే మనం బయట చూసినప్పుడు అవి మనకేసి కొంటెగా తొంగి చూసి పలకరిస్తాయి.‌

కథలన్నీ మీకోసం ఎదురుచూస్తున్నాయి.. అందుకే నేను వివరంగా చెప్పడం లేదు.. కానీ, ఈ కథలను మిస్ అయితే గుండెలో ఓ మధురభావనను మిస్ అవుతాం అని మాత్రం చెప్పగలను.

జమ్మి పూలు: వెల రు 160/-
సమ్మెట ఉమాదేవి కథానికలు: వెల: రు.160/-

పుస్తకాలు నేరుగా రచయిత్రి నుండి ఫోన్ పే ద్వారా చెల్లించి పొందవచ్చు.
సమ్మెట ఉమాదేవి, 9849406722

– MVS పద్మావతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో