మేకోపాఖ్యానం-5 మదర్స్ డే -వి. శాంతి ప్రబోధ

మదర్స్ డే

“అబ్బబ్బా ఎండ మండి పోతున్నది” అనుకుంటూ మర్రి వృక్షం కిందికి వచ్చి చేరింది గాడిద.
“నా హృదయం మండిపోతున్నది” దీర్ఘ శ్వాస వదిలి అన్నది ఆడమేక

“ఎండ మండితే గొంతెండి పోవాలి కానీ గుండె మండటం ఏంటి విచిత్రంగా” అన్నది మగమేక భార్య మేక కేసి ఆశ్చర్యంగా చూస్తూ ..

“అటు చూడండి . “చెట్టుకింద సొమ్మసిల్లి పడి ఉన్న ముసలి అమ్మను చూపుతూ అన్నది ఆడమేక .
మగమేక, గాడిద అటు చూశాయి.

అంతా మామూలుగానే ఉన్నట్టుంది. వాటికి ఏమీ తేడా కనిపించలేదు .
ఏముందన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది మగమేక

“అటు చూడు అనే బదులు విషయం ఏంటో చెప్పొచ్చుగా ” విసుగ్గా అన్నది గాడిద .

“ఆమెను చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆ అమ్మను చూడండి” అన్నది

“రోజూ ఈ చెట్టుకింద కనబడే దృశ్యాలేగా.. నీ హృదయం మండిపోయేంత ఏముంది అందులో..? వెటకారంగా అన్నది గాడిద

“రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఒంటి చేత్తో పెంచి పెద్ద చేసింది. బుడిబుడి అడుగుల బుడతడి తండ్రి చిన్నప్పుడు దూరమైతే తల్లీ తండ్రీ తానే అయి పెంచింది. ఆకలి తీర్చింది. నడక నేర్పింది. నడత నేర్పాననుకుంది.

అంతులేని ఆప్యాయత, ప్రేమానురాగాలు పంచి ఇచ్చింది. సరదాలు, షికార్లు బలాదూర్ తిరుగుళ్లతో బడి వదిలిన కొడుకును సరిదిద్దింది. అతను చేసిన తప్పుల్ని కడుపులో దాచుకుంది. పరీక్షల్లో తప్పిన కొడుకుని కనికరించింది. భవిష్యత్ కు బాటలు పరిచింది.

చెట్టంత ఎదిగిన కొడుకు తనను ఒంటరి చేసి భవిత వెతుక్కుంటూ దూర తీరాలకు పోయినా బాధపడలేదు. అతనికి మంచి జీవితం దొరికిందని సంబరపడింది. వారి క్షేమం కోసం పరితపించింది.
కొడుకు రాక కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది.

ఏడెనిమిదేళ్లుగా వినని కొడుకు గొంతు వినడం కోసం చకోరపక్షి లాగా ఎదురు చూస్తుంది.

తన ఎరుకలో అమెరికా వెళ్లే వాళ్లందరికీ తన కొడుకుని అడిగానని చెప్పమంటుంది. తన దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్ కి ఫోన్ చేయమని కొడుకుకు చెప్పమని కోరుతుంది.

కోట్లు సంపాదించిన కొడుకు కు అమ్మని పలుకరించే తీరికలేదు. వచ్చి చూసేంత ఓపిక లేదు అని ఎవరైనా అంటే ఊరుకోదు.

మీ అందరి కళ్ళు నా కొడుకు సంపాదన మీదే.. నా కొడుకు అక్కడ ఎంత పని వత్తిలో ఉన్నాడో… తీరిక ఉంటే అమ్మ కోసం రాడా .. కనీసం ఫోనైనా చేయక పోతాడా అంటూ ఎదుటివాళ్ళ నోరు మాయిస్తుంది ఆ తల్లి. కొడుకు కోసం ఎదురు చూస్తుంది తప్ప మనసులోనైనా పల్లెత్తు అనదు.

ఏడాదికి ఒకసారి కొడుకు పేర వచ్చే మదర్స్ డే పూల గుత్తి, స్వీట్ ప్యాకెట్ కోసం ఎదురు చూసింది. తల్లిపై ప్రేమనంతా మూటగట్టి యాడాది కోసారి పంపిస్తున్నాడని మురిసి పోయింది. ఇంటి ముందు అరుగులపై కూర్చొని వచ్చే పోయే వాళ్లందరికీ కొడుకు పంపిన పూల గుత్తిని చూపుతూ, స్వీట్ పంచుతుంది. ఆ రకంగా కొడుకు తనను గౌరవిస్తున్నాడని అంబరాన నిలిపింది ఆ పిచ్చి తల్లి.

అతని కోసం సర్వం ధారపోసి పెంచిన తల్లి, కళ్ళలో పెట్టి కాపాడుకోవలసిన ఆ తల్లి దిక్కు మొక్కు లేని అనాధగా ..

తీవ్ర అనారోగ్యంతో ఈ చెట్టు కింద పడి ఉంది. అందుకే నా గుండె బరువయింది.
ఆమెను పట్టించుకోని కొడుకు మీద, ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన వాళ్లపై నాకు మండిపోతూ ఉంది.

“అయ్యో .. అవునా .. ” అన్నది మగ మేక

“ఆమె కొడుకు అమెరికాలో ఉన్నాడా ..? ఎవరో బిచ్చగత్తె అనుకున్నాను” అన్నది గాడిద.

“అదిగో ఆ మూలింటి ఆమె” చూపింది ఆడమేక

“మరి ఆ ఇల్లు వాకిలి .. ?”

“ఆమెవే. ఒకప్పుడు చిన్న ఇల్లు ఆమెది. అమెరికా కొడుకు కట్టించిన ఇల్లు ఇది. కొడుకు తల్లిని తనతో అమెరికా వచ్చెయ్యమన్నాడట.

మీరిద్దరూ ఉద్యోగాలకు పోతే నేనొక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ ఉండలేను బాబు , నా వల్ల కాదు. భాష తెలియని పరాయి చోట మంచి చెడు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు.

ఉన్న ఊరు, అయినవాళ్లు అందరినీ వదిలి ఉండలేను అని ఖచ్చితంగా చెప్పిందట. తల్లికి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేశాడు కొడుకు.

సగం ఇల్లు కిరాయికి ఇస్తే వచ్చే డబ్బు, ఎకరం పొలంలో వచ్చే ఆదాయం అమ్మకి సుబ్బరంగా బ్రతికేయొచ్చు అనుకున్నాడు.

అనుకున్నట్టుగానే ఇంట్లో ఒక పోర్షన్ బంధువుల కుటుంబానికి అద్దెకు ఇచ్చింది.”

“ఓ ఆ రకంగా తన బాధ్యత వదిలించుకున్నాడా ఆ కొడుకు ?” ప్రశ్నించింది మగమేక

“ఇంకేం పోయేకాలం మరి? దిక్కు మొక్కు లేనట్టు పడుంది?” ఆశ్చర్యంగా గాడిద

” నువ్వూ నీ ఆత్రం పాడుగాను, చెప్పే దాకా ఓపిక పట్టలేవు ..” అని విసుక్కుని చెప్పడం మొదలు పెట్టింది ఆడమేక

” ఓపిక తగ్గిన ఆ తల్లి, సహాయంగా తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయిని చేరదీసింది. ఒకరికి ఒకరు తోడై బతుకుతున్నారు.

సహాయకురాలికి మొన్న కరోనా సోకి హాస్పిటల్ లో చేరింది.
ఈమెకు కూడా కరోనా వచ్చి ఉంటుందని ఇంట్లో ఉన్న వారు బయటకు గెంటారు.

“అయ్యో .. కరోనా భయమా ..” అన్నది మగమేక.

“ఆమె ఇంట్లో నుంచి ఆమెను గెంటేయడం ఏంటి ” అరిచింది గాడిద

“అందుకే నాకు కడుపు మండిపోయింది ” ఆవిడకి ఎలా సహాయం చేయగలం అని ఆలోచిస్తున్న ఆడమేక అన్నది.

“అసలీ విషయాలన్నీ నీకెట్లా తెలిశాయి?” ఆరా తీసింది గాడిద

“నిన్న మొన్నటి దాకా నాకు కూడా తెలియదు. మీరు రాకముందు చెట్టుకింద చూసిన వాళ్ళు అనుకోగా విన్నాను ” చెప్పింది ఆడమేక

” ఇంకేం అనుకున్నారేంటి ?” కుతూహలంగా గాడిద

“తల్లులను గౌరవిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికాలో మదర్స్ డే జరుపుకుంటారట. చాలా దేశాల్లో మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవం జరుపుకుంటారట “

“అమ్మకు ఒక రోజేంటి అన్ని రోజులు రాసిచ్చినా సరిపోదు” అన్నది మగమేక
అవునన్నట్లుగా తలూపింది గాడిద

“మదర్స్ డే రోజు నా కొడుకు నుంచి వచ్చే పూలగుత్తి తీసుకోవాలి . ఆ తర్వాతే నేను హాస్పిటల్ కి పోత. అంతవరకూ నేనిక్కడే ఉంటా అని కదలలేదట.

ఇంట్లో ఉన్నవాళ్లు 108 కబురంపారు. వాళ్ళు ఫోన్ లోనే లక్షణాలు అడిగి ఇంట్లో ఉండమన్నారు.
అయినా ఇంట్లో ఉన్నవాళ్లు దొడ్లోకి రాకుండా గేటుకి తాళం వేశారట.

అలా ఇంట్లో ఉన్న వాళ్ళు గెంటితే బయట అరుగు మీద కూర్చుందట . ఆ తర్వాత, వాళ్ళు అక్కడ కూడా ఉండనివ్వక పోతే ఈ చెట్టు కిందికి చేరిందట “

“చ్చో ..చ్చో .. పాపం , ఆ తల్లికి కొడుకు మీద ప్రాణం ఎంత కొట్టుకులాడిపోతున్నదో .. ” అన్నది మగ మేక .

“ఏం కొడుకు? పనికిరాని పూల గుత్తి పంపే బదులు వచ్చి చూసి పోవచ్చుగా …” గొణిగింది గాడిద

“ఇంకెక్కడి కొడుకు, ఆ కొడుకు రోడ్డు ప్రమాదంలో పోయి చాన్నాళ్లయింది.

ఆ విషయం ఆ తల్లికి తెలియనీయదు తానో బిడ్డకు తల్లి అయిన కోడలు.

సర్వం తానే అయి చిన కొడుకు లేడనే వార్త వింటే ఆ తల్లి గుండె తట్టుకోలేదని.
ఎప్పటిలాగే కొడుకు తల్లికి పంపినట్టే ప్రతి ఏడూ కోడలు పూలగుత్తి, స్వీట్ ప్యాకెట్ పంపిస్తున్నదట” వివరించింది ఆడమేక

“అసలు మదర్స్ డే ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో గానీ ఆ రోజు పంపే పూలగుత్తి ఏడాదికోసారి కొడుకును చూసుకున్న అనుభూతినిచ్చింది ఆ తల్లికి ” అన్నది మగమేక

“ప్చ్ .. పాపం ఆ తల్లికి ఎంత దుర్గతి పట్టింది ” దుఃఖంగా ఆ తల్లి కేసి చూస్తూ అన్నది గాడిద

” ఆ తల్లి స్థితికి దుఃఖం, బాధ ఆమెను అనాధలా గెంటేసిన వారిపై కోపం.. మనకే ఇలా ఉంటే ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తున్నదో ..” అన్నది ఆడమేక

వీళ్ళ ముచ్చట్లు ఆ తల్లి గురించి సాగుతుండగానే ఆ చెట్టు కింద చేరిన వారిలో కొందరు ఆ తల్లి కేసి చూస్తూ ముసల్ది చచ్చినట్టుంది అని దూరం జరిగారు.

“అమ్మ ఒక అద్భుతం
ఆమె ప్రేమ మహా అద్భుతం
ఆమె అందించే అనురాగం,
ఆత్మీయత , అనుబంధం.. . “

వారిలో ఒకరి సెల్ ఫోన్ నుంచి వస్తున్న రింగ్ టోన్ వింటూ ఆ ప్రాంతమంతా నిశ్చబ్దమైంది అమ్మ తలపులతో .

వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో