*పెళ్ళి రోజు కానుక*(కథ)-కౌలూరి ప్రసాదరావు

” అమ్మగోరు అదోలా ఉండారు, ఓ పాలి సూడు!” చెవులు కొరికేస్తూ గుసగుసలాడింది,పని మనిషి రంగమ్మ. ఆమె భర్త కిట్టప్ప యజమానురాలు భారతి వైపు చూసి, “అదేటి నేదే , ఎర్రిమొకమా!నిన్నట్నుంచీ పనుల్తో తీరిక నేకుండా పోయింది. కుసింత మొహం తోటకూర కాడలా వాడినాదంతే” తేలిగ్గా చప్పరిస్తూ కొట్టి పారేసాడు. “నీ బుర్ర సరిగా పనిసెయ్యదేటి? అలిసి పోయిన దానికి,అలిగిన దానికి తేడా తెలీకండా పోనాది” అంది భర్త బుగ్గ మీద ఓ పోటు పొడిచి. గిచ్చిన బుగ్గని అరచేత్తో సవరదీసుకుంటూ,మరోసారి చూసి ” నిజమేనేవ్,ఏదో తేడాగున్నాది” అన్నాడు సాలోచనగా. మొగుడు తన మనసులో మాటని సమర్ధించటంతో సంబర పడిన రంగమ్మ,కిట్టప్ప వైపు మెచ్చుకోలుగా చూస్తూ,”అద్గదీ వరస,ఇప్పుడు దారిలో పడ్డావు” అంటూ ” నిన్న బట్టలు కొన్నకాడ్నించీ ఇదే తీరు ” గుంభనంగా చూసింది రంగమ్మ.

  అర్ధంకాని కిట్టప్ప అమాయకంగా చూస్తుంటే,అసలైన గుట్టును గుప్పిలి విప్పింది.”మనిద్దరికి బట్టలు తీసిన శెణం నుంచీ కల్లల్లో నిప్పులు పోసేసుకుంటన్నాది మావా!” కడుపులో తెములుతున్న నొప్పిని కక్కేసి,కిట్టప్ప వేపు సాభిప్రాయంగా చూసింది. హఠాత్తుగా వచ్చిన ఉప్పెనలా,కోపం నషాళానికంటిన కిట్టప్ప,పెళ్ళాం వైపు తోకతొక్కిన తాచులా చూసాడు. “ఛత్ ! నోర్ముయ్యెస్! నీ యమ్మిడియాలి.శివయ్య,పారోతమ్మ లాంటి మడుసుల్ని పట్టుకుని అంత మాటంటావా? నీ నాలిక్కోసి,ఉప్ఫూ కారమెట్టీగల్ను.” అని చేయెత్త బోతుంటే అప్పటి వరకూ వారి సంభాషణ శ్రద్ధగా వింటున్న నాకు గొడవ శృతి మించి రాగాన పడేటట్టుందనిపించి గొంతు సవరించుకుని “కిట్టప్పా!?” అన్నాను. తలుపు దగ్గరి నుండి లోపలి కెళ్ళి కుర్చీలో కూర్చుని. “అయ్ గారూ!” అన్నారిద్దరూ ఒకేసారి.వారి మాటలు నేను విన్నానేమోననే శంకతో ఒక్కసారిగా తుళ్ళిపడ్డట్టు నాకు స్పష్టంగా అర్ధమైంది. అప్పుడే లేచినట్టు,బైటికొచ్చి, “అవతల బోలెడు పనులు పెట్టుకుని,ముచ్చట్లు పెట్టారా! తొందరగా సామాను సర్ధండీ!మీ సరసాలేమైనా ఉంటే,రాత్రి భోజనాలయ్యాక చూసుకోండి” అంటూ వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నించాను.

కిట్టప్ప భార్యవైపు కొరకొరా చూస్తూ ” ఈ ఆడాళ్ళ సంగతీ మీకు ఇవరంగా తెల్దు బాబూ! పక్కా సత్తెబామ బాపతు.కాళ్ళు పట్టించీగల్రు, ఇగటమాడినపుడు అదిలించనేకపోతే నెత్తికెక్కి డాన్సాడేగల్రు!మన సేత కూడా ఆడించేత్తారు.ఓసోస్ ఈ ఏషాలు నాకాడ కాదు”అంటుంటే మధ్యలోనే ఆపి “ముందు పని చూడండి ” గంభీరంగా చెప్పి లోనికెళ్ళాను.

నిజానికి వారి సంభాషణ మొదట్నుంచీ వింటూనే ఉన్నాను. “అంతఃపుర రహస్యాలు పరిచారకుల కెరుకే కదా?”అయితే నాకు కోపమేమీ రాలేదు,రాదు కూడా! ఎందుకంటే నాలో ఉన్న లోపాలు,దాపరికం లేకుండా బయట పడతాయి ఇటువంటి వారివల్లే.సద్విమర్శ అయితే నన్ను నేను సంస్కరించు కుంటాను.కాలక్షేపపు పుకారులైతే కాసేపు నవ్వుకుంటాను.నా ఉద్దేశం ప్రకారం స్నేహితులకంటే పగవారే మనల్ని కరెక్టుగా అంచనా వేయగలరు.’ఎంతమంది శత్రువులుంటే అంత ఎత్తుకు ఎదిగినట్టనేది’ నా నిశ్ఛితాభిప్రాయం.నా భార్య భారతి వైపు చూసాను.

వంటింటి నుంచి,హాలు లోకి,అక్కడ నుండి,బెడ్ రూమ్ లోకి చక్కర్లు కొడుతూ,పిల్లల్ని తయారు చేస్తున్నట్టు తెగ హైరానా పడుతున్నట్టు కనిపిస్తోంది గానీ,వాస్తవానికి ఏ పనీ చేయకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేసింది.పైకి మామూలుగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా,అదిమి పెట్టలేని ముభావం భారతి మొహం మీద నీటి బుగ్గలా ఎగసి పడుతూనే ఉంది.పెదవులు ఉచ్ఛరిస్తున్న ప్రశ్నలేవో నా చెవుల వరకూ దూసుకొచ్చి మొహమాట పడి వెనుదిరిగి పోయి,గ్లాసులు,స్పూన్లను తాకి కింద పడేస్తున్నాయి.భారతిలోని అసహనానికి బలైన పాత్రలు కిందపడి తలబొప్పికట్టి చేస్తున్న ఆర్తనాదాలు వింటూనే ఉన్నాను.ఎప్పుడూ తూరుపు రేకలు విచ్చుకునే కనులు మసిబారిన దీపాలయ్యాయి.

చేతులు యాంత్రికంగా పనిచేస్తూ నిర్లిప్తతను ప్రకటిస్తున్నాయి.మనసు కొద్దిగా చలించింది. ‘ఏడిపించింది చాలు,ఇక చెప్పేద్దామా ?’అని క్షణంపాటు మనసు బలహీనపడింది.కానీ ‘ధ్రిల్ ‘ పోతుందని సంభాళించు కున్నాను. ఎలాగూ కాసేపట్లో తెలుస్తుంది కదాని సమాధానపడ్డాను.ఇవాళ మా పెళ్ళి రోజు.మా జీవితాల్లో ఏకైక పండుగ ఇదొక్కటే.పుట్టిన రోజులు జరుపుకోం. ఎందుకంటే మేము ఎప్పుడు పుట్టామో సరిగ్గా తెలీదు.నేనూ ,నా భార్య ఇద్దరం అనాధలమే. అనాధ ఆశ్రమంలో నమోదు చేయబడిన బర్త్ డేటు మీద మాకు ఆసక్తి లేదు.అందుకే వివాహ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం.

ఇక మా ఆవిడ అలకకి చాలా కారణాలున్నాయి.వాటిలో మొదటిది ఇంట్లో ఫంక్షన్ చేయక పోవటం.ప్రతి సంవత్సరం బంధుమిత్రులను ఆహ్వానించి,వైభవంగా సంబరం చేస్తాము.ఈసారి ఎవరినీ పిలవలేదు
ఊరి బయట పిక్నిక్ లా సింపుల్ గా ప్లాన్ చేసాను.రెండవది బట్టల కొనుగోలు మాతో పాటు పనిమనిషి రంగమ్మ,ఆమె భర్తకి కూడా తీసాను.ఐతే రంగమ్మ అపోహ పడినట్టు,పనివారికి బట్టలు కొన్నందుకు కినుక పడలేదు.

కానీ అదనంగా తెచ్చిన రెండు జతల దుస్తులు ఎవరికో అర్ధంకాక నేను చెప్పకుండా గోప్యంగా, ఉంచినందుకు హర్టయి సతమతమై పోతోంది.ఎందుకంటే మా మధ్య ఇప్పటివరకూ రహస్యాలేమీ లేవు,ఇన్నాళ్ళకో విషయం దాచాను,మూడోది అసలైన కారణం బహుమతులు.

ప్రతీ ఏడాదీ పెళ్ళికానుకలు ఇచ్చి పుచ్చుకుంటాం.పాపకి,బాబుకి చెరో గొలుసూ తీసుకున్నాం.భారతి నా కోసం రింగ్ కొన్నది.నేను మాత్రం తన కోసం మునపట్లా ఏ గిఫ్టూ ఖరీదు చేయలేదు.అందుకే నిన్న షాపింగ్ ముగిసిన దగ్గర్నుంచీ, నా పట్ల నిరసన పెల్లుబుకుతున్నా,బలవంతంగా ఆనకట్ట వేస్తుందని తెలుస్తూనే ఉంది.ఎవరూ లేని మేము ఒకరికొకరం ఆదరణ.మాకు మేమే ఆలంబన.బంధుమిత్రుల కొరత కొంత భర్తీ అయినా ,తల్లిదండ్రులు,అత్తమామలు లేని లోటు అడుగడుగునా మమ్మల్ని వేధిస్తూనే ఉంది.ఉద్యోగాలు సాధించినా, ఆస్తులు సంపాదించినా అయినవారు లేరన్న వేదన వెంటాడుతుంటుంది.ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుని సాంత్వన పొందుతాం.

ఒక వస్తువు విలువ అది దగ్గర ఉన్నపుడు కాక దూరమైనపుడే తెలుస్తుంది.అమ్మా నాన్నల విలువ అనాధలమైన మాకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది?.నా భార్య బైటికి ఏడిస్తే,నేను మనసులోనే రోదిస్తాను.

పిల్లలు పుట్టాక కాస్త ఉపశమనం కలిగినా ఆవేదన ఇంకా రగులుతూనే ఉంది.భారతి వైపు నర్మగర్భంగా చూసి “కాసేపు ఓపిక పట్టు డియర్ ” అని మనసులోనే నవ్వుకున్నాను .కానీ నా నిర్ణయాన్ని స్వాగతిస్తుందా? వ్యతిరేకిస్తుందా?’అనే సందిగ్ధం నన్ను పీడిస్తూనే ఉంది.చెప్పిన పని తలూపుతూ చేస్తుందే తప్ప మౌనం వీడి మాట్లాడటం లేదు.రంగమ్మ అనుమానం తీరక ఇంకా విడ్డూరంగా చూస్తుంటే”మీ అమ్మగారు నవ్వితే నవరత్నాలు రాలతాయి.వాటిని ఏరుకుని మీరెక్కడ ఉంగరాల్లో పొదిగించు కుంటారోనని మాట్లాడటం లేదు” అంటూ మేలమాడాను.అయినా భారతి పెదవి విప్పలేదు.ఏమనాలో తెలీక రంగమ్మ దంపతులు మారు మాటాడకుండా పనిలో నిమగ్నమయ్యారు.
ఒక ట్రక్కు ఆటోమీద సామాన్లు ఎక్కించాం.వండిన పాత్రలు,నీటి డ్రమ్ము,కింద పరచటానికి చాపలు వగైరాలు సర్దాం.కారులో నేనూ భారతి,పిల్లలూ,ఆటోలో రంగమ్మ , ఆమె భర్తా బయలుదేరాం.సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఒక పాడు బడిన బస్ షెల్టర్ ఉంది.తిన్నగా దాని దగ్గరకు దారి తీసాను.అరగంటలో అక్కడికి చేరుకుని,’అత్తమ్మా,మావయ్యా!’అని పిలిచాను.నా పిలుపు విని శిధిల కట్టడంలో పడుకున్న వృద్ధ దంపతులు లేచి’నువ్వా బాబూ!’ అన్నారు సంభ్రమంగా.వారివైపు మొహం చిట్లించి చూస్తున్న భారతితో ‘కంగారు పడకు,మెల్లగా అంతా అర్ధమవుతుంది”అంటూ రంగమ్మ,ఆమె భర్తకి పురమాయించాను వృద్ధులకి స్నానం చేయించమని.

వాళ్ళు అయోమయంగా చూస్తూ ముసలి వాళ్ళకి తలంటు పోసారు. ఈలోపు ఆటో డ్రైవరు సాయంతో పలావు,చికెన్ వండిన పాత్రలు, పాయసం గిన్నె దించాను.చాపలు పరచి అన్నీ సిద్ధం చేసాను.పని పూర్తి చేసిన రంగమ్మ దంపతులకి బట్టలు చేతికిచ్చాను.వాళ్ళు సంతోష పడుతుంటే,మా ఆవిడ అనుమానంగా చూసిన వస్త్రాలు తీసి ముసలి వాళ్ళకిచ్చి ధరించ మన్నాను.వాళ్ళు విస్తుబోతూ షెల్టర్ లోకి వెళ్ళారు.భారతి విస్మయంగా చూసింది.ఒక్కొక్క రేకూ విప్పుకుంటూ పువ్వు వికసిస్తున్న భావన.ఏదో అవగతమౌతున్నట్టు తల పంకించింది.కొద్ది క్షణాల తర్వాత ముసలి వాళ్ళు బట్టలు కట్టుకుని బయటికి వచ్చారు.తెల్లని పట్టు బట్టల్లో పెద్దవాళ్ళు ఆది దంపతుల్లా వెలిగిపోతున్నారు. కిలుం వదిలి పోయిన కంచు పాత్రల్లా ధగధగ మెరిసి పోతుండటం చూసి సంతృప్తిగా నిట్టూర్చాను.ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళనుకుంటా, పూర్వ వైభవం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.కళ్ళలో కృతజ్ఞత వెల్లువలా కురుస్తోంది.
వారిని మొదటిసారి కలసిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది.

                                                                         *****
ఆ రోజు చిన్న పని మీద మిత్రుడింటికి వెళ్ళాను.పని పూర్తయ్యాక బయలు దేరుతుంటే “ఓ ఆట వేసి వెళ్ళవోయ్ ” అంటూ చదరంగపు భోర్డు అమర్చి బలవంతం చేసాడు.వాడు ఒత్తిడి చేసాడని కాదు గాని,నాకూ ఆడాలనిపించింది.చెస్ అంటే చెవి కోసుకుంటాను.హుషారుగా ఆడుతూ చకచకా ఓ అరడజను గేములు గెలిచాను.అప్పటికి బుర్ర వేడెక్కి పోయి,బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి’ఓ టీ ఇవ్వరా! తాగేసి పోతాను” అన్నాను.కానీ వాడికి సంతృప్తి కలగ లేదు.ఇంకో ఆట అంటూ మరో అరడజను గేములు ఆడించాడు.అంతేకాదు గేముకో ‘టీ’ తెప్పించాడు.అప్పుడు నాకో విషయం స్పష్టమైంది. నా మీద గెలిచే వరకూ నన్ను వదలడని.తరువాతి ఆటలన్నీ కావాలనే ఓడిపోయాను.గెలిచే కొద్దీ వాడి మొహంలో విజయం తాలూకు కాంతి నడిమింటి సూర్యుడిలా ప్రకాశించింది.కాసేపయ్యాక నా మీద జాలిచూపుతూ,”ఇవాళ్టికి చాలు లేరా! మరోసారి తీరికగా ఉన్నపుడు ఆడదాం! పైగా మా చెల్లి నీకోసం కంగారు పడుతుంటుంది ” అంటూ సాగనంపాడు.’మంచితనమంటే,ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఉండటం కాదు, మనం కొంత నష్టపోయి ఎదుటి వారి అహాన్ని సంతృప్తి పరటం’ అనే పాఠం బోధ పడింది.తిరిగి వస్తుండగా,నన్ను కలవర విషయాలు రెండున్నాయి. ఒకటి ఆటలో పడి చీకటి పడిన సంగతి.రెండోది ఆకాశం కారు మబ్బులతో కప్పబడి,ఏ క్షణంలోనైనా కురియటానికి సిద్ధంగా ఉంది. మొండి ధైర్యంతో ముందుకు సాగిపోతుంటే,అనుమానించినట్టుగానే ఆకాశం కుళాయి విప్పేసింది.దగ్గరే కదాని బైక్ వేసుకొచ్చా.కుంభ వృష్టికి తడిచిపోతూ కాసేపు తల దాచుకోవటానికి నీడ దొరుకుతుందేమోనని చూస్తుంటే ఈ పాడుబడిన కట్టడం కనబడింది.

బండి ఆపి లోనికి చొరబడి కర్చీఫ్ తో తల తుడుచు కుంటుంటే విన్పించిందా మూలుగు.ఉలిక్కిపడి చూస్తే ముసలి బిచ్చగాడొకడు జ్వరంతో బాధ పడుతుంటే ,భార్య జావ తాగిస్తూ సపర్యలు చేస్తోంది.వారిని చూడగానే మనసు చివుక్కుమనిపించింది .దుమ్మూ ధూళితో నిండి భూత్ బంగ్లాలాంటి షెల్టరు.జవసత్వాలు ఉడిగి పోయి చావుకోసం ఎదురు చూస్తున్న ముసలివాడు.చిరిగిన బట్టల్లో శోక దేవతలా ముసలామె.గోడకంతల్లోంచి వారి మీదకి ఉరుకుతూ తడిపేస్తున్న జాలి లేని వాన. వారినలా చూస్తుంటే హృదయం ద్రవించింది. చప్పున నా అనాధ జీవితపు రోజులు కళ్ళముందు కదలాడాయి.ఎవరైనా నా స్ధితికి జాలిపడతారని, కాస్తంత చేయూతనిచ్చి,ఆదుకుంటారని ఎంతగా ఆశపడ్డానో,ఆదరువు కోసం అలమటించానో జ్ఞాపకమొచ్చి కన్నీరు పొంగింది. కళ్ళు తుడుచుకుంటుంటే ముసలావిడ గద్గదస్వరంతో చెప్పింది ” నాల్రోజులుగా ముసలాయనకి జ్వరం బాబూ! ఆయన్ని ఒంటరిగా వదిలేసి అడుక్కోవటానికి వెళ్ళలేక పోయాను. ఉన్నదాంట్లోనే కాస్త జావ కాసి పోస్తున్నాను.మందులకి డబ్బుల్లేక పసరు వైద్యం చేస్తున్నాను “అంటూ తన అశక్తతని తలుచుకుని వణికింది.

జావ తాగి కాస్త తెప్పరిల్లిన వృద్ధుడు కళ్ళు విప్పి భార్యని ఇబ్బంది పెడుతున్నానన్న అపరాధ భావాన్ని కళ్ళతోనే పలికించాడు.నన్ను చూడగానే వారికి ఎక్కడలేని నిశ్చింత కలిగినట్టు గుర్తించాను.  మామూలుగానే ఎవరూ రాని ప్రదేశానికి,వర్షంలో పైగా అనారోగ్యంతో దిక్కుతోచక తల్లడిల్లుతున్న సమయంలో నేను రావటంతో,ఆ దేవుడే తన ప్రతినిధి పంపాడన్నట్టు నిట్టూర్చారు.
ఈ వృద్ధ దంపతుల అవసరం తీర్ఛాలన్న కృత నిశ్చయంతో పైకి లేచి, హఠాత్తుగా “మీకు నా అన్నవాళ్ళెవరూ లేరా? “అన్నాను. ఆ ప్రశ్న వినటంతోనే ముసలాయన కళ్ళు ఎర్రబడ్డాయి.పురాతన విషాద అనుభవమేదో కుదిపేసినట్టు శరీరం కంపించింది. నేను చటుక్కున చేయి పట్టుకుని సముదాయించాను. కొన్ని క్షణాల తరువాత లేచి,” ఓ గంటలో తిరిగొస్తాను,జాగ్రత్తగా ఉండండి” అంటూ బైకు తీసి భోరున కురుస్తున్న వానలో సిటీ వైపు దూసుకు పోయాను.

ఓ ఆర్.ఎం.పీ.డాక్టరును వెంటబెట్టుకుని.కావలసిన మందులు, ఆహారపు పొట్లాలు తీసుకుని ఆఘమేఘాల మీద వెనక్కి వచ్చాను.వైద్యం చేయించి,కొద్దిగా డబ్బులిచ్చాను.అప్పట్నుంచీ వారి యోగ క్షేమాలు చూడటం,ఎంత బిజీగా ఉన్నా వారానికోసారి కలవటం నా బాధ్యతగా మారింది.నేనే వరసలు కలిపాను.
వాళ్ళు కూడా ‘అల్లుడూ’ అని ఆప్యాయంగా పిలుస్తారు

*****

వృద్ధుల చేతుల్లో అక్షింతలు పోసి”ఈనాడు మా పెళ్ళిరోజు ,మమ్మల్మి ఆశీర్వదించండి”అన్నాను
నివ్వెర పోతున్న భారతి భుజం తట్టి,”ఇక నుంచి వీరే నీ తల్లిదండ్రులు, ఇదే నేను నీకిచ్చే ‘మేరేడ్ డే గిఫ్ట్ ‘ అంటూ పిల్లల కేసి తిరిగి” మీ అమ్మమ్మా,తాతయ్యల్రా,ఇంటికి తీసుకెళ్దామా?”అని అడిగాను.నిన్నటి నుండి పొడి బారిన నా భార్య కళ్ళు ఆర్ద్రతతో చెమ్మగిల్లి,ఆ తడి పిల్లల నేత్రాల్లో తుఫానుగా మారి,ముసలి వాళ్ళ చూపుల్లో తీరం దాటింది.ఏం చేస్తుందో తెలీని భావావేశంలో భారతి అమాంతం నన్ను కౌగలించుకుని ముద్దుల్తో ముంచెత్తింది, అది చూసిన రంగమ్మ దంపతులు, ఆటోవాడు సిగ్గుతో తల పక్కకు వాల్చితే,ఆ దృశ్యం చూడకుండా పిల్లల్ని పొదవి పట్టుకున్నారు పెద్దవాళ్ళు.నా నిర్ణయాన్ని అభినందిస్తూ ఎండుటాకులు చప్పుట్లు కొడితే,చెట్లు పువ్వులు రాల్చి, తలలూపుతూ స్వాగతించాయి.

—కౌలూరి ప్రసాదరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో