ఉద్యమకారిణి, రచయిత్రి దేవకీదేవి తో సంభాషణ  – కట్టూరి వెంకటేశ్వరరావు

తెలంగాణ ఉద్యమకారిణి, ఉపాధ్యాయిని, రచయిత్రి, కవయిత్రి. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి దశలోనే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో భాగంగా ధర్నాలు, పికెటింగ్ లు, రాస్తారోకోలు, ర్యాలీలలో పాల్గొన్నారు దేవకీ దేవి . వారితో ముఖాముఖి  ఈ నెల విహంగ చదువరుల కోసం…..

 

1. నమస్తే మేడం, మీ బాల్యం, కుటుంబ నేపథ్యం మాతో పంచుకుంటారా.
నమస్తె..
నా బాల్యమంతా ఒడిదుడుకులమయమే. మా బాపుది అప్పటి కరీంనగరు జిల్లాలోని హుజురాబాద్.
బతుకుదెరువులో భాగంగా మాఅమ్మమ్మ ఊరు హన్మకొండకు మా మకాం మారింది. .రెండు నుండి ఐదు రూపాయల లోపు ఫీజు…ఇరవై ముప్పై మంది గల పిల్లలతో…సుమారు వంద చదరపు గజాల రెంటు లేని ఖాళీ జాగలో ఆయన బడి.అది చాలా సార్లు స్థానభ్రంశానికి గురౌతుండె .నగరం నడి బొడ్డున రెండు తడుకలతో మూడు అర్రలుగా గుర్తించబడే నాలుగు గోడల గుడిసెనే మా ఇల్లు. మేము కుర్చీలు..మంచాల పేర్లే వినలేదు. కరెంటు దీపాలను కనలేదు. ఏ రోజుకారోజు ఉప్పు..పప్పు మిరుప కాయలతో పాటు చారాన శర్కర..దొవ్వాన చాయపత్త తెచ్చుకోవడం మాకు యజ్ఞంగా ఉండేది. చాయనే మా బ్రేక్ ఫాస్ట్. ఫలితమివ్వని ఉద్యోగాల వేటలో మా అమ్మ…బతుకు దేవులాటలో మా బాపు…మా బతుకులను గట్టెక్కించాలనే ఆరాటంలో కళ్ళులేని అమ్మమ్మ.

ఎవరి పర్యవేక్షణ లేకుండనే ఎనిమిదో తరగతిలో మంచి మార్కులు రావడంతో నా హైస్కూల్ చదువు మా మేనమామ పనిచేస్తున్న జనగామ జిల్లా పరిషత్తు హైస్కూల్ కు మారింది .ఆ మూడు సంవత్సరాలు నా జీవితానికి ఓ మంచి మలుపు. లక్ష్యం దిశగా ధైర్యంగా అడుగులు వేస్తూ మనిషి మనిషిగా జీవించ డానికే ప్రయత్నం చేయాలనే ఆలోచనలకు మామయ్య పర్యవేక్షణ మంచి ఊతమిచ్చింది. ఆయన ప్రోత్సాహం మరువలేనిది.హెచ్.యస్.సి ఐపోతూనే హనుమకొండకు తిరుగు ప్రయాణమైన.

నా ప్రమేయం లేకుండనే మా ఆరో మామయ్య పింగిల్ విమెన్స్ కాలేజీలో పి.యు.సి (బి.పి.సి ) కి అప్లై చేసిన్రు.అంతవరకు నేను చదివింది తెలుగు మీడియంలో .ఆ. రోజులలో హైస్కూల్ చదువు ఏ మీడియం ఐనా కాలేజీ చదువు తప్పని సరిగా ఇంగ్లీష్ మీడియం. . ఆరో తరగతిలో ఎబిసిడిలు నేర్చుకున్న మేము ఇంగ్లీషు మీడియం నుండి వచ్చిన ఫాతిమా అమ్మాయిలతో పింగిల్ కాలేజీ చదువుకు చిక్కు తెచ్చి పెట్టింది. పాఠాల అవగాహనలోనే కాదుఆహార్యం లోనూ బోలెడు ఆంతర్యం. కారణాలు ఏవైనా ఒక సంవత్సరం నేను ఫేల్ ఐతే మరో సంవత్సరం చదువు ఉద్యమానికి అంకితం ఐంది..ఆ తర్వాత ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ..పి.జి. సెంటర్(ఓ.యు affiliated)లో పి.జి తెలుగు. ఈ నా చదువంతా సంవత్సరానికి రూ 225 ఎకనామికల్లీ బాక్వర్డ్ స్కాలర్షిప్ ..ఉదయం సాయంకాలం .హోం ట్యూషన్స్ తో గడిచింది.1975లోనే వికారాబాద్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం. నా సహచరుడు
సామాజికాంశాలలో తల మునుకలై తిరగడం వల్ల పిల్లల చదువుసంధ్యల బాధ్యత నా పి.హెచ్.డి ని 2005 లో ..లా డిగ్రీని 2014 పూర్తి చేసుకోనిచ్చింది .ఇవే నా బాల్యం చదువుల ప్రస్థానాలు.

2.1969 లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుండి 2014 ప్రత్యేకరాష్ట్ర సాధన వరకు జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. మీ ఉద్యమ అనుభవాలు మా విహంగ పాఠకులతో పంచుకుంటారా?

నిజాం భూస్వామ్య పాలనలోనే ఎంతో అణిచి వేతకు గురై విద్యాగంధానికి దూరమైన తెలంగాణ ప్రజలు సమైక్యాంధ్రలో సామాజికంగా..సాంస్కృతికంగా..ఉద్యోగపరంగా నష్టపోతున్నారన్న విషయం నన్ను ఉద్యమంలో పాల్గొనేట్లు చేసింది. ఒక సంవత్సరం చదువుకు దూరంగా ఉన్న …ఏ విద్యా సంస్థకు సంబంధం లేని నేను ఉద్యంలోకి చొచ్చుక పోయిన.ఉద్యమ నాయకత్వం పిలుపునిచ్చిన రాస్తారోకో..పికెటింగులు ..దర్నాలు…ర్యాలీలు…జైలు భరోలు..వంటి అన్ని కార్యక్రమాలలో పాల్గొన్న. వరంగల్ లోనే కాకుండా వేరే ఊళ్ళు తిరిగి జరుగుతున్న సభలలో ఉద్యమ అవశ్యకతను ప్రసంగించిన.పోలీసులతో తలపడి అరెస్టై పోలీస్టేషన్లకు పోవడం..కోర్టుమెట్లక్కడం రోజువారీ కార్యక్రమమైంది.పోలీసుల లాఠీలకు..జడ్జిల ప్రశ్నలకు భయపడక పోవడమే కాదు న్యాయం గురించి…హక్కులగురించి మాట్లాడి కృష్ణ జన్మస్థానమెట్లుంటదో చూసినం.ఆ రోజుల్లో పిల్లలకు వసతి
గృహాలు లేకపోవడంతో విద్యార్థుల స మీకరణకు చాలా శ్రమపడవలసి వచ్చేదే.మల్టీపర్పస్ గ్రౌండ్ లో పదివేలమంది జనంతో ఈశ్వరీబాయి ముఖ్య అతిథిగా నేను సభాధ్యక్షురాలిగా మహిళా సదస్సును నిర్వహించిన సంఘటన అపురూపం. అందుకు పీత .కష్టాలు పీతవనుకోకండి.

ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారానే రాష్ట్రం సిధ్ధించగలదంటూ ప్రజాసమితి పార్లమెంటు పోటీలకు
సిధ్ధమైతే యుక్త వయసులో ఉన్నామనే విషయాన్ని లెక్కచేయకుండా రాత్రనక పగలనక దాని గెలుపుకు పాటుపడ్డం.అదంతా బూడిదల పోసిన పన్నీరైంది.రాజకీయ నిరుద్యోగం తొలగి పోగానే నాయకత్వం ఉద్యమాన్ని గాలికొదిలేసింది.విషయం అందరికీ తెలిసిందే.వాళ్ళ గెలుపుకు నానా తంటాలుపడ్డ మా విద్యార్థుల ముఖం వాళ్ళు చూడనే లేదు.

ఉద్యమ ఆకాంక్ష 1997లో ప్రజాస్వామ్య తెలంగాణకై జనసభ…వామపక్షభావజాలాలతో
తెలంగాణ మహిళా వేదక 2006లో. తెలంగాణ సాంస్కృతిక నేపథ్యంతో 2007-2008 (అనుకుంట )తెలంగాణ ఉత్సవ కమిటీ ఏర్పడింది.ఈ మూడు సంస్థ లలోనూ నేను పని చేసిన.పని చేయడమంటే నా మట్టుకు సభలలో పాల్గొని ాష్ట్ర ఆవశ్యకతను వివరించడమే. కేసిఆర్ 2009 నవంబరు లో నిరాహార దీక్షకు కూర్చోక పూర్వమే విభిన్న రూపాలలో తెలంగాణ అంతట ఉద్యమాగ్ని రగులుకొంటున్నది.

2009 లో రిటైరైన నేను ఈ మలి దశ ఉద్యమంతో మమేకమైన. నాకు బతుకునిచ్చిన వికారాబాదు జె.ఏ.సి లో పాల్గొంటూనే నేను హైదరాబాదు నివాసినే అన్నం తగా మహిళా జె.ఎ.సి సభ్యురాలుగానే కాక అనేక సంస్థలతో కలిసి పని చేసిన. .ఊరూర జరిగిగిన సభలలో ఉపన్యసించిన. అడ్డంకులను అధిగమిస్తూ మిలియన్ మార్చ్ చేసిన. మానవహారంలోనూ పాల్గొన్న.ఆరుపదులు దాటిన నా ఉద్యమ ప్రమేయం యువతరానికి ప్రేరణగా నిలిచింది.

తొలిదశ మలి దశ ఉద్యమాలను మనం తప్పని సరిగా బేరీజు వేసుకొనితీరాలి. తొలి దశ ఉద్యమం విద్యార్థుల చేతిలోనుండి రాజకీయనాయకుల చేతిలోనికి పోయింది.ఉద్యమ లక్ష్యం న్యాయమైనదే ఐనప్పటికి రాజకీయ నిరుద్యోగులు ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నట్టే ఎత్తుకొని రాజకీయ లబ్ది పొందగానే దాన్ని గాలికొదిలేసి పదవుల బాట పట్టిన్రు మలిదశ ఉద్యమం రాజకీయ నాయకుల చేతిలనుండి విద్యార్థుల చేతుల్లోకి వచ్చినా …సకలజనుల సమ్మెగా మారి తిరగి రాజకీయ మలుపు తీసుకుంది. తొలి దశ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన సి.ఆర్. పి సుమారు నాలుగు వందల ఉద్యమ కారులను బలి తీసుకుంది. కాని మలి దశ ఉద్యమంలో స్థానిక పోలీసుల కారణంగా విద్యార్థులు ప్రజలు తీవ్ర నిర్బంధానికి గురైన విషయం జగమెరిగిన సత్యమే . తొలిదశ ఉద్యమ కాలంలోపోలీసు కమీషనర్ ఒక ర్యాలీ కి అనుమతి ఇచ్చిన తర్వాత కర్ఫ్యూ విధించింది రాజ్యం.ఐనా మా ర్యాలీలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగక కుండా సవ్యంగా సాగింది.ఈ సందర్భంగా స్థానిక పోలీసులు అత్యుత్సాహం చూపించక పోవడాన్ని గమనించక తప్పదు. మలి దశ లో ఉద్యమ సంద్రంతో మేము సైతం అంటూ జనసంద్రం మమేకమైంది. రాష్ఠమివ్వక తప్పని పరిస్థితులలో సోనియా గాంధీ..సుష్మా స్వరాజ్..మీరాకుమార్ ల సానుకూలత కూడా పని చేసింది. చంద్రబాబు నాయడు..లగడపాటి కుట్రలు..కుతంత్రాలు ఎత్తులు జిత్తులు చిత్తై రాష్ట్రం సిధ్ధించింది.

3.మద్యపాన నిషేధ కమీటీ లో సభ్యులుగా,మద్యపాన నిషేధానికి మీరు ఏమేం కార్యక్రమాలు చేశారు.మద్యపానం వల్ల కలిగే అనర్ధాలను అరికట్టేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు?

మద్యం …తాగిన వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబాలనూ సమూలంగా నాశనం చేస్తది.ఆ సంఘటనలు నా మనసు మీద నాకు తెలియకుండ ముద్ర వేసినై. సో నా చిన్నతనం నుండి నేను మద్యపాన వ్యతిరేకిని. యన్.టి.రామారావు మద్యంపై నిషేధాన్ని తెస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేసిండు. దాంతో మహిళలు నిషేధం విధించి తీరాలంటూ గళమెత్తి ఉద్యమించిన్రు. మల్లాది సుబ్బమ్మ కూడా ఈ కమిటీ సభ్యురాలే. ఆమె పిలుపు మేరకు కమిటీ సభ్యురాలుగా సమావేశాల్లో మాట్లాడిన. అదే విషయాన్ని వ్యాసరూపంలోనూ వ్యక్త పరిచిన. చంద్రబాబు నాయుడు విద్యా సంస్థలకు ప్రతి సంవత్సరం ప్రణాళిక గా పదిరోజులు ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా గ్రామాలకు.. బస్తీలకు పోయినపుడు అక్కడి ప్రజలకు మద్యపానం వల్ల కలిగే నష్టాలను వివరించే వాళ్ళం . యథార్థంగా దీనిపై చేయాల్సినంత కృషి చేయలేదని చెప్పాలె.

4.మద్యనిషేధం వల్ల ప్రభుత్వఆదాయానికి గండి పడుతుంది అంటారు. దాని గురించి మీ అభిప్రాయమేంటి?

ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు పై శ్రధ్ధ ఉంటే కచ్చితంగా దాన్ని నిరోధించే దిశగా చట్టాలను తేవాలి. ప్రభుత్వాలు ఆదాయం దృష్టితో మద్యం విక్రయాలను రకరకాల మార్గాలలో పెంచే మార్గాన్ని యోచిస్తున్నది. ప్రభుత్వ ఆదాయం ప్రజలకొరకే. కాని ఏ ఆదాయం ప్రజలకు ఉపయోగ పడుతున్నదని ప్రభుత్వాలు చెప్తున్నాయో ఆ ఆదాయ మార్గం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమౌతున్నై.ముఖ్యంగా పేద వర్గం పొద్దంతా కష్ట పడిన సంపాదనను తాగడానికి తగులపెట్టి ఆర్థికంగానే కాదు ఆరోగ్యాన్నీ ఫణంగా పెడుతున్నారు.తాగిన మైకంలో వివేకాన్ని కోల్పోయి తగాదాలలో తలదూర్చి లేని పోని సమస్యలను తెచ్చుకుంటున్నారు/సృష్టిస్తున్నారు. ప్రమాదాలకు కారకులౌతున్నరు. అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్నారు.తాగబోయించడం అవినీతికి..అక్రమాలకు…ఎన్నికలను పక్కదారులు పట్టించడానికి ఆధారమౌతున్నది.మరో విషయమేంటంటే మద్యమే ప్రమాదమంటే అందులో కల్తీ మద్యం మహా ప్రమాదం. కల్లు విషయానికి వస్తే తగిన పాళ్లలో కల్లు చలువ నిస్తుందని చెప్తారు. కాని అసలు కల్లుకన్నా దాన్ని యూరియా శక్రీన్ లను ఉపయోగించి కల్తీ కల్లును శుచి శుభ్రతలు పాటించ కుండా తయారు చేయడం కారణంగా ఆ వినియోగదారులు మరింత నష్ట పోతున్నారు.చిత్తశుధ్ధితో ప్రభుత్వాలు వీటిపై నియంత్రణను తీసుక రావలసి ఉన్నది.ఇన్ని నష్టాలు జరిగిన తర్వాత ఆ ఆదాయం వల్ల కలుగబోయే లాభం వ్యర్థ కదా! ఇంత చిన్నపాటి ఆలోచన ..దేశప్రజలను పాలించే ప్రభుత్వ యంత్రాంగానికి తెలియనిది కాదు. మద్యం వ్యాపారం సహజంగానే పెట్టుబడి రంగానికి చెందింది. ఆ పెట్టుబడిదారుల గుత్తాధి పత్యంలోనె ప్రభుత్వాలు నడుస్తున్నై.ఇక ఆదాయం విషయానికి వస్తే మనసుంటే మార్గముండదా?

5.మద్యనిషేధం వల్ల నష్టపోయే ఆదాయం గురించి మీ అభిప్రాయమేంటి?

ప్రభుత్వంలో ఉన్న మంత్రుల విదేశీ పర్యటనలను….వాళ్ళకు కల్పించే మితిమీరిన సౌకర్యాలు కుదించడం.. పారిశ్రామిక వేత్తలు బడావ్యాపారస్తులు పన్నులు ఎగ్గొట్టకుండా చూడటం…
అడవి సంపదలు దుర్వినియోగం కాకుండా చూడటం……ప్రభుత్వ భూములు మధ్య దళారీల చేతిలోకి పోకుండా చూడటం…కూల్చి వేతలు నిర్మాణాలు తవ్వకాలు..సెంట్రలైజ్డ్ పద్ధతిలో జరగడం…అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కెటాయించే డబ్బు దుర్వినియోగం కాకుండా చూడటం వల్ల మిగులు ఆదాయాన్ని ప్రజల కోసంవినియోగిస్తూ మద్యాన్ని నిషేధించవచ్చు .ఈ విషయాలన్నిటినీ మేము ప్రజలముందు పెట్టేవాళ్ళం

4.”తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం”అనే అంశంపై పరిశోధన చేసి,ఉత్తమ పరి శోధనకు బంగారు పతకాన్ని అందుకున్నారు కదా.ఆ పరిశోధనా వివరాలు మా విహంగ పాఠకులకు తెలియజేస్తారా? 

ఇతర పోరాటాలతో పోల్చి చూసినపుడు ఈ పోరాటం తప్పకుండా విభిన్నంగా కనపడుతుంది.పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి..సహకరించడానికి…అందులో పాల్గొనడానికి ఈ స్త్రీలకు చదువు లేక పోవడం అడ్డు కాలేదు.ప్రపంచ పోరాటాలతో దీనికి కొంత పోలిక ఉన్నా ఈ పోరాటం పునాదిగా అనేక ఉద్యమాలు ఉదయించి ఫలించినా వీరు పోరాడిన విధానంలో..చేసిన త్యాగంలో..చూపిన తెగువలో పొందిన అవమానంలో..అనుభవించిన శిక్షలో దీనికి ప్రత్యేకత ఉంది. అది మరువలేనిది..మరుపు రానిది. స్త్రీలు పోరాటానికి సహకరించడంతో పాటు పోరాటంలో పాల్గొనవలసిన అవసరాన్ని పార్టీ గుర్తించి ప్రోత్సహించింది.గమనించాల్సిన విషయమేంటంటే స్త్రీల అవసరాన్ని ఉద్యమం గుర్తించింది కాని స్త్రీల అవసరాలను పట్టించుకోలేదు.

అకస్మాత్తుగా పోరాటం విరమించిన పరిస్థితులలో ముఖ్యంగా స్త్రీలే దిక్కు తోచని పరిస్థితికి నెట్టి వేయబడ్డారు.ఇల్లు..పిల్లలు..సంసారాలను వదిలి పోరాటంలో పాల్గొన్న స్త్రీలు తాము కలగన్న సమాజాన్ని చూడలేక ఎంతో ఆవేదనకు గురయ్యారు.పోరాటంలో ఆయుధం పట్టిన స్త్రీల చేతులు తిరిగి వంట పనికి పరిమితమై పోయినై. పోరాటం నుండి వచ్చిన ఈ స్త్రీలను కుటుంబాలు..సమాజం ఎన్నో సమస్యలకు గురి చేస్తూ వివక్షకు లోను చేసింది.అందువల్ల పోరాటంలో పాల్గొన్న స్త్రీలు మానసిక వేదనను క్షోభననుభవించడమే కాక పడరాని పాట్లు పడ్డారు.పడుతున్నారు. పోరాటం కారణంగా సామాజికంగా కొంత మార్పు వచ్చినా ఆర్థిక పరిస్థితులు మెరుగు పడలేదు.కుటుం బ పనిభారం తగ్గలేదు.లైంగిక వివక్ష కొనసాగుతునే ఉన్నది.

ఈ అనేకాంశాలను సాహిత్యం ఒడిసి పట్టుకున్నది. పోరాట నేపథ్యంతో కళారూపాలతో పాటు కథలు నవలలు వెలుగు చూసినై. నవలలలో స్త్రీల చైతన్యస్థాయి కొందరిది ఉన్నంతంగానే కనపడినప్పటికి రచయితలు ఎక్కువగా స్త్రీలను సహకార పాత్రలుగానే రూపొందించారు. కొందరు రచయితలు స్త్రీలు ఉద్యమించిన తీరును వారి పోరాట పటిమను తమ రచనలలోపొందు పరుచ లేదు.స్త్రీలు భూమికగా లేకుంటే పోరాటమే లేదన్న విషయాన్ని అంచులకు నెట్టివేసారనే అభిప్రాయం కలిగింది నాకు.పార్టీ
నిర్లక్ష్యం వల్ల స్త్రీలకు జరిగిన అన్యాయాలు కూడా చాలా వరకు రికార్డ్సు కాలేదు. స్త్రీల పట్ల నిర్లక్ష్య ధోరణి ఉన్నప్పటికీ తెలంగాణ పోరాటం గత అర్దశతాబ్ది కాలం జరిగిన ఉద్యమాలలో స్త్రీలు తమ అస్థిత్వం నిరూపించుకోవడానికి ప్రేరణనిచ్చిందని చెప్పాలి.

5.సాహితీవేత్తగా,వక్తగా,ఉద్యమకారిణిగా కవియిత్రిగా, రచయిత్రిగా ఉపాధ్యాయులుగా మీరు ముందుకు సాగడంలో మీకు స్ఫూర్తినిచ్చినవారు ఉన్నాారా. ?

మా కుల వృత్తి లోబోధన కూడా ఒకటి.. అది నా జీవన యానాన్ని అర్థవంతంగా సాగించడానికి ఉపయోగ పడింది కూడా.ఒకరిని చూసి స్పూర్తి పొందడం కన్నా అవసరం ఉపాధ్యాయ వృత్తిలో రాణించేట్లు చేసింది. యధార్థానికి నాకు ఒక మంచి న్యాయ వాదిగా ఎదగాలన్న ఆకాంక్ష ఉండేది. కాని అవసరం అవకాశం అధ్యాపకత్వంలో నిలబెట్టింది.

ఏ కళ ఐనా రాణించడానికి మూడు దశలుంటాయని లాక్షణికులు చెప్తుంటారు (ప్రతిభ.. వ్యుత్పత్తి ..అభ్యా సాలు)అవెట్లావున్నా…ఒక వ్యక్తి లో అంతర్లీనంగా ఉన్న కళ..సామర్థ్యాలు చుట్టూర ఉన్న వాతావరణం వల్లనో అవకాశాల వల్లనో ప్రేరేపించబడి వికసిస్తాయి.వాటిని అభ్యాసం మరింత సాన పడుతుంది. నా విషయానికి వస్తే స్కూల్ లో టీచర్లంతా నా వక్తృత్వ ప్రతిభనుమెచ్చుకునేవారు. ఆ మెచ్చుకోలు నాకు బలాన్నిచ్చేది. సాధారణంగా వక్తృత్వం లో గెలుపు ఎప్పుడూ నాకే సుమా!మా మేనమామ కూడా ఆ విషయంగా ప్రోత్సహించేవారు.ఉద్యమం పట్ల ఉన్న చిత్తశుధ్ధి కూడానన్ను మంచి వక్తగా నిలబెట్టింది.
కవయిత్రి మాటకొస్తే ఎంతో గాఢ ముద్ర పడితే తప్ప తృప్తిపడే కవిత్వం రాయలేను.అట్లా నేను రాసిన యాబై కవితలలో నాకిష్టమైనవి పదిహేను సంఖ్యలో ఉంటై. నా కవిత్వంలో ప్రతీకాత్మకత కన్నా విషయ ప్రాధాన్యం ఎక్కువ.

రచనలు చేయాలని చిన్నప్పటినుండి అభిరుచి ఉన్నా నాకుటుంబ వాతావరణం యాబయ్యో పడిదాకా నా కా అవకాశమివ్వలేదు. టు బి ఫ్రాంక్ నా బాల్యం తరగతి పుస్తకాలు తప్ప ఇతరత్రా అధ్యయనానికి అవకాశ మివ్వలేదు .అధ్యాపకత్త్వం తో మమేకమై తాదాత్మ్యం చెందిన పరిస్థితి నా లోని సాహితీ వేత్తను రచయిత్రిని వెలికి తీసింది.ఓల్గా శైలి నాకిష్టం.జానకి విముక్తి నవలమొట్టమొద ట నన్ను స్త్రీల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించ చేసింది.అన్నట్టు మరిచే పోయా.నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడుహాస్య వివాహ పత్రికను ఆధారం చేసుకొని ఒక చిన్న నాటకం రాయడమేకాదు…స్నేహితులను కూడకట్టుకుని ప్రదర్శించాం కూడా..నాటకాలలో కూడా ప్రధాన పాత్ర పోషించేదాన్ని.వాటిలో ప్రథమ బహుమతిని పొందటమే కాదు పదకొండో తరగతిలో జిల్లా స్థాయి ఉత్తమ నటి స్థానాన్ని పొందాను.

6.ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(ప్రరవే)లో తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షురాలిగా మహిళలకోసం మీ సంస్థ ద్వారా చేస్తున్న అవగాహనా కార్యక్రమాల వివరాలు మా ‘విహంగ’ ద్వారా ప్రజలకు తెలియజేస్తారా?

నేను ప్ర ర వే అధ్యక్షురాలినై మూడు సంవత్సరాలైంది.ప్రత్యేకించి తెలంగాణ శాఖనుండి కథాకార్యశాలను కవిత్వ కార్యశాలలను నిర్వహించి రచయిత్రులలో విమర్శనాత్మక దృష్టిని పెంపొందించే ప్రయత్నం చేసినం. రచయిత్రుల విమర్శకుల వ్యాసాలకు పుస్తక రూపాన్ని కూడా తెచ్చినం.గత సంవత్సరం అంటే 2020లో మహబూబ్ నగర్ లో నేరము శిక్ష అనే అంశంపై సదస్సు నిర్వహించినం.ముస్లింలఅస్థిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో 370 ఆర్టికల్ రద్దును నిరసిస్తూ 26-01-2020 న ఒక్కరోజు మొత్తం సమావేశానికి నిర్వహించినం. 2020 మార్చ్ ఎనిమిదిన జమేతా ఇస్లామియాతో కలిసి వరంగల్లు లో తెలంగాణ శాఖ మహిళా సమావేశానికి జరిపింది. నిరంతరం స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ …. ఒకవైపు పత్రికా ప్రకటనలిస్తూనే…కళాశాలలకు పోయి ఈ విషయం పట్ల అవగాహన కల్పిస్తూ ..”గళమెత్తక పోతే” అనే కార్యక్రమం నిర్వహించింది.కరోనా లాక్డౌన్ కాలంలో మా సంఘ సభ్యులు కొందరు వలస ప్రాంతాలను తిరిగి తోచిన సాయం చేసిన్రు.ఆర్థిక సాయం కూడా అందించిన్రు. ఈ సంవత్సరం మోడి తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను దృష్టిలో ఉంచుకొని వరంగల్లు లో “తెలుగు సాహిత్యం–రైతాంగ సమస్యలు” అంశంపై సదస్సు నిర్వహించింది. వరంగల్లు..మహబూబ్ నగర్ హైదరాబాద్ సదస్సులు తెలంగాణ లో జరిగినా అవి జాతీయ కమిటీ అధ్వర్యంలోకే వస్తాయి.

7.నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రాజకీయార్ధిక అభివృద్ధి ప్రాంతీయ గుర్తింపు, అభివృద్ధి ఆకాంక్షలు, వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రజాసాధికారత,మహిళా సాధికారత, ప్రజాస్వామ్యం ఇవన్నీ నేడు నెరవేరుతున్నాయంటారా?

రాష్ట్రం సిధ్ధించినందుకు తెలంగాణ ప్రజలం ఊపిరి పీల్చుకున్నాం. లేదంటే అరవై ఏళ్ళ పోరాటం ఆభాసు పాలయ్యేది. గతంలో హైదరాబాద్ స్టేట్ గా ఉన్న తెలంగాణ ప్రాంతం నిజాం నీడలోని దొంతరల వారి భూస్వామ్య నిరంకుశ పాలనలో పరాధీన బతుకులుగా దోపిడికి దుర్మార్గానికి గురవడమే కాక ఏ పూటకాపూట దినదిన గండం నూరేళ్ళాయుష్షుగా బతుకులను ఈడ్చుకుంటూ పోయారు.బీదరికంతో పాటు అక్షరాస్యతకు దూరమైనారు. పాలక భాషైన ఉర్దూ పెత్తనం చేసింది. ఆ ముస్లింల సంస్కృతి కొంత అనివార్యంగా హిందూ కుటుంబాలలోకి చొరబడింది. అదే సమయంలో బ్రిటిషు పాలనలో ఉన్నదత్త మండలాలు సహజంగానే ఆ సర్కారు కల్పించిన సౌకర్యాలు…అవకాశాల కారణంగా అన్ని రంగాలలోనూ ముందంజలో ఉన్నారు. నిజాం లొంగుబాటు తర్వాత వెల్లొడి పాలనలోని పాలన సౌలభ్యానికి వలస వచ్చిన ఆంధ్రులు సమైక్యాంధ్రలో రాష్ట్ర ప్రజలుగా నిలదొక్కుకున్నారు. అక్షరాస్యతలోనే కాక ఆర్థికంగా ..సామాజికంగా రాజకీయరంగాలలో ఎదిగిన ఆంధ్రుల భాష సంస్కృతిల ముందు తెలంగాణ ప్రజల భాష..యాస..సంస్కృతి వెలవెల పోవడమే కాదు. ఎంతో అవమానానికి గురైంది.

చదువు లేక పోవడం మొదటి కారణం కాగా… చదువుకున్న వాళ్ళు కూడా ముక్కుసూటితనం తప్ప ఉన్న ఉద్యోగాలను పొందే లౌక్యం లేక నిరుద్యోగులుగాను..ఫోర్త్ క్లాసు ఎంప్లాయ్స్ గాను మిగిలి పోయిన్రు. నివురు గప్పిన నిప్పులాంటి ఈ నిజం రాజుకొని 1952 లో ఉద్యమంగా మొలకెత్తి…1969లో పెరిగి…1997 లో చిగురించి 2002మొగ్గ తొడిగి…2014 లో ఫలించింది . ఈ రాష్ట్రమే సిధ్ధించకపోతే ఉద్యమంతోపాటు ఈ ప్రజలు అపహాస్యం పాలయ్యేవారు. మరిన్ని అవమానాలను నెత్తికెత్తుకోవలసి వచ్చేదే.

బాషా యాసా సంస్కృతులను తెలంగాణ ప్రజలు పునరుజ్జీవింప చేసుకున్నారు .తెలంగాణాలో కవులే లేరన్న వాదానికి స్వస్తి చెప్తూ ఈ ప్రాంత కవుల చిట్టా విప్పడమే కాదు. వాళ్ళ రచనలు పరిష్కరిస్తున్నారు.తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణ కవుల రచనలపై ప్రసంగాలను సాహితీ ప్రియులకు అందుబాటులోకి తెచ్చింది. కొన్ని ముద్రణకు కూడా నోచుకున్నై.తెలంగాణా భాషాసాంస్కృతిక మండలి కూడా ఆ కృషి చేసింది. సుంకిరెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి, సంగిసెట్టి శ్రీనివాస్ కాసుల ప్రతాపరెడ్డి…ఇంకా చాలా మంది ఈ కోణంలో కృషి చేయడమే కాదు.. ఆ కృషిని కొనసాగిస్తున్నారు.తెలంగాణలోని సాహిత్యకారుల మీది మబ్బు తొలగిపోయింది..

తెలంగాణ సంస్కృతిపై ఉన్న చిన్నచూపుకు భయపడి తమ పండుగలను జరుపుకోవడానికి వెనుకంజ వేసిన జనం ఎంతో సంతోషంగా ఆ పండుగలను జరుపుకోవడమే కాదు ప్రాంతేతరులు కూడా ఆ పండుగలను జరుపుకోవడానికి ముందుకు వస్తున్నారు. సినిమాలలో విలన్స్కు కమేడియన్స్ కు తెలంగాణ కు కెటాయించి తెలంగాణను అవమాన పరిచిన సినిమా రంగం తన పధ్ధతిని మార్చుకోవడంలోనూ ాష్ట్రం సిధ్ధించిన ప్రభావం కనబడుతుంది. ఇటీవల మీడియా కూడా వార్తలన్నీ తెలంగాణ యాసలో అతి సహజంగా ప్రజలముందుకు తెస్తుంది. మొత్తంగా తెలంగాణ కు ఆత్మ గౌరవం దక్కింది.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మాప్ ను చూపిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటిమయమై పోతుందని చెప్పిన వ్యాఖ్య అబధ్ధమని తేలుస్తూ
కరెంటు నిరాటంకంగా అందరికీ చేరుతుంది.దాంతో వ్యవసాయదారులు హాయిగా పొలాలకు నీటిని చేర్చుకోగలుగుతున్నారు.గతంలోకన్నా వ్యవసాయం కొంత మెరుగైంది. మిషన్ భగీరథ వల్ల కూడా ప్రజలకు నీరు అందుబాటులోకి వచ్చింది.. పాల మూరు ప్రజల నోటినుండి ఆ మాట స్వయంగా విన్నాను ఇక ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చే పథకంలో మార్పు చేసి సన్నకారు రైతులకే వర్తింపచేయాలని నా అభిప్రాయం.

ఐటి కంపెనీలు సమృద్ధిగా తెరుచుకోవడంతో ఆ ఉద్యోగాలు బాగానే పెరిగినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు చేతులెత్తేసినై. తెలంగాణ ాష్ట్రం ఉద్యోగాలు కల్పిస్తుందన్న కలకలగానే మిగిలిపోయింది. ఐతే అది అకస్మాత్తుగా ఊడిపడిన సమస్య కాదు. .ప్రైవెటీకరణకు తలుపులు తెరిచింది పి వి గారు. అది కారీ ఫార్వర్డ్ ఔతున్న సమస్యే. ఐనప్పటికి రాష్ఠ ఏర్పాటు వల్ల ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని యవత నమ్మింది.ఉద్యమ నాయకత్వం ఆ ఆశలు కల్పించింది ప్రభుత్వం కచ్చితంగా యువకులకు ఉద్యోగాల పట్ల శ్రధ్ధ తీసుకోకపోవడం బాధాకరమే.యవత ఏ పనులు లేకుండా ఉండటం ఏ దేశానికైనా ప్రమాదమే. అది అందరి మనసును తొలచి వేస్తున్న సమస్యే.గురుకులాలు సాధిస్తున్న ప్రగతిని అభినందిస్తూనే స్కూళ్ళు మూతబడటం పట్ల విచారించక తప్పదు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది.ఆ ఖర్చు తడిసి మోపెడౌతున్నది. సహజం గానే అన్ని సంక్షేమ పథకాల్లోనూ అపాత్ర లబ్దిదారులుంటారు. బ్రోకర్లు ఆ లబ్దిదారుల సంఖ్యను పెంచేస్తుంటారు.కర్ణుడి చావుకు కారణాలెన్నో. .ఏ ప్రభుత్వమైనా ఒకసారి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత దానిని నిలబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తది. సంక్షేమ పథకాలు అందుకు ఉపయోగ పడగలవు. ఐనప్పటికి లబ్దిదారులూ ఉంటారు.ఈ పథకాల వల్ల లోటు బడ్జెట్ ఏర్పడిన విషయాన్ని గుర్తించి తగిన మేరకు ఉపయోగించి కొన్ని నిధులను నిరుద్యోగానికి ఉపయోగించ వలసి ఉండిందని నా అభిప్రాయం.

ప్రజా సాధికారత..ప్రజాస్వామ్యం అనేవి చాలా పెద్ద మాటలు నా దృష్టిలో.నేను పుట్టిబుధ్ధెరిగినప్పటినుండే కాదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిడెబ్బై మూడు సంవత్సరాలు గడిచి పోయినై. ఎన్నో పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినై.ఏ ప్రభుత్వంలోనూ ఈ సాధికారతను చూడలేదు..అవి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎక్కడా దాని నీడ కూడా కనబడ లేదు..ఇక మహిళా సాధికారత విషయంలోనూ నాకు అసంతృప్తి ఉంది.. ..కాని షీ టీంలు ఎంతో కొంత పని చేస్తున్నై.(అని అత్యారాలు తగ్గినవని నేను చెప్పబోవడం లేదు.)

8. రచయితగా, స్త్రీవాదిగా, పరిశోధకులుగా నేటి సమాజానికి మీరిచ్చే సందేశం?

ఇటీవల కాలంలో సమాజం తాత్కాలిక ప్రయోజనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నది.వ్యక్తిగత ఎదుగుదలే
ధ్యేయంగా ముందుకు పోతున్నది. ఆ విధానం చాపకింద నీరులా నష్టం చేకూర్చడాన్ని పట్టించు కోవడం లేదు.వస్తు వ్యామోహం ఎక్కువైంది .మనుషులకన్నా సాంకేతికతకు విలువనిచ్చే విధానం ముందుకొచ్చింది.మనిషి మనిషికి అభిరుచులలో ఆలోచనలలో అంతరం పెరిగి సమిష్టి కుటుంబాల పట్ల విముఖత ఎక్కువై ఒంటరి సంసారాలలో పిల్లలకు సెల్ఫోన్లనే ఆరో ప్రాణంగా అందుబాటులోకి తెస్తున్నారు. మానవీయ విలువలను పక్కన పెట్టి సామాజిక సంబంధాలు కూడా వ్వాపార ధోరణితో సాగుతున్నై.ఆత్మీయతలు..అనుబంధాలకన్నా అట్టహాసాలు..ఆడంబరాలకు విలువనిస్తున్నారు.వై జ్ఞానికంగా ప్రపంచం ముందడుగు వేసినట్లు కనబడుతున్నా స్త్రీల పట్ల మగవాడి దృష్టి కోణం మార లేదు.గతంలోఅడపాదడుపా జరిగిన అత్యాచారాలు….ఇప్పుడు హత్యాచారాలతో కలిసి జమిలిగా సాగుతున్నై.చదువుకున్న మేధావులు ..నేరస్థుల నుండి సమాజాన్ని రక్షించాల్సిన న్యాయవాదులు.. రాజకీయ నాయకులు కూడా ఆడవాళ్ళను ఒక మనసున్నజ మనుషులుగ గుర్తించకుండా అనుచిత తీర్పులు..వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటువంటి సమాజంలో మార్పు తీసుక రావలిసిన బాధ్యతలో భాగంగా సామాజిక కార్యక్రమాలను చేపడుతూ…సమాజాన్ని…పాఠకులను చైతన్య దిశలో నడపడంలో భాగంగా మంచి రచనలు చేస్తూ తమ తమ సంస్థల ద్వారా రచయితలు పఠనాసక్తిని పెంచాలి. ఈ మార్పు మొదట వాళ్ళ స్వంత కుటుంబాల నుండి మొదలు కావాలి. దానితో పాటు సంప్రదాయాల పేరిట జరిగే అనాచారాలను రూపు మాపే ప్రయత్నం చేయాలి.(ప్రస్తుతం ఇటు వంటి సంస్థలు లేవని కాదు. మరిన్ని ముందుకు రావాలని మరింత కృషి జరుగాలని)ఐతే ఇది అంత సులభం కాదు. సహనంతో నిరంతరంగా శ్రమించాలి.పాటు

9.స్వర్గీయ డా.పుట్ల హేమలత గారితో మీ అనుబంధం గురించి తెలియజేస్తారా?

హేమలత గారు నాకు ప్ర ర వే లోనే పరిచయం.ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా కన్పించేవారు. వారి మాటలలో దళిత స్పృహ కొట్టవచ్చినట్లుగా కనపడేది. అనారోగ్యం ఎంత ఇబ్బంది పెట్టినా సంస్థ పట్ల ఆమె నిబధ్ధతను చెప్పుకొని తీర్చాల్సిందే..ఆ లక్షణమే మరణం అంచుదాకా వచ్చినా విశాఖ మహా సభలో ఉత్సాహంగా పాల్గొనేట్లు చేసింది.మానస కూడా ప్ర ర వే సభ్యురాలు అవడం వల్ల తల్లీ కూతుళ్ళిద్దరినీ ఒక దగ్గర చూడగల్గిన అవకాశం . హేమలత గారు మానస తల్లీ కూతుళ్ళిద్దరినీ చూస్తె నాకు స్నేహితులను చూస్తున్న భావన కలిగేది.సరదాగా ఒకళ్లపై ఒకళ్లు చెణుకులు విసురుకుంటుంటే చాలా సరదాగా అనిపించేది. అన్నిటినీ మించి ఆమె స్నేహ శీలి.హేమలతగారి పరిశోధన అంతర్జాల పత్రికలపై.అంతర్జాల పత్రికలపై మొట్ట మొదటి పరిశోధన చేయడానికి పూనుకోవడమంటే సాహసమే కదా? ఇంటర్నెట్ పై ఆమెకు గల పట్టు వల్లనే ఆ సాహసం చేయగలిగారు.మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా మా సంస్థ సభ్యులకు నెట్ ను ఉఫయోగించుకోవడంలో తర్ఫీదును ఇచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఆమాట మా ముందు వాలకుండానే ఆ కల సాకారం కాకుండానే మనందరినుండి సెలవు తీసుకున్నారు. ప్ర ర వే హేమలత గారిని చాలా చాలా మిస్ ఔతుంది.

మీ పాఠకులతో నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
అన్నిటినీ మించి ఇంత చిన్న వయసులో అంతర్జాల పత్రిక సంపాదకురాలిగా మానసను మనసారా
అభినందిస్తున్నాను .

— కట్టూరి వెంకటేశ్వరరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో