పాక్సో -4 -బుద్ది చెప్పాల్సిందే – వి. శాంతి ప్రబోధ

shanthi prabodha

“ఆ పిల్లలను చూడండి.. ఛి ఛీ .. ఈ ఆడపిల్లలకి చదివేస్తే ఉన్న మతి పోయినట్టుంది. గుడ్డలు చించుకుని ఎట్లా తిరుగుతున్నారో చూడండి సిగ్గులేకుండా ” అన్నది పక్కనే కునుకు తీస్తున్న మేక జంటను చూస్తూ ..

గాడిద గొంతు అసలే పెద్దది . ఇప్పుడు మరింత పెద్దగా వినిపించండి.
ప్రశాంతంగా ఉన్న చెట్టు కింద చల్లటి గాలి సన్నగా వీస్తున్నది. ఆ గాలికి ఆ జంటకు నిద్ర ముంచుకు వచ్చింది.

గాడిద వచ్చి నిద్ర భంగం చేసినందుకు చిరాగ్గా చూసింది మగమేక.

“ఏమిటోయ్ .. అంత గుస్సా అవుతున్నావ్. యిప్పుడేమైందనీ” కళ్ళు నులుముకుంటూ అడిగింది ఆడమేక.

“సిగ్గు ఇడిసేసి, అచ్చోసిన ఆంబోతులల్లే బజారున పడిన వాళ్ళని చూడండి. బజారు మనుషులు. బజారు మనుషులు” గాడిద ఊగిపోతూ అన్నది.

గాడిద ఎందుకంత ఉద్రేక పడుతున్నదో మేకల జంటకి అర్ధంకాక మొహాలు చూసుకున్నాయి. అది గాడిద గమనించింది. వెంటనే

“మోకాళ్ళ మీద ఆ పైన కింద చింపుకున్న జీన్స్ ప్యాంట్ తో ఒళ్ళంతా ప్రదర్శనకు పెడుతున్న ఆడపిల్లలను చూస్తే ఒళ్ళంతా మంట మండి పోతాంది. పోయి ఆ చెంప ఈ చెంప వాయించి బట్టలు నిండుగా కట్టివ్వాలన్నంత కోపం వస్తాంది. అసలు ఈ కాలం ఆడపిల్లలకి పద్దతి పాడు లేకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు ఎట్లా కళ్ళుమూసుక్కూచ్చున్నారో …
నేనైతేనా, నాలుగు తన్ని ఇంట్లో కూర్చో పెట్టే దాన్ని” అన్నది గాడిద.

పడుతున్న నిద్ర చెల్లాచెదురైన మేకల జంటకు గాడిద ఆవేశంలో అర్థం కనిపించలేదు. ఎందుకింత ఉద్రేక పడిపోతున్నదో వాటి ఊహకి అందలేదు.

“తమకు నచ్చిన బట్టలు వేసుకుంటారు. మధ్యలో నువ్వెవరు వాళ్ళను ఆక్షేపించ డానికి ?” వెళ్తున్న ముగ్గురు జీన్స్ అమ్మాయిల్ని చూస్తూ అడిగింది ఆడమేక.

“చిరిగిన జీన్స్ ని ధరించిన మహిళలు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ మొన్నీమధ్య ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా అలాగే వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత, ఆగ్రహం ఎదుర్కొన్న తర్వాత తన మాటలు వెనక్కి తీసుకున్నారు” నవ్వుతూ నిదానంగా అన్నది మగమేక.

“అవునా ..! ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగునా .,” గాడిద మొహం లోకి చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆడమేక.

“మీరేమైనా అనుకోండి . ఈ కాలం ఆడవాళ్ళు బరితెగించి పోతున్నారు. ఒంటిమీద సరైన గుడ్డలుండవు. ఆ బట్టలు వాళ్ళు . చూడ లేక చస్తున్నాను.. నాకే ఇలా ఉంటే మగవాళ్ళకి ఎలా ఉంటుంది ? ఆడవాళ్ళ మీదకి ఎగబడకుండా ఎలా ఉంటారు” గొంతు పెంచి అన్నది గాడిద.

“సిగ్గులేదూ అట్లా మాట్లాడడానికి. ఆడవాళ్ళ వస్త్రధారణ మార్చు కొమ్మని నీతులు చెప్పే బదులు మగవాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు మార్చు కొమ్మని, బుద్దిగా నడుచుకోమని వాళ్ళకి గడ్డి పెట్టొచ్చుగా ..” అన్నది ఆడమేక.

మగమేక మౌనంగా ఆ ఇద్దరినీ గమనిస్తూ ఉన్నది.

” అయితే, జానెడు బెత్తెడు లేని గుడ్డలు కట్టుకుని , పీలికలు చుట్టుకుని , చీరికల బట్టలతో ఒళ్ళంతా ప్రదర్శించుకోవడం సరైనదేనంటారా ..” కోపంగా అన్నది గాడిద

‘”ఎవరికి ఎట్లాటి బట్టలు వేసుకోవాలో వాళ్ళకి తెలియదా. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వేసుకుంటారు . నిండుగానో , అర్ధనగ్నంగానో లేకపోతే నగ్నంగా మనలా తిరుగుతారో అది వాళ్ళ ఇష్టం. నువ్వెవరు, నేనెవరు నిర్ణయించడానికి? ఎదుటి వాళ్ళను తక్కువ చేసే తప్పుడు ఆలోచన మానుకో.

మన పల్లెల్లో ఒంట్లో సగం కనపడేటట్టు బట్టలేసుకుంటారు శ్రామిక మహిళలు . బయటి దేశాల్లో చిట్టి పొట్టి బట్టలేసుకు తిరుగుతారట . అదంతా అసభ్యత అంటావా .. ?” కొంచెం తీవ్రత ధ్వనిస్తున్న గొంతుకతో ఆడమేక.

“ఆడపిల్లలు సంప్రదాయంగా ఉంటే ఎంత అందంగా ఉంటారు. అటు చూడు ఆ పిల్లని. నిండుగా లంగా ఓణిలో ఎంత సంప్రదాయంగా ఉంది . అట్లాటి ఆడవాళ్ళని చూస్తే గౌరవం పుడుతుంది. సగం సగం గుడ్డలతో దిగజారిన వాళ్ళని చూస్తే మగపిల్లలకి అల్లరి చేయాలని బుద్ధి పుడుతుంది. ” ఇంకా ఏదో చెప్పబోతున్న గాడిద ను చూస్తూ

” ఇక ఆపుతావా హితోపదేశాలు, అవమానకరమైన నీ కామెంట్స్ వినలేకపోతున్నా .. ఎవరికి ఏ దుస్తులు సౌకర్యంగా ఉంటే అవి వేసుకుంటారు.

దుస్తులను బట్టి వాళ్ళు తప్పుదారి పట్టిన వాళ్ళుగానో, దిగజారిన వాళ్ళుగానో, నైతిక పతనం అయినట్లుగానో ఎలా భావిస్తున్నావు? నిండుగా వొంటి నిండా బట్టలు వేసుకున్నవాళ్లంతా మంచి వాళ్లేనా ..?

అలా తీర్పులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నావు?

అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఉనికిని, మన వస్త్రధారణను కాపాడాల్సిన బాధ్యత భారతీయ మహిళలపై మాత్రమే ఉన్నదా..?
మరి పురుషులపై లేదా ..?

ఆడవాళ్ల దుస్తులపై నువ్వు నీలాంటి వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేసేస్తారు.

అదే తమ కండల్ని, శరీరాన్ని ప్రదర్శిస్తూ చొక్కాలు విప్పుకు తిరుగుతున్నా, చెడ్డీలపై ఉన్నా మగవారిని ఏమనరు సరి కదా, వాళ్ళ కండల్ని, సిక్స్ ప్యాక్ బాడీ ని ఆహా ఓహో అని పొగుడుతారు. అంతేనా ..?” గతంలో సిక్స్ ప్యాక్ బాడీ గురించి గొప్పగా మాట్లాడిన గాడిద మాటలు గుర్తొచ్చిన ఆడమేక కోపం, వ్యంగ్యం కలిపి అన్నది ఆడమేక.

ఆ వెంటనే “దేశంలో అత్యాచార సంఘటనలు చూస్తే నిండుగా కట్టుకున్న చీర, షాల్వార్వే కమీజ్సు, వదులు ప్యాంటు , స్కూల్కు యూనిఫామ్ వంటి దుస్తుల్లో ఉన్నవాళ్లే ఎక్కువ అత్యాచారాలకు గురయ్యారు తెలుసా ..

మగవాళ్ల దుస్తుల్ని చూసి ఆడవాళ్లు మిర్రిగుడ్లేసుకుని ఆబగా తినేసేటట్టు చూస్తారా .. ” అన్నది ఆడమేక

విదేశీయులు మన సంస్కృతి సంప్రదాయాలకు దాసోహం అంటుంటే నిండుగా చీరలు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటే, మన పద్ధతిలో యోగ చేస్తుంటే మనవాళ్ళు ఇవన్నీ వదిలేస్తున్నారు. ఏం మనుషులో ” అన్నది గాడిద.

“పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచే ఎవరికైనా ” నవ్వింది మగమేక

“నా ఆవేదన అర్థం చేసుకోకుండా నువ్వెందుకు అంత కోపానికి వస్తున్నావో నాకు అర్ధం కావడం లేదు” గాడిద

“నా ఆగ్రహం నీ మీద కాదు. నీ ఆలోచనా విధానం పైన. నీ ఒక్కదాని పైనే కాదు ఆడవాళ్ళ పట్ల ద్వేషం పెంచే ఏ వ్యాఖ్యలనైనా నేను యిట్లాగే ఖండిస్తాను. అటువంటి వ్యాఖలు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాను. వ్యక్తిగతంగా నీ మీద కాని , మగవాళ్ల మీద కానీ నాకు ఎటువంటి కక్ష లేదు . ద్వేషం లేదు.

ఆడవాళ్ళని చులకన చేసి నోటికొచ్చినట్లు వాగుతూ తీర్మానాలు చేసే వాళ్ళంటేనే అసహ్యం. ఏమీ తెలియని వాళ్లంటే ఏదో తెలియక అట్లా మాట్లాడుతున్నారని సరిపెట్టుకోవచ్చు .
పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు కూడా సభ్యత సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు దిగజారిమాట్లాడుతుంటే తట్టుకోలేను.” ఆడమేక మాటలకి అడ్డు తగులుతూ

“ఎవరన్నారేంటి ” అడిగింది గాడిద

“కొంత మంది మహిళల వస్త్రధారణ చూసి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారని ఓ మంత్రి గారు అంటారు.
జీన్స్ వేసుకోవద్దని ఒక గాయకుడు అంటాడు .

మహిళలు జీన్స్ వేసుకుంటే పుట్టే పిల్లలు ట్రాన్స్ జెండర్ అవుతారని ఒక టీచర్ వదరుతాడు. కనీస శాస్త్ర జ్ఞానం లేనివాడు ఏం టీచరో మరి!

ఆడవాళ్ళ పొట్టి దుస్తుల వల్లే కరోనా అని ఓ మతబోథకుడు అంటాడు.
మహిళల కట్టు బొట్టు సరిగ్గా ఉంటే కుర్రాళ్ళు ఎందుకు అల్లరి చేస్తారని ఇంకొకరు అంటారు.
ఏ చిన్న అవకాశం దొరికిన ఆడవాళ్ళమీద పడి ఏడ్చే బదులు , నీతులు వల్లించే బదులు మగవాడి బుద్ది ఏమైందో ఆలోచించరే .. అతని విలువలు ఏ గంగలో కలిపాడో చెప్పరే..?

సమాజంలో మగవారి రుగ్మతలకు కారణం ఆడవాళ్ళ దుస్తులు అని నిందించడం, మహిళల వస్త్రధారణ నియంత్రించ చూడడం సరైనది కాదని అంటున్నాను.

మహిళలపై జరిగే అత్యాచారాలకి , వస్త్రధారణకి లంకె వేయడం కరెక్టు కాదని చెబుతున్నాను.
ఆంక్షలన్నీ ఆడవాళ్లకే కాదు. మగవాడి బుద్ది గడ్డి తినకుండా చూస్కోవాలని చెబుతున్నాను.
మగపిల్లలకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలను గౌరవించడం నేర్పాలంటాను.” ఆవేశంగా జవాబిచ్చింది ఆడమేక.

“మగపిల్లాడితో ఆడపిల్ల సమానం ఎట్లా అవుతుంది ?” గాడిద

“ఏం ఎందుకు కాదు. ఏ విషయంలో తక్కువ? ఒక విధంగా చెప్పాలంటే అతని కంటే ఆమెనే ఎక్కువ .

భారతీయ సంప్రదాయం భారతీయ సంస్కృతి ఇంట్లో పిల్లలకి సమానంగా నేర్పించాలి. ఎక్కువ తక్కువలతో కాదు.

ఆడపిల్లలను ట్రోల్ చేయడం, ద్వేషం పెంచే వ్యాఖ్యలతో కాదని మర్చిపోకు.

అంతెందుకు , స్త్రీలను గౌరవించడం భారతీయ సాంప్రదాయం అని తాటికాయంత అక్షరాలతో రాస్తారే .. చీమ తలకాయంత అయినా ఇంట్లో మగ పిల్లలకి నేర్పుతున్నారా ..?

లేదు,నువ్వు మగాడివి అంటూ కొమ్ములిచ్చేసేయడం, వాళ్లలో లేని ఆలోచనలు , అపోహలు సృష్టించడం అదేగా చేసేది . ఊ చెప్పు ” అని గద్దించింది ఆడమేక.

ఎప్పుడు ఏంటో సాత్వికంగా కనిపించే ఆడమేకలోని ఆవేశాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న మగమేక నెమ్మదిగా నోరు విప్పింది.

“మన దేశ ఔన్నత్యం ప్రపంచానికి తెలియ చేయాలంటే మగపిల్లలు తమ తోటి ఆడపిల్లని తమతో సమానంగా చూస్తూ గౌరవించినప్పుడే అది సాధ్యం .

ఈ సమాజం అందరిదీ. కొందరి ఆధిపత్యం ఉండకూడదు. వివక్ష ఉండకూడదు. కానీ అలా జరగడం లేదు.

పసిపాపాయి నుండి పండుటాకు వరకు మహిళలంతా మగవాడి దౌష్ట్యానికి, అధిపత్యానికి బలై పోతున్నారు. హద్దులన్నీ, ఆంక్షలన్నీ ఆడవాళ్లకు పెట్టి అచ్చోసిన ఆంబోతులాగా మగవాళ్ళని ఊరిమీద వదిలేస్తున్నారు. చిన్నప్పటి నుండి ఆడవాళ్ళ పట్ల గౌరవం కలిగే మాటలు చెప్పడం లేదు. జీవితపు విలువలు నేర్పడం లేదు. అందుకే వావి వరుసలు మరిచి, విలువలు విడిచి ఆడవాళ్ళ మీద తెగబడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు మగవాళ్ళు.
అందుకే తప్పుదారి పట్టించే దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవడం మంచిది ” అన్నది మగమేక.

“భారతీయ సంప్రదాయం ప్రకారం మగవాళ్ళు పంచె కట్టుకోవాలి . కట్టుకుంటున్నారా ..?
గాంధీ తాత బొమ్మ చూడండి . ఎక్కడ చూసినా ఒంటిమీద గోచీ గుడ్డ తప్ప ఏమీ ఉండదు. మగవాళ్ళ కురచదుస్తుల గురించీ , చీరికల పాంట్స్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. వాటిని చూసి ఆడవాళ్లు కూడా రెచ్చిపోయి మగవాళ్ల మీద అత్యాచారాలు జరపాలి కదా.. కానీ , అలా జరగడం లేదు. అంటే ఆడవాళ్లు అంత బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదనేగా ..

ఆడవాళ్ళ దుస్తుల బట్టే అత్యాచారాలు జరుగుతున్నాయని నిందించే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సింది బలహీనమైన పురుషుల మనస్తత్వం గురించి . దృఢమైన శరీరమే కాదు బలమైన బుద్ది ఇవ్వాలి.

చౌకబారు వ్యాఖ్యలతో ఆడవాళ్ళని అవమానించడం మంచిది కాదు. మొదట ఆడవాళ్ళని చూసే దృష్టి మారాలి . అసలు సమస్య ఆడవాళ్లు వేసుకునే దుస్తుల్లో లేదు . ఆడవాళ్ళని ఒక భోగ వస్తువుగా , ఒక యంత్రం గా, మనసు లేని మరబొమ్మ గా చూసే మగవాడి దృష్టిలో ఉంది .

పనికి మాలిన మాటలు మాని, అడ్డమైన కూతలు కూయడం ఆపేసి మగవాడి దృష్టి లోపాన్ని సరిచేయడం మంచిది. విచక్షణ , విజ్ఞత నేర్పడం మంచిది. నీకు వీలయితే,నీ మాట ఎవరైనా వింటారనుకుంటే ముందు ఆ ప్రయత్నం చెయ్యి . పో ” కసిరింది ఆడమేక

మొహం చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది గాడిద.

“ఎందుకంత ఆవేశపడ్డావ్ ” అన్నది మగమేక.
వెళ్తున్న గాడిదను చూస్తూ “బట్టతలకు మోకాళ్ళకు ముడి వేసి నోరు పారేసుకునే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందేగా” అంటూ నవ్వేసింది ఆడమేక.

వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో