పాక్సో -మేకోపాఖ్యానం-3 – వి . శాంతి ప్రబోధ

మన దీపమని ముద్దాడితే..

మేకల జంట, గాడిద మరి కొన్ని ఇతర జంతువులు ఎప్పటిలాగే ఆ మధ్యాహ్నం మర్రి చెట్టు నీడలో చేరాయి.
“ఈ ఆడపోరగాళ్ళకి ఏం రోగ మొచ్చిందో .. చక్కగా ఇంటి కాడ తిని కూర్చోక..
నిరసనలు, పోరాటాలు , ఉద్యమాలు అవసరమా ..” గొణుక్కున్నది గాడిద.

“ఎవరి గురించన్నా నీలో నువ్వే చిరాకుపడుతున్నావ్” అడిగింది మగమేక

“ఇంట్లో ఇంత కూడు వండి పడేసి పిల్లా పాపల్ని చూసుకోకుండా రోడ్లెక్కి తైతక్కలాడే ఆడాళ్ళ గురించి” చెప్పింది గాడిద

“ఆడాళ్ళ గురించా .. అసలేమైందో వివరంగా చెప్పు ” ఏమంటున్నదో అర్ధం కాని ఆడమేక

“ఏమవుతుంది. గమ్మున కూచోకపోతే ఏమవుతుంది. నేనున్నానంటూ పుట్టలో వేలుపెడితే చీమ కుట్టదా ..!
ఇదీ అంతే, అరెస్టు అయ్యి ఊచలు లెక్క పెడుతున్నారు” అక్కసుగా అన్నది గాడిద .

“అయ్యయ్యో .. పోలీసుల చేతుల్లో పడ్డ ఆడపిల్ల గతి అంతే .. ఆమెనట్లా ఉంచుతారా .. నరకం చూపుతారట కదా ..
చ్చొ చ్చొ .. పాపం ఆ బిడ్డల జీవితం ముందు ముందు ఎంత నరకమైపోతుందో.. బతకలేరు. చావలేరు” అన్నది లోకం చూస్తున్న మగమేక

“ఆ .. అందుకే తమ్ముడూ నా బాధ .
ఆడవాళ్లు ఆడవాళ్ళలాగా ఉండాలనేది. ఎందుకొచ్చిన తిప్పలు చెప్పు , హక్కులు, నిరసనలు, ఉద్యమాలు అంటూ రోడ్డెక్కడం. తన్నులు తినడం, కటకటాల పాలవడం .
ముల్లొచ్చి ఆకుమీద పడ్డా , ఆకెళ్లి ముల్లు మీద పడ్డా చిరిగిపోయేది నష్టపోయేది ఆకేగా .. ఆ చిన్న విషయం చదువుకున్న వీళ్ళకి ఎందుకు అర్ధంకాదో మరి!

తప్పుతుందా..! చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత ప్రాప్తం” అన్నది గాడిద

వింటున్న ఆడమేకకు వళ్ళు మండిపోతున్నది. “ఇంతకీ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావ్ .. “చురచురా చూస్తూ అన్నది ఆడమేక .

” ఇంకా అర్ధంకాలేదా .. మహా మేధావులం అని మిడిసిపడుతున్నారుగా ఆడకూతుళ్ళు వాళ్ళ గురించి మొన్న కార్మిక హక్కుల కార్యకర్త నవదీప్ కౌర్ , నిన్న పర్యావరణ కార్యకర్త దిశ రవి , లాయర్ నిఖిత జాకబ్ , ఆర్కిటెక్ట్ శంతన్ ములుక్ వగైరా అంతా పాతికేళ్ల లోపు ఆడవాళ్లే .. ప్చ్ .. వాళ్ళకి పెళ్లిళ్లు ఎట్లా అవుతాయో.. అలాంటి వాళ్ళనెవడు చేసుకుంటాడు ఈ భూలోకంలో ?
ఎందుకొచ్చిన తిప్పలు చెప్పు. కోరితెచ్చుకున్న కొరివి అంటే ఇదేనేమో ” బాధపడిపోతున్న గాడిదను చూస్తుంటే నాలుగు తన్ని తగలెయ్యాలన్నంత ఆవేశం తన్నుకొస్తున్నది ఆడమేకకు.

ఏదో అనబోతున్నంతలో “వాళ్ళేం నేరం చేశారో ” ఏమీ ఎరగనట్లుగా ప్రశ్నించింది మగమేక

“నీలాగే, నాలాగే మరింకెంతో మంది లాగే వాళ్ళూ కొత్త వ్యవసాయ చట్టాలని వ్యతిరేకించారు . అవి రైతులకి మేలు చేయవని గుర్తించారు. అదే విషయం నలుగురికీ చెప్పారు . సామాజిక మాధ్యమాల ద్వారానో మరో విధంగానో శాంతి యుతంగా నిరసన తెలుపుతూ ధర్మపోరాటం ప్రారంభించారు అంతేనా .. ” మొగుడిని , గాడిదని మార్చి మార్చి చూస్తూ తీక్షణ్ణంగా చూస్తూ అడిగింది ఆడమేక .

ఆ చూపులకు కలవరపడుతూ అవునట్లు కాదన్నట్లుగా తలూపి, “వాళ్లేమన్నా రైతులా.. అన్నిట్లో తలదూర్చడం ఎందుకు ” తలెగరేస్తూ అన్నది గాడిద .

“ఇల్లలకగానే పండగ అయిపోతుందా ..? కాదని చెప్పేవాళ్ళు ఉంటారుగా ..
ఈ దేశంలో తమ అభిప్రాయాల్ని చెప్పడం కూడా తప్పేనా ?
సామాన్యులకి న్యాయం చేయని అలుకుపూతల చట్టాలని వ్యతిరేకించడం , నిరసన తెలపడం నేరమా ..? భిన్నాభిప్రాయాలు ఉండకూడదా .. ?
ఉంటే దేశద్రోహం , నేరపూరిత కుట్రకేసులు పెట్టేస్తారా .. అరెస్టు చేసేస్తారా .. జైల్లో పెట్టేస్తారా .. ?
భిన్న స్వరాన్ని, భిన్నఅభిప్రాయాల్ని గౌరవించాల్సిన దేశంలో, భిన్నత్వాన్ని గౌరవించలేదంటే, సహించలేకపోతున్నారంటే అర్ధం ఏంటి ?

తామ పనులు ప్రజాప్రయోజనాలను దెబ్బతీసే పనికిమాలినవని వాళ్లకు తెలుసు. తమ అసమర్ధతను ఎత్తి చూపేవాళ్లు, ఎదుర్కోవడానికి సిద్దపడేవాళ్లు ఉంటారని ఖచ్చితంగా తెలుసు.
అందుకే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి దేశద్రోహులుగా ముద్ర వేసేది. అరెస్టులు చేసేది.

తాము అనుకున్న పని నిర్విఘ్నంగా సాగిపోవడం కోసం నియమాలన్నీ తుంగలో తొక్కేసి తమ ఇష్టానుసారం రకరకాల సెక్షన్లలో నేరారోపణలు చొప్పించి బేడీలు వేసేది.

వారి అభద్రతను చూస్తే అర్ధమవడంలా .. ఎవరు బలవంతులో, ఎంత శక్తిమంతులో .. ” తీవ్రంగా చూస్తూ అన్నది ఆడమేక.

అంతటి ఆవేశాన్ని ఎప్పుడూ చూడని గాడిద , మగమేకతో పాటు అక్కడున్న మరికొన్ని జంతువులూ విస్తుపోయి ఆడమేకను చూశాయి .

” అహ్హ హ్హా .. ఏలెడంత లేని పిల్లల్ని చూస్తే మహావృక్షాలకి భయమా హ్హా హ్హా .” అంటూ పగలబడి నవ్వింది గాడిద .

ఆ తర్వాత ” నీకు తెలీదేమో, ఆ అమ్మాయిలకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయట. నిషేధిత సంస్థలతో కలసి దేశ విచ్చిన్నతకు కుట్రలు పన్నుతున్నారట” తన మాటకు బలం చేకూర్చుకుంటూ తనకే దేశభక్తి పొంగిపోతున్నట్లు అన్నది గాడిద .

” అచ్చా .. ‘అట’ అనుకుంటే అది నిజమైపోతుందా.. కేసులు పెట్టేస్తారా .. అసలు ఏ ఆధారాలున్నాయని?

పిరికితనం సన్నాసులు పిరికిసన్నాసులు ..
మీ మహావృక్షాలకి రేపటి నుండి సూర్యోదయం కూడా కుట్రగానే కనిపిస్తుంది . వెలుతురు రావడం , గాలి వీచడం కూడా కుట్రగానే కనిపిస్తాయి.

నువ్వు తెగ బాధపడిపోతున్న ఆడవాళ్ళకి మద్దతివ్వలేదు. సంఘీభావం తెలపలేదు. సరే అనుకున్నా, వారి బాధేంటో ఎప్పుడైనా తెల్సుకున్నావా.. నాలుగ్గోడల మధ్యనుండి బయటికొచ్చి ఎందుకు నినదించాల్సి వస్తున్నదో తెలుసుకున్నావా ? ఆ కోణంలో ఒక్క క్షణమైనా ఆలోచించారా ..?
ఊహూ అది చేతకాదు గానీ అవాకులు చెవాకులు అల్లేసుకుంటూ బాగానే ఓండ్ర పెడతారు.
ఆహారం, ఆరోగ్యం, విద్య , వైద్యం అన్నిటిలో వెనుకబాటుతనమే. అయినా భరిస్తూ వస్తున్నారు. ఓపికతో గుట్టుగా కాలం వెళ్లబుచ్చుతూ వస్తున్నారు. తమ హక్కుల్ని కాలరాస్తున్నా సహిస్తున్నారు. అసలు బతుకే ఉండదనుకుంటే ఏమవుతుంది ?

గదిలో బంధించిన పిల్లి కూడా పులిలాగా మారుతుందని తెలియదా .. ” నిలదీసింది ఆడమేక .

“ఏమీ ఎరగనట్టే ఉంటావు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచీ వచ్చిందే” అని ఆశ్చర్యపోయింది మగ మేక .
మళ్ళీ తానే “రైతులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే రైతుల కోసం అని మూడు కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చేశారు . అవి ఈనాటి వరకూ తిండి పెట్టిన రైతుకు తిండి దూరం చేసే చట్టాలని , రాబందులు , గద్దలు రైతును కూలీగా మార్చి వారి శ్రమను దోచుకుపోయే చట్టాలని అన్నం పెట్టే రైతు ప్రపంచం నమ్ముతున్నది .

నేలనే నమ్ముకున్న రైతు నోట్లో మట్టి కొట్టి ఆకాశంలో ఎగిరే రాబందులు, గద్దలకు అన్నీ కట్టబడుతుంటే రైతు ఎలా ఊర్కోగలడు ?” తాను ఆనోటా ఈ నోటా విన్నమాటలను నెమరువేసుకుంటూ అన్నది మగమేక .

“అది సరేలే, రైతులు ఆ పని చేస్తున్నారుగా .. తగుదునమ్మా అంటూ వీళ్లేందుకట అందులో దూరడం?” అరిచింది గాడిద

” అసలు నీ బాధ ఏంటట?

నీ దృష్టిలో రైతంటే ఎవరు మగవాళ్లేనా ..? ఆడవాళ్లు కదా .? ఈ చెట్టు కింద కాసేపు కూర్చున్నా ఆ విషయం అర్ధమయిపోతుందే వ్యవసాయంలో వాళ్ళ ప్రాధాన్యత గురించి. ఇన్నేళ్లొచ్చినా నీకు తెలీలేదా..

సాగుభూమిలో 12 శాతానికి మాత్రమే మహిళలు హక్కుదారులు కావచ్చు. నీ చుట్టూ నా చుట్టూ ఉన్న ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా 75శాతం సాగు పనులు చేసేది మహిళలేనని తెలుసుకో ముందు.

పొయ్యి వెలగకపోతే , కంచం ఖాళీ ఉంటే ముడ్దిచుట్టు తిరిగే పిల్లల కాలే కడుపుల ఎట్లా నింపాలో సతమతమయ్యేది ఆమెనే . ఆ బాధ, వ్యధ ఆమెకు మాత్రమే బాగా తెలుసని మర్చిపోకు.

ఉండడానికి లేదు, తినడానికి లేదు. వసతి లేదు సదుపాయం లేదు నెలలుగా రోడ్లమీదే జీవనం. వీధుల్లోనే నివాసం. నినాదం.

జీవావసరాలు తీర్చుకోవడం మరింత ఇబ్బంది , అయినా వెరువలేదు .
వ్యవసాయచట్టాల నిరసన ఉద్యమంలో రహదారులనే ఆవాసాలుగా చేసుకున్నారు. చేతనయిన వసతులు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు , పిల్లలు , వృద్దులు అంతా అందులో ఉన్నారు.

ధైర్యాన్ని సడలించే చలిగాలులు , నిరసనను నీరుగార్చే అకాల వర్షం , టియర్ గ్యాస్ , జల ఫిరంగులు .. ఏమున్నా ఉద్యమ స్ఫూర్తి ఇనుమడిస్తూనే ఉన్నది . వీసమంత కూడా తగ్గలేదు
ఆ జనాన్ని చూస్తుంటే జాతరే అనిపిస్తున్నది . ఆ అక్కచెల్లెళ్లంతా సమ్మక్క సారక్కల్లాగే కనిపిస్తున్నారు.

ఆ అవ్వలు , అమ్మలు, అక్కలు, చెల్లెల్లు ఏమంటున్నారో తెల్సా .. మాకు బతుకు మీద బెంగ తప్ప ఇంటిమీద బెంగలేదు అంటున్నారు.

చీకటి చట్టాలు మాకు పని ఇస్తాయేమో కానీ తింటానికి తిండి పెట్టవని ఇప్పటికే అర్ధమయింది. మా పొట్టకొట్టే చట్టాలను మేమెలా ఆమోదిస్తాం. ఆమోదించం . అది మా హక్కు అంటున్నారు.

ఆమెను మగవాడి కోరిక తీర్చి, పిల్లల్నికని అతని వంశ అభివృద్ధి చేస్తూ ఇంట బయట పని చేసే యంత్రాలు మాత్రమే అనుకుంటున్నారేమో.. అవసరమైతే రణరంగంలో ముందువరుసలో నిలుస్తుందని మర్చిపోకండి. చూశారుగా .. నడుము వంగిన బామ్మ సహా తాడో పేడో తేల్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

62 ఏళ్ల మంజిత్ కౌర్ 250 కిమీ పైగా స్వయంగా జీపు నడుపుకొచ్చింది . మరికొందరు ఉద్యమకారిణులు .. బల్జీత్ కౌర్ , ముల్కిత్ , పర్మజీత్ .. ఎందరో .. నడుము వంగిన బామ్మలు కూడా పోరులో నిరసనలో భాగస్వాములు ముందు నిలుస్తున్నారు.

పొలంలో ఉండాల్సిన మేం ఈ నిరసన లో ఉన్నామంటే, రోడ్డు మీద ఉన్నామంటే ఎందుకు ? చీకటి చట్టాలు మమ్మల్ని ఎంతటి చీకటిలోకి నెట్టేయ్బోతున్నాయో తెలవడం వల్లనే . చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం చెప్పండి.

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ మేము లేచి నిలబడలేమని, లేవలేనంత చీకటి లోయల్లో కూరుకుపోతామనీ తెలుసు. అందుకే ప్రయత్నం అంటున్నారు వాళ్ళు .

ఈ చట్టాల ప్రభావం ఎక్కువ పడేది మహిళలు మీదే . అందుకే తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా కదులుతున్నాం అంటున్నారు రైతు మహిళలు.

ఇప్పటికే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు విపరీతమైన అప్పులపాలయ్యాయి . ఫలితం రైతు ఆత్మహత్యలు . ఆత్మహత్య బాధిత కుటుంబాల్లోని మహిళా రైతులను చాలా దుస్థితిలోకి నెట్టివేశాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించినా లాభం లేకుండా ఉంది.

ఎందుకంటే మహిళల పేరు మీద భూమి పట్టా లేదు . కాబట్టి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు .

మీ మహావృక్షాల దృష్టిలో , మీ దృష్టిలో మహిళలు రైతులుగా గుర్తించబడక పోయినా వాళ్ళు రైతులే. అందుకే తమ బాధ్యతగా ఉత్తుంగ తరంగాలై కాలిబాటన ఉద్యమ ప్రాంతాలకు తరలి వస్తున్నారు.

వాళ్ళ చుట్టూ గోడలు కట్టేస్తున్నది . మూళ్ళ కంచెలు వేస్తున్నది . ముందుకు రాకుండా మేకులు కొడుతున్నది . దాటి వచ్చారా .. ఖబడ్ధార్ ..

మీకు దిశరవి , నవదీప్ , జాకబ్ లకు పట్టిన గతే పడుతుందని చెప్పకనే చెబుతున్నది రాజ్యం.
అయినా, మేము రైతులం అంటూ వ్యవసాయంలో తమ స్థానాన్ని హక్కుని స్వరాన్ని స్పష్టంగా వినిపిస్తున్నారు మహిళలు. వారికి సంఘీభావం తెలుపుతున్నారు మరికొందరు.

ఆ తానులో ముక్కేగా ! రైతక్కల స్వరం సుప్రీకోర్టు న్యాయమూర్తికీ నచ్చినట్లు లేదు. ఆడవాళ్ళిక్కడెందుకు ఇంటికాడ ఉండక అన్నాడు . అచ్చం నువ్వనట్టే అంటే , మీరేమనుకుంటున్నారు. ఆడవాళ్లు మనుషులుగా కనబడట్లేదా? వాళ్ళకి రాసుకున్న రాజ్యాంగంలోని హక్కులు చెల్లవా ? అవి నీటిమీద రాతలేనా ..?

మహిళలకి నిరసన తెలిపే హక్కు లేదా ఏది ఎట్లా ఉన్నా పడి ఉండాల్సిందేనా మీ ఉద్దేశంలో .. వ్యవసాయ చట్టాల నిరసన ఉద్యమాన్ని సమర్ధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా మద్దతు వస్తున్నది. ముఖ్యంగా మహిళల నుంచి . గ్రెటా థన్ బర్గ్ , పాప్ స్టార్ రిహన్నా , మినా హ్యారిస్, వనసే నకటా మొదలుకొని మనదేశంలోని మణిపూర్ కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పర్యావరణ కార్యకర్త లిసిప్రియా కంగుజుమ్ వరకు ఎందరో సమర్థిస్తున్నారు .

ప్చ్ .. మన దేశ మహావృక్షాలమనుకునే వాళ్లకు మాత్రం రైతుల గోస అర్ధం కావట్లేదు.. అది వాళ్ళ దేశభక్తి మరి !

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొన్ని వృక్షాలకయితే నన్నెవరూ ఏమిచేయలేరనే అహంకారం బాగా ముదిరింది. వాటికి బీచ్ లో, అడవిలో ఎక్కడెక్కడో ఫోటోలకు పోజులివ్వడం మాత్రం బాగా తెల్సు.

ఫోజురాయుళ్ళకి నిజంగా పని చేసే వారంటే ఎపుడూ భయమే మరి ! ” విరామం లేకుండా మాట్లాడేస్తున్న ఆడమేక ధోరణికి విస్తుపోయి చూస్తున్నారంతా. చెట్టుకు ఆవలి వేపు వీళ్ల మాటలను విన్న దున్న చప్పట్లు కొట్టింది. పంది గునగునా వచ్చి ఆడమేకను అభినందించి పక్కనే కూర్చుంది.

ఎంతో సాత్వికంగా కనిపించే ఆడమేకకే ఇంత ఆవేశం వచ్చిందంటే అనుభవించే ఆ ఆడవాళ్ల పరిస్థితిని ఆలోచిస్తూ “మనదీపమని ముద్దాడితే మూతి కాలకుండా పోదని రైతాంగానికి బాగా తెల్సు . అందుకే , వ్యవసాయం కార్పొరేట్ల చేతుల్లోకి పోకూడని , సాంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తాపత్రయ పడుతున్నారు .

ఆ క్రమంలో , పెద్దలు గద్దలు తనని తన మందని తూర్పార పడతారని ముందే కట్టడి చేసే యత్నంలో భాగంగానే ఈ అరెస్టులు అని అర్ధమవుతున్నది” అన్నది మగమేక

“నిజానికి నాటకాలకు తేడా ప్రజలకు అర్ధమవుతున్నది. ఊరుకుంటారా .. ఎట్లా ఆడుకుంటారో చూడండి ” అన్నది నవ్వుతూ భార్య మేక

“అదుపు ఆజ్ఞలు లేని ప్రవేటీకరణ సామాజిక వినాశానికి దారితీస్తుందని ఆనాడే అన్నాడు వాళ్ళ పెద్దయ్య వాజ్పాయ్ “అన్నది చెట్టు మీది కాకమ్మ

“బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు , నాటి చంపారన్ రైతు ఉద్యమం నుంచి నేటి ఢిల్లీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన ఉద్యమాల వరకు రైతుల సంఘటిత శక్తిని ఎవరూ ఛేదించలేరన్నది నిజం ఎవరైనా గుర్తించాల్సిందే .” అన్నది చిలుక

“అది సరే గానీ .. నేనన్నది ఆడవాళ్ళ గురించి .. ” నసిగింది గాడిద .

” చాల్చాల్లే .. ఏం మాట్లాడుతున్నావయ్యా .. పొలంలో కలుపును గుర్తించే రైతక్కలు పాలకుల నలుపును గుర్తించలేరా..

మౌనంగా నాలుగ్గోడల మధ్య ఉన్నారని వాళ్ళకి ఏమీ తెలియదనుకుంటే అది మీ పొరపాటే .
ఇంటి నుంచి బయటికొచ్చిన ఆడవాళ్ళంతా ప్రభంజనమై కదిలితే ఎంతటి మహావృక్షాలైనా కూకటివేళ్లతో కూలిపోక తప్పదని నీవాళ్లకు తెల్సు.

ఉద్యమ క్షేత్రంలో ఉన్న తమ మగవాళ్ళకి ఇంధనం సమకూర్చేదీ వాళ్ళ ఆడవాళ్లేనని తెల్సు .
అందుకేగా, పాతికేళ్ళు లేని ఆ అమ్మాయిలను భయంకరమైన శత్రువులుగా చిత్రిస్తున్నది. వారి శక్తికి భయపడుతున్నది . కంట్లో నలుసుల్లా తీసివేయ యత్నిస్తున్నది
” అన్నది ఆడమేక

వి . శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో