సమాంతరాలు –మొట్టమొదటి సారి -యం.యస్.హనుమంత రాయుడు

1997 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శెట్టూరులో మా 7వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసాము. చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం అయిపోగానే మాకు సంతోషమే సంతోషం.పరీక్ష హాల్ నుండి బయటకు రాగానే నోట్ పుస్తకాలు అన్నీ చించి గాల్లోకి విసిరి గంతులే గంతులు,తెల్ల షర్టులు మొత్తం ఇంకుతో నీలి రంగులోకి మారిపోయాయి.

తరువాత రోజు నుండి వేసవికాలం సెలవులు. మామూలు రోజుల్లోనే ఇండ్లలో ఉండము అట్లాంటిది పెద్ద సెలవులు అంటే మాటలా. తినడానికి ఇంటికి వస్తే అదే గొప్ప.పొద్దున్నే నిద్ర లేచినప్పుడు ఇంటి నుండి బయటకు వస్తే తిరిగి రాత్రికి నిద్రపోవడానికి ఇంటికి వెళ్ళేవాళ్ళం.

పొద్దున్నే లేస్తూనే పొయ్యి దగ్గర ఇంత బొగ్గు తీసుకుని నోట్లోకి వేసుకుని కసా బిసా నమిలి,చూపుడు వేలుతో పళ్ళమీద అటు ఇటు రెండు మూడు సార్లు రుద్ది,చెంబులో కొన్ని నీళ్లు తీసుకుని నోట్లోకి పోసుకుని పుక్కిలించి ఉమ్మి,చెంపలు కూడా నానకుండా ముఖం మీద నీళ్లు చల్లుకోవడంతో మొహం కడుక్కోవడం అనే కార్యక్రమం అయిపోయేది.

పొద్దున్నే నాకు ఇంట్లో ఒకే ఒక డ్యూటీ ఉండేది,పాల క్యారియర్ తీసుకుపోయి మాటోళ్ల తిప్పయ్య తాత వాళ్ళ ఇంట్లో పాలు పోయించుకుని రావడం ఇది నా డ్యూటీ. పాలు తెచ్చి ఇచ్చిన వెంటనే బెల్లం,టీ పొడి వేసి చేసిన టీ తాగి ఇంట్లో ఉండే బ్యాట్,బాల్,వికెట్లు తీసుకుని ఛలో క్రికెట్ గ్రౌండ్ అట్ చెరువు.
చెరువులోనే ఒకటి, రెండు కార్యక్రమాలు సామూహికంగా అందరూ అక్కడే కానిచ్చేవాళ్ళం.పొద్దున్న పోయిన వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వరకూ ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా క్రికెట్ ఆడేవాళ్ళం.కొన్నిసార్లు క్రికెట్ గ్రౌండ్ మారేది కానీ క్రికెట్ ఆడేది మాత్రం ఆగేది కాదు. కొన్ని రోజులు వడ్డే హనుమంతన్న చేనులోన,కొన్ని రోజులు గొల్లోల్ల కశెప్ప చేనులోన క్రికెట్ ఆడుకునేవాళ్ళం.
మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంత అన్నం తిని మళ్ళీ బయటకు పరుగు. ఇప్పుడు విశ్రాంతి కోసం కోమటోళ్ల హనుమంతయ్య తోటలోకి పోయి అక్కడ మోటార్ కింద కూచుని మాకు చాలయ్యేంత వరకూ ఎగురుతూ దుముకుతూ స్నానాలు చేసేవాళ్ళం.

అక్కడే ఉన్న చింత చెట్లు ఎక్కి చింత చిగురు కోసి ఇన్ షర్ట్ చేసి దాంట్లోకి వేసుకునేవాళ్ళం. అక్కడ నుండి తడి బట్టలతోనే ముత్రాసోల్ల తోటలోకి పోయేసరికి తడి బట్టలన్నీ ఆరిపోయేవి.అక్కడ బంక పండ్లు చెట్టులో ఆ పండ్లు పీక్కోని నోరంతా బంక బంక అయ్యేంత వరకూ తినేవాళ్ళం.అక్కడ నుండి మెల్డి మీదకు వచ్చి కడుపు ఉబ్బేలా కలివి పండ్లు తినేవాళ్ళం.

ఇవన్నీ అయ్యేసరికి సాయంత్రం అయ్యేది. అక్కడి నుండి నారమ్మ చేనులో కానుగ చెట్ల కిందకు చేరేవాళ్ళం.అక్కడే కానుగ చెట్టు నుండి కట్టెలు నరికి సిల్లా కాము చేసుకుని కట్లు మంచల్ నరియల్ గిలి గిలి పటకర పిల్లర కొండి అని సిల్లా కట్టి ఆడేవాళ్ళం, ఓడిపోయిన వాళ్ళు జగ్గా జువ్వన్న అంటూ జువ్వు పట్టడం భలే తమాషాగా,సరదాగా ఉండేది.పొద్దు మునిగి చీకటి పడేంత వరకూ ఇదే ఆట.

చీకటి పడిన తర్వాత ఆర్డీటీ స్కూల్ ముందర ఆట స్థలానికి చేరుకుని జట్లు జట్లుగా విడిపోయి ఉప్పరం పట్లు ఆట ఆడేవాళ్ళం.అన్ని ఇండ్లలోకి ఉప్పు తీసుకువచ్చి బయటకు వస్తే దాన్ని కోడి పీకడం అనేవాళ్ళం.ఈ కోడి పీకేదానికి చాలా చాలా ఎత్తులు వేసేవాళ్ళు ఆటగాళ్లు.ఇండ్లలో వాళ్ళు వచ్చి మబ్బు అయ్యింది ఇళ్లకు రండి అనేంత వరకూ ఆడుతూనే ఉండేవాళ్ళం. ఇంటికి పోయి మొహం కడుక్కుని ఇంత తిని తల నేలకు ఆనిస్తే చాలు నిద్రలోకి జారుకునేవాళ్ళం. తెల్లవారేంత వరకూ మెలకువ కూడా వచ్చేది కాదు.

మళ్ళీ పొద్దునే తెల్లవారగానే మళ్ళీ ఇవే కార్యక్రమాలు. ఏదో ఒక చోటకి చేరడం ఏదో ఒక ఆట ఆడటం.
ఆర్డీటీ స్కూల్ వెనక చేరి గోళీలు ఆట ఆడేది. న్యామేలి ఆట,చిట్ పట్ ఆట విచిత్రమైన పేర్లు తో ఉండే ఆటలు అన్నీ. ఎవరు ఎక్కువ గోళీలు గెలుచుకుంటే వాళ్ళు గ్రేట్. డబ్బాలు డబ్బాలు నిండా గెలుచుకున్న గోళీలు నింపుకునేవాళ్ళం.

ఇది చాలదు అన్నట్టు పత్తాలాట.పడేసిన సిగరెట్ ప్యాకెట్ల అట్టలు చించి వాటిని కరెన్సీ గా పెట్టుకుని రాజా పూలు ఆట ఆడవాళ్లు.గెలుచుకున్న పత్తాలు అన్నీ కట్టలు కట్టలు కట్టి దాచుకునేవాళ్ళం,ఎవరి దగ్గర ఎక్కువ పత్తాలు ఉంటే వాళ్ళు షావుకార్లు.

ఒకానొక రోజు, రోజు మాదిరే ఆడుకుంటుంటే ఎవరో వచ్చి ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి, ఆఫీస్ రూమ్ దగ్గర రిజల్ట్స్ పేపర్ అతికించారు అని చెప్పేసారు. అంతవరకూ సంతోషంగా ఆడుకుంటున్న వాళ్లు ఒక్కసారిగా గంభీరంగా మారిపోయారు. ఎవరెవరు పాస్ అయ్యారో ఎవరెవరు ఫెయిల్ అయ్యారే అనే టెన్షన్ తో పరీక్షలు రాసిన వారు రాయని వారు అందరూ స్కూల్ వైపు పరుగులు తీశారు.

నేను మాత్రం చాలా నింపాదిగా వెళ్ళాను, ఎందుకంటే మార్కులు చాలా రాకపోయినా నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అనే నమ్మకం నాకు ఉంది. తీరా అక్కడికి పోయి చూస్తే 413 మార్కులతో(హిందీ మార్కులు కలపకుండా) నేనే స్కూల్ ఫస్ట్ వచ్చాను.పూజారి శ్రీనివాసులు సార్ ట్యూషన్ కు పోకపోయినా అందరికన్నా ఎక్కువగా సాంఘిక శాస్త్రంలో నాకు 98 మార్కులు వచ్చాయి.ఇది నాకు ఎక్ట్రా సంతోషం.

రెండు నెలలు ఎండాకాలం సెలవులు కాస్తా ఆట పాటలతో రెండు రోజుల్లోనే అయిపోయాయి.మళ్ళీ స్కూల్స్ తెరిచారు.స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తో నేను 8వ.తరగతిలోకి పోయాను.

8వ.తరగతికి అంతా పెద్ద అయ్యవార్లు వస్తారు. సోషల్ అయ్యవారు, బాలప్ప సార్, శేష శయనం సార్… అమ్మో వీళ్ల పేర్లు వింటేనే భయం అయ్యేది.

ఒకరోజు ఏం జరిగింది అంటే ..
నా క్లాస్మేట్ అయిన మిత్రుడు తన నోట్ బుక్ ఏదో మరచిపోయి క్లాస్ కు వచ్చాడు.ఇద్దరూ కలిసి ఇంటికి పోయి తీసుకువద్దాం రా అని నన్ను పిలిచాడు.నేను రాను రాను అంటున్నా నా మాట వినకుండా తను వాళ్ళ ఇంటికి నన్ను పిలుచుకుపోయాడు.

ప్రత్యక్షంగా ఎక్కడ నాకు అప్పటివరకూ ఎదురుకాలేదు కానీ మమ్మల్ని వేరేవాళ్ళు వాళ్ళ ఇండ్లలోకి పిలుచుకోరు అనే అవగాహన అయితే నాకు అప్పటికే ఉంది.అందుకే నేను లోపలికి వెళ్లడానికి తటపటాయిస్తూ ఇంటి బయటే నిలబడి ఉన్నాను. కానీ మావాడు నా చేయి పట్టుకుని లాక్కుని లోపలికి పిలుచుకుపోయాడు.

లోపల హాల్ లో మంచం మీద ఇద్దరూ కూర్చున్నాము. మెత్తటి దూది పరుపు కూచుంటేనే హాయిగా ఉంది.అప్పటికి మా ఇంట్లో అటువంటి మంచాలు పరుపులు లేవు. నాకు ఒక కొత్త అనుభూతి అది.

వాళ్ళ అమ్మ లోపలి ఇంట్లో నుండి హాల్ లోకి వచ్చింది.నేను పైకి లేవబోయాను.కూచో బాబు కూచో అని తాను అనడంతో నేను మళ్ళీ అక్కడే కూచున్నాను.ఎటువంటి ప్రశ్నలు నన్ను అడగలేదు.
దాంతో హమ్మయ్యా ఏం ఇబ్బంది లేదులే అని నేను ఊపిరి పీల్చుకున్నాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ రెండు స్టీలు గిన్నెల్లో పాయసం తీసుకువచ్చి తినడానికి స్పూన్ ఇచ్చి మళ్ళీ లోపలికి పోయింది.

పాలు, నెయ్యి,చక్కెర, జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి చేసిన సేమియా పాయసం చాలా అద్బుతంగా ఉంది.తింటూ ఉంటే అదో రకమైన మాధుర్యం.
భక్త రామదాసు అన్నట్టు

“కదలి ఖర్జురాది ఫలముల కన్ననూ, నవరస పరమాన్నం నవనీతములకన్నా” అధికమైన రుచిగా ఉంది.

స్పూన్ తో తినడం పెద్దగా అలవాటు లేకపోవడంతో,తింటూ ఉంటే నాకు ఏదో అసౌకర్యంగా అనిపించింది.స్పూన్ ను పక్కనపెట్టి చక్కగా గిన్నెను నోటికి కరుచుకుని తన్మయత్వంతో పాయసం తాగుతూ ఉన్నాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మళ్ళీ బయటకు మా దగ్గరకు వచ్చింది. మరి నేను తింటున్న విధానం చూసి ఆమెకు అనుమానం వచ్చి అడిగిందో లేదంటే యాదృచ్చికంగా అడిగిందో తెలీదు గానీ

“బాబు మీరు ఎవరి పైకి” అని అడిగింది.
నాకు ప్రశ్న సరిగ్గా అర్థం కాక అనుమానంగా ఆమె వైపు చూసాను.
ఆమె “అదే బాబు నువ్వు ఎవరి పిల్లోడు” అని మళ్ళీ అడిగింది.
నేను ఫలానా ఫలానా వాళ్ళ పిల్లోడు అని గొణుగుతూ సమాధానం చెప్పాను.
నా ఇబ్బందిని మా ఫ్రెండ్ గుర్తించినట్టు ఉన్నాడు.ఇంకా ముందుకుపోతే బాగుండదని “అమ్మా నువ్వు కొద్దిసేపు ఊరుకో” అని గద్దించినట్టుగా కొంచెం గట్టిగా అన్నాడు.

కానీ నా ఫ్రెండ్ వాళ్ళమ్మ మావాడి మాట వినలేదు.ఆగకుండా మళ్ళీ ఇంకో ప్రశ్న
అంటే మీరు ….అంటూ.
నేను ఇంక దాచుకోదలచలేదు.అవునక్కా మేము మాదిగోళ్లు అని చెప్పాను.

ఆమె చాలా నిధానంగా బాబు ఏం అనుకోవద్దు మేము మీవాళ్లను ఎవరిని లోపలికి పిలుచుకోము,ఈసారికి ఏదో మా పిల్లోడు తెలియకుండా పిలుచుకువచ్చాడు నువ్వు లోపలికి వచ్చేసావు,మళ్ళీ ఇంక ఎప్పుడూ మాఇంట్లోకి రావొద్దు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.

నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను.నా కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి.నేను కూచున్న మెత్తటి పరుపు ఇప్పుడు నాకు ముళ్ళకంచె లాగా అనిపించింది.గొంతులో పోసుకున్న పాయసం ఇప్పుడు నాకు చాలా చాలా చేదుగా అయిపోయింది.

తాగుతున్న పాయసం గిన్నె అక్కడ పెట్టి,మంచం మీద నుండి దిగ్గున లేచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను.

-యం.యస్.హనుమంత రాయుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో