ఎండమావి – (అనువాద కథ )- మూలం :వీణా శాంతేశ్వర , అనువాదం ‌: అజయ్ వర్మ అల్లూరి

మూల రచయిత పరిచయం : 
వీణా శాంతేశ్వర ప్రసిద్ధ కన్నడ స్త్రీవాద రచయిత్రి. 1945 ఫిబ్రవరి 22న ధారవాడలో జన్మించారు. కర్నాటక విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ ఇంగ్లీష్ పట్టా పొంది, చదువుకున్న కర్నాటక కాలేజీలోనే ముప్పైయైదేళ్ళకు పైగా ఉపన్యాస వృత్తిని కొనసాగించి ప్రిన్సిపాల్ గా నివృత్తి చెందారు. ‘ముళ్ళుగళు’, ‘కొనెయ దారి’, ‘కవలు’, ‘బిడుగడె’ ఇవి వీరి ప్రముఖ రచనలు. ‘గండసరు’ వీరికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన నవల. వీరి ‘అతిథి’ అన్న కథ 1975లో పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. స్వంత రచనలే కాక మహిళా సాహిత్యానికి సంబంధించి చాలా అనువాదాలు కూడా చేసారు. హింది రచయిత అగ్నేయ గారి ‘నదీ కే ద్వీప్’ అన్న పుస్తకాన్ని అనువదించినందకు 2005లో కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కారం పొందారు. ఈమె రచనలు పలు భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి. 60 , 70 దశబ్దాలలో ఆధునిక స్త్రీలు ఎదుర్కునే సమస్యలను వీణా తన రచనలలో ఎంతో పరిణితితో చిత్రించారు. ఈ కథ రచనా కాలం – 1973. ఈమె కథలన్నీ ఇప్పటకీ నవనవీనమే.

అనువాద రచయిత పరిచయం : 
అజయ్ వర్మ అల్లూరి  కర్నాటకలోని రాయచూరు జల్లా సింధనూరు తాలూకాకు చెందిన అజయ్ 1996 లో జన్మించారు. కన్నడంలో కవితలు, కథలు రాస్తూ సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. ‘గగనసింధు’ (కవితా సంపుటి), ‘డయానా మర’(స్పానిశ్ కవయిత్రి అలెహాంద్రా పిజార్నిక్ కవితల కన్నడ అనువాదం), ‘విముక్తె’ (ఓల్గా గారి ‘విముక్త’ కథల కన్నడ అనువాదం ) ప్రచురిత పుస్తకాలు. గత రెండేళ్ళ నుండి అనువాద రంగంలో సీరియస్‌గా కృషిచేస్తున్న అజయ్ మైసూరు విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సి (ఫిజిక్స్) చదువుతున్నారు. ‘కలల కన్నీటి పాట’ అన్న అనువాద కవిత్వం తెలుగులో వీరి మొదటి పుస్తకం.

ఎండమావి

“టాటా ఆంటీ”

“సెలవలిచ్చిన వెంటనే పిలూ, సతీశులని పంపించాల్సిందే హఁ”

“ఆంటి టాటా”

– అక్కయ్య పిల్లలు ముగ్గురూ మరాఠీలో ఒకటే గోలగా అరుస్తోంటే ఈ బస్సు ఇక కదిలితే చాలురా జీవుడా అని అనిపించిందామెకు. అనిపించదా మరి ! రాత్రి పదకొండు అవుతోంది. హాయిగా ఇంట్లో పడుకోడం మానేసి, ‘ఆంటీని పంపడానికి మేమూ వస్తామ్’ అని మారం చేసి వచ్చారు ముగ్గురు బుడంకాయులూ ! అక్కయ్యకు మాత్రం పిల్లలని వెంటబెట్టుకుని ఎక్కడబడితె అక్కడికి తిరగడానికి ఎలాంటి హుషారో ఏంటో ! ఆమెకు ఏ పనిలోనూ విసుగు లేదు. బస్టాండుకు వెళ్ళాళని రాత్రి ఎంత ఉత్సాహంగా వంట చేసింది ! అందరికీ తనే వడ్డించింది ! మొగుడితో ఎంతలా కిలకిలలాడుతూ మాట్లాడుతుంది అక్కయ్య – పెళ్ళై పన్నెండేళ్ళైనా కూడా ! అదే భర్త, అదే పిల్లలు, అదే ఇల్లు, అదే పని – రోజూ అదే అదే. అయినా నిన్ననే పెళ్ళైనట్టు చిందులేస్తుంది. వీటన్నటినుంచీ పారిపోవాలి, ఒక్క రోజైనా, కనీసం కాస్త సేపైనా – అని తనకెప్పుడూ అనిపించుండదా !

“మినీ, మరోసారి కొల్లాపూరు వచ్చినప్పుడు ఇలా ఒకత్తివే రామాక, మరిదినీ, పిల్లలనీ తోడు తీసుకురా – కదండీ ?”

“హ్ఞా, ఔనౌను” తలూపాడు అక్క భర్త.

తన్నుకొస్తున్న చికాకుని కప్పిపుచ్చటానికి ప్రయత్నించకుండానే ఆమె నోరువిప్పింది –

“మీరిక ఇంటికి వెళ్ళండక్కా, పిల్లలు నిద్రపోవాలిగా. వేళయ్యింది.”

“హ్హా హ్హా వెళ్తాంలేవే. అనట్టు మినీ ! బస్సులో నీకేమి ఇబ్బంది కలగదులే. ఎలాగో పుశ్ బ్యాక్ సీట్లున్నాయి, హాయిగా పడుకోవచ్చు. నువ్వు కళ్ళు తెరిసేలోగా పూనా వచ్చేస్తుందిలే.”

– అలా అని అక్కయ్య వెంటనే తన భర్తవంక తిరిగి చాలా శ్రద్ధాపూరితంగా చెప్పింది –

“అయ్యో మర్చేపోయాను, పాలు తెప్పాళ పై మూత పెట్టనేలేదు. ఈ పాడు పిల్లొకటి. ఇప్పుడెలా అండి !”

పాల గురుంచి అక్కకున్న శ్రద్ధ చూసి ఆమెకు అదోలా అనిపించింది. ఇంట్లో తనుక్కూడా పాల గురుంచి శ్రద్ధ లేకపోలేదు. కాని అక్కయ్యలా తనెక్కెప్పుడూ ఇలా దానికోసం మనసారా ‘అయ్యో!’ అనిపించలేదు. ఎందుకో మరి !

“చూడండి, ఒకవేళ పిల్లి పాలు తాగేస్తే రేపొద్దున్నే మీరు ఆఫీసుకెళ్ళెలోగ టీ పెట్టడం కుదరదు – మీరు తొమ్మిది గంట్లకు బయలుదేరుతే ఎలా ? లేకపోతే ….”

– ‘అబ్బా అక్కయ్య ఒక్కసారి ఆపకూడదా ఆ పాల పురాణాన్ని, ఈ బస్సైనా కదలకూడదా !’ అననిపించిందామెకు.

“బస్సు స్టార్టయ్యింది వెనక్కు జరగండ్రా. మినీ వెళ్ళొస్తావా మరి ?”

“ఆంటి టాటా”

జవాబిచ్చినట్లుగా ఆమె కిటికీలో ముఖం దూర్చి చెయ్యూపింది. వాళ్ళింకా కనపడతూ ఉండగానే చేయ్యూపడం ఆపేసి లోపలకు జరిగి సరిగ్గా కూర్చుని ఉఫ్ఫని నిట్టూర్చింది.

ఛీ, మూడు రోజులు కాస్త బూడిదలో పోసిన పన్నీరు లానే అయ్యింది. సినిమా, షికారు, పంచభక్షపరమాణ్ణ భోజనం, పిల్లల అల్లరి – ఛిఛీ. పూనా నుండి బయలుదేరినప్పుడు తను ఆశించింది వీటినేనా ? ఇలాంటివాటి నుండే విముక్తి కోరి ఇంటినుంచి బయలుదేరి మళ్ళీ ఇలాంటివాటిలోనే చిక్కుకునిపోయి చికాకు రెట్టింప్పయ్యింది మినీకి.

అక్క గృహలక్ష్మి. రెండు రోజులు తనతోపాటు రమ్మంటే – ‘ఇల్లు వదిలి ఎలా రాను ?’ అంటోంది. ఈమెకంతేనా ఇల్లుండేది ? – తనకు లేదా ? ఆమె ఇంటికంటా పెద్ద ఇల్లు, మంచి కారు, ఆమె మొగుడికంటా అందమైన మొగుడు, ఇద్దరు పిల్లలు – అన్నీ ఉన్నాయి. పదేళ్ళనుండీ ఉన్నాయి. రోజూ వంట – వడ్డించడం – భర్త ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అతని కోటుబటన్స్ పెట్టడం – అప్పుడతను మరిచిపోకుండా ఇప్పటికీ తన నుదుటిమీద ముద్దుపెట్టడం – పిలూ, సతీశులు స్కూలుకెళ్ళేటప్పుడు టాటాలు – మధ్యాహ్నం నిద్ర, Femina, వివిధ భారతి – మళ్ళీ సాయంత్రానికి టీ – స్నాక్స్, భోజనం – ఆదివారమైతే సినిమా , పిక్నిక్, పార్టి, రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరడం, ‘నువ్వీరోజు అందరికన్నా అందంగా కనపించావోయ్ !’ అనే మొగుడి కాంప్లిమెంటు, తరువాత పడుకోడం, పడుకుని మళ్ళీ లేవడం, మళ్ళీ –

ఛీ ! ఇదే జీవితమా ?

మొన్న చదివిన ఒక ఫ్రెంచి కథ: ప్యారీస్ నగరంలోని ఒక చర్చిలో అనుకోకుండా ఒక ఐరిశ్ యువతీ, ఒక ఫ్రెంచ్ యువకుడూ కలుసుకుంటారు. చర్చిలో ఇద్దరూ కలిసి ప్రార్థన చేసిన తరువాత హోటలకు వెళతారు ; అక్కడనుండి ఒక సినిమాకు ; సాయంత్రం ఒక సభకు ; రాత్రి ఒక రెస్ట్ హౌసుకు. మరుసటిరోజు పొద్దున్నే ఆమె ప్లెయినెక్కి తన దేశానికి వెళ్ళిపోతుంది. ఆమెకు బాయ్ బాయ్ చెప్పి అతను తన ఆఫీసుకు వెళతాడు. ఇద్దరికీ జీవితం మరింత అందంగా మారినట్లు అనిపిస్తుంది. అక్కడికి కథ ముగిసింది.

– చాలా సార్లు మధ్యాహ్నం ఒకత్తే పడుకుని నిద్ర పట్టక పక్కలో అటూ ఇటూ దొర్లుతూంటే అనిపిస్తుండేది – ఒక సారి వెళ్ళిపోవాలి రెక్కలల్లార్చి, ఈ అన్నీ గోడలను దాటి అవతల ఏముందని చూడాలి. ఒక సారైనా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ?
ఏమీ ఆలోచించకుండా మనసుకొచ్చింది చెయ్యాలి. దొరకవచ్చు తనకూ ఒక ఫేరిల్యాండ్, కలుసుకోవచ్చు గుర్రం మీది రాకుమారుడుని – కాని ఛీ, దీని అర్ధం వేరేదో అవుతుంది; తననుకున్నది ఇలాక్కాదు. ఖచ్చితంగా కాదు. తననుకుంటున్నదల్లా ఇంతే – మొత్తానికి ఇప్పటివరుకూ జరిగని అద్భుతమేమైనా జరగాలి – ఈ విసుగునంతా తరమిగొట్టేలాంటిది ఏదైనా…

చాలా సార్లు ఆలోచించింది ఆ కథ చదివిన తరువాత. రాత్రి వాళ్ళిద్దరూ అలా రెస్ట్ హౌసుకు వెళ్ళకుండా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని వెళ్ళిపోయిన తరువాతనూ జీవితం ఇంత అందంగా అనిపించుండేదా ? – చాలా సేపటి తరువాత ఆమే నిర్ధారణకు వచ్చింది – ఔను, ఖచ్చితంగా అనిపించుండేది.

– ఇలా జీవితాన్ని అందంగా గడపాలనే అవకాశాన్ని వెతుక్కుంటూ తను పూనా నుంచి బయలుదేరింది. ఇప్పుడైతె ఆ అలోచన చాలా మూర్ఖంగా అనిపిస్తోంది. ఇలాంటి అవకాశలేమైనా అక్కయ్య ఇంట్లో ఉత్తి పుణ్యానికి పడుంటాయా ఏంటి ! ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేసాను. ఇటు కాకుండా దూరంగా ఎటైనా వెళ్ళిపోవాల్సింది. దూరంగా – ఈ పాల తెప్పాళ నుండి, దాని మూత నుండి, వీటి లోకంనుండి దూరంగా..

లగ్ఝరీ బస్సు. చాలా స్పీడుగానే పరిగెడుతోంది. టర్ను తీసుకునేటప్పుడల్లా టికెట్లు ఇస్తోన్న కండక్టరుగాడి వళ్ళు లేడీస్ సీటులవైపే వాలుతోంది.

“Excuse me -”

పక్కనుండే వచ్చిన మగగొంతు విని ఆమె కుడివైపుకు తిరిగి చూసింది. పక్క సీటులో కూర్చున్న వ్యక్తి గంభీరంగా ఆమెనే చూస్తూ అన్నాడు – “Excuse me, madam !”

ఏంటి – ఎంతుకు – అని అర్ధంకాకపోడంతో అమె అతణ్ణే చూసింది. ఎంతో హాయిగా అనిపించింది. అతనలా పలకరించింది ఎందుకని కనుక్కోడం మానేసి అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె కాలు కింద ఏదో కదలినట్టనిపించింది. ఒక్క సారిగా బుర్ర వెలిగింది – తను చెప్పుకాలుతో అతని పాదం తొక్కుతున్నానని. “oh sorry” అని కాలు ఇటువైపుకు లాక్కుంది. మళ్ళీ మళ్లీ సానుభూతి వ్యక్తపరిచింది. “పరవాలేదు” అని అన్నాడతను చిరునవ్వుతో.

‘అయ్యో నేనెంథ మొద్దుని ! ఇంత సేపూ ఇతణ్ణి చూడనేలేదేంటి ! ఎంత బాగుంది ఇతని గొంతు- అదేదో పాత సినిమాలోని అచ్చం ఆ మహారాజు గొంతులా. ఒక వైపునుంచి చూస్తుంటే గ్రీకువీరుళ్ళానే కనిపిస్తున్నాడు.’

ఆమె తన కంటి చివరి వెలుగులోంచి మళ్ళీ మళ్లీ అతణ్ణి చూసింది. తనివి తీరక పూర్తిగా ఆ వైపు తిరిగి చూసింది. హటాత్తుగా అతనూ చూసాడు – ఇలా జరిగినప్పుడు ఉలిక్కిపడ్డానికి తనేమి పడుచుపిల్ల కాదుకదా అని ముసిముసిగా నవ్వుకుంది. అతనూ నవ్వాడు. అందంగా నవ్వాడు.

కథ మొదలవ్వబోతుందనే అనిపించిందామెకు. ఆమె తన దృష్టిని వేరే వైపు మళ్ళించలేదు. ఔను, ఇప్పుడతను తప్పక మాట్లాడతాడు :

“మీరు పూనాకు వెళ్ళాలా లేక -”

“ఔను పూనాకు, మీరు ?”

“నేనూ అక్కడికే. బస్సులో కూర్చుని రాత్రిని గడపడం చాలా చిరాగ్గా ఉంటుంది కదూ ?”

“ఔను.”

“కాని ఇలా మంచి కంపని దొరికితే ఏ చిరాకూ ఉండదులేండి.”

ఆమె చిన్నగా నవ్వింది.

“మీరు పూనాలో చదువుకుంటున్నారా ?”

“ఆ్ఞ ?” ఏం చెప్పాలో తెలియక ఆమె “ఔను” అంది.

తనింకా కాలేజి అమ్మాయిలానే కనిపిస్తోందని చాలా మంది అంటుటారు. ప్రకాశు కూడా ఎప్పుడూ అదే మాటంటాడు. కాని ఈ అపరిచితుడి నుండి ఈ మాట వింటూంటే వేరే ఏదో అనిపిస్తోంది. ఇప్పటివరుకూ ఎన్నడూ అనిపించనది. ఆమె తన తాళిబొట్టుని జాగర్తగా బ్లౌజులోకి దూర్పి కనపడకుండా చూసుకుంది.

“మీ పేరు ?”

“మినీ” – అంది మిసెస్ మీనాక్షి పుణేకర్ అనకుండా.

“ఓ, Sweet name.”

“చాకలేట్ ?” – అతను క్యాడ్బరీసుని చేతులో పట్టుకుని అడిగాడు. ఆమె ఒక పీసు తీసుకున్నప్పుడు “Sweets to the sweet,” అన్నాడు.

ఎంత polished, ఎంత smart గా ఉన్నాడు…!

“విపరీతమైన గాలి”, అంటూ కిటికీ అద్దం జరపబోయిందామె. సగానికి జరిపి అతని వైపు చూసి, “చాలా బిగువు” అని అంది మళ్లీ.

“తప్పుకోండి నే మూస్తాను” అని అతను తన ఎడంచేతిని ఆమెకడ్డంగా కిటికివరుకూ చాపి అద్దం జరిపాడు. ఇప్పుడు – తనైనా అరయించు ముందుకు వాలాలి, లేక అతని చెయ్యైనా అరయించు ఇటువైపు జరగాలి, మొత్తానికి ఏమయ్యిందో గాని మరుక్షణం అతని మోచేయి మృదువుగా ఆమె ఎదను ఒరసుకుంటూ పోయింది. ‘Oh, sorry’, ‘Oh, it’s all right’ ల తరువాత ఆమెకు అనిపించింది – ఎన్ని సంవత్సరాల తరువాత
నేనిలా వేరేలా మారాను ! హైస్కూల్లో ఉన్నప్పుడైతే మూగమ్మలా ఉండేదాన్ని. కాలేజీలో ఉన్నదీ రెండేళ్ళే. ఎప్పుడూ తలెత్తి ఎవరనీ చూడలేదు కూడా, పట్టుకుని ఒకతనికిచ్చి కట్టబెట్టారు. పదేళ్ళయ్యింది పునాలో కాపురంపెట్టి. రోజూ తెల్లవారుతూనే మళ్ళీ అదే జీవితం. ఒక్కసారి, ఒకేఒక్కసారి గట్టి మనస్సు చేసి – మొగుడూ, పిల్లలూ, ఇల్లూ, పాలతెప్పాళా అన్నిటినీ అలా వదిలేసి వెలుగులోకొచ్చి చూడాలనే తను బయలుదేరింది.
మూడు రోజులూ కొల్హాపూరులో వ్యర్ధంగా గడిచిపోయాయి. ఇక తనకు మిగిలింది రేపొద్దిటివరకూ ఉన్న సమయం మాత్రమే. తెల్లవారగానే పూనా వచ్చేస్తుంది. మళ్ళీ అదే అదే. ఈ అవకాశం తనకు మళ్ళీ దొరకదు. ఈ నాలుగైదు గంటల్లోనే ఏదైనా జరగాలి. ఎన్నోసార్లు ఎక్కడో రెండే నిమిషాలు కలుసుకున్నవారిలో కూడా ఏదేదో జరిగి పెద్ద పెద్ద adventure కథలే పుడతాయికదా ! చూద్దాం- తను రంగంలోకి దిగి సిద్ధంగావుంది, అద్భుతమైన అనుభవమొకటి తనకోసం వేచిచూస్తునప్పుడు ఎంతుకొదలుకోవాలి ?

– ఎక్కడో బస్సాగినప్పుడు అతను మృదువుగా అడిగాడు :

“టీ తాగుతారా ?”

“Oh yes.”

అతను రెండు టీలు ఇవ్వమని చెప్పాడు. స్వయంగా అతనే ఆమెకు అందించాడు. “ఇలాంటి చలివేళలో నాకు టీతాగడం చాలా ఇష్టం. ”

“నాక్కూడా”

ఆమె బిల్లు కట్టడానికి పర్స్ తీస్తున్నప్పుడు ఎంతో చనువుగా ఆమె చేతిని తాకి, “No please. నాకు చాన్స్ ఇవ్వండి.
ఇలాంటి అవకాశం నాకు మరోసారి దొరకదు కదా” అన్నాడు.

– ఇతను కూడ తనలాగే అవకాశం వెతుక్కుంటూ బయలుదేరినవాడా ?

ఆమే ఊరికే అలా తన చేతిలోవున్న పుస్తకాన్ని చూస్తూ ఉంది.

“ఏమిటా పుస్తకం ?”

“Waiting For Godot.”

“ఓ, అలాగైతే మన్నిద్దరీ లైకింగ్స్ ఒక్కటేనన్నమాట. బెకెట్ గురుంచి నాకేమనిపిస్తోందంటే -”

అతను మాట్లాడుతూనే ఉన్నాడు. సాహిత్యం, విమర్శ, ఇలా అనేక విషయాలు. అతని బిజినెస్‌, దానివల్ల అతనికి కలిగె చికాకు- అకస్మాత్తుగా బస్సులో ఆమెను కలవడంవల్ల అతనిలో
వెల్లివిరిసిన సంతోషం, ఇలా అనేక విషయాలు.

ఆమె అతని గొంతులోని ఎగువుదిగువులని వింటూ మధ్యమధ్యలో ‘హ్ఞూ’ అంటూ అతని ముక్కూ, పెదవుల చలనాన్ని తన్మయంగా చూస్తూ కూర్చుంది.

అదెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. “మినీ, మినీ” – మెత్తని గొంతొకటి చెవి తీరాలని తాకినప్పుడు ఆమెకు మేలకువ వచ్చినా కళ్లు తెరవలేదు. ఏంటో ఒక రకమైన మగ వాసన దగ్గరనుంచే వచ్చినట్లై ఏమయ్యుండచ్చని ఒక్క క్షణం ఆలోచించింది. మరుక్షణమే కారణం తెలిసింది – తను ఆ అపరిచితుడి భుజంపై తల ఆనించి నిద్రపోయానని. రెండు గంటలో నాలుగు గంటలో ! థట్టున ఫ్రెంచి కథ గుర్తొచ్చింది. తన కథ దానికన్నా అందంగా సాగుతోందని అనిపించింది.

“మినీ, మీనీ- లేస్తారా ? పూనా వచ్చేసింది.” – అతను బండరాయిలా కదలకుండా కూర్చునే మాట్లాడాడు. ఆమె మెల్లిగా లేచి ఒక్కసారే ఉలిక్కి పడినట్టుగా అంది – “Oh sorry, మీకు చాలా ఇబ్బంది కలిగించినట్టున్నాను. మీరు అప్పుడే లేపుండచ్చుకదా !”

“నాకు ఏ ఇబ్బందీ కలగలేదు. అయితే నేను మోటు మనిషిని – మీ మెడ నొచ్చుకునండచ్చు.”

– ఊహ్ఞూ, indecent అనేలాంటి నీడకూడా లేదు అతని మాటలో.

ఎన్ని రోజులనుంచి వేచివున్నాను నేను – ఇలాంటి ముందూ-వెనకాలేని, పరిపూర్ణమైన, చివరిదాకా గుర్తుండిపోయేదొకటి ఏదానా జరుగుతుందా అని ! ఎంతలా వేచిచూడాల్సి వచ్చింది దీనికోసం. కాని, అలా చూస్తే ఇంకా ఏమీ జరగనేలేదు. ఇప్పటివరకూ జరిగినదానికి తలాతోకాలేదు. ఇంకా ఇది కొనసాగాలి. ఎవరికి తెలుసు ! ఆ ఫ్రెంచి కథలోని క్లైమాక్సులా-

“నేను Waiting For Godot చదువుతున్నాను మీరు పడుకున్నప్పుడు.”

“ఉ్ఞ ?” ఆమె చాలా తేలికగా అడిగింది : “నేనెప్పుడు నిద్ర లేస్తానో అనా ?

అతను నవ్వి, ఆ తరువాత గంభీరంగానే అన్నాడు : “మనం ఏవేవో జరగాలని చూస్తూ ఉంటాం. కానీ జీవితంలో అన్నీ అవుతాయా చెప్పండి ?”

“ఎందుకు జరగవు ప్రయత్నిస్తే ?”

“అదీ నిజమే” – అతను ఆమెవైపు చూశాడు. అతని దృష్టి నిజంగా అర్థవంతంగా ఉందని అనిపించిందామెకు. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపంచింది. ఎలా చెప్పాలా అని గందరగోళంలో పడినట్లుగా అనిపించింది. పూనాలో దిగిన తరువాత చెబుదామా అని అలోచిస్తునట్లుగా అనిపించింది. ఏమి చెప్పాలా అని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా అనిపించింది – సాయంత్రం ఫలానా టైముకి ఫలానా చోటకు రమ్మనా ? నిజంగా ఎంథ అందంగా సాగుతోంది తన కథ !

తెల్లవారుతుంది. సమీపంలోనే పునా నగరం కనపడుతోంది. ఆమె మనస్సు ఒక్కసారిగా అస్వస్థమయ్యింది. ఏం చెప్పొచ్చు అతను ? దానికి తనేం జవాబివ్వాలి ? ఛీ ! ఇన్ని రోజులు ఎప్పుడూ ఇలాంటి సిచువేషన్ గురించి ఆలోచించనే లేదుగా !

ఒక్కసారిగా అతను అడిగాడు “నన్ను గుర్తుపెట్టుకుంటారు కదూ
?”

అతని ప్రశ్నకి జవాబివ్వకుండా ఆమె సూటిగా అడిగింది “మీరు ?”

“నేను అందమైనవాటిని ఎప్పటకీ మరిచిపోను.”

“ఓ థాంక్స్.”

ఆమె మనస్సు పిట్టలా పైకైకి ఎగిరింది. కథ ముగింపు గురించి ఆమెకి ఏ అనుమానమూ మిగలలేదు.

“Waiting For Godot సగానికే మిగిలిపోయింది” అన్నాడతను.

అంటే-

పూనా వచ్చేసింది.

“మీరు తోడున్నందుకు టైము గడిచిందే తెలియలేదు. థాంక్స్ – అందమైన ఈ రాత్రికి. అంటే మీ అందమైన company కి-” అతను తన లగేజి సర్దుకుంటూ అన్నాడు.

ఆమె మనస్సులో హోరు మొదలైంది. ఎక్కడికి చేరబోతుంది ఈ కథ climax ? బహుశా అతను తనను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. అందుకే ప్రతిదానికీ వెనకా ముందు చూస్తున్నాడు. దేనికో సంకోచపడుతున్నాడు. ఎవరు మొదలపెడితే ఎంటి ? ఆ పని తనే చేస్తే ?

కూలీల అరుపులు, కిందకు దిగుతున్న ప్రయాణికులు హడావుడి, చుట్టూ జనసాగరం.

అతను బస్సు వెనకాలికెళ్ళి పైనుండి సామానులు దింపుకుంటున్నాడు.

-దూరంలో ప్రకాశు వచ్చి నిలబడ్డాడు. కారు తీసుకొచ్చాడు. తనను వెతుకుతున్నాడు. ఇంకేం ఇటువైపు వచ్చేస్తాడు. ఆమె బుర్ర చురుగ్గా పని చేసింది. పర్సులోంచి నీలం రంగు కాగితమూ, పెన్నూ తీసింది. అందమైన గుండ్రపు అక్షరాలతో ఇంగ్లీషులో రాసింది- తన ఫోన్ నెంబరూ, అడ్రస్సూ, ‘సాయంకాలం నాలుగింటికి ఫోన్ చేసి, నిన్ను ఎక్కడ కలవాలో చెప్పు. వేట్ చేస్తూంటాను’ కాగితాన్ని మడతపెట్టి, ‘waiting for Godot’ మొదటి పేజిలోనే పెట్టి, అక్కడే అతను వదిలివెళ్ళిన బ్యాగ్ మీద పుస్తకాన్ని పెట్టింది.

“వెళ్ళొస్తారా ? నమస్కారం” అనంటూ అతను దగ్గరకి రావడం చూసి, “నమస్కారం” అని చెప్పి అక్కడినుండి కంగారుగా వెళ్ళిపోయింది.

*

మధ్యాహ్నం రెండు గంటలు. ఆమె కూర్చున్న చోట కూర్చోలేక, నిలుచున్న చోట నిలవలేక సతమతమౌతోంది. నాలుగవ్వటానికి ఇంకా రెండు గంటలు. ఏమని ఫోన్ చేయొచ్చు అతను- పలానా హోటలకు రమ్మనా ? పలానా పార్కులో కలుసుకుందాం అనా ?

అలా ఓ సారి కలుసుకున్నామే అనుకుందాం, మరి ముందేంటి ? అతను నాకు నువ్వు కావాలి అనంటే ?

అంటే మాత్రం ఏంటి ? నేను అతనికి నచ్చచెప్పాలి: నేను ఎన్నాళ్ళ నుండో వేచిచూస్తున్న ఒక అపూర్వమైన అనుభూతిని నాకందించినందుకు నెను నీకు ఋణపడి వుంటాను. ఒక రాత్రి సహవాసంతో నా జీవితాన్ని ఎంతో అందంగా మలిచావు. మనం స్నేహితుల్లా విడిపోదాం. నా ప్రవర్తన వలన నీలో మరేదైనా నిరీక్షన రేకెత్తితే నన్ను క్షమించు. నా ఉద్దేశం అది కాదు, నాకు సంసారం ఉంది. కాని నిన్నెప్పటకీ మరిచిపోను- బాయ్…

కాలింగ్ బెల్ మ్రోగగానే కాళ్ళూ చేతలూ ఆడలేదు మినీకి, అదేంటి, చెప్పచేయ్యకుండా తిన్నగా ఇంటికొచ్చెసాడా అని ఆమె గుండి గుబేలుమంది. అతణ్ణి ఎదురుపడగలననే ధైర్యం నేలరాలినట్టనిపించింది.

వచ్చినవాడు ప్రకాశు. “నువ్వీ రోజు ఊరినుంచి వచ్చావని మధ్యాహ్నానికే లీవ్ పెట్టి వచ్చేసా. ఎంచెక్కా సినిమాకెళ్దామా ?” ఆమెనుండి ఉత్తేజకరమైన సమాధానాన్ని నిరీక్షిస్తూ అడిగాడు.

“అంటే ? నువ్వు మధ్యాహ్నమంతా ఇంట్లోనే ఉంటావా ? ఆఫీసుకి వెళ్ళవా ? అంటే-?” తడబడుతూ అడిగిందామె.

“అంటే- నేనీ రోజంతా ఈ రాణీగారికి సేవలు చేసే బానిసని. నీ ముఖమేంటి అలా ఉంది ? ఒంట్లో బాలేదా ఏం ?”

“ఏం లేదు. ఏదో కాస్త తల తిరుతునట్టుగా ఉందంతే !” అంటూ ఆమే పక్కమీదికి వాలింది.

“అలాగైతే నువ్వు పడుకో. రాధామ్మతో చెబుతాను వేడి వేడిగా నీకో కప్పు టీ పెట్టి తెమ్మని. పోని డాక్టరకి ఫోన్ చేయ్యమంటావా ?” చాలా చొరవతో అడిగాడు ప్రకాశు.

“అబ్బే ! వద్దొద్దు.”

“సర్లే పడుకో. బస్సులో అంత సేపు ప్రయాణం చేసొచ్చావుగా దానివలనే అయ్యుటుంది. రెస్ట్ తీసుకో, ఐదు నిమిశాల్లో టీ వస్తుంది,” అంటూ అతను వంటగది వైపు నడిచాడు.

ఆ ఎత్తైన ఆకారాన్నలా వెనకనుండి చూస్తూంటే, ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వట్టి మొద్దు సన్నాసి అనుకుని ఎప్పుడూ చిరాకుపడే నాపై ఇతనిలో ఎంత ప్రేముంది !
ఎంత పని చేసాను నేను ! ఇంకో గంటలో మొత్తం తేట తెల్లం అయిపోతుంది. తనను ఇంతగా ప్రేమించే భర్త, పిల్లలూ, ఈ ఇల్లు తనకు ఉండీ లేనట్టౌతుంది. నాలుగ్గంటలకి ఫోనెత్తే ప్రకాశుకి ఎలాంటి కల్లోలం వేచివుందో ! ఆ అపరిచితుడు ఎలాంటివాడో ? ఇటీవల పూనాలో బ్లాక్ మేల్ చేసేవాళ్ళు పెరిగిపోయారంట. తన పేరూ, అడ్రస్సూ, తన చేతరాత సమేతంగా అతని చెతిలో ఉన్నాయి. దాన్ని అడ్డుపెట్టుకుని అతను ఏదైనా చేస్తే ? ప్రకాశుకి ఇదంతా చూపిస్తానని బెదిరించి తనదగ్గర డబ్బులు గుంజితే ? అంతే ఐతే పరవాలేదు. మరేదైనా అడిగితే ? నేను నిరాకరించినప్పుడు నా గుట్టుంతా బయటపెడతానంటే ? ఇక ఈ ఇల్లూ-సంసారంతో నా సంబంధం ? వంశ మర్యాద ? పిల్లల భవిష్యత్తు ? అయ్యో దేవుడా ! నాకెలాంటి పరిస్థితిని ప్రాప్తించావ్ ! సాహసం కావాల్సిందిగా తనకు ! పాలు తెప్పాళా లోకంనుండి, నీరసమనిపించే భర్తనుండి, యాంత్రికం అనిపించే సంసారంనుండి, రోమాంటిక్ విముక్తి కావాల్సిందిగా !

ఆమెకు ఒక్కసారిగా ఏడవాలనిపించింది. ఆత్మహత్య చేసుకుంటే ? హా, ఎంతుక్కాకూడదు ? ఈ సిగ్గుమాలిన జీవితం గడపడంకన్నా చచ్చిపోవడమే నయంకదా ? ప్రకాశు ఎంత ఏడుస్తాడు తను చచ్చిపోతె ? – ఆ ఆలోచనవల్ల ఆమె చాలా కుదిటబడింది. నాలుగింటికి ఫోన్చేసే ఆ అపరిచితుడిక్కూడా కవురు తెలిసి అతను ఆగమేగాల మీద రావొచ్చు. ఆ ఫ్రెంచి కథకన్నా తన కథ పదిరెట్లు అందంగా మారిపోయిందిగా !

ఆమె అసహాయంగా గోడ మీది గడియారం వైపు చూసింది. నాలుగవ్వడానికి ఇంకా పది నిమిషాలు. ఏదో తెలియని వేదన, కడుపులోని పేగులన్నీ బయటకు తన్నుకొస్తునట్లుగా అనిపిస్తోంది. కాళ్ళూ-చేతులూ ఆడేటంత శక్తీ కూడా లేదు. ఆమె కళ్ళు భారంగా మూసుకున్నాయి.

….ట్రిన్ ట్రిన్ –

ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఇంత crisis లో కూడా తనకు నిద్రెలా పెట్టేసింది అని దడాలున లేచికూర్చుంది. బయట గదిలోంచి టెలిఫోన్ మ్రోగుతోంది. ఆమె పక్కకు అంటుకున్నట్లై గడియారం వైపుకు చూసింది – ‘నాలుగు గంటలు ! ఇక ముగిసిపోయింది ఈ లోకంతో నా బంధం, అన్నిటికీ-అందరికీ గుడబాయ్-’

బయటనుండి వినబడతున్న ప్రకాశు గొంతును ఆమె నిర్జీవంగా వింది : “హలో, డా.మిశ్రా ? నమస్తే ! ఏంటి సాయంత్రం పార్టీకా ? Sorry. ఈరోజు మా మిసస్ కు వంట్లో బాగోలేదు. హా, గుర్తుంది వచ్చే వారమేగా..”

మిని ఒక్కసారిగా నిట్టూర్చింది. మరుక్షణమె పక్కనుండి కిందకు దిగింది. ఇంకా ఐదారు నిమిశాలే మిగిలింది. సరిగ్గా నాలుగింటికి వస్తుంది ఆ అపరిచితుడి ఫోను. ఒకవేళ అతను బ్లాక్మేలర్ అయ్యుంటే, దుష్టుడైయ్యుంటే ? ఒకటా తను భర్తా పిల్లల్ని వదిలి వెళ్ళిపోవాలి. లేదా ఆ వెధవతో –

ఛీ ! దానికి మించి ఆలోచించలేక ఆమె తలపట్టుకుని కూర్చుంది.

“మినీ !” బయటనుండే పిలిచాడు ప్రకాశు- “నీకోసం ఎవరో వచ్చారు చూడు.”

ఏంటి ? వచ్చేసాడా ? మినీ కాళ్ళులోని శక్తంతా నేలరాలినట్టై పోయింది. కాని మరుక్షణమే ఆమే ఏదో పిచ్చి ధైర్యంతో బిరాబిరా నడుస్తూ బయటకొచ్చింది- ఏమౌతుందో అవ్వని, నేనంతా ఎదురించగలను. నేనేమైనా పిరికిదాన్నా ?

తలపువద్ద తెల్ల యూనిఫార్మ్ ధరించిన మనిషి నిలబడ్డాదు. చాలా వినయంగా వంగి తన చేతిలోని ప్యాకెట్టుని ముందుకు చాపాడు. “అమ్మగారు మీకిచ్చి రమ్మన్నారు.”

ఆమె దాన్ని పుచ్చుకోగానే అతను వంగి నమస్కరించి రెండగులు వెనక్కేసి వెంటనె తిరిగెళ్ళిపోయాడు. అక్కడే పేపరు తిరగేస్తూ కూర్చున్న ప్రకాశు తలెత్తకుండానే అన్నాడు- “నీ ఫ్రెండు శశికల పంపింది కాబోలు. ఏదైనా కొత్త రకం డిజైనేమో. ఇంకేం ఉంటుందిలే మీ ఆడవాళ్ళకి !”

ఆమె ప్రకాశు మాటలకు జవాబివ్వకుండానే ఆత్రంగా లోపలకొచ్చింది. బెడ్ రూము తలుపు వేసుకుని పక్కమీద కూర్చుంది. చేతులు వణుకుతున్నాయి. గులాబీ రంగు ర్యాపర్, సిల్కు దారం – Waiting For Godot, లేత రంగు కాగితం, తనే రాసిపెట్టిన చీటి, అన్నీ వెనక్కొచ్చాయి సురక్షితంగా.

ఆ ఫ్రెంచి కథ, రాత్రి బస్సులో ఆకస్మికంగా కలిసిన ఆ అపరిచితుడు, అతను తిరిగి పంపిన పుస్తకం-చీటి, ఈ ఇంటి సంసారం, విముక్తి కోసం తను ఆరాటపడడం, సాహచించడం..
ఛీ, అన్నిటినీ కిరసనాయిలు పోసి తగలబెట్టాలి.‌

లేచి హాల్లోకి వస్తూ గట్టిగా చెప్పింది, “పద ప్రకాశ్, సినిమాకెళ్దాం.”

మూలం : వీణా శాంతేశ్వర

అనువాదం :అజయ్ వర్మ అల్లూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

3 Responses to ఎండమావి – (అనువాద కథ )- మూలం :వీణా శాంతేశ్వర , అనువాదం ‌: అజయ్ వర్మ అల్లూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో