‘ సమానాంతరాలు ‘-మీరేంటోళ్లు?-యం.యస్. హనుమంతరాయుడు

రచయిత పరిచయం :

యం.యస్. హనుమంతరాయుడు అనంతపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అన్యాయాన్ని అక్రమాన్ని సహించని ఆక్రోశమే తన కథలకు స్ఫూర్తి. కులం చేత వేధింపబడే నిజజీవిత గాధలను
‘ సమానాంతరాలు ‘ శీర్షికన మనకు అందిస్తున్నారు.

మీరేంటోళ్లు?

నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు, సబ్జెక్టు నేర్చుకున్నట్టు ఉంటుంది, నా ఖర్చులకు నేను సంపాదించుకున్నట్టు ఉంటుంది అని ఆలోచించి మా ఊర్లోనే ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేశాను.

స్వతహాగా ఎవరితోనైనా త్వరగా కలిసిపోయే గుణంను నేను కలిగిఉండడం వల్ల, నాకు అప్పజెప్పిన పనిని శ్రద్దగా పూర్తిచేయడం వల్ల, అవసరం అయినప్పుడు టీచింగ్ తో పాటు కొంత ఆఫీస్ వర్క్ కూడా చేయడం వల్ల యాజమాన్యంతో నాకు మంచి పేరు వచ్చింది.

తరగతి గదిలో పిల్లలకు బోధించేటప్పుడు ఒకటికి రెండుసార్లు విషయాన్ని వివరించి,అందరినీ అడిగి, విసుక్కోకుండా,విషయం అర్థమయ్యేంతవరకూ ఓపికగా చెప్పడం వల్ల విద్యార్థులలో కూడా సార్ బాగా చెప్తాడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా తక్కువకాలంలోనే నాకు రెండు వైపులా మంచి పేరు వచ్చింది.

నేను పనిచేసే స్కూల్ తప్ప దగ్గరలో వేరే స్కూల్ లేకపోవడం వల్ల,మా స్కూల్ లో బాగా చదువు చెబుతారు అనే పేరు ఉండడం వల్ల మా ఊరితో పాటు చుట్టుపక్కల పల్లెల నుండి కూడా చాలా మంది పిల్లలు మా స్కూల్ కు వచ్చేవాళ్ళు.

ఒకరోజు నేను క్లాసులో ఉండగా ఒక అబ్బాయి వచ్చి సార్ హెడ్ మాస్టర్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ ఆఫీస్ రూమ్ దగ్గరకు పోవాలంట అని చెప్పి వెళ్ళాడు.ఏం జరిగింది, ఎందుకు పిలిచి ఉంటాడు,ఈ నెల సిలబస్ పూర్తి అయ్యింది కదా, ఎవరైనా నామీద ఏమైనా పిర్యాదు చేశారా అని అనేక రకాలుగా ఆలోచించుకుంటూ సరే లే సార్ దగ్గరకు వెళితే విషయం తెలుస్తుంది అని నేరుగా ఆఫీస్ రూమ్ దగ్గరకు వెళ్ళాను.

ఆఫీస్ రూమ్ లో పిల్లల తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు,అంతా హడావిడిగా ఉంది, ఏం జరిగిఉంటుంది అని మళ్ళీ అనుమానం వచ్చింది,సరే అని దగ్గరికి వెళ్లి సార్ పిలిచారంట ఏంటి విషయం సార్ అని నేను అడిగినాను.సార్ నన్ను దగ్గరకు పిలిచి MRC వాళ్ళకి Children information కావాలంట అది చూడు అబీ అని నింపాదిగా చెప్పాడు.హమ్మయ్యా ! ఏం ఇబ్బంది లేదులే అని ఊపిరి పీల్చుకున్నాను.సరే సార్ అని చెప్పి దానికి సంబందించిన ఫారాలు తీసుకుని మొదట 1వ తరగతి పిల్లల దగ్గరకు వెళ్ళాను.

నాకు మా ఊర్లోను, చుట్టుపక్కల ఊర్లలోను చాలా మందితోప్రత్యక్షంగా బాగా పరిచయాలు ఉండటంతో వ్యక్తిగతంగా బాగా తెలిసినవాళ్ల పిల్లలే ఎక్కువమంది మా స్కూల్ లో ఉండేవాళ్ళు, కాబట్టి వాళ్ల వివరాలు వాళ్ళు చెప్పకపోయినా నేనే రాసేసుకున్నాను.తెలియని పిల్లల వివరాలు వాళ్లనే అడిగి రాసుకోవాలి.

రే కొత్త పిల్లలు ఎవరెవరు ఉన్నారు రా అని అడిగితే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవరైనా ఒక్కరు గోవిందా అంటే మిగిలిన వాళ్లంతా ఒకేసారి గోవింద గోవిందా అన్నట్టు పిల్లలందరూ కూడా సార్ వీడు కొత్తగా చేరినాడు సార్ అంటూ రాగాలు తీస్తూ ఒక అందగాన్ని చూపించినారు. చూపించింది చాలదన్నట్టు వాడి భుజాలు పట్టుకుని లాక్కుని మరీ వచ్చి అంతా నా చుట్టూ చేరినారు.

నేను వాళ్ళ క్లాసులకు వెళ్ళే టీచర్ కాకపోవడం వల్ల, ఒకవేళ ఎప్పుడన్నా ఎవరైనా టీచర్లు రానప్పుడు వాళ్ళ క్లాసుకి వెళ్లినా ABCD లు అ ఆ లు 1 2 లు అడక్కుండా బుక్కులన్నీ పక్కన పడేసి వాళ్లకు నచ్చినట్టు కూర్చోమని చెప్పి నాకు వచ్చిన పాటలు పాడేవాన్ని, కథలు చెప్పేవాన్ని వాళ్ళతో కూడా పాటలు పాడించి డాన్స్ చేయమనేవాన్ని దాంతో నాతో చిన్నపిల్లలందరు బాగా చనువుగా ఉండేవాళ్ళు.నేను కూడా వాళ్ళతో బాగా కలసిపోయేవాన్ని.కల్మషం లేని వాళ్ళ మాటలు, స్వచ్ఛమైన వారి నవ్వులు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి.

పెద్ద క్లాసులో దీనికి భిన్నమైన పరిస్థితి, ఎప్పుడూ క్లాస్ వర్క్, సిలబస్,మార్కులు అంటూ తీరికలేకుండా పని ఉంటుంది. అందులోనూ పెద్దపిల్లలు కాబట్టి వాళ్లతో కొంచెం సీరియస్ నెస్ తో ఉండాలి. కొన్నిసార్లు ఈ పెద్దపిల్లలు చేసే అల్లరికి దెబ్బలు కూడా కొట్టాల్సి వచ్చేది.అయ్యో అసలు విషయం వదిలేసి వేరే సోది మొదలెట్టాను సరే మళ్ళీ అసలు విషయానికి వద్దాం.

కొత్త పిల్లోడు చూడగానే దగ్గరకు తీసుకునేలా చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు,తలకు నూనె పెట్టుకుని నున్నగా జుట్టు దువ్వుకుని ఉన్నాడు. వాణ్ణి దగ్గరకు పిలుచుకున్నాను వాళ్ళ నాన్న పేరు అమ్మ పేరు అడిగాను చెప్పాడు రాసుకున్నాను.

తర్వాత కాలమ్ “కులం” ఇక్కడే చిక్కొచ్చి పడింది నాకు. ఇప్పుడు డైరెక్టుగా వాణ్ణి మీ కులం ఏది అని ఎలా అడగాలి, చిన్న పిల్లోడు ఇంకా ఏమి తెలియనితనం. ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తే కొత్తచోటుకు వెళ్ళినపుడు తెలియని వాళ్ళు కులాన్ని కనుక్కోవడం కోసం ఏమేం ప్రశ్నలు అడిగేది అంతా గుర్తుకు తెచ్చుకుంటి.

సరే లే ఒక ప్రయత్నం చేద్దాం అని మీ ఊరేది అని అడిగాను,ఎందుకంటే కొన్ని ఊర్లలో పర్టీకులర్ గా ఒకటి లేదా రెండు కులాలు మాత్రమే ఉంటాయి కాబట్టి అర్థం అయిపోతుంది అని అలా అడిగాను,ఆ అబ్బాయి తన ఊరు పేరు చెప్పాడు,తను చెప్పిన ఊర్లో చాలా కులాల వాళ్ళు ఉన్నారు,దీనివల్ల ప్రయోజనం ఏం లేకపాయే.

తర్వాత మీ ఇల్లెక్కడ రా అని అడిగాను వాళ్ళు ఉన్న ఏరియా బట్టి కులం కనుక్కోవచ్చు అని నా ఆలోచన,నేను ప్రశ్న అడగ్గానే వెనక పిల్లల నుండి ఒక గొంతు సార్ “వాళ్ళు తోట లోనే గుడిసె వేసుకుని ఉన్నారు” సార్ అని వినబడింది సో ఇదికూడా పాయే.

సరేలే అయ్యేదేది లేదు నేరుగా అడగాల్సిన ప్రశ్న అడిగేద్దాం అని నిర్ణయించుకున్నాను.నేను ఇబ్బంది పడుతూనే,చుట్టూ ఒకసారి గమనించి,వాణ్ణి మరింత దగ్గరగా పిలిచి,వాడి చెవి దగ్గర నోరు పెట్టి,అక్కడున్న మిగతా పిల్లలకు వినబడకుండా చిన్నగా “మీరేంటోళ్లు” రా అని అడిగాను.

అప్పుడు వాడు చెప్పిన సమాధానం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి,చెంప చెళ్లుమనిపించిన విధంగా అనిపిస్తుంది.ఆ చిన్న పిల్లోడు ఎటువంటి సంశయం,మొహమాటం పడకుండా వాడి మొహంలో అస్సలు ఏం ఫీలింగ్స్ లేకుండా టక టకా సమాధానం చెప్పేసాడు.

సార్ మేము “బీదోళ్లు” సార్ మా యప్పా మా యమ్మా పనికి పోతారు సార్ అని చెప్పాడు. నా ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది, నా కళ్ళలో నీళ్ళు అప్రయత్నంగా ఉబికి వస్తున్నాయి, ఎంత ఆపుకున్నా ఆగలేదు, వాణ్ణి గట్టిగా హగ్ చేసుకున్నాను. ఇవేవీ తెలియని వాడు మాత్రం నేను ఏం చెప్పినానని ఈ సార్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టు నా వైపు ఓ లుక్ వేసి చూస్తున్నాడు.

వాని పేరు, ఊరు ఏవీ ఇప్పుడు నాకు గుర్తులేవు. కానీ వాడు,వాని పెద్ద పెద్ద కళ్ళు,వాని అమాయకమైన చూపులు మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటాయి.

-యం.యస్.హనుమంత రాయుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో