‘స్త్రీ చైతన్య శిఖరం ‘ గోగు శ్యామల తో ముఖా ముఖీ -కట్టూరి వెంకటేశ్వర్రావు  

ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఎందరో ఉద్దండులైన కవులు, రచయితలు, రచయిత్రులు వచ్చారు. కానీ సాహిత్యంలో అణగారిన వర్గాల నుండి వచ్చిన వారు చాలా తక్కువ. 1980వ దశకంలో వాయువేగంతో దూసుకువచ్చిన స్త్రీవాదంలో దళిత స్త్రీవాద రచయిత్రులు కనిపించరు. అంటే తెలుగు సాహిత్యంలో దళిత రచయిత్రులు లేరా? ఉంటే వాళ్ళ సాహిత్య రచనలు సమాజానికి ఎందుకు అందడం లేదు అనే ఆలోచనతో డా.గోగు శ్యామల ఒక అన్వేషణ మొదలుపెట్టారు. ఆ అన్వేషణ ద్వారా తెలుగు సాహిత్య పూదోటలో నీలికలువలు వికసిస్తూనే ఉన్నాయని. వాటిని ఎదగనీయకుండా ఉన్న ముళ్లపొదలను తొలగించి, అవి ప్రకాశవంతంగా వికసిస్తున్నాయని, సాహితీ పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయని నిరూపించారు. 1921 నుంచే దళిత స్త్రీలు రచనలు చేస్తున్నారని సాహితీలోకానికి “నల్లపొద్దు” సంకలనం ద్వారా తెలియజేశారు గోగు శ్యామల. ఈ సంకలనం వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో శ్రమపడ్డారు. ఈమె దళిత పేద విద్యార్థులకోసం ‘ఎడ్యుసెంట్’ అనే సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారి సాహితీ కార్యక్రమాలను, ప్రయాణాన్ని తెలుసుకుందాం…

1. మీ కుటుంబ నేపథ్యం, మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి మా పాఠకులతో పంచుకోండి.
మాది పెద్దేముల్ గ్రామం, అప్పట్లో రంగారెడ్డి జిల్లా ఇప్పుడు వికారాబాద్. మా తల్లిదండ్రులు గోగు బాలయ్య, అనంతమ్మ. వ్యవసాయ కూలీలు. మేము నలుగురం సంతానం. మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో కూలికి వెళ్లేవారు మా అమ్మానాన్న. నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ పెద్దేముల్లోనే చదివాను. 7వ తరగతి నుండి తాండ్లూర్ లో చదివాను. పై చదువులు ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీ) విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పరిశోధనను కొనసాగిస్తున్నాను. అన్వేషి సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ లో పరిశోధనవేత్తగా పనిచేస్తున్నాను.

2.మన సమాజంలో దళిత మహిళలు చదువుకోవడమే ఒక యుద్ధం. చదువుకొని రచయిత్రులుగా సాహితీ రంగంలోకి రావడం కూడా పెద్ద యుద్ధమేనంటారా?
ప్రస్తుత పరిస్థితుల్లో అంత యుద్ధం లేదు కానీ ఒకప్పుడు ఉండేది. 2002లో ప్రచురించబడిన నల్లపొద్దు ముందుమాటలో నేను మాట్లాడాను. నేను 54 మంది దళిత స్త్రీలను అపుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రాంతాల్లోని దళిత స్త్రీలను గుర్తించి, వారి రచనలు సేకరించి వాళ్ళ జీవిత చరిత్రను బ్రీఫ్ గా రాసాను. అందులో వాళ్ళ సాహిత్యం, రాసిన విధానం, వాళ్ళ అనుభవాలను రాస్తా ఉంటే వాళ్ళకి ఎదురైన అడ్డంకులను ప్రోత్సాహంను చూసినప్పుడు నేను నల్లపొద్దులో ఇదే మాట రాశాను. ఇప్పుడైతే బలమైన సాహిత్యం రాయటమే ఒక యుద్ధం. ఏం గుర్తు పడుతున్నాం, ఏం రాస్తున్నాం, ఎవరికోసం రాస్తున్నాం, ఏ అంశాలను రాస్తున్నామనేది చాలా ముఖ్యం. దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దళిత స్త్రీ దృక్కోణం నుండి అటు పితృస్వామ్యo, ఇటు కుల స్వామ్యo ఇవన్నిటి నేపథ్యo వాళ్ల మీద ఎట్లా ప్రభావాలు చూపుతున్నది, వాళ్ల జీవితం మీద, వాళ్ల చదువు మీద, వాళ్ళ ఆరోగ్యం మీద ఎట్లా ప్రభావం చూపుతుందనేది గుర్తించి రాయటమే ఒక యుద్ధం. రాసిన తర్వాత ఇప్పుడు తప్పకుండా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. దళిత స్త్రీల సాహిత్యానికి చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బలంగా వస్తున్నది దళిత సాహిత్యం మాత్రమే. అయితే ఇప్పుడు దళిత సాహిత్యం పేరు మీద ఒక ధోరణి నడుస్తోంది. అది ఏంటంటే బాధిత గొంతుని దళిత సాహిత్యంలో పెట్టడమన్నట్టు. ధిక్కారమనే గొంతు ఒకప్పుడు పనికొచ్చింది. ఇప్పుడు ధిక్కారమనేది ఒక్కటే సరిపోదు. ఇప్పుడు డైలాగ్ నడపాలి. సంవాదం నడపాలి. సంవాదం నడపాలంటే మన దగ్గర ఆ నాలెడ్జ్ ఉండాలి. వాళ్లతో సంవాదం నడిపే పరిజ్ఞానo, ఆ హిస్టరీ, ఆ అనుభవo, ఆ ఫిలాసఫీ మన దగ్గర ఉన్నప్పుడే బలమైన సంవాదం జరుపుతాం. ఆ సంవాదం జరిపేదే యుద్ధం. ఆ యుద్ధానికి ఇప్పుడు కొత్త నిర్వచనం ఇవ్వాలే. పాత నిర్వచనాలు ఇప్పుడు పనికిరావు.

3. రచనావ్యాసంగంలో మీకు స్ఫూర్తి ఎవరు?
ఆ…నాకు ఒక్కరు కాదు స్ఫూర్తి. అంటే నాకు నేను ఆలోచించుకుంటున్న కొద్దీ నాలో వచ్చే పరిపక్వతను బట్టి నా ఆలోచనలే స్ఫూర్తిదాయకం, పరిపక్వత లేనప్పుడు వేరే వాళ్ళు స్పూర్తినిస్తారు. తర్వాత కొద్దిగా పరిపక్వత వస్తున్నప్పుడు స్పూర్తి చాలా లిమిటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు విప్లవ సాహిత్యం నడుస్తున్నది అనుకోండి అప్పుడు శ్రీ శ్రీ. ఇక స్త్రీలకు సంబంధించిన విషయాలలో గాని మన బిడ్డల శిక్షణ అట్లాంటి వాటిలో గాని చలంగారు స్ఫూర్తి. తర్వాత సాహిత్యంలో కొత్తగొంతుకలు, కొత్త దృక్కోణాలు, కొత్త వ్యూస్ వస్తున్న కొద్దీ తర్వాత దళిత సాహిత్యంలో మద్దూరి నగేష్ బాబు, నాగప్ప గారి సుందర్రాజు, ఎండ్లూరి సుధాకర్, కలేకూరి ప్రసాద్, పైడి తెరేష్ బాబు వీళ్లే ఇన్స్పిరేషన్. స్త్రీవాదం కొస్తే పితృస్వామ్యాన్ని క్వశ్చన్ చేసే స్త్రీవాదం ఏదైతే ఉందో దానితో కూడా నేను ఐడెంటిఫై అయ్యాను. అంటే స్త్రీల గొంతు పవర్ పుల్ గా రావాలంటే కచ్చితంగా పితృస్వామ్యాన్ని ప్రశ్నించవలసిందే. అదే సమయంలో దళిత గొంతు రావాలని అంటే కులాధిపత్యాన్ని ప్రశ్నించాలి. అటు కులాధిపత్యాన్ని ఇటు పితృస్వామ్యాన్ని ఒకే టైంలో భరిస్తున్నది దళితస్త్రీ. కాబట్టి దళితస్త్రీ మాట్లాడటమేదైతే ఉందో కుల పితృస్వామ్యానికి వ్యతిరేకంగా రాస్తరు మట్లాడ్తరు. అట్లా కాలాన్ని బట్టి ఆయా సాహిత్యాన్ని బట్టి సాగుతుంది నా జర్నీ అంతా. అయితే బేసికల్ గా ఏందంటే వీరందరికంటే ముందు మా నాన్నగారు నాకు స్పూర్తి. మా నాన్నగారు ఆల్ రౌండర్. అంటే అప్పుడు మా నాన్న వాల్యూ నాకు తెల్వలేదు గానీ నేను ఒక రచయిత్రి అయిన తర్వాత నేనెందుకు, ఎట్ల రాస్తున్నను, దేన్ని నేను ఇంపార్టెంట్ గా చూస్తున్నా, ఎందుకు దీన్నే ఇంపార్టెంట్ గా చూస్తున్నా అనుకుంటున్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారికి సంబంధించిన జీవన విధానం అన్నీ కళ్లారా చూసిన. మానాన్న మా ఊర్లో యూత్ కి కథలు నేర్పేవారన్నమాట. కథలంటే మైథాలజీ స్టోరీస్. భాగవత రామాయణ కథలు నేర్పేవారన్నమాట. మా ఏరియాలో ఫేమస్ అయిన కథలు- బ్రహ్మంగారి ఆటలు, రంపా రాంపాలకులు, నల్లసంఘ అమ్మాయి ఇటువంటి కథలున్నాయి. వాటిని నేర్పేవారు మా నాన్న. మా నాన్నగారు ఒక ట్రైనర్ అన్నమాట. ఈ కథలను పాటలు పద్యాలు డైలాగులు ఇవన్నీ మా నాన్న ఊరి వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చేది. అంతే కాకుండా మా ఫాదర్ కి అన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వచ్చు. హార్మోనియం తబలా చిడతలు వాయించడం లాంటివి వచ్చు. అంతేకాకుండా మా నాన్న బ్యాండ్ మేళం కెప్టెన్ అన్నమాట. కినాట్, కార్నీట్ వంటివి వాయించేవారు. డోలక్, డ్రమ్స్ వంటివి వాయించేవారు. పెళ్లికి ముందు రోజు మా ఇంట్లో రిహార్సల్ వేసేవారు. ఆ సౌండ్ వినుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, ఆ మ్యూజిక్ వింటూ ఉండేదాన్ని. మా నాన్నగారు ఆ కార్యక్రమం జరిగే సమయంలో మా చదువులకు ఇబ్బంది కలుగుతుందని మమ్మల్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. మా నాన్న పిల్లనగ్రోవి, ఆలుగొయ్య అనే వాయిద్యాలు కూడా వాయించేవారు. ఇన్ని కళలు ఎలా వచ్చో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు ఇప్పుడనిపిస్తుంది, ఇన్ బిల్ట్ గా మా ఇంట్లోని వారసత్వమే వచ్చుంటుందని ఈ సృజనాత్మత . ఇలా అందరికంటే ముందు మా ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్.

*4. ‘స్త్రీవాద రచనలు ఉండగా ప్రత్యేకంగా దళిత స్త్రీవాద రచనల అవసరం ఉందా’ అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం?
*
ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే స్త్రీవాదo కులాధిపత్యాన్ని ప్రశ్నించలేదు. స్త్రీవాదo పితృస్వామ్యాన్ని మాత్రమే ప్రశ్నించింది. చాలా పవర్ పుల్ గా ప్రశ్నించేది. ఎందుకంటే వాళ్లు అగ్రకుల నేపథ్యం నుండి వచ్చారు కాబట్టి కులాధిపత్యాన్ని ప్రశ్నించలేదు. కుల అణిచివేత అనే స్పృహ ఎక్కువమంది స్త్రీవాదులకు లేదు. వాళ్లు కూడా అగ్రకుల లైఫ్ స్టైల్ లోనే ఉన్నరు కాబట్టి. ఆ కులాధిపత్యాన్ని వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కులం బారిన పడలేదు. కులం బాధపడలేదు. జస్ట్ పితృస్వామ్యాన్ని, అందులోనూ బయట దేశాల స్త్రీల ఉద్యమాలు, స్త్రీల సాహిత్య కార్యక్రమాలు కొంత ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఇక్కడున్న ఇంగ్లీష్ చదువుకున్న స్త్రీలు, అక్కడి సాహిత్యం యొక్క ప్రభావంతో వీళ్ళు పితృస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ బలమైన సాహిత్యం రాసేవారు. అయితే నేను ఆ పితృస్వామ్యం అనేది కూడా చాలా ముఖ్యమైనది అని చెప్పాను. పితృస్వామ్యం చేసేడంత భయంకరుడు మా ఫాదర్ కాదు. అగ్రకుల పురుషుడున్నట్లు మా ఫాదర్ ఉండడు. అగ్రకుల పురుషులు చేసే కులాధిపత్యానికి బలైతున్నడు మా నాన్న. అయినా మా నాన్న పురుషుడే. మా ఫాదర్ ని పితృస్వామ్యానికి ప్రతినిధిగా ఎట్ల చెప్తను? కాబట్టి ఇక్కడ ఉన్నది కులస్వామ్యo, పై కులాల్లో ఉండే ఆడవాళ్లు కూడా విలన్లులాగున్నరు. వాళ్ల వల్ల దళిత మగవాళ్ళ మీద పెత్తనం ఉంటది. ‘ఒరేయ్, రారా పోరా’ అంటూ జీతగాళ్ల పై పెత్తనం చేస్తరు. అగ్రకుల ఆడవాళ్లు దళిత మగవాళ్ళ మీద కుల దురహంకారం చూపిస్తారు. కాబట్టి స్త్రీవాదంలో కులం కోణం అనేది లేదు. బ్రాహ్మణ వాదమనేది పూర్తిగా లోపించింది. ఆ పరిమితిని గుర్తించి వచ్చిందే దళిత స్త్రీవాదం. అటు కులాధిపత్యాన్ని, ఇటు పితృస్వామ్యాన్ని రెండింటిని ఏకకాలంలో భరిస్తున్నారు కాబట్టి రెండింటినీ ఏకకాలంలో క్వశ్చన్ చేస్తారు.

5.దళిత స్త్రీవాద కవిత్వాన్ని ప్రత్యేకంగా సంకలనం తీసుకురావడానికి కారణం ఏమిటి?
అప్పటికే దళితవాదంతో కొన్ని సంకలనాలు వచ్చాయి. దళితవాదo స్త్రీవాద సంకలనాలు వచ్చాయి మరి ఇందులో దళిత స్త్రీలు ఏరి? కాబట్టి ఎవరు ఉన్నారా అని ఒక అన్వేషణతోనే నేను స్టార్ట్ అయిన. అయితే దళిత పురుషులు రాసేదంతా దళితవాదo. అగ్ర కులస్తులు రాసేదంతా స్త్రీవాదo. అగ్రకులాల స్త్రీవాదంలో దళిత స్త్రీవాదo, దళిత పురుషులు రాసే దళిత వాదంలో దళిత స్త్రీ ఎక్కడ? వీళ్లిద్దరి మధ్య దళిత స్త్రీ వాయిస్ లేదు. అంటే రాసే వాళ్ళు లేరా? ఉంటే వాళ్లకు కనబడలేదా? ఏంటిది అనే దాంతోనే నేను నల్లపొద్దు స్టార్ట్ చేసిన. అప్పుడు అర్థమైంది దళిత స్త్రీలకి ఒక చారిత్రకమైన లైఫ్ ఉందని. ఒక పోరాటం ఉంది. వీళ్ళకు ఒక హిస్టరీ ఉంది. వీళ్ళు టీచర్లు కావడానికి ఒక చరిత్ర ఉంది. వీళ్ళు రాసిన వాటిలో దేన్ని సాహిత్యమనాలి, ఎట్లా సాహిత్యంగా నిర్వచించాలి, ఏ ఫాం లో పితృస్వామ్యాన్ని, ఏ ఫాం లో కులస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు, దీన్ని ఎట్ల ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేయడంలో ఏమి ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని హిస్టారికల్ విశేషాలతో నల్లపొద్దులో 30 పేజీల ముందుమాటలో రాశాను.

6. మీరు నల్లపొద్దులో 1921 నుండి దళిత మహిళలు కవిత్వం రాస్తున్నారని, రచనలు చేస్తున్నారని తెలియజేసేదాకా ఎవరికీ తెలియదు. మన సాహితీ లోకంలో ఆంధ్ర కవయిత్రులు, నిశానీ నీలిమేఘాలు, చిక్కనవుతున్న పాట ఇవన్నీ దళిత మహిళలు రచయిత్రులుగా లేరనే అభిప్రాయాన్ని భ్రమింపజేశాయి. దీనిని ఏవిధంగా చూడాలి?
నేను అది చూసే నల్లపొద్దును తీసుకొచ్చానన్నా కదా. ఐతే నేను కొన్ని కొత్త డెఫినిషన్స్ ఇచ్చాను. వాళ్ళను చూసే ఇచ్చాను. నేను వాళ్ళతో మాట్లాడానుగూడ…దళితసాహిత్యంలో వచ్చిన చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట ఇందుట్లో రాసిన కవులను, సంపాదకులను కలిసి వారితో మాట్లాడుతూ వచ్చా. స్త్రీవాదులు వేసిన నీలిమేఘాలు సంపాదకులతో కూడా మాట్లాడా, రచయితలతో కూడా మాట్లాడా…ఈ పుస్తకం తీసుకొస్తున్న క్రమంలో. దళిత కవిత్వం అంటే ఒక నిర్వచనం. స్త్రీవాద కవిత్వమంటే ఒక నిర్వచనం. కానీ ప్రక్రియలని, ఆధునిక కవిత్వమనేది ఒక లిమిటేషన్. ఒకే ప్రక్రియను తీసుకోవడం – కవిత్వమో, కథలో, వ్యాసమో, పాఠమో ఏదో ఒకటి వాళ్ళ లిమిటేషన్ కావటం. సూటిగా చెప్పగలిగిన ధిక్కార కవిత్వం. డిప్లమాటిక్ గా కాని నివేదనగా గాని అట్లా కాకుండా సూటిగా చెప్పగలిగిన కవిత్వం అనే దాంతో వాళ్లు తీసుకొచ్చారన్నమాట. అయితే నేనేం చేశానంటే ప్రక్రియలకు లిమిటేషన్ లేదు. ఏ ప్రక్రియలో రాసినా దళితస్త్రీ రాస్తే చాలు. పాట రాసినా ఏది రాసినా, అది ఏ ప్రక్రియ అయినా సరే అది దళితస్త్రీ రాయాలి. దాంట్లో ఆ వ్యక్తీకరణ అనేది పైపైన కాకుండా లోపలికెళ్ళి చూడాలే. అప్పుడే దళిత స్త్రీని చూడగలం. దళిత స్త్రీని చూడాలి అనంటే, దళిత స్త్రీ గొంతును చూడాలంటే మనం ఒక కొత్త మెకనిజంను, కొత్త మెథడ్ ని అప్రోచ్ గావాలి. అక్కడున్న మెథడ్స్ సరిపోవు. కాబట్టి కొన్ని కొత్త కొత్త మెథడ్స్ ని మనం తీసుకుంటే తప్ప వీళ్ళు సరిపోరు. అందుకనే హిస్టరీలో దళిత కవులను పక్కన పెట్టేశారు. స్త్రీవాదులను పక్కన పెట్టేశారు. అట్లా తమను పక్కకు పెట్టిండ్రు అనే కదా పోరాట కలాలు, గళాలు వచ్చినయి. అట్లానే mainstream స్త్రీవాదులకు వీళ్ళకు కూడా వేరే గొంతులను పక్క పెట్టే యాటిట్యూడ్. అంటే కావాలని పక్కకు పెట్టాలని కాదు. ఈ ప్రక్రియలకు ఈ లిమిటేషన్స్. ప్రక్రియకు లిమిటేషన్ లేదంటే సూటిగా ధిక్కారమనే లిమిటేషను. లేకపోతే ఒక స్త్రీ ఒక క్రైస్తవ కీర్తన రాసింది అనుకోండి. అసలు ఆమె దళిత కవే కాదు అని తేల్చేశారన్నమాట. కీర్తనలు రాసినా, భగవద్గీతపై రాసినా, ఆమెకున్న ఒక అణిచివేతను ప్రభువుకు నివేదించుకుందామె. మనుషులంతా ఒకటే కదా ప్రభువా అందరూ నీ బిడ్డలే అంటూ ఆమె సమానత్వాన్ని కోరుకుందన్నమాట. అంటే ఎంతో కాన్సెస్ ఉంటే తప్ప అలా రాయలేరు. కాబట్టి ఎట్లా చూడాలి అనేది నేను కొంత వివరాలిస్తూ దళితస్త్రీ సాహిత్యాన్ని డిసైడ్ చేశానన్నమాట. పరిమితమైన దృక్కోణాలు తీసుకు వచ్చినరు కాబట్టి వాళ్ళ పరిమితి అది.

7.ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దళిత స్త్రీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. సమాజంలో మార్పు తీసుకురావడానికి సాహిత్యం ఏ విధంగా తోడ్పడుతుంది?
సమాజంలో మార్పు తీసుకురావడానికి సాహిత్యం కచ్చితంగా తోడ్పడుతుంది. రాయడం అనేదే కాదు, ఏం రాస్తున్నమనేది ముఖ్యం. ఏం రాస్తున్నాము ఎవరికి వెళుతున్నదాసాహిత్యం, ఎవరికి బలాన్నిస్తుంది, ఎవరికి సంవాదం చెప్తుంది అనే ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా. ఫేస్ టు ఫేస్ అనే ట్రెడిషన్. దళితుల్లో ప్రతిదీ ఫేస్ టు ఫేస్. జాంబవ పురాణం కాడికెళ్ళి అందులో జాంబవంతుడు ఒక పురోహితుడి ఎదురుగా నిలబడి నీ పుట్టుక నా పుట్టుక అని మాట్లాడతడు. అదొక సంవాదన అన్నమాట. నువ్వెంతో నేనంతే అని జెప్పేది చారిత్రక మౌఖిక సాహిత్యంలోనే ఆ ట్రెడిషన్ ఉంది. ఆ కొనసాగింపులో అంబేద్కర్ పార్లమెంటులో రాజ్యాంగం ద్వారా సంవాదన చేస్తడు హక్కుల గురించి. అట్లా ఎప్పుడు ఉన్నట్లు కవులు కులాధిపత్యంతో, కులాధిపత్య వివక్షతో, కులాధిపత్య శక్తులతో ఎంత పవర్ ఫుల్ గా కన్వర్జేషన్ చేస్తున్నారు. ఈ కుల బాధితులు ఎవరైతే ఉన్నరో వాళ్లకి ఎంత వరకు చైతన్యం ఇస్తున్నరో, చైతన్యo అంటే ఒక ఎనర్జీ, ఒక సపోర్టు. అంటే చదువు సపోర్టు కావచ్చు, ఆరోగ్య సపోర్ట్ కావచ్చు. ఒక సిస్టంలో పోయి పని చేసుకోవడం. ఒక వ్యక్తి ఒక రూలింగ్ సిస్టంలో పోయి పనిచేసుకోగలిగిన strength. ఇదంతా కూడా ఒక పాలసీ మేకింగ్ లో అయిపోయింది. ఆ పాలసీ మేకింగ్ వరకు వెళ్లకపోతే ఎంత సాహిత్యం వచ్చినా దండగ నా ఉద్దేశ్యంలో. సాహిత్యo సమాజానికి అతీతంగా ఉండదు. అందులో దళిత సాహిత్యం అస్సలు ఉండదు.

పార్లమెంటు, అసెంబ్లీ నుండి ఇంటి వరకు. దళిత సాహిత్యం అంటేనే ఈక్వాలిటీ కోసం. సమానత్వం కోసం. సాంస్కృతిక సమానత్వము, ఆర్థిక సమానత్వము, విద్యా సమానత్వము. అన్నిట్లో సమానత్వమే ఇంక. ఏం సాహిత్యం రాస్తున్నమన్నది సృజనాత్మక సాహిత్యంలో కూడా, అందులో సమానత్వం ఉందా లేదా? లేకపోతే బానిసత్వం ఉందా? లేకపోతే బానిసత్వాన్ని ఒప్పుకునే సాహిత్యం ఉందా…ఆ ఫిలాసఫీలు చాలా ఉన్నాయి. అంబేద్కర్, గాంధీ నేపథ్యం నుండి నేను బానిసత్వం గురించి రాసిన అనుకోండి. బానిసత్వం ఒప్పుకుంటే నన్ను చాలా ప్రమోట్ చేస్తారన్నమాట. నేను ఈక్వాలిటీ గురించి రాస్తే నన్ను సైలెంట్గా మ్యూట్లో పెట్టేస్తారు. అయినా నేను నా పోరాటాన్ని ఎక్కడ చేస్తాననేది నాకు క్లారిటీ ఉండాలి. ఎవరో ప్రమోట్ చేస్తరు, నాకు ప్రమోషన్ ఇస్తరు నాకు పేరు రావాలి అంటే అది నాల్రోజులే. కాబట్టి ఏం రాస్తున్నాము అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. అట్లాంటి యుద్ధమే ఒక సెక్యూరిటీ ఇస్తదన్నమాట. దళిత స్త్రీలకి సెక్యూరిటీ అనేది కనిపించే అత్యాచారాలు ఒకటి. మరొకటి కనబడిన అత్యాచారాల నుండి రావాలి. వీటిని మనం గుర్తుపట్టగలగాలి.

అత్యాచారం అంటే ఒక రేప్ జరగడం, దాడి జరగడం వంటివి మనకు కనిపిస్తాయి. కానీ లైఫ్ లాంగ్ నువ్వు ఒక బానిసగా బతికే ఇంకొక సిస్టం కూడా ఆపరేట్ అవుతుంది. వీటన్నిటినీ గుర్తుపట్టగలిగి రాయగల్గడమనేది ఇప్పుడున్న చాలెంజ్. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక యూఎన్ సర్వేలో భారతదేశంలో దళిత స్త్రీల ఆయుష్షు మిగతా స్త్రీల కంటే ఏడు సంవత్సరాలు తక్కువ. మిగతా స్త్రీలతో పోల్చుకుంటే ఏడేండ్ల ముందు చనిపోతారు. అత్యాచారం అంటే మనకు ఒక గాయం లాగ ఉంటది. వాళ్ళ జీవిత కాలం తగ్గిపోయింది. వీళ్ళు ఎందుకలా అవుతున్నారు. నేను చాలాసార్లు మాట్లాడాను. చాలామంది స్త్రీలకి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము వంటి కేటగిరీలు ఉంటాయి కదా. అవి దళిత స్త్రీలకు ఉండవు. అదొక్కటే కాదు దళిత స్త్రీలలో ఈ దశలు కనబడవు మనకు. ఒక స్త్రీ శరీర సౌష్టవము ఎలా ఉండాలి. అని డిసైడ్ చేస్తే ఈ దళిత స్త్రీల శరీరం అట్లా ఉండదు. అదొక రకమైన సమాజంలో ఉండే కనిపించని అణచివేతలన్నీ, మనసు మీద శరీరం మీద పడుతున్నాయి. వాటిని గుర్తించగలిగి రాయగలిగితే అత్యాచారాలను ఎట్లా ఎదుర్కోవాలి అనేది మనం నేర్చుకుంటే, system ని అడుగుతం మనం. అంతేగాని మన ఊరికే సిమస్టంని అడగడం వల్ల, system ని ఏం అడగాలన్నా మనకు భాష లేదు మొదటగా. ఆ పరిస్థితుల నుండి ఇంకా బయటకు రావాలి. కొత్తగా చాలా కెపాసిటీ పెంచుకోవాలి. చాలా రాయాలి. మన సాహిత్యాన్ని పబ్లిష్ చేస్తారా చేయరా అనేది ఆలోచించకుండా రాస్తూనే ఉండాలి. దళితస్త్రీలకు ముఖ్యంగా కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి. కమ్యూనిటీ బలంగా సపోర్ట్ చేసినప్పుడు బుక్స్ వచ్చినప్పుడు, అవి మార్కెట్ అవుతున్నప్పుడు, అవతలి వాళ్ళు కూడా ఓ మార్కెట్ అవుతున్నాయని, ఎంకరేజ్మెంట్ చేస్తరు. ఈ కమ్యూనిటీలో కూడా కొంత తక్కువగానే ఉంది దళితస్త్రీలకు. కమ్యూనిటీలోనూ కుటుంబాలలోనూ సపోర్ట్ తక్కువ. అయితే నల్లపొద్దు తర్వాత, ఇప్పుడు దళిత రచయిత్రులుగా వచ్చిన వాళ్ళందరూ, నల్లపొద్దు నుండే. ఒక సాహిత్యము ఒక సంకలనము ఎట్ల వెలుగునిస్తుంది అంటే ఇదే ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నల్లపొద్దు తర్వాతనే వాళ్లకి ఒక ఐడెంటిటీ వచ్చిందని రచయిత్రులు అన్నారు. కాబట్టి బయట కూడా చూస్తున్నారు. ఏమి రాస్తారు ఏం చెప్తారు అని. కానీ బయట పాలిటిక్స్ ఏంటంటే కులాన్ని ప్రశ్నిస్తే బయటోళ్లు సైలెంట్ అయితరు. పట్టించుకోరు కానీ దళిత స్త్రీలు రాయాలని మాత్రం చెప్తా ఉంటరు. దళిత స్త్రీలు ఎవరికి తోచినచ్చినట్లు వాళ్లు రాయరు కదా. వాళ్ల కోసమే వాళ్లు రాస్తరు. అట్లాంటి ఒక రకమైన అనిశ్చితి. సాహిత్యంలో ఒక కల్చర్ ఉండాలి.

కానీ ఒక కుల పెత్తనం పీటలమీద కూర్చున్నోళ్ళు కులాన్ని ప్రశ్నిస్తే ఒప్పుకుంటారా. కాబట్టి వాళ్ల కోసం చూడకుండా ఇప్పుడు పత్రికలో ఒక దళిత స్త్రీ ఒక కులాధిపత్యాన్ని, కుల పితృస్వామ్యాన్ని రాస్తే పత్రికలు వెయ్యవ్. అయితే దళిత స్త్రీలు ఏం చేయాలంటే పత్రికలు వెయ్యాలని చూడొద్దు. ఆల్టర్నేట్ గా పుస్తకాలు రాసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే చాలామంది పత్రికలు వేయకపోతే నిరాశకు గురవుతారు. పత్రికల్లో వేస్తేనే గుర్తింపు వస్తుందనే అభిప్రాయాలు, అపోహలు కూడా ఉన్నాయి. దళిత స్త్రీలు రాయడమే ఒక యుద్ధం అన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో రాయగలిగే స్థాయికి దళిత స్త్రీలు ఎదగాలి. అంటే అంత బాగా కులాధిపత్యాన్ని ప్రశ్నించాలి. ఇంతకు ముందున్న పద్ధతులు సరిపోవు. అంటే వ్యక్తులను టార్గెట్ చేయకూడదు. వ్యవస్థలో ఉన్న కుల వ్యవస్థని మన క్రియేటివిటీతో ఎత్తి చూపించాలి. పత్రికలను దళిత స్త్రీల సాహిత్యం వరకు తీసుకురావాలంటే కష్టపడాలి. అయితే సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వచ్చేసింది అనుకోండి. పత్రికలు ఏం చేస్తరు ఖచ్చితంగా వేస్తరు. ఆ తప్పని స్థితిని దళిత స్త్రీ రచయితలు సృష్టించాలి. అంబేద్కర్ని ఎన్నో రోజులు పక్కన పెట్టారు. ఇప్పుడు పెట్టగలగుతున్నరా. అంతకంటే గొప్పగా రాయలేం కదా మనం. అంతగొప్ప వ్యక్తినే పక్కన పెట్టారు. ఇప్పుడు మనకి ఇంకా చాలా వెసులుబాటు ఉంది.

ఆ కాలంలో లేదు. ఇప్పుడు సోషల్ మీడియా సమాజంలోకి విస్తృతంగా పోతుంది. కాస్త వినే వాళ్ళు ఉన్నరు, చదివే వాళ్ళు ఉన్నారు. చాలామందికి అవార్డులు కూడా ఇస్తున్నరు. సంకలనాల్లో కూడా ఇస్తున్నరు. చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. కానీ పైపైన రాయడంతోనే అయిపోతుందన్నమాట. పైపైన రాసి లోతైన విశ్లేషణ చేయలేకపోతున్నారు. మళ్లీ కుల అణచివేతను ఎదుర్కొనే ఒక బాధితత్వం నుండే వస్తుంది. ఎన్ని రోజులు ఎదుర్కొంటము. ఎన్ని రోజులు బాధపడ్తము. ప్రశ్నించిన ప్రశ్నించే గొంతు కూడా ఉండాలి కదా.

8.మీరు ‘ఎడ్యు సెండ్’అనే సంస్థను స్థాపించారు కదా. దళితుల విద్యపై పనిచేస్తుందని విన్నాము. ఆ సంస్థ వివరాలు తెలియజేస్తారా?
నేను హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు దళితుల పిల్లలు గ్రామాల నుంచి వచ్చి హాస్టల్స్ లో ఉంటూ డిగ్రీలు పీజీలు చేసేవారు, గ్రామాల నుండి పదవ తరగతి అయిపోయి హైయర్ ఎడ్యుకేషన్ కి చాలా తక్కువ మంది వస్తరు. పది మందిలో ఇద్దరు మాత్రమే పై చదువులు చదవడానికి పట్టణాలకు వస్తరు.ఇక్కడకు వచ్చినాక వాళ్ళు కూడా చదువు మనేస్తున్నారన్నమాట. ఎందుకు ఏమిటి అని దానిపై ఒక స్టడీ చేసినాము. ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా తీశం. హైదరాబాదులో వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే దాని కోసo మేము డాక్యుమెంటరీ తీసినప్పుడు, ఆ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్లు ‘మేము ఇక్కడ పనులు చేసుకుంటూ చదవాలి. మాకు పని చేయనిదే చదువు నడవదు. మా తల్లిదండ్రులు మాకు డబ్బులు పంపించరు. ఎందుకంటే మావి పేద కుటుంబాలు’ అని చెప్పారు. ఇంకొక విషయం ఏమిటంటే వారి తల్లిదండ్రులు పిల్లల సంపాదనపై బ్రతుకుతారు. పిల్లలు ఏమైనా డబ్బులు పంపిస్తే చాలు అనుకుంటారు. అంతటి దీనావస్థలో ఆ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళకు ఇంగ్లీషు రాదు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లేదు. ఎక్కడికి పోయినా లాంగ్వేజ్ ప్రాబ్లమ్. దానివల్ల వారికి ఉపాధి లేకుండా పోతుంది. అట్లా కొంతమంది హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను ఒక చోటకు తీసుకువచ్చి వాళ్లకి కంప్యూటర్, ఇంగ్లీషు నేర్పిస్తాం. నా ఫ్రెండ్స్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వెళ్లి వాళ్లకి ఇంగ్లీష్ నేర్పాలి. అట్ల కొన్ని నెలలపాటు వాళ్లకి ఇంగ్లీష్ కంప్యూటర్ నేర్పితే, చాలామంది నేడు ఉద్యోగంలో జాయిన్ అయిపోయి సెటిలయ్యారు.ఈ ఎడ్యుసెంట్ సంస్థకి మంచి రిజల్ట్ ఉంది.

9. చాలా గొప్ప విషయం! అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మీ అనుభవాలు చెప్తారా?
తెలంగాణా ఉద్యమము సాంస్కృతికంగా, సాహిత్య పరంగా అంత పవర్ పుల్ గా ఎందుకయినదంటే, తెలంగాణ ప్రజలు వలసాధిపత్యానితో పాటు కులాధిపత్యాన్ని కూడా ప్రశ్నించారు కాబట్టి అంత బలంగా కొనసాగింది. కులాధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించారు అంటే దళితులే. ప్రాంతీయ ఆధిపత్యాన్ని, కులాధిపత్యాన్ని రెండింటిని ప్రశ్నించడం వల్ల ఒక పవర్ పుల్ సాహిత్యము, పవర్ పుల్ డిమాండ్, పవర్ పుల్ పోరాటాన్ని నిర్మించ గలిగింది. కేవలం వలసాధిపత్యము, ప్రాంతీయాధిపత్యము అయితే ఆ ఉద్యమం అంత వృద్ధి చెందక పోయేది. అట్లా భాష చేరింది. ఉద్యమాన్ని దళితులే ముందుకు తీసుకు పోయిండ్రు. అందులో నేనుకూడా పాల్గొన్నాను. నేను కూడా ఉద్యమ కవితలు రాసిన. అప్పుడు సిరీస్ ఆఫ్ కవి సమ్మేళనాలు, పాటలు, ఆటలు, కవితలు, కథలు వచ్చాయి. స్త్రీకోణం నుండి నేను కథలు రాసిన. ఆ విధంగా తెలంగాణా ఉద్యమంలో సాహిత్యం ద్వారా కృషి చేసిన.

*10. భవిష్యత్తు లో మీరు అందించబోయే రచనల గురించి వివరిస్తారా? నేటి తరానికి సాహిత్యాన్ని దగ్గర చేయాలంటే ఎలా?
*
ఇంకా లోతుగా రాయాలి. లోతైన పరిశోధన మనకు స్ట్రెంత్ ఇచ్చేది. నేను రాసే ప్రతిదీ కొత్త తరాలకు ఒక ఎనర్జీ ఇచ్చి నిలబడగలిగేది. ఎంపవర్ మెంట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మెయిన్ స్ట్రీమ్ లో పాలసీ మేకింగ్ లో యాడ్ గావాలి. సిలబస్ లో రావాలి. అంతేగాని నేనేదో రాస్కోని నావల్లే కొద్దిమంది చదవడం వేస్ట్. నేను రాయాల్సిన అవసరం లేదు. పాలసీ మేకింగ్ ని అభివృద్ధి  జేయాలి.

11.వర్ధమాన కవయిత్రులకు, రచయిత్రులకు మీ సూచనలు…
మనం చరిత్రను కూలంకషంగా చదవాలి. చరిత్ర లో ఉన్న లెజండ్స్ ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్ కోసము మనం రాయాలి భవిష్యత్ లో ఈక్వాలిటి కోసం రాయాలి. చరిత్రను చూడకుండా మనం భవిష్యత్ లో ఈక్వాలిటి కోసం ఇప్పుడున్న పరిస్థితుల నుండి రాయలేం. నా సక్సెస్ అంతా అదే.’నల్లపొద్దు’ అంతా చరిత్రనే గదా!

మీ అనుభవాలను మా విహంగ చదువరులతో పంచుకునందుకు ధన్యవాదాలు ……

-కట్టూరి వెంకటేశ్వర్రావు  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

ముఖాముఖిPermalink

Comments are closed.