అరణ్యం 13 -అ’మృత’ వృక్షం- దేవనపల్లి వీణావాణి

ఎండ పెరుగుతుంది. నేను ఈ రోజు మా బృందంతో కలిసి పరకాలకు వెళ్ళే దారిలో వచ్చె గుడేప్పాడు వద్ద ఉన్నాను. వచ్చేటప్పుడు కొంచంగా ఉన్న ఎండ ..ఉదయపు చలికి ఉపశమనం కలిగించినా ఇప్పుడు తీక్షణంగా మారుతున్నది. రోడ్డుకు ఒక పక్కగా ఒక పెద్ద చెట్టు కింద జీపును ఆపుకొని మొన్నీమధ్య కాలంలో నేను తీసిన కొన్ని మొక్కల పోటోలను విశ్లేసిస్తూ కూర్చుకున్నాను. అందులో కొన్ని ఇదివరకే చూసిన,తెలిసిన మొక్కలు ..కొన్ని చూడనివి. సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొక్కల పేర్లు తెలుసుకోవడం సులభమైంది. ఒక మొబైల్ అప్లికేషనులో మేము తీసిన ఫోటోను జతపరిస్తే చాలు, దాని పేరు, ఆ పోలికలతో ఉన్నవేరే మొక్కల జాతుల వివరాలు వెంటనే తెలియజేయబడ్తాయి. నేను అలాంటి పని మీదే ఉన్నాను. ఈ రోజు మా గొడుగు ఇక్కడున్న పెద్ద వట వృక్షమే. చాలా పెద్ద చెట్టు ఇది.

చాలా చోట్ల అటవీ శాఖ వారు రోడ్లకు ఇరువైపులా అందమైన పూల నిచ్చే చెట్లను నాటడం అందరికీ తెలిసిందే. ఒక్క అటవీశాఖనే కాదు ఇతర శాఖలు కూడా రహదారి పక్కన మొక్కలు నాటుతారు. అవి పెరిగి దారంట వెళ్లేవారికి నీడనిస్తాయి. వాహనాల కాలుష్యాన్ని పీల్చుకుంటాయి. ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పక్షులకు ఆశ్రయన్నిస్తాయి. దారంతా పసుపు రాసులుగా పోసినట్టు అడవి తంగేడు చెట్ల పువ్వులు రాలిపోయి రోడ్డు మీద రంగుల ముగ్గులు వేసినట్టు కనిపించే దృశ్యం ఈ మధ్యే వర్ధన్నపేట వెళ్ళేటప్పుడు చూసాను. కానీ నేను కూర్చున్న చెట్టు చాలా పాతది. రహదారి పక్కన చెట్టు కాదు ఇది.ఎవరో ఎప్పుడో నాటి ఉంటారు. సుమారు ఎనభై తొంభై ఏళ్ళ వయసు ఉండి ఉండవచ్చు. విశాలమైన బాహువులు విస్తరించి తనకు తానే ఒక ఆవరణ వ్యవస్థగా మారిపోయింది. శాఖల మీద కుచ్చెలుగా అమరుకున్న ఆకుల మధ్య నుంచి చిల్లులు చిల్లులుగా ఎండపొడ కురుస్తున్నది. ఎండపొడకు గాలిలో ధూళి రేణువులు కదులుతూ రాలిపడుతున్నాయి. ఇలా సూర్యకాంతిలో మన కంటికి కనిపించే ధూళి రేణువులను తీస్రరేణువులని అంటారని నందూరి రామ్మోహన్ రావు తన విశ్వదర్శనం లో రాసారు. చంద్రకాంతిలో ఎటువంటి నలతలు కనిపించవు. నలతలు ఉండవని కాదు..మన కంటికి కనిపించవు అంతే. గాలికి శాఖలు ఊగినప్పుడల్లా ఆకుల సందుల్లోంచి జారుతున్న ఎండ బొట్లు అటూ ఇటూ కదులుతున్నాయి. మనం పట్టించుకోం గానీ ఒక్క క్షణం ఆగి చూస్తే గానీ ప్రతి కదలికలోనూ ఒక అదృశ్య హస్తం ఉన్నదనీ అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుందనీ తెలుసుకుంటాం. నేను ఆ అదృశ్య హస్త విన్యాసాన్ని గమనించడానికి ఉవ్విళ్ళూరుతుంటాను. నాకు నేను ఆశ్చర్యపోతుంటాను. ఎన్ని నిమిషాలో గంటలో అటువంటి ఆశ్చర్య సముద్రంలో మునకలేస్తూ గడిపేస్తుంటాను. ఆ భావంలో నాకు ఒంటరితనం తెలియదు, ఆ సృహలో నాకు భయమూ తెలియలేదు.

సూర్యకాంతిలో ఉన్న తీక్షణత చంద్రకాంతిలో ఉండదు. చంద్రకాంతిలో ఉండేదంతా ఒక మెత్తని స్పర్శ. ఆయుర్వేద వైద్యులు కానీ ప్రకృతి వైద్యులు కానీ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే సూర్యచంద్రులయొక్క వికిరణ శక్తి జీవుల జీవనియంత్రణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే హార్మోన్ల వ్యవస్థ అన్నమాట. అటువంటి చోదక వికిరణ శక్తి ఈ సూర్యచంద్రులకాంతి లోనే ఉంటుంది. సూర్యకాంతిలో శరీర పెరుగుదల కావలసినటువంటి చోదక శక్తి ఉంటే చంద్రకాంతిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే శక్తి ఉంటుందని అంటారు. ప్రయోగాల్లో తేలిందేమంటే చంద్రుని యొక్క పదహారు కళలు కూడా జీవుల చైతన్యాన్ని ప్రభావితం చేస్తాయని. స్త్రీలలో ఋతుక్రమం ఇరవై ఎనిమిది రోజులు ఉండడానికి కారణం చంద్రుని యొక్క ప్రభావమేనని శాస్త్రజ్ఞులు తేల్చారు. జీవ నియంత్రణ వ్యవస్థను సరిగ్గా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే సూర్య, చంద్ర వికిరణశక్తిని స్వీకరించేలాగున మన జీవనశైలిని మార్చుకోవడమే మార్గం. అటవీశాఖ వారికి అటువంటి సౌలభ్యం పుష్కలంగా ఉంటుందని నేను గుర్తు చేయవలసిన అవసరం లేదని అనుకుంటాను. ఇదిగో ఎలా ఎండన పడినప్పుడో … కురుస్తున్న వెన్నెలలో చిక్కుకున్నపుడో నాకు ఈ విషయం గుర్తుకు వస్తుంది. అందువల్ల ఎండా, వానా, గాలీ, వెన్నెల ఏదైనా కానీ ఇదీ ప్రకృతి ఏర్పాటుకు తగినదే కదా అందుకే స్వీకరించడానికే సిద్దపడుతుంటాను.

సమయం గడుస్తున్నది. జనబాహుళ్యం ఎవరి పనులలో వారు నిమగ్నమయ్యారు.నాతో ఉన్నవారు కూడా వారి వారి విషయాలను చర్చించుకుంటూ గడుపుతున్నారు. పెద్ద చెట్టు.. వచ్చీ పోయే రెక్కల అతిథులు..అదే పక్షులు…వాటి చిన్నపాటి అరుపులు. ఎవరి ప్రపంచాలలో వారు మునిగిపోయాం. ఇక్కడిదాకా వాటికి మనకూ యే సంభందమూ లేదు. వాటి మనుగడకు మన అవసరం లేదు. ఎటొచ్చీ మనకే వాటి అవసరం. అవి లేకపోతే అడవి ఎక్కడిది. ఇంతింత అడవి ఎవరివల్ల ఎదిగింది. ఈ చిన్ని పక్షులవల్ల కాదూ అరణ్యాలు విస్తరించింది. బహుశా అందుకేనేమో చెట్టు వాటికి ఆతిథ్యం యిస్తుంది. ఆహరం అవుతుంది. ప్రతిగా అవి వాటి సంతతిని వృద్ది అయ్యేలా వ్యాప్తి అయ్యేలా కృషి చేస్తాయి. ఒక సుహృద్భావ సహజీవనం..పరస్పర ఆధారిత జీవన కొనసాగింపు మానవుడు నేర్చుకోవడానికి కావలసినంత విషయం వీటిని గమనిస్తే తెలుస్తుంది.

చెట్టు ఒక్కటే అది ఒకే జీవి అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అంటే చెట్టు ఒక్కటి కాదా, చెట్టు అనేక వ్యక్తుల సమూహమా , అది పని విభజన చేసుకొని తానే ఒక సమాజమైనదా…?! చెట్టు ఒక్కటే అయితే ఒక మెదడు ఉండాలి.అది మొత్తం వ్యవస్థను నియంత్రించాలి. కానీఅలా జరగడం లేదు. ఒక చెట్టు అంతా ఒక సమాహమని నేను అనుకుంటాను. అంతే అయ్యి ఉంటుంది.. అది ప్రతి కణం దానికదే నియంత్రించుకుంటుంది. పక్క కణంతో సంభందం కలిగి ఉంటుంది. అన్నీ కలిసి ఒక్కొక్క విధి నిర్వహిస్తాయి..ఆశ్చర్యం కదా.. అంతేకాదు చెట్టు జంతువులలాగ కాదు. ఏ భాగం తీసుకున్నా తిరిగి మొక్కగా మారగలదు. ఆకునో , కొమ్మనో, వేరునో, పువ్వునో , పుప్పొడినో ఏ భాగమైన పునర్జన్మ పొందగలదు. పరిస్థితులు ఎటువంటి సవాలు విసరినీ తన అంత:శ్శక్తిని ప్రదర్శించడానికి వెనుకాడదు. మళ్ళీ మళ్ళీ తన జన్మను తాను లిఖించుకోగలదు. చెట్టు ప్రతీ కణంలో జీవించగలిగే శక్తిని దాచిపెడుతుంది. నిద్రాణంగా ఉన్న ఆ శక్తి అనుకూలతను పొందినప్పుడు మళ్ళీ తన మాతృస్వరూపాన్ని పొంది విశ్వవిధిని నిర్వహించడంలో భాగమైపోతుంది.అలా చెట్టు మొత్తం జీవశక్తితో తొనికిసలాడుతుంది.

కొన్ని చెట్లైతే వేర్లు , కొమ్మలు తీసేసినా దుంగల నుంచి పిలకలు వచ్చేస్తాయి. దానికి మరణాన్ని వాయిదా వేసుకునే శక్తి ఉంది, ఆపగలిగే శక్తి ఉంది. తన చిన్ని విత్తనంలోనైనా సరే ఎన్ని యేళ్ళ వరకైనా ఆ శక్తిని దాచిపెట్టగలదు. మనకు ఎంతగానో పరిచయం ఉన్న తామర మొక్కలో ఈ శక్తి వెయ్యేళ్ళ పైమాటే. ఒక్క తామర మొక్క ఏమిటి మన ఇంట్లో ఉండే పప్పు పలుకులోనూ జీవించే శక్తి ఉంది. ఉడికి మనకు ఆహారం అయ్యే వరకు అది బతికే ఉంటుంది.స్పందిస్తుంది , సంతోషిస్తుంది, మనలాగే దుఖిస్తుంది కూడా.మనదేశానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదేశ్ చంద్రబోస్ ( 1858-1930)మొక్కలకు ప్రాణం ఉందని, అవి తమకు ఎదురయ్యే సందర్భాలకు స్పందిస్తాయని నిరూపించాడు.. అంతే కాదు బోస్ తన 1902 నాటి పరిశోధనా వ్యాసంలో Responses in the Living and Non-Living లో మొక్కలు మంచి సంగీతానికి , మృదువైన సంభాషణకి మంచిగా పెరుతాయని , కటినమైన మాటలకు గిడసబారతాయని రాశాడు.. వాటి పెరుగుదలను నమోదు చేసే పరికరాన్ని కనిపెట్టాడు. దాన్ని క్రేస్కోగ్రాఫ్ అంటారు. 1923 లో ఆనాటి బ్రిటన్ ప్రధాన మంత్రి రామ్సే మాక్ డోనాల్డ్ , ప్రఖ్యాత ఐరిష్ నాటక కర్త బెర్నార్డ్ షా ల సమక్షంలో మొక్కల స్పందనల మీద ప్రయోగాన్ని చేసాడు. మొక్కలు కూడా స్పందిస్తాయని , వాటికీ సంతోషమూ బాధా ఉంటాయని నిరూపించడానికి క్రేస్కోగ్రఫ్ ప్రయోగాన్ని చేసాడు చంద్రబోస్. ఒక కాబేజిని ఉడికే నీటిలో వేసి క్రేస్కోగ్రాఫ్ మీద పరిశీలించినప్పుడు, దానిలోని స్పందనలను రికార్డు చేసి చూపినప్పుడు తన మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉడుకుతున్న కాబేజీ ముక్క చేసిన ఆర్తనాదానికి స్వతహాగా శాఖాహారి అయిన బెర్నార్డ్ షా ఏడ్చేశాడట. డెడ్ కాబేజ్ గా ఇది ప్రసిద్ధి. కాకపోతే నిత్య జీవితంలో మన జ్ఞానేంద్రియాల శక్తికి అతీతంగా ఉన్న వాటి స్పందనాశీలత మన జీవికకు కాస్త ఉపశమనం. లేకపోతే వాటి ఆర్తదాలను వింటూ ఎలా బతుకీడ్వగలం…అయినా మన కంటితో చూడలేకపోయినా , చెవితో వినలేకపోయినా వాటి ఆత్మతో తాద్యాత్మమం చెందితే గానీ వాటిని నష్టపరచకుండా బతకడం ఎలాగో నేర్చుకోలేము. బోస్ మనకు ఒక ఉదాహరణ చూపి మన బాధ్యతను జాగృతం చేసాడని భావిస్తాను.

బోస్, భారత స్వతంత్ర్య సముపార్జనా కాలంలో భారతీయ యువకులకు పునరుజ్జీవన వారధిగా కనిపిస్తాడు.. “లక్షలాది త్యాగధనులు యుగాలుగా అఖండ భారత జ్ఞానజ్యోతిని తమ జీవితం ద్వారా వెలిగించారు..ఒక చిన్న అగ్ని కణం నా ద్వారా దానికి జతపడింది” అని తనను తాను ప్రకటించుకున్నాడు. చంద్రబోస్ పరిశోధనలు ఆనాటి శాస్త్రవేత్తలకే కాదు సాహిత్యకారులకు కూడా దగ్గర చేసాయి. చంద్రబోస్ సమకాలీకుడు రవీంద్రనాథ్ టాగోర్ ఆయనకు మంచి స్నేహితుడు కూడా. బోస్ గురించి రవీంద్రనాథ్ టాగూరు తన కవితా వాక్యాల ద్వారా ఇలా ప్రకటించాడు “సింధూ తీరానికి ఆవల.. పశ్చిమ దేశాల శాస్త్ర మందిరాలనుంచి స్నేహితుడా ఒక విజయమాలను తెచ్చి మాతృభూమి మెడలో అలంకరిచావు ..ఈనాడు ఆమె ఈ అనామక కవి పదభాష్పాలలో తన దీవెనలను పంపింది… పశ్చిమ దేశాల గొప్ప అన్వేషకుల మధ్య సోదరా.. ఆ పలుకులు నీ చెవికి చేరునుగాక” అని రాసారు. అంతేకాదు శాస్త్రీయ జ్ఞాన దేవతకు భక్తుడు అని ప్రకటించాడు.

ఒక్క పరిశోధకులే కాదు, చెట్టు ప్రతిస్పందిస్తుంది, వ్యక్త పరుచుకుంటుంది…అని మొక్కలతో అనుభందం ఉన్న ఎవరికైనా అనుభవమేనని భావిస్తాను. ఇంకో విషయం చెట్టు వయసును కూడా బదిలీ చేయగలదు. అవును..చెట్టు తన వయసును బదిలీ చేస్తుంది. ఒక చెట్టు వందేళ్ళు పెరుగుతుంది కనుక ముసలి చెట్టు అని మనం అనుకుంటూ ఉండవచ్చు కానీ కాదు చెట్టు మొదలు వద్ద వచ్చే పిలకల వయసు తక్కువ..అంటే చిన్నపిల్లలవలె అన్నమాట. చెట్టు పై పైన వచ్చే కొమ్మల వయసు ఎక్కువ అంటే ప్రస్తుత వయసు అన్నమాట. ఇది అలంకరణ మొక్కల శాస్త్రంలోనూ, పండ్లతోటల పెంపకంలోనూ, అటవీశాఖలోనూ ఈ సాంకేతిక అంశాన్ని ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలలో వాడుకుంటారు. ఉదాహరణకు ఒక మామిడి తోట ఉంది అనుకోండి ..అది ఐదేళ్ళలో కాపుకు వస్తుంది అని మీరు వినే ఉంటారు. సహజంగా ఒక గింజ నుంచి పిలక వచ్చి కాపు కాసే సరికి పది పదిహేనేళ్ళ సమయం పడుతుంది. అయితే అప్పటికే ఎదిగిన తోటనుంచి తెచ్చిన అంట్లు కట్టడం వల్ల పిలక తొందరగా కాపుకు వస్తుంది . అంటే అంటు కట్టిన కొమ్మ ద్వారా ఎదిగిన చెట్టు వయసు కొత్తగా మొలిచిన పిలకకు బదిలీ అవుతుంది అన్నమాట. అందుకే అవి సాధారణం కన్నా తొందరగా కాపుకు వస్తాయి. పూలు, పండ్ల తోటల నిర్వాహకులు ఇదే అంశాన్ని ఉపయోగించుకొని పంటకాలాన్ని తగ్గించుకొని దిగుబడి సాధించుకంటారు. ఇక అదే అంశంలో అటవీ శాఖ అధికారులకు పూలు , పండ్లు వంటి వాటికన్నా కలప ఎక్కువ అవసరం, అంటే శాఖీయ పెరుగుదల అవసరం కనుక చెట్టు కింద భాగం నుంచి పిలకను సేకరించి నర్సరీలలో కొత్త పిలకలుగా అభివృద్ధి చేస్తారు. వీటిని కాపీస్ (Coppies) అంటారు. కాపీస్ వయసు అప్పుడే గింజ నుంచి మొలిచిన పిలకల్తో సమానం. అంటే చెట్టు మొదలు బాగం ఎప్పుడూ బాల్యావస్థలోనూ , శీర్ష భాగం అసలు వయసును కలిగి ఉంటుందన్నమాట. విచిత్రం కదా .. ఒకే దేహంలో భిన్న వయోభేదాలను ప్రతిభింభించడం..! ఒక్క అంతేనా చెట్టు ప్రతి ఏడూ కొత్తగా జీవనదశలను చూపిస్తుంది. అంటే జంతువులలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం వంటివి ఒకసారే వస్తాయి. కానీ చెట్టు ఈ జీవనదశలను యే ఏటికి ఆ యేడు చూపిస్తుంది.ఆకురాల్చే చెట్లలో ఈ సంగతి సులభంగా గుర్తు పట్టవచ్చు. ఋతువులకు అనుగుణంగా చెట్టు ఈ దశలను చూపిస్తుంది. ప్రత్యుత్పత్తి జరిపి తన సంతతిని భూమి మీదకు వదిలేశాక మళ్ళీ ఒకసారి ఇదే చక్రాన్ని పునరాగమనంగా జరుపుతుంది. దీనినే శాస్త్రీయంగా ఫీనోలోజీ ( Phenology ) అంటారు. ఇంగ్లండు రచయిత ఫిలిప్ లార్కిన్, The trees పేరుతో కవిత రాశాడు. చెట్ల నిత్య నూతనత్వానికి ఆశ్చర్యపోతూ చెట్లు ప్రతీ యేడూ కొత్తగా జన్మిస్తుంటాయని అంటాడు. మృతిచెందిన కాలాన్ని దారువలయాలలో నిక్షిప్తం చేస్తున్నాయని ఇలా అంటాడు.

ఎప్పుడూ చెప్పినట్టే

చెట్లు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి

ఇటీవలి మొగ్గలు నింపాదిగా విస్తరిస్తున్నాయి

వాటి పచ్చదనమూ ఒక విచారమే

అవి మళ్ళీ మళ్ళీ జన్మిస్తే

మనం మాత్రం వృద్దులవుతున్నమా ? కాదు అవికూడా మరణిస్తాయి

ప్రతి ఏడూ నూతనత్వాన్ని పొందే

యుక్తి వాటి వార్షిక దారు వలయాలలో

లిఖించబడి ఉంది

అయినప్పటికీ విరామం ఎరుగని దివ్యమందిరాలు

ప్రతి వేసవిలోనూ సంపూర్ణంగా ఎదిగి

ఇలా చెప్పాలని అనుకుంటాయి…

గత సంవత్సరం మృతి చెందింది

మళ్ళీ మొదలుపెట్టు కొత్తగా నూతనంగా నవీనంగా…

ఇలా నూతనత్వం పొందిన ఈ చెట్టుకిందనే కూర్చోని నేను చెట్టు జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను.

ఎవరు నాటారో ఈ చెట్లన్నీ..యే మహానుభావులో రేపటి రోజు మీద నమ్మకం ఉంచి మొక్కను నాటి ఉంటారు. నేటికి అది మహా వృక్షమయ్యి నాతో సహా ఎంతో మందికి నీడనిచ్చి ఉంటుంది. మా ఊర్లో కూడా ఇలాగే చెట్లు ఉండేవి. అసలు చెట్లు ఉండడం వల్లనే ఊరు మొదలవడం మనం త్వరగానే గుర్తుపట్టగలం. కొత్తగా వెళ్ళిన యే ప్రాంతమైనా ఎదురయ్యే చెట్లనుబట్టి దూరం నుంచే గుర్తుపట్టవచ్చు. తాటి చెట్ల గుంపు కనిపిస్తే నిస్సందేహంగా దగ్గరలో ఊరు ఉందని గుర్తు పట్టవచ్చు.ఒక్క మా ఊరేమిటి యే ఊరి శిఖమైనా ఒకసారి గమనిస్తే ఎక్కడైనా అడవినో , పొలాలనో దాటి ఒక పిల్ల దారి , దూరం నుంచి అయితే తాటి చెట్ల గుంపో , ఈత పొదలో ఆ తర్వాత ఒక చెరువో లేక ఒక వాగు ఏదో ఒక నీటి సరఫరా ఉన్నటువంటి ప్రాంతం నుంచి మొదలవుతుంది. ఇంకా వ్యవసాయ క్షేత్రాలు, మామిడి తోపులో , చింత తోపులో ..ఆ తర్వాత గ్రామదేవతల మందిరాలు ఆ తర్వాత ఇండ్లు.

ప్రతి గ్రామంలోనూ సాధారణంగా ఉండేటువంటి జీవన విధానానికి అనుగుణంగా ఆయా మొక్కలను పెంచడం మనం గమనించవచ్చు. ఇదంతా కూడా మనకు తెలిసిన గ్రామీణ నేపధ్యాన్ని చూపించే వాతావరణం. సామజిక వనాలు అని ఈనాడు చర్చించుకుని సిద్ధాంతాలు రాశాం. కానీ ఒక్క సారి ఊరిని చూడండి. పొలం దగ్గర బావి మీద తుమ్మ చెట్టు, గ్రామ దేవతల వద్ద వేప చెట్టు , కచ్చీరువద్ద రావి చెట్టు , గుడిలో రావి చెట్టు , పొలం గట్ల మీద వాయిలి చెట్లు , చెరువు కట్టకు తాడి చెట్లు, ఈత చెట్లు. ఇంకా కొంత లోతుగా చూస్తే వెనుకటికి రవాణ సౌకర్యాలు లేని కాలంలో ఆధునిక అంగళ్లు లేని కాలంలో మర్రి చెట్లు, రావి చెట్లు అంగడి అడ్డాగా నిలిచేవి . గ్రామస్తులు వినోదం కోసం ఏర్పాటు చేసుకునే బుర్ర కథలు, గుడ్దేలుగుల ఆటలు, ఒగ్గు కథలు, జాతరలు సీస కమ్మరుల సామన్ల తయారీ ఇంకా సంచార జాతుల అడ్డా కూడా. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా పంచాయతీలు, పండగలు ఇతర గ్రామీణ క్రీడలు అన్ని చెట్టు నీడలోనే జరిగేవని వినడం మనకు పరిపాటే..అంటే వెనుకటికి ఈ పెద్ద చెట్లు ఆనాటి కమ్యూనిటీ హాల్స్ అన్నమాట !

చిన్న నాడు చదువుకున్న చందమమ కథలలోనైనా పేదరాసి పెద్దమ్మ కథలలో నైనా మర్రి చెట్లో, చెట్ల తొర్రలో లేని కథలు బహు అరుదు. గ్రామ పెద్దలు కూడా ఈ సర్వజన శ్రేయోవృక్షాలను పెంచేవారు, కాపాడేవారు, పూజించేవారు. ప్రతి గ్రామం మరో గ్రామాన్ని కలిసి ఊరి పొలిమేర దాటేటప్పుడు ఎటువంటి వన్యప్రాణుల ప్రమాదం జరగకుండా ప్రార్థిస్తూ ఉండడం కోసం గ్రామస్తులు చెట్లనే మందిరాలుగా ఏర్పాటు చేసుకునేవారు. అందుకు అనుగునంగానే పొలిమేర చెట్ల వద్ద చేద వేసుకునే ఏర్పాటుతో పెద్ద పెద్ద బావులు కూడా ఉండేవి. నా చిన్నతనంలో మా ఊరి పొలాల మధ్య పెద్ద మర్రి బావి ఉండేది. నాకు తెలిసి ప్రతి ఊర్లో దాదాపు ఇదే పేర్లతో పెద్ద పెద్ద బావులు ఉండేవి అనుకుంటాను.ఆ మర్రిచెట్టును , బావిని గురించిన ఆసక్తికరమైన కథలు ఎన్నో ప్రచారంలో ఉండేవి. అక్కడ దయ్యం ఉందని చెప్పే వాళ్ళు. సహజంగానే పెద్ద పెద్ద వృక్షాలు మీద గబ్బిలాలు ఇతర పక్షులు ఉంటాయి కనుక వదంతులు, భయమూ ప్రచారంలోకి వస్తాయి.

ఒకప్పుడు ఈనాటిలా వ్యాపారాలు నిర్వహించుకునే దుకాణాలు లేవు అంతేకాక ఒక ఊరికి మరొకరికి వెళ్లాలంటే ఎడ్లబండి మీద కాలి నడకన వెళ్లే వారు, అలాంటి ప్రయాణాలలో సరిహద్దుకు ముందు ఇలా పెద్ద పెద్ద చెట్లను నాటి అక్కడ ఆగడానికి వీలుగా చేసేవారు. అంతే కాదు ఎడ్ల బండ్లలో ప్రయాణం చేసే ప్రజలు ఊరి హద్దులోని ఈ చెట్ల వద్దనే ఆగి ఎడ్లకి నీళ్ళు పెట్టుకొని తెచ్చుకొన్న ఫలహరమో అన్నమో తిని..లేకపోతే వండుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించే వారు. పశువులకు విశ్రాంతి నిచ్చేవారు. ఈ చెట్ల తొర్రలలోనో , కొమ్మలల్లోనో పశువుల కాపర్లు సద్ది మూటలు దాచుకొనే వారు.వానకు ఎండకు తన శాఖలే చేతులు చేసి గొడుగు పట్టేవి చెట్టు. ఆ విధంగా చెట్లు మన నమ్మకాలకు అవసరాలకు అనుగుణంగా మన సంస్కృతిలో భాగమయ్యాయి. రవాణాసౌకర్యాలు మొదలయ్యాక దారులు పెద్దవి అయ్యాయి. ఈ వృక్షాల అవసరం తగ్గింది, వాటి ప్రభావం మరుగున పడిపోయింది. అయితే ఈ మధ్యే వారసత్వ వృక్ష పరిరక్షణ ( Heritage Tree Conservation )అనే ఒక భావనను పెంపొందించి ఇలా ప్రాధాన్యత కలిగిన రక్షించవలసిన వృక్షాలను కాపాడటంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఎంతో అభిలషణీయమైన చర్య. వారసత్వ సంపదగా వృక్షాలను భావించడం ఎంతో అవసరమైన పని. ఉదాహరణకు పిల్లలమర్రిలోని మనం చూసే వృక్షాలు మన వారసత్వ సంపద. అలాగే మూసీ వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చింతచెట్టు ఒకటి, వంద మందిని వరదలో కొట్టుకు పోకుండా కాపాడింది. ఇది కూడా వారసత్వ సంపదనే. అలాగే మన సంస్కృతిలో భాగమై సంరక్షించబడిన చెట్లను పవిత్ర వృక్షాలని అంటారు (Sacred tree Conservation ). ఉదాహరణకు రావి చెట్టు, భోధి వృక్షం , అశోక వృక్షం లాంటివన్నమాట. ఏదేమైనా మనం స్థానికంగా ఉన్న వృక్షాలను సంరక్షించడం ముఖ్యం. వీలైతే అది మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఎలాగూ ఉంటుంది. ప్రజలకు అవగాహనా కలుగుతుంది.

ఇప్పుడు చెట్లను రహదారులకు పరిమితం చేసాం. పశువులు సేద దీరేతందుకు ఒక్క చెట్టు కూడా లేదు . కాసేపు వాన వస్తే ఎవరైనా ఎక్కడైనా కాసేపు నిలబడే చోటు లేదు. ఇంటి నుంచి వెళ్ళే పశువులు గుక్కెడు నీళ్ళుతాగే కుంటలు లేవు. ఒకటి లేకపోతే మరొకటి ఉండలేదు . చెట్టు లేని చోట నీటి ఊటలేదు. ఇలా ఎలా మారిపోయింది. మన దాహం ఇప్పుడొక వ్యాపారం. డబ్బులు వదిలించుకునే అయినా గొంతు తడుపుకునే వెసులుబాటు ఉంది. మరి తెల తెల వారుతుండగానే మన కాఫీ కప్పులోనో టీ కప్పులోనో కలిసిన తెల్లని రక్తం ఊరే పొదుగు ప్రాణి గొంతులో నీళ్ళు ఎవరు పోస్తారు ? కనిపించే ప్రతి నీటి చెలిమ ఎదో ఒక విధంగా పనికి రాకుండా ఉంటే ఆ మూగ జీవాలు మనకు పెట్టె శాపాలు ఎవరికి తగులుతున్నాయి ?

ఇప్పుడు మన తాత ముత్తల లాటి చెట్లు రోడ్ల మీద నుంచి కూడా వెళ్లి పోతున్నాయి. ఇప్పుడు తీసి వేసిన మొక్కల స్తానంలో కొత్త మొక్కలు వస్తాయి. ఎర్రని తురాయి చెట్లో , పచ్చని తురాయి చెట్లో , దిరిసెనలో… చెట్లో యేవైతేనం కంటికి ఇంపే కానీ మరొక ప్రయోజం పెద్దగా కనపడదు . ఆ కాయలు పక్షులు తినవు. మనుషులు తినరు, పశువులు తినవు. గట్టిగా వచ్చే గాలికి విరిగి పోయి వాన కన్నా ఎక్కువ వీటి వల్ల కలిగే ఇబ్బందే ఎక్కువ.

చాలా రోజులక్రితం నేనిప్పుడు ఉన్న చోట రహదారి విస్తరణ పని నిమిత్తం చెట్లను తొలిగించే పనికి అనుమతి లభిచిందని నేను విన్నాను. ఇది చాలా నిభంధనలమీద అనుమతించే తప్పనిసరి పని. ప్రజలు తమ సౌకర్యాలను వదులులుకోనంతకాలం ప్రభుత్వాలకు ఈ తలనొప్పి తప్పదు. నేను ఇప్పడు కూర్చున్న చెట్టు కూడా రేపటికి ఉంటుందో ఉండదో. బహుశా ఉండకపోవచ్చుననే అనుకుంటున్నాను.

మా బృందం అక్కడ నుంచి కదిలి మరి కొంత ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. చెట్టు కింద నుంచి లేచి కొంత దూరంరం వెళ్లి పోయాం. అక్కడ కూడా ఇలాగే పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. కంటి నిండుగా భారీకాయాలతో గంభీరంగా రహదారిని అలంకరించి ఉన్నాయి.

ఇక్కడ రహదారి విస్తరణ నిమిత్తం ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఏ చెట్టు ను ఎటునుంచి కొట్టాలో ఏ సమయంలో కొట్టాలో ఎలా తరలించాలో లెక్కలు వేసుకుంటున్నారు. అలా ఆలోచిస్తుండగానే నరికె పనికి ఓం కారం పడింది.నేను అనుకున్నదే జరగబోతుంది…ఒక అశక్తత ..ఉదాసీనత..కళ్ళ మీదుగా హృదయపు లోతును తాకింది. భారంగా నా లోచనాలు కదులుతున్నాయి..నేనిప్పుడు ఈ దారుణానికి సాక్షిని…నా కళ్ళముందే జరుగబోతున్న విద్వంసాన్ని చూడలేక వెనక్కి తిరిగి పోయాను.. ఒక ఉద్రుతిలో పడి కొట్టుకుపోతున్న గడ్డిపరకలాగా అయిపోయాను…

కాసేపట్లో అవి మరణిస్తాయి. రహదారి పక్కన వాటి గంభీర రూపం ఈ క్షణం నుంచి ఇక కనిపించదు .అందుకు బదులుగా చెల్లాచెదరైన వాటి దేహ ఖండాలు దారంతా పరుచుకుని ఒక వారం పది రోజుల వరకు వచ్చి పోయే వాళ్లకి తమ దేహ దుర్గతిని చూపిస్తుంటాయి. ఏళ్ల తరబడి పోగు చేసుకున్న సమస్త శక్తీ రంపపు పళ్ళ రాపిడికి లోకువ అవుతుంది. తమ అస్తిత్వం ,కూడబెట్టుకున్న నిబ్బరం ,తామిచ్చిన సమూహ బలం ఈ క్షణం నుంచి ఈ విశాల విశ్వంలో కలిసిపోతుంది. ఇక రేపటి నుంచి ఆ చెట్టు చుట్టూ వందల సార్లు తిరిగి తిరిగి తను పట్టు పెట్టుకున్న తేనెటీగలు నిరాశ్రయులవుతాయి. ఆ చెట్టు కింద పుట్ట పెట్టుకున్న చీమలు తరలిపోతాయి. ఆ చెట్టు మీద ఎన్నో తరాల నుంచీ ఉన్న కొంగల గూళ్ళు చెత్త కుప్పలా మారిపోతాయి. రానున్న వసంతంలో ఆ చెట్లకు సుగందాన్ని చాటింపు చేసే పువ్వులు ఇక పుట్టకముందే నశించిపోతాయి. బాగా దారుడ్యం పెంచుకున్న దేహం రంపపు కోతతో ముక్కలు ముక్కలై ఎక్కడికి వెల్లనుందో. ముక్కలన్నీ ఎన్ని భస్మ రాసులవుతాయో ఏ వంటశాలలో మంటగా మారి పోతాయో తెలియదు. ఈనాటికి వాటికి ఋణం తీరిపోతుంది.

నువ్వెప్పుడైనా ఎప్పుడైనా కూలిన చుట్టుపక్కన రోదిస్తున్న పక్షిపిల్లల విలవిలలాడటం జరిగిందా.. కనీసం ఆ ఊహ అయినా వచ్చిందా..కానీ నేనిప్పుడు అలాగే అనుకుంటున్నాను. నిజమే రేపటికి ఈ చెట్టు ఉండదు. ఎందుకంటే రోడ్డువిస్తరణ పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. అతి త్వరలో ఈ దారెంట ఉన్న అన్ని చెట్లూ మరణిస్తాయి…కాదు కాదు హత్య చేయబడతాయి. తమ సౌకర్యాలను కుదించుకోలేని మానవులచేతిలో తమ ఉనికిని శాశ్వతంగా పోగొట్టుకుంటాయి. ప్రకృతి చేత దీర్గాయువని ఆశీస్సులు పొందిన వాటి ఆత్మలు నిర్దాక్షణ్యంగా ఈ భూగోళం నుంచి గెంటివేయబడతాయి. వాటి దేహాలు యే పంచన జ్వలించి అస్మిక రాసులవుతాయో … మరప్పుడు అప్పుడు ఆశ్రిత విహంగాల భవిష్యత్తు ఏమి కానుందో…అవి ఎక్కడికి వెళ్తాయి.. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే నిరశ్రులయ్యే మానవ సమూహాల కోసం వారు చట్టాలను రాసుకున్నట్టు ఇవి రాసుకోలేవు. నిర్భందాలు ,నిరసనలు వాటికి తెలియదు.

ఇంతకీ చెట్టుకి తనను నరికే విషయం తెలుసో లేదో. మౌనంగా ఆ చెట్టు కింద నుంచి ఎటువైపు నుంచి నరకాలని ఆలోచిస్తున్నటువంటి మనుషుల మాటల్ని వింటుందో లేదో వింటే ప్రతిఘటించలేని తన అసమర్ధతకు అది బాధపడుతుందో లేక నేను అజరామరాన్ని నువ్వు ఎన్ని సార్లు నన్ను తీసివేసినా నేను తిరిగి తిరిగి వస్తూనే ఉంటానని అనుకుంటుందో ఏదైతేనేం ఇప్పుడు నరికివేసి చెట్టు నామరూపాల్లేకుండా చేయడానికి మనం సిద్దపడే ఉన్నం కదా . వెనకాలే అన్ని బారులు తీరి మిగిలినవి కూడా నేటికి తనకు నెలవు నిచ్చిన నేలకు సెలవు మాట చెప్పకుండానే నిష్క్రమిస్తాయి. ఒక్క వేటుతో సమస్తం ఒరిగి పోతాయి. ఆ క్షవరం అయిన స్థలాల్లో మళ్ళీ పిల్లలురాకుండా దాని వేళ్లతో సహా పెకిలించి దాని మీద కంకర ఇసుక వేసి ఇంకా ఏ రకమైన గాలి చొరబడకుండా దాని పైన తారు కూడా వేసి గట్టిగా అదిమి పెట్టేస్తాం. ఇక ఈ భూమి ఇక్కడ మానవ సంచారం ఉన్నంత కాలం దాని వేర్లను ఓదారుస్తుంది.

నడుస్తున్నాను… అప్పటికే నరకబడిన కొన్ని చెట్ల కొమ్మలు నాకళ్ళకు అడ్డంపడి కదలనివ్వడం లేదు. హత విధీ … నిజానికి ఇక్కడికి కాసేపు చెట్టు నీడలో కూర్చివాలని ఆ దారి వెంట వెళ్తున్న దాన్ని ఆగిపోయాను.నిజానికి ఇలాటి అమృత వృక్షాల ముందు నా గోడు యేదో వెల్ల బోసుకోవాలని కూలబడతాను. కానీ ఆ చెట్లే ఈనాడు నాకు వాటి గోడును వెల్ల బోసుకున్నట్లు అనిపించి వెనుదిరిగాను. నా కాళ్ళకు అడ్డం పడ్డ కొమ్మ ఆ దారి మీద తన ఆకులే కుంచగా తనను హత్య చేసిన వారి బొమ్మ గీస్తున్నది. ఆ బొమ్మ అచ్చంగా నా లాటి మనుషులదే.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

One Response to అరణ్యం 13 -అ’మృత’ వృక్షం- దేవనపల్లి వీణావాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో