గజల్-9 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సుమాంజలి.
ప్రేయసి నవ్వు చూస్తే మనసులో ఎన్నో భావాలు కలుగుతాయి
ఆ నవ్వు వెన్నలా చల్లగా అనిపిస్తుంది … క్షీరసముద్రంలోని కెరటంలా
అనిపిస్తుంది. అలాగే ప్రకృతిలోని ఎన్నో అందమైన వస్తువులను,
అనుభూతులను తలచుకొనేలా చేస్తుంది ఆ నవ్వు.
మదిలో వసంతవీణ మోగినట్లుంటుంది. కనులలోనున్న చీకటి
మాయమైనట్లుగా ఉంటుంది. కొన్నిటిని మాత్రమే వర్ణించగలిగాను.
చెలినవ్వులో జారే మల్లెలు , ముత్యాలు ఏరుకుంటూ వాటిని మాలలుగా చేసే
ప్రేమికుని మనసును చూపే ప్రయత్నం చేసాను ఈ గజల్ లో

చిలుకుతున్న పాలమీద వెన్నలాగ నవ్వుతావు

పాలకడలిలో ఎగసిన తరగలాగ నవ్వుతావు

మదిలోపల సరిగమలే నర్తనాలు చేస్తున్నవి

శృతిచేసిన చైత్రవీణ తీగలాగ నవ్వుతావు

మనసులోన మధువేదో ఒలికినట్లు ఉన్నదిలే

తేనెటీగలను పిలిచే పూలలాగ నవ్వుతావు

తనువులోని తాపమంత ఒక్కసారి అణిగినది
వేసవిలో మరుమల్లెల వానలాగ నవ్వుతావు

గుబాళించు స్వరమేదో గుండెలోన పలుకుతోంది
నైటుక్వీను పూలలోని పాటలాగ నవ్వుతావు

చూపులలో నక్షత్రపు ధూళిరేగిపోతున్నది
కోటితారలున్న పాలపుంతలాగ నవ్వుతావు

కనులలోని చీకట్లను తుడిచేస్తూ “ నెలరాజా “
పున్నమిలో నెరవెన్నెల సోనలాగ నవ్వుతావు

 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గత సంచిక – ఆర్ .వీ.ఎస్ .శ్రీనివాస్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

2 Responses to గజల్-9 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

  1. అనిత మోహన్ says:

    గజల్ చాలక్ బాగా రాసారు శ్రీనివాస్ గారు

  2. ఆనంద్ says:

    గజల్ చాలా బాగుంది శ్రీనివాస్ గారు…