అక్కర్లేని మొక్కలు(అరణ్యం -6)-దేవనపల్లి వీణావాణి

ఉదయాన్నే గుండ్ల పహాడ్ నుంచి మేడపల్లి వైపు బయలుదేరాము. ఈ రెండూ నర్సంపేట సబ్ డివిజన్ కు చెందిన ఊర్లే. మా బృందంలోని వారు వెళ్తూ వెళ్తూ ఆ ప్రాంతం గురించిన విషయాలు చెప్తున్నారు.పొద్దున గుండ్ల పహాడ్ శివాలయం చూసాక ప్రాణంలేని శిల, ప్రాణం పోసుకుని చెప్పకనే చెప్పిన కథను చూసి తలో జ్ఞాపకాన్ని పంచుకున్నాక ఇక మేడపల్లి అటవీ శివార్లలోకి ప్రవేశించాము. మేడపల్లి పేరుతో రెండు బీటులు ఉన్నాయి .మేడపల్లి వన్యప్రాణి బీటు , మేడపల్లి బీటు. ఒక అడవి దారి ఈ రెంటినీ విడదీస్తుంది. బీటుచివరంచు మొండి గుట్టలతో ముగుస్తుంది. మేడపల్లి బీటు అంతా ఆక్రమణలకు గురైందే. కొన్ని అటవీ హక్కుల ప్రకారం ఉన్నవి , మరికొన్ని లేనివి, న్యాయ పరిధిలో ఉన్నవీ ఇలా చుట్టూ పక్కలంతా మాములు వ్యవసాయ క్షేత్రాలలగానే ఉన్నది. చుట్టూ కొండలు, చిన్న పల్లెటూరి శంఖం గుండా మైదానంలా మారిన బీటు ప్రాంతానికి చేరుకున్నాము. ఇంకాస్త ముందుకు వెళ్ళవలసిన సమయానికి జీపు కుదుపులివ్వడం మొదలుపెట్టింది. భద్రు దాన్నిఅదుపు చేయడానికి ప్రయత్నిస్తూనే మొన్న వర్షం పడ్డప్పుడు కుంటల్లోనుంచి పోకుండా ఉండాల్సిందని ఇప్పుడొచ్చిన సమస్య క్లచ్ ప్లేట్ది అయ్యుండవచ్చునని నిరాశగా చెప్తున్నాడు . అసలే పాత జీపు ఎన్నో సార్లు రిపేర్లు , జీపు కి ఏదైనా అయితే తనకే అయినట్టు బాధ పడిపోతాడు భద్రు . ఒక పక్క తిరిగే సరికి ఊహించినట్టుగానే క్లచ్ ప్లేట్ దెబ్బతిని జీపు ఆగిపోయింది .చేసేదేం లేక మేము అక్కడ దిగవలసి వచ్చింది.అందరం, పక్కనే ఉన్న మొక్కజొన్న చేలోకి దిగాము. చేను ఒక పక్కన పత్తి వేసారు. ఆ రైతు ఒక మామిడి చెట్టు నాటుకొని అవసరం అయితే అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మంచి నీళ్ళ కుండ, చిన్న బండలతోటి గద్దె , బోరు స్విచ్ మరొక పక్క రెండు మూడు చిక్కుడు పాదులు వేసుకున్నాడు. ఒక పక్కగా కుప్ప పెట్టిన వరి గడ్డి ఉంది. నేను నడుచుకుంటూ మామిడి చెట్టు వద్ద ఉన్న గద్దె మీద కూర్చున్నాను . మిగిలిన వాళ్ళు నన్ను అక్కడ దింపి జీపు వద్దకు తిరిగి వెళ్లారు.

దూరం నుంచి చేలల్లో కలుపు తీస్తున్న మహిళలు ఉన్నారు. జూలై మాసంలో కురవాల్సిన వర్షం కురవకపోయినా బోర్ల కింద సాగు చేసే రైతులు వర్షాల కోసం ఎదురు చూడకుండా కార్తెలకు అనుగుణంగా విత్తనాలు వేసుకున్నారు. అవి ఇప్పటికి మోకాలెత్తుకు ఎదిగాయి. పంటతో పాటు వాళ్ళు తమకు అక్కరలేని మొక్కలను(కలుపు అనడం నాకిష్టం లేదు ) తీసే పని చాలా శ్రద్దగా చేస్తున్నారు.అలా చేస్తూ వాళ్ళలో వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, స్వేచ్చగా మనసులో బాధో సంతోషమో పంచుకునే అవకాశం ఇలా దొరుకుతుందేమో ! మా పొలంలో పనిచేయడానికి వచ్చేవాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళని , మంచి మంచి సామెతలు చెప్పేవారని , ఒకామె అయితే సామెత లేకుండా ఒక్క వాక్యం కూడా మాట్లాడదని మా అమ్మ ఎంతో ఉత్సాహంగా ఆ విషయాలన్నే నాతో చెప్పేది. ఆ మాటలన్నీ ఏమయి ఉంటాయో ఇప్పుడు.. వర్షానికి వర్షానికీ మధ్యన కాచే ఎండ చురుకుగానూ ,పదునుగానూ ఉంటుంది. అందుకేనేమో చేలో పని చేసే మొక్కలు మహిళలు తలకు గుడ్డ కట్టుకుని తమను తము రక్షించుకుంటున్నారు. పొలాల మధ్య అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు వదిలి వేయబడి ఉంది. ఆసాములు చేనులో భోజనం కోసం , ఏవైనా వస్తువులు పెట్టుకోవడం కోసం ఇలా వదిలివేస్తుంటారు. ఇక్కడ ఉండే వన్యప్రాణులు పక్షులు మాత్రమే. వాటికి అక్కడక్కడా వదిలిన చెట్లే ఆధారం. మరి కొంత దూరంలో మొండి గుట్టలు…ఇక అంతే. ఆక్రమణలు మొండి గుట్టలదాకా చొచ్చుకువచ్చాయి. మరొక పక్క దేవాదుల ప్ర్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కొన్నేళ్ళ క్రితం వరకు ఈ ప్రాంతం అంతా చిక్కని అడవి. ఇప్పుడు అంతా పొలాలు .. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు అటవీ అధికారులంటే భయమూ, కోపమూ. ప్రభుత్వం వాళ్ళ భూముల్ని లాక్కుంటుందని వాళ్ళ భయం, అందుకు నివేదికలు రాస్తామని కోపం. మాపని చాలా సార్లు పోక చెక్కనే.

పక్కన జీపును బాగు చేసే పనిలో డ్రైవరు , అతనికి మార్గదర్శకంగా మా ఉద్యోగులు నిమగ్నమై ఉన్నారు. చుట్టూ చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాను. రోజూ బండబారిన రోడ్ల మీద ప్రయాణించి , సిమెంటు గూళ్ళలో కాలం వెళ్లదీసే బస్తీ బతుకుకు హాయి గొలిపే చందన లేపనం అద్దినట్టు ప్రశాంతంగా ఉంది. తెచ్చుకున్న బాగ్ లోంచి మసనోబు ఫుకువొక రాసిన “గడ్డి పరకతో విప్లవం” ( One Straw Revolution) పుస్తకం తీసాను. రెండు రోజుల్నించి ఆ పుస్తకం చదువుతున్న. నిజానికి రెండు నెల్ల కిందనే మొదలు పెట్టినా మధ్యలో వేరే వేరే పనిపడి పూర్తి చేయలేదు. చివరి కొన్ని పేజీలు మిగిలిపోయాయి. అందుకే మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. ఎప్పుడయినా సమయం చిక్కితే ఆ కొన్ని పేజీలుపూర్తి చేస్తే బాగుంటుందని వెంట తెచ్చుకున్నాను. ఇలా పుస్తకం తెచ్చుకోవడం ఒక తరాన్ని మోసుకు తెచ్చుకుంటున్నట్టుగా తోస్తుంటుంది.

గడ్డి పరకతో విప్లవం చదివాక ముసనోబుతో ఏకీభవించకుండా ఉండని పర్యావరణ ప్రేమికుడు ఉంటాడని అనుకోను. ఆయన జపాన్ వాడు. 1938 నాటి నుంచి తన ముప్పై ఏళ్ళ వ్యవసాయ క్షేత్ర ప్రయోగ అనుభవాలను 1975నాటికి ఒక పుస్తకంగా రాశారు . అది జపనీస్ భాషలో వెలువడి ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. తెలుగులో 1990 లోనే వచ్చింది. హరిత జీవనం చేయమని సూచించే ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులోకి చేయడానికి ముప్పై ఏళ్ళ క్రితమే ప్రయత్నం చేయడం నాకు నచ్చింది. ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నానిన విత్తన బంతుల ( Seed balls) ప్రయోగానికి ఆద్యుడు ఆయనే. పంటలు వేయడానికి మొత్తం నేలను దున్నవలసిన అవసరమే లేదని , కావాల్సిన చోట నటుకుంటే సరిపోతుందని అంటాడు.

మసనోబు ప్రకృతి వ్యవసాయాన్ని బోధించాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించమని చెప్తాడు. పుస్తకం ఆద్యంతం ప్రకృతిని యే విధంగానూ కలగజేసుకోకుండానే మానవుని మనుగడ సాధ్యమని చెప్తాడు. కాలానుగుణంగా పండే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మానవులకు ఉత్తమ ఆహారం అని తన పరిశోధనలతో ఈ వివరాలతో ఒక ఆహార చక్రాన్ని కూడా రూపొందించాడు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయవచ్చో తన ముప్పై యేళ్ల అనుభవం సారంగా తెలుసుకున్న విషయాలను క్రోడీకరిస్తూ దున్నడం వల్ల నేలలోని జీవ సంచయం దెబ్బ తింటుందని , పురుగు మందులు, కలుపు మందులూ నేలను నిర్వీర్యం చేస్తాయని , సృష్టిలో ఒక నిర్దిష్టమైన సూత్రంతో జీవుల పరస్పర సంబంధాలు కొనసాగుతాయని వాటికి మానవ చర్యలు విఘాతం కలిగిస్తాయని నేల నిస్సారమై తుదకు మనుగడ కష్టమవుతుందని చెప్తాడు. ఆయన ఈ దృగ్విషయాలు అన్నీ అనుభవించి తెలుసుకున్నవే. స్వతహాగా శాస్త్రవేత్త , చాలా చిన్న వయసులో ఒక సంక్లిష్టమైన మానసిక స్థితిలో తాత్వికచింతన వైపు మరలుతాడు. అదే అతని జీవితాన్ని మార్చిన కాలం. ప్రకృతికి ఎవరి అవసరమూ లేదని మనం నిమిత్తులమని గ్రహించిన ఆ క్షణమే ఆయన లక్ష్యాలు మారిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచాక తన ఊరు చేరుకొని అక్కడ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి తానే ఒక అప్రకటిత ప్రయోగ దీపికగా మారాడు . మానవాళికి ఏమీ తెలియదన్న ఒక్క విషయమే అయన నిరూపించదలుచుకున్న పరమ సత్యం. లెక్కలేనంతమంది అతను కనిపెట్టిన విషయాలను గురించి తెలుసుకోవడానికి అతని దగ్గరికి వస్తారు, పరిశీలిస్తారు, పరిశోధిస్తారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మొండి సూదుల వంటివి అవి వేటికి అవే సమస్య ప్రయత్నిస్తాయి కానీ కారణాన్ని అన్వేషించలేవు అంటాడు. మసనోబు ఒక విశాల ప్రకృతి నేత్రంతో ఈ లోకాన్ని దర్శిస్తాడు, అందుకోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. ఒక గడ్డి పరక కూడా విప్లవానికి నాంది కాగలదని ,పునాది కాగలదని నిరూపిస్తాడు. భౌతికంగా ఆయన ప్రయాణం 2008లో ముగిసినా అతని ఆధ్యాత్మిక తాత్విక వ్యవసాయ స్ఫూర్తి ఇంకా దీపం పట్టుకుని తిరుగుతూనే ఉంది. మన ఆధునిక వ్యవసాయం ఎంత ప్రమాదకరకంగా ఉందో , భవిష్యత్తును ఎంతగా ప్రభావితం చేయనుందో నలభై ఏళ్ల క్రితమే నిరూపించినవాడతను. పుస్తకం పేజీలు ముగించి పక్కన పెట్టాను . దీర్ఘమైన నా నిట్టూర్పు మామిడి చెట్టు విసిరిన గాలిలో కలిసిపోయింది.

చల్లటి గాలి వీస్తుంది. చిన్న చిన్న పక్షుల అలజడి తప్ప యే శబ్దమూ లేదు. కళ్ళు మూసుకున్నాను. తెరవాలని అనిపించలేదు. నేను నిద్రపోలేదు. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుండగా ఈ క్షణం మసనోబు నా ఎదురుగా నిలబడి అటు చూడు ఏం జరుగుతున్నదో అక్కడ….అని అడిగాడో, నా ఆలాపనో తెలియదు. కళ్ళు తెరిచి నా ఎదురుగ్గా ఉన్న గడ్డి కుప్పవైపు చూసాను. నిర్లక్ష్యానికి గురైన ఈ వరి గడ్డే ఆధునిక వ్యవసాయంలోని అపసవ్యతకు నిదర్శనం అని చెప్తున్నట్టనిపించింది. పుస్తకం మళ్ళీ తెరిచి చివరి పేజీలు మళ్లీ చూసి ,మూసి వేసాను. నా అంతరంగం నిండా ముసురుకున్న నిట్టూర్పులే. అక్కణ్ణించి దూరంగా మా వాళ్ళు, జీపు పని చేస్తుందో లేదోనని చూసే ప్రయత్నం చేస్తున్నారు. గద్దె మీద నుంచి లేచాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. స్థానికంగా ఎవరైనా జీపు రిపేరు చేసే వాళ్ళు ఉంటె బాగుండునని తెలుసుకుంటే ఎవరూ దొరకలేదు.వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళని అలా ఉంచి నేను ముందుకు వెళ్ళాను.

అక్కడక్కడ పొదలతో ఉన్న గట్లు ,వాటి మీద రకరకాల తీగలు , అడవి పొట్ల, అడవి దొండ ఇంకా ఏవేవో తీగలు. నేలంతా ఇప్పుడు పచ్చి బాలింత. అడుగులో అడుగు వేసుకుంటూ నడవక పోతే వాటి బతుకు మన కాళ్ళ కింద పడి నలిగి పోతుంది. నీలం రంగుతో చిన్న చిన్న పూలు పూసే విష్ణుక్రాంతాలు,నేలను కరుచుకున్న మూశికపర్ని మొక్కలు , రకరకాల గడ్డి పిలకలు . విష్ణుక్రాంతం మొక్కల్లాగా పూలు పూసే చెట్లు చాలా ఉంటాయి. కట్ల పూలు అంటారు తెలంగాణలో. వీటిల్లో రకరకాల రంగులవి ఉంటాయి . అచ్చంగా కట్ల పూల లాగానే ఉండే ఈ పూలు కట్ల పూల కన్నా చిన్నవిగా ఉంటాయి అంతే. అందుకే కట్ల పూలని ఇంగ్లిష్లో మార్నింగ్ గ్లోరి అంటే దీన్ని డ్వార్ఫ్ మార్నింగ్ గ్లోరి (Evolvulus alsinoides ) అంటారు. కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన మొక్కలన్నీ ఇలాటి పుష్పాలనే ఇస్తాయి. మన దగ్గర భాద్రపద మాసంలో వినాయక చవితిలో వాడినట్లే వీటిని కేరళలో కరక్కిదకం (Karakkidakam )లో దైవారాధనకు వాడతారు. కేరళ సంప్రదాయ వైద్యంలో దశ పుష్పంగా వర్ణించే పది మొక్కలలో ఇది ఒకటి. మిగిలినవి భద్ర (Avrva lanata ), విపరీత లజ్జలు( Biophytum sensitivum ), ఇంద్రవల్లి (Cordiospermum halicacabum), ముసలి ( Curculiogo orchioides ), దుర్వ (Cynodon dactylon), భ్రింగరాజ(Eclipta laba ), అకుకర్ని (Emilia sonchifolia ), లక్ష్మణ (Ipomea sepiaria ), సహదేవి (Vernonia cinerea). కేరళలో వీటిని పవిత్రమైన (Sacred flowers )గా భావిస్తారు. ఇందులో దుర్వ అనేది గడ్డి. ఋగ్వేదం పేర్కొన్న మూడు గడ్డి జాతులలో ఇది ఒకటి. మిగిలిన ఆరెండు గడ్డి జాతులు కుష, దర్భ.

సహ్యాద్రి పర్వతాలను ఆనుకోని ఉన్న అత్యధిక జీవ వైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతలలో కేరళ ఒకటి. కేరళలో ఆయుర్వేదం వెలుగొందగానికి అక్కడి వైవిధ్యమైన వృక్ష వనరులు ఎంత దోహదమో , వాటిని వినియోగించే అద్భుతమైన పరిజ్ఞానం అభివృద్ది చేయడం కూడా అంతే కారణం . అక్కడ ఈ దశ పుష్పాలను సేకరించి ఒక ఇత్తడి పళ్ళెంలో వేసి ఇంట్లో దేవుడి ముందు పెట్టె ఆచారం ఉంది. పూర్వకాలం రాజ వైద్యులు వీటిని తలపై ధరించాలని సూచించేవారట. అందుచేత ఇప్పటికీ కరక్కిదక మాసంలోనూ , ధనుర్మాసంలో తిరుత్తరా పండుగలో చేసే సంప్రదయ నృత్యం, తిరువత్తకాలి లోనూ విధిగా ధరిస్తుంటారు. వీటితో తయారైన ఆయుర్వేద తైలాలు ఇప్పుడు అంతర్జాల పుణ్యమా అని అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఈ దశ పుష్పాలను వివిధ తైలాలలోనూ , లేహ్యలలోనూ వాడడం కోసం ఇవి విరివిగా లభించే ఈ వానాకాలంలోనే సేకరిస్తారు. అందుకే మనం కొంచం చూసుకొని నడవాలి.

ఇంకా కొన్ని తీగలు నిండిన కాయలతో పసరు వాసనతో ఏపుగా పెరుగుతున్నాయి. అందులో అడవి పుచ్చకాయ( Stinking passion flower , love in a mist , wild water melon Passiflora foetida ) కూడా ఉంది. దూరం నుంచి చూస్తే బోడ కాకర కాయలు లాగా ఉంటాయి ఇవి. నిజానికి లోపల ఉన్న ఎర్రని పండ్లను కాపాడుకోవడానికి ఎక్కువగా పెరిగిన భాగం. ఇది తీగ మొక్క ముళ్ళ కంపలు చెట్లమీద పాకుతుంది దీనిని వైల్డ్ వాటర్ మెలన్ అని కూడా అంటారు. వీటిని పక్షులు ఇష్టంగా తింటాయి.

ఇంకా ముందు పోతున కొద్దీ పొలం గట్ల మీద రకరకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు తెల్లగా పాలిపోయి ఉంటే మరికొన్ని నల్లగా మాడిపోయి ఉన్నాయి. బహుశా వాళ్ళు గడ్డి మందు ఏమైనా వాడి ఉంటారా ..అనుకుంటూ దగ్గరికి వెళ్లి చూసాను . నిజమే వాళ్ళు గడ్డి మందు వాడారు. అందు చేతనే మొక్కలు పాలిపోయి , మాడి పోతూ నల్లగా ఉన్నాయి. మానవుడు కలిగించే విషాదానికి అంతే ఉండదనుకుంటాను . ప్రతీది నిమిషాల్లో అయిపోవాలి. ఇప్పుడు పెరిగిన కూలీల ఖర్చు , అందుబాటులో లేని పని వాళ్ళు మందు చల్లడానికి ఈ రైతులను గడ్డి మందు చల్లడానికి ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ చుట్టుపక్కల గట్లన్నీ ఇలా మాడిపోయిన మొక్కల్తోటే ఉన్నాయి . అంటే వీళ్ళంతా కలుపు మందు వాడి ఉంటారు. నా ముందున్నవన్నీ పత్తి చేలు , మొక్కజొన్న చేలు. మొక్కజొన్న చేను అయితే మొక్కజొన్న ఏక దళ బీజం కనుక ద్విదళ బీజపు మొక్కలను చంపే మందును , పత్తి, మిరప లాంటి పంటలు ద్విదళ బీజాలు కలిగిన మొక్కలు కనుక ఏక దళ బీజాపు మొక్కలను చంపే మందునూ వాడతారు. ఇలాటి మందులను ఎంపిక చేయబడిన కలుపుమందులు (Selective Herbicides ) అంటారు. ఇంకొన్ని కలుపు మందులు అన్నింటినీ చంపగలిగేవి ఉంటాయి. వీటిని ఎంపిక చేయనవసరం లేని కలుపుమండులుంటారు. ఒక్కో కలుపు మందు ఒక్కో విధంగా పని చేస్తుంది.దేనికి అదే ప్రత్యేకమైంది..అది పని చేసే విధానమూ , వాడే విధానమూ ప్రత్యేకమైనదే.

నాకు తెలిసినంత వరకూ భారత దేశంలో కలుపు మందు వినియోగించిన చరిత్ర ఏప్పుడూ లేదు. యాంత్రికంగా అంటే మనషుల చేతులతో తమ పంటకు పోటీ ఇచ్చే చెట్లను, మొక్కలను తీసివేయడం మాత్రమే మన వాళ్లకు తెలుసు. మన దేశంలో చిన్న చిన్న కమతాలు ఉండటం ఇందుకు కారణం కావచ్చు లేదా ఎటువంటి శాస్త్రీయ మైనటువంటి రసాయనాలను పంటల కోసం వాడటం అనేది అంతగా ప్రాధాన్యం లేని విషయంగా ఉండటం కావచ్చు. అంతకన్నా ఎక్కువగా అనవసరంగా దేనిని హింసించ కూడదని కావచ్చు .కానీ అప్పటికే రసాయన శాస్త్రంలోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి యూరోప్ దేశాలలో అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద కమతాలలో కలుపు మందులను వాడి ప్రధాన పంటకు అవసరం లేని మొక్కలను రసాయనాలతో తొలగించే పనికి పూనుకున్నారు. ఫ్రాన్స్లో మొదటిసారి కలుపు మందులు వాడినట్లు తెలుస్తున్నది . యూరప్లో తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అనేక రసాయన పదార్థాలు, కలుపు మందులుగా పనిచేసేటువంటి ప్రభావాన్ని పరిశీలించడం జరిగింది .

మన రాష్ట్రంలో నాకు తెలిసి ఉన్నంత వరకు జూలై 2018 నుంచి కలుపు మందుల అమ్మకం మీద నిషేధం, నియంత్రణ ఉంది. మన రాష్ట్రంలో గ్లైఫోసేట్ అనే గడ్డి మందును విస్తారంగాగా వాడతారు. ఇది అనేక రకాలుగా ప్రమాదకారి అని గుర్తించడంతో మన రాష్ట్రమే కాదు దేశ వ్యాపితంగా ఒక్క తేయాకు తోటలను మినహాయించి దీనిపై నియంత్రణ విధించారు. భారత ప్రభుత్వం పురుగు మందుల, కలుపు మందుల నిషేధం కొరకు 66 మందులను పరిశీలించి ,నిషేధించిన 18 రకాల పురుగుమందులలో గ్లైఫోసేట్ కూడా ఒకటి . ఒకవేళ ఈ మందు వాడటం తప్పని సరి అయితే అందుకు గాను అమ్మకం దారు వద్ద వ్యవసాయ శాఖ వారి అనుమతి పత్రం ఉంటేనే అ మందును రైతుకు అమ్మవలసి ఉంటుంది.అయినా సరే ఇక్కడి రైతులు కలుపుమందులు వాడారు . అన్ని రకాల మొక్కల మీద పనిచేసే కలుపు మందులను సాధారణంగా ఎక్కడైనా విపరీతంగా గడ్డి మొక్కలు వచ్చి రైల్వే కట్టల మీద సిగ్నల్ వ్యవస్థను ఆటంకపరిచే పరిస్థితులు ఉంటేనో , ప్రత్యేక సందర్బాలలోనూ కొనసాగించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది . ఇక్కడ రైతులకు కలుపు మందు దొరకం నాకు పెద్దగా ఆశ్చర్యమని అనిపించలేదు కాకపోతే ప్రభుత్వం ఇంతగా నియంత్రణ విధించింది అంటే అదేదో ప్రమాదకారి అయి ఉంటుందనే కనీస ఊహే రాని స్థితిలో రైతులు ఉండడం మనందరికీ చేటే కదా. మనం ఎలా మారి పోయామంటే మనకు అక్కరకు రానివన్నిటినీ తొలగించుకుంటూ పోవడానికే నిశ్చయించుకున్నాం కానీ ముందు వెనకలు చూసుకునే నిమ్మళమే లేకుండా పోయింది.

మధ్యాహ్నం కావస్తుంది. జీపు రిపేరు కాలేదు. ఎటూ తోచడం లేదు. వచ్చిన పని కానిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వెనక్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి కష్టమే. ఇక్కడ ఇతర ప్రయాణ సౌకర్యాలేమీ ఉండవు . కనీసం రెండు మూడు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తే గానీ మరో మార్గమేమీ లేదు.

మబ్బులు మెల్లిగా కూడుతున్నాయి. మబ్బుల వెనుక నుంచి సూర్య కిరణాల వెలుగు వాటి నలుపు దనాన్ని తేలిక చేసేలా మెరుస్తున్నది. కాలం కూడా చరిత్రలో నున్న చీకటిని మరపు అనే కాంతితో మసక బారుస్తుందేమో. కానీ కొన్ని సంఘటనలు మర్చిపోయినా, ప్రజలని మరపింపజేసినా వాటి తీవ్రత మాత్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు వియత్నాం యుద్ధం గురించి చెప్పడం సందర్భం అవునో కాదో గానీ ఏజెంట్ ఆరెంజ్ గురించి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. ఎంత చీకటి ఆవిష్కరణలు , ఎటువంటి పనులవి, నువ్వో నేనో ఒక్క విన్నపాన్ని మోసుకుతిరిగితే ఆగిపోయే విధ్వంసమా అది. ఉత్తర వియత్నాం కమ్యునిస్టుల ప్రోద్బలంతోనూ , దక్షిణ వియత్నాం అమెరికా సహకారంతోనూ దశాబ్ద కాలానికి పైగా కొనసాగించిన రెండో ఇండోచైనా యుద్ధం ( Nov 1, 1955 to April 30,1975)చరిత్రలోనే అతిపెద్ద పర్యావరణ ఘాతుక యుద్ధం అది. దాదాపు 20 మిలియన్ల గాలన్ల ( ఒక గాలను 3.785 లీటర్లకు సమానం ) కలుపు మందులను ఉత్తర వియత్నాం చిక్కని అడవుల మీద చల్లిన చీకటి దశాబ్దం అది. దీనికి అమెరికా దళాలు పెట్టుకున్న ముద్దు పేరు “ఆపరేషన్ రాంచ్ హ్యాండ్”. ఇలా కలుపు మందులు యుద్ధం కొరకు వాడడంలో అమెరికా మొదటిది కాదు. బ్రిటన్ , మలయా అత్యవసర పరిస్థితి కాలంలో చేసిన ప్రయోగాలూ ఇందుకు ప్రేరణ. అక్కడి అడవుల భౌతిక నేపథ్యం సైనిక దళాలకు అననుకూలంగా ఉండడం ఒక కారణమైతే చైనా ప్రేరిత ఉత్తర వియత్నాం గెరిల్ల యుద్ద తంత్రానికి అనుకూలంగా ఉండడం మరొక కారణం. ఈ ఆపరేషన్ రాంచ్ హ్యాండ్ ప్రణాళికలో భాగంగా ఆరు రకాల కలుపు మందులను తయరు చేసారు. వాటికి, అవి నింపబడిన డబ్బాల మీద వివిధ రంగులు వేసి ఆ రంగుల పేర్లతోనే పిలిచారు . ఏజెంట్ ఆరెంజ్, ఏజెంట్ గ్రీన్ , ఏజెంట్ బ్లూ , ఏజేంట్ పింక్, ఏజెంట్ గ్రీన్ , ఏజెంట్ వైట్, ఏజెంట్ పర్పుల్ వాటి పేర్లు. ఇంద్ర ధనుస్సు కలుపు నాశకాలని కూడా వీటికి పేరు. ఇందులో అత్యధికంగా ఏజెంట్ ఆరెంజ్ ను దాదాపు 13 మిలియన్ గాలన్లు వాడారు.ఈ మందులన్నీ వృక్షాల ఆకులు రాల్చేవే. ఏజెంట్ బ్లూ రసాయనం ఆహారపంటలను ఎండిపోయేలా చేసిది. అందువల్ల శత్రు సైనికులకు ఆహారం లభించకుండా చేయడం లక్ష్యంగా ఈ మందును పొలాల మీద ప్రయోగించారు. దాదాపు అయిదు లక్షల పంట పొలాలు దీని ప్రభావానికి గురయ్యాయి.ఒక్కో మందుది ఒక్కో దుర్లక్షణం. ఇప్పటికీ వియత్నాం ప్రజల ఆరోగ్యం మీద వీటి ప్రభావం ఉండడం ఇంకా గతం నుంచి వెంటాడుతున్న విష చరిత్రక వాస్తవం. ఈ మందులన్నీ తయారు చేసిన కంపెనీ మనకు బాగా తెలిసిన. తరచూ వార్తల్లో నానే మొన్సాంటో కంపనీ . అదే బీటీ పత్తి విషయంలో మనదేశంలో బాగా గుర్తింపు పొందిన అమెరికా కంపనీ . ఇంకా డౌ రసాయనాల కంపనీ కూడా.

కలుపు మందులుగా వాడేవి నిజానికి చెట్లను చంపే రసాయనాలు కాదు అవి కృత్రిమంగా సంశ్లేశించబడిన వృద్ధి నియంత్రకాలు ( హార్మోన్స్ ). స్వల్ప మోతాదులో తయారై శరీర ధర్మ ప్రక్రియల్నిఅత్యధికంగా ప్రభావితం చేసే హార్మోన్లు ప్రతోతి జీవి శరీరంలోనూ ఉత్పత్తి అవుతుంటాయి. అలా ఉత్పత్తి అయినప్పుడు వాటి మోతాదు శరీరానికి సరిపడినంతగా ఉండి జీవ క్రియలు సమతూకంలో ఉంటాయి. మన శరీరంలో ఎలాగైతే వివిధ హార్మోన్లు ఉంటాయో అలాగే మొక్కల్లో కూడా హార్మోన్లు ఉంటాయి . సాధారణంగా హార్మోన్ల ప్రభావం పెరుగుదలను సాఫీగా జరిగే ప్రమాణాన్ని నియంత్రిస్తే , మోతాదు మించితే అదే శరీరాన్ని దెబ్బతీసే విధంగా ప్రతి చర్య చూపుతాయి. అలా మొక్కల్లో పెరుగుదమను ప్రభావితం చేసే ఆక్సిన్ లు అనబడే హార్మోన్లు సమతూకంగా ఉంటే పెరుగుదలను ప్రోత్సహించి మోతాదు మించితే అందుకు విరుద్ధమైన ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే మొక్క , పెరిగిన కణవిభజన వల్ల ఏర్పడ్డ కొత్త కణాలకు , అంత స్వల్ప సమయంలో తగిన పోషకాలు అందించే స్థితిలో ఉండదు. అప్పుడు మొక్క ఆహారం తయారు చేసుకోలేక , తన జీవాన్ని పోషించుకోలేక ఆకుల్ని రాల్చేస్తుంది. తర్వాత పూర్తిగా మరణిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఉపయోగించి ఈ మందులన్నీ తయారుచేసి వాటిని మరింత హానికారకం చేసే ఇతర రసాయనాలను కూడా కలిపి వీటిని రూపొందించారు. ఈ విధంగా మొక్కలలో కణవిభజనను ప్రోత్సహించే ఆక్సిన్లు అనబడే హార్మోన్లను కలుపు నాశకాలుగా వినియోగించవచ్చుననే విషయం కనిపెట్టడం ఇలా శాస్త్రీయ పరిశోధనలను దుర్వినియోగం చేయడానికి మూల కారణం.

ఏజెంట్ ఆరెంజ మందును ఉపయోగించినందువల్ల నిర్వీర్యమైపోయిన అటవీ విస్తీర్ణం దాదాపు 31 వేల చదరపు కిలోమీటర్లు . ఇందుకు హెలికాప్టర్లని వినియోగించారంటే ఎంత భారీ ప్రణాళిక రచించబడిందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి యుద్ద తంత్రాన్ని విమర్శిస్తూ అమెరికన్ దళాలపై “మీరు అడవిని మాత్రమే నియంత్రించగలరు” ( Only you can prevent a Forest) అనే వ్యంగ ఛలోక్తి వాడుకలోకి వచ్చింది. అంటే అమెరికాదన్నుతో ఇటువంటి అనైతిక పరిస్థితులు సృష్టించి యుద్దాన్ని జయించాలని అనుకోవడం తమ సంకల్పాన్ని యే మాత్రం సడలించలేరని వైరిపక్షపు భావన. అత్యంత వినాశకరమైన ఈ రసాయనాల ప్రభావానికి గురైన వియత్నాం ప్రజలు ఈనాటికీ అనేక అనారోగ్య సమస్యలకు గురౌతున్నారంటే అందుకు కారణం వారు నివసించే ప్రకృతి విద్వంసం కావడమే. ఇక ప్రభావిత మానవేతర జీవం గురించి విచారించి ఏమి లాభం, అది చేజేతులా చేసుకున్న వినశానమేకదా! చేయకూడని పనిని తలుచుకోవడమూ , మిగుల్చుకోవడమూ తప్ప ఈ చరిత్ర పోగుట్టుకున్న వనరుల విలువను తిరిగి ప్రతిక్షేపించలేదు కదా !

రైతులు కలుపు మందులు వాడటం అలవాటుగా పెట్టుకుంటే వియత్నాం యుద్ధం కన్నా ఎక్కువ విషాదమైన పరిస్థుతులు ఎదురవుతాయి. కాకపోతే యుద్డంలో ఒక్కసారిగా వీచిన తుపాను అయితే రైతుల వినియోగం మెల్లగా తలకెక్కే విషం. ఈ మందులలో ఉన్న రసాయానాలు అనేక యేళ్ళ పాటు భూమిలో ఉండడం అత్యంత హానికారకం ఇంకా కేవలం ఋతువులలో మాత్రమే బతికే మొక్కలు కీటకాలు వాటి ఆధార భూతమయిన ఇతర జీవులు క్రమేనా ఉనికి కోల్పోయి అంతర్ధానం అవుతాయి. ఎందుకంటే ఈ వాన కాలంలో వచ్చే అనేక రకాల మొక్కలు ఆయా రుతువుల్లోనే జన్మించి తిరిగి విత్తనాలు తయారు చేసుకొని మరణించాలి తిరిగి రుతుకాలం వచ్చే వరకు ఎదురు చూడాలి. ఇలా మందులు వాడి ఋతువులోని పెరుగుదలను నియంత్రించడం వలన వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోలేవు ,వాటి జీవిత చక్రాల మధ్యలో ఆగిపోయి అనుసంధానమైన జీవులు మనలేవు. ఇక పూలు లేని కొమ్మలు , తుమ్మెదలు లేని పూలు , చిలకలు కొట్టలేని కాయలు, మట్టిని చేరని విత్తులు, మెత్తబడని నేల, ఒకదానికటి పెనవేసుకున్న బతుకులు తెగిన పూసల దండగా విడిపోతాయి. తాను పచ్చగా ఉండడం కోసం లోకమంతా ఎండబెట్టడం మానవునికే చెల్లింది. , ఇక ఒక్కొక్కటిగా జీవుల అంతర్ధానం మొదలై అది మన వరకూ వస్తుంది. రానున్నదనే సంకేతమే నేను నిలబడిన చోట మాడి పోయిన ఆకులతో నిలబడిన శవాలవంటి మొక్కలు ఇస్తున్న హెచ్చరిక.

శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగి విధ్వంస రచనకు పాలు పంచుకోవడం ఎంతో దురదృష్టకరమైన విషయం . దిగినా కొద్దీ లోలోతుకు కూరుకు పోయినట్లుగా , ఒక తెంపు లేని జీవనం సహస్రాబ్దాలు కొనసాగి ఇక్కడ ఈ చిన్ని మలుపులో కూలబడ్డట్టు, ఎటు పోవాలో తెలియని అనేక దారుల్ని చిక్కుముడులువేసి వాటి మధ్య దిక్కు తెలియని మన ప్రయాణం చతికిల పడనున్నట్టు ఒక గగుర్పాటు. నన్ను తాకుతున్న చల్లని గాలి కూడా గడ్డ కట్టి మానవాళి ఊపిరి బిగుసుకోనున్నట్టు సన్నని వణుకు. “హిట్లర్ని ఎందుకని ద్వేషించాలి..? గ్యాస్ చాంబర్స్ కట్టింది ఒక ఇంజనీరు, వాటిని డిజైన్ చేసింది ఒక రసాయన శాస్త్రవేత్త, బంధించిన వారిని వ్యంధులను చేసింది ఒక వైద్యుడు, ఆ పాలసీని నిర్ణయించింది ప్రభుత్వం , ఆమోదించినవారు ప్రజలు ,హిట్లర్ అమలు చేసినవాడు మాత్రమే, నైతికత లేని విజ్ఞానం , శాస్త్రీయత సృష్టించ గలిగిన మారణహోమానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే” అని జర్మనీ లో నాజీ కాంపు బారిన పడి తప్పించుకున్న ఒక బాలుడు అక్కడ నుంచి బయట పడి పెరిగి పెద్దవాడయ్యి చెప్పినమాటలు నాకెందుకో గుర్తుకువస్తున్నాయి. మనం కాక పోతే మన ద్వారా తెలిసీ జరుగుతున్న జీవ హననాన్ని మరి ఇంకా ఎవరు నియత్రించాలి , ఇంకెప్పుడు విజ్ఞాన విమర్శ చేసుకోవాలి.. ?

భద్రు పిలుపుతో ఒక భారపు నిట్టూర్పు విడచి ,వచ్చిన పని గురించి నిర్ణయం తీసుకునే పరిస్థితిని మా బృందంతో చర్చించాను. జీపు కదిలేలా లేదు , మరే మార్గమూ లేదు. అందుబాటులో ఉన్న గ్రామస్తులను అడిగి వారి వద్ద ఉన్న ట్రాక్టర్ని సహాయం కోసం అడిగాము . జీపును ట్రాక్టర్ కు కట్టి నర్సంపేట దగ్గరరలో ఉన్న మెకానిక్ వద్దకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసాము. ఇంత సమయం గడిచినా వచ్చిన పని కాలేదు. రేపటికి కార్యక్రమం ఇదివరకే ఏర్పాటు చేసి ఉంది కనుక
ఈ బీటు మరొక రోజు సందర్శించవలసి ఉంటుంది. బయలు దేరుతున్నాము. బురద బురదగా ఉన్న పొలం దారి దాటాక మేము కూడా ట్రాక్టర్ మీదనే వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. మొక్కజొన్న చేను నిండా చిన్న చిన్న మొక్కలు. బహశా ఈ రైతు ఇంకా కలుపు మందు చల్ల లేదేమో .. హమ్మయ్య ఈ ఏడాదికి వీటికి గండం గడిచినట్టే..చేను దగ్గర నిలబడి పాడైన జీపుతో సహా ఫోటో తీసుకోవాలని అనుకున్నాం.పాతికేళ్ళ తర్వాత ఈ పొలం గట్టు ఎలా మారనుందో… పిల్లగాలి వీస్తున్నది. మా అడుగుల కింద అక్కరలేవు అని పేరుబడ్డ మొక్కలు కొన్ని నలగక తప్పడం లేదు… నేను క్షమించమని అడుగుతూ జీపు వైపు వెళ్లిపోతున్నాను..

దేవనపల్లి వీణావాణి

అరణ్యం -5 భాగం  వృక్ష సాక్ష్యం – దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

2 Responses to అక్కర్లేని మొక్కలు(అరణ్యం -6)-దేవనపల్లి వీణావాణి

  1. వర్ధిని రమేష్ says:

    మంచి కాలమ్ మేడం..చాలా విషయాలు తెలుస్తున్నాయి…మీకు చాలా ధన్యవాదాలు అండి

  2. సరోజ says:

    మంచి సమాచారం అందించారు..వీణావాణి గారు
    మీకు ధన్యవాదాలు..