ఇదే హేలాపురి* (కవిత )-వెంకట్ కె

అయ్యాలరా..!ఇదే హేలాపురి
వేంగీ ప్రభుల రాజధాని
కవివరేణ్యుల పుట్టినిల్లు
ఆదికవి నన్నయాదులు నడయాడిన ప్రదేశమిది
ఎంకిపిల్ల కొంటె చూపులతో
అమృతంబు కురిసిన రాత్రుల్లో
చిలకమర్తి అడుగుజాడల్లో
సంఘ సంస్కరణాభిలాషతో
ముందుకు నడిచే నవ చైతన్యంతో
విప్లవ వీరుడు అల్లూరి
విద్యావేత్త దంతులూరి
అడవిబాపి రాజుల సాహిత్య సేవలో
యర్రాప్రగడ వైద్యంలో వెలుగొందుతూ
కొల్లేటి అందాలతో
గోదావరి సోయగాలతో
పాపికొండల అభయారణ్యంతో
ఆంధ్రుల జీవనాడి
పోలవరంతో పట్టిసీమ పరవళ్ళతో
పచ్చని పైరుల తివాచీలా
ఆంధ్రదేశ అన్నపూర్ణగా
సుందరగిరి ఆరామాలతో
పారిజాత పరిమళాల గిరి పారిజాతాగిరి
ఎర్రకాలవ జలాశయదరినున్న
మద్ది తొర్రలో వెలిసిన
అంజనీపుత్రుని కాపుదలతో
క్షీరారామలింగేశ్వర నారసింహులు
కొలువై ఉండగా
అలల తరంగాల పేరుపాలెం
మేరీమాత కటాక్షంతో
గోష్పాదక్షేత్ర మహిమలతో
వాసవీమాత నిలయంగా
నిర్మలగిరి మహోత్సవాలతో
అత్తిలి జైనాలయాలతో
జానపదాకళలకు నిలయంగా
సినీదిగ్గజాలకు నెలవై
కీర్తినందుకుందీ పచ్చని పశ్చిమగోదావరి

                                                                             -వెంకట్ కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“`

కవితలుPermalink

One Response to ఇదే హేలాపురి* (కవిత )-వెంకట్ కె

  1. రాజేశ్వరి వాసు దేవ్ says:

    పశ్చిమ గోదావరి గొప్పతనం మీ అక్షరాల్లో సూపర్ గా ఆచెప్పారు వెంకట్ గారు