భారత స్వాతంత్య్రోద్యమం – ముస్లిం మహిళలు

సయ్యద్‌ నసీర్అహమ్మద్‌

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి,నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్దంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. లక్షలాదిప్రజానీకం ఒకే నినాదం, ఒకే లక్ష్యం కోసం ఒకే బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.      ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జన సమూహాలతో మమేకమై స్వాతంత్య్రసమరంలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన బలిదానాలతో  భారతీయ  ముస్లింలు  పునీతులయ్యారు. అయినప్పటికీ ముస్లిం సమాజం త్యాగమయ చరిత్ర పలు కారణాల మూలంగా మరుగున పడిపోయింది.
బ్రిటీష్‌ పాలకులు తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు  విభజించు-పాలించు  అను కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను  మతం పేరుతో  హిందువులు- ముస్లింలుగా విభజించటంలో కృతకృత్యులయ్యారు.

           ఆ తరువాత భారత విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ సందర్భంగా జరిగిన దారుణాలు, పొరుగుదేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు, వివాదాలు స్వాతంత్య్రోద్యమ కాలంనాటి హిందూ – ముస్లింల ఐక్యతకు చిచ్చుపెట్టాయి. భారత విభజనానంతర పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయబడిన ముస్లిం సమాజం సుషుప్తావస్థలోకి నిష్క్రమించింది. యుద్ధాలు, వివాదాలు, దేశంలో తరచుగా సాగిన మత కలహాలు మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య మానసిక విభజనకు కారణమయ్యాయి.

              ప్రజల మత మనోభావాలను రెచ్చగొట్టి మతం పేరుతో మనుషులను చీల్చి, రాజకీయ ప్రయోజనాలను సాధించదలచిన మతోన్మాద రాజకీయశక్తులు, వ్యక్తులు ఈ చీలికను అగాధంగా మార్చాయి.  పర్యవసానంగా  బ్రిటీషర్ల బానిసత్వం నుండి మాతృ భూమిని విముక్తం చేసేందుకు  సాగిన  సుదీర్ఘ పోరాటచరిత్రలో  ముస్లిం  సమాజం త్యాగాలు మరుగున పడిపోయాయి.

                   ప్రజలకు చేరువకాని సమాచారం

   చరిత్ర గ్రంథాలలో ముస్లింలు చాలా వరకు కన్పించరు. ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి త్యాగాలు, సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడ్డాయి. ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాధలు సరైన స్థానం పొందలేకపోయాయి.  ఆయా కథనాలు సామాన్య చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్య పుస్తకాలలోగాని చోటు చేసుకోలేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు అమూల్య సమాచారం అందకుండా పోయింది.

                చరిత్ర  ద్వారా  తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళా రూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముస్లింల శ్లాఘనీయ చరిత్రలు కథా వస్తువు కాలేకపోయాయి. ఆ కారణంగా ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత  సంఘటనలు జనబాహుళ్యంలోకి  వెళ్ళకపోవటంతో ఆ తరువాతి తరాలకు ఆ విషయాలు అందలేదు. ఈ పరిణామాలే భారతదేశంలోని హిందూ- ముస్లిం జనసమూహాల మధ్య మానసిక ఎడం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి.

               ఈ  అగాధాన్ని మరింత పెంచి ఒక సాంఘిక  జనసమూహానికి తామే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్న శక్తులు-వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి.

పురుషులకు దీటుగా  మహిళలు

ఈ సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. ఆ త్యాగాలు కూడా పలు కారణాల మూలంగా  మరుగున పడిపోయాయి. మతపరమైన ఆచార సంప్రదాయాలు ముస్లిం మహిళలను గడప దాటనివ్వవన్న అపోహల మూలంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్ర వైపు దృష్టి సారించటమే గగనమైపోయింది.  చరిత్రకారుల అన్వేషణకు స్వాతంత్య్రోద్యమంలో  ముస్లిం మహిళల పాత్ర వస్తువు కాలేకపోయింది. ఆ కారణంగా  విముక్తి పోరాటంలో ముస్లిం మహిళల అరుదైన పాత్ర చరిత్ర పుటలలో బందీగా మిగిలిపోయింది.
మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ముస్లిం మహిళలు ఆత్మబలిదానానికి సిద్ధపడిన దృష్టాంతరాలున్నాయి. విముక్తి పోరాట మైధానంలో శత్రువును సవాల్‌ చేసిన వీర వనితల చరిత్రలున్నాయి. సాహసోపేత సంఘటనలున్నాయి. ఆ సంఘటనలన్ని చరిత్ర అట్టడుగు పొరల నుండి బయటపడలేక పోయాయి.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో…

ప్రథమ స్వాతంత్రసమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ఆత్మార్పణలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో ప్రముఖులు అవధ్‌రాణి బేగం హజరత్‌ మహాల్‌. బ్రిటీష్‌ పాలకులు కుయుక్తులతో ఆమె భర్త నవాబ్‌ వాజిద్‌ అలీషాను అరెస్టు చేసి అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిటీష్‌ సైన్యంపై విరుచుకుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. పదమూడు సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను ప్రజలను ఐక్యపర్చారు. పరిపాలనలో హిందూ-ముస్లింలకు సమాన స్థాయి కల్పించారు. బ్రిటీష్‌ సైనికదళాల పడగ నీడలో కూడా ఎంతో సాహసంతో 14 మాసాల పాటు బ్రిటీష్‌ వలస పాలకుల ఎత్తులను చిత్తుచేస్తూ, సమర్థ్ధవంతమైన పాలన సాగించారు. బేగంపై కత్తి గట్టిన బ్రిటీష్‌ పాలకులు అవధ్‌ను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏమాత్రం అధైర్యపడక ఆమె స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దళాలను ముందుకు నడిపి వీరోచితంగా పోరాడారు. భారీ సంఖ్యతో చుట్టుముట్టిన బ్రిటీష్‌ సైనికమూకలను

ఎదుర్కొనటం కష్టతరమైన తరుణంలో, తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధరంగం నుండి వైదొలిగి  నేపాల్‌ పర్వతాల్లోకి నిష్క్రమించారు. ఆ అడవుల్లో నానాసాహెబ్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా లాంటి యోధులను కలసి బలగాలను మళ్ళీ సమీకరిస్తూ, 1879లో నేపాల్‌ అడవుల్లో సామాన్య మహిళగా కన్నుమూశారు.

 ప్రథమ స్వాతంత్య్ర సమరంలో బేగం బాటన నడిచిన మహిళలు పలువురున్నారు. చరిత్ర పుటలు మనకు పలువుర్ని పరిచయం చేస్తాయి. ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ఒకరు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆమె ప్రభుభక్తి పరాయణురాలు. కాన్పూరు అధినేత నానాసాహెబ్‌ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే ఆమె కూడా యుద్ధరంగ ప్రవేశం చేశారు. స్వయంగా శత్రుసైన్యాలను ఎదుర్కొన్నారు. సైనిక పటాలాలను, గూఢచారి దళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటుచేసి నానాసాహెబ్‌ పోరుకు ఎంతగానో తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధభూమిలో గాయపడి శత్రువు చేత చిక్కారు. శత్రువు క్షమాభిక్ష ప్రకటించినా, తనకు ప్రాణం కంటే మాతృభూమి విముక్తికై సాగుతున్న పోరాటం  ప్రధానమని ప్రకటిస్తూ, బ్రిటీష్‌ తుపాకి గుండ్లకు ఎదురు నిలిచి వీరమరణం పొందారు.

 అజీజున్‌ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియదు. ఆమె ఎల్లవేళల ధరించే పచ్చరంగు దుస్తుల వలన ఆమె పచ్చరంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటీష్‌ సైనికదళాలలో భయోత్పాతం సృష్టించారు. గాయపడిన తరువాత గాని పట్టుబడని ఆమెను అంబాలాలో గల బ్రిటీషు సైనిక స్థావరానికి పంపారు. ఆమెను అంబాల పంపుతూ, ఈ వృద్ధురాలు బహు ప్రమాదకారి…జాగ్రత్త, అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి పంపి, ముందు జాగ్రత్తల గురించి హెచ్చరించారంటే ఆ పచ్చదుస్తుల మహిళ ఎంతటి ఘటికురాలో మనం ఊహించవచ్చు.

 ఈ విధంగా శత్రువును సాయుధంగా ఎదుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దళాలను ప్రోత్సహించినవారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఎందరో ఉన్నారు.  ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడా  లెక్కచేయని సాహసి హబీబా బేగం,  ఝూన్సీ రాణి వెన్నంటి నిలచి పోరాడి ప్రాణాలర్పించిన ముందర్‌, బ్రిటీషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధుల క్షేమం కోరుతూ సజీవదహనమైన అస్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను  నిలువరించిన బేగం జవిూలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా తదితరులు ఎందరో ఉన్నారు.

చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఘిక జనసముదాల తోపాటుగా వందలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డారు. సజీవ దహనమాయ్యారు. ఉరితీయబడ్డారు. అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ మేరకు ఆ సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.

-సయ్యద్‌ నసీర్ అహమ్మద్‌

వచ్చే సంచికలో  ….

జాతీయోద్యమంలో ముస్లిం స్త్రీల పాత్ర

 

Uncategorized, , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో