3. స్నేహితుల ఒత్తిడి (పీర్ ప్రెషర్)
ఎంజాయ్చేద్దాం
పీర్ గ్రూపులు అంటే సుమారుగా ఒకే వయసు వున్న స్నేహబృందం. ఈ బృందం సభ్యులు ఒకే క్లాసులో కలిసి చదువుకునే వారు కావచ్చు లేక కలిసి ఆడుకునేవారు అవవచ్చు, ఒకేచోట పనిచేసేవారు అవవచ్చు. ఒకేచోట కలిసి వుండే వారు అవవచ్చు.
పీర్ గ్రూపుల సభ్యులకు ఒకే ఆసక్తులు, ఒకే హాబీలు, ఒకే విలువలు వుండవచ్చు. జీవితంలో జరిగే వాటి పట్ల ఒకే దృక్పథాలు వుంటాయి. ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు సంతోషంతో, సంతృప్తితో జీవిస్తారు.
కౌమార బాలల శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మీద పీర్ గ్రూప్‌కి సానుకూల ప్రభావం వుండొచ్చు లేక ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.
పీర్ గ్రూప్ సానుకూల ప్రభావాలు
* పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్ళి అన్ని కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటారు.
* చదువులో మంచి ఫలితాన్ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు.
* మంచి హాబీలను అభివృద్ధి చేసుకుంటారు.
* కొన్ని విలువలను, లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి దారి తీసే అభిప్రాయాలను అభివృద్ధి చేసుకుంటారు.
ఉదా: ‘పొగత్రాగకూడదు’, ‘కాపీ చెయ్యగూడదు’ ‘కలక్టర్ అవాలి’, ‘పేదవారిని గౌరవించాలి’ మొదలగునవి.
* తమ జీవితం తాలూకు నిర్ణయాలను తీసుకోవడానికి ఎక్కువ స్వతంత్రం కలిగి ఉంటారు.
* తాము చేసే పనులకు గ్రూపు ఆమోదం వుండడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
* స్వతంత్రంగా వ్యవహరిస్తూనే, ఒకరి ఆసరా తీసుకోవడానికి, తను మరొకరికి ఆసరా నివ్వడానికి సిద్ధంగా వుంటారు.
ప్రతికూల ప్రభావాలు:
* పాఠశాలకు వెళ్ళకుండా స్నేహ బృందంతో కలిసి సినిమాలకు, షికార్లకి వెళ్ళడం,
* డబ్బుని, సమయాన్ని వృథా చెయ్యడం.
* స్నేహితులతో కలిసి ఇంటి నుండి పారిపోవడం
* తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దవారిని ఎదిరించడం, లక్ష్యపెట్టక పోవడం, హేళన చెయ్యడం, సమంజసం కాని కోరికలు కోరడం, వ్యాఖ్యలు చెయ్యడం
* అత్యంత ప్రమాదకరమైన ప్రవర్తనలని అలవరచుకోవడం :
– పొగ తాగడం,
– మత్తు మందులు, మద్యం వ్యసనం,
– జూదమాడడం,
– దొంగతనాలు చెయ్యడం
– పిరికిగా, బలహీనంగా కనిపించేవారిని రేగింగ్ చెయ్యడం
– ఈవ్ టీజింగ్ చెయ్యడం
– ఎవరితోపడితే వారితో లైంగిక సంబంధాల్ని పెట్టుకోవడం
– పబ్లిక్ ఆస్తుల్ని ధ్వంసం చేయ్యడం
– మానభంగం, హత్య మొ||
ఒక స్థాయిలో స్నేహితుల ఒత్తిడి లేక ‘పీర్ ప్రెషర్’ కారణంగా చేసే చెడు పనులు తరువాత అలవాటుగా మారతాయి.
‘పీర్ ప్రెషర్’ ని తట్టుకోవడమెలా?
కౌమార బాలలు పీర్ప్రెషర్ గురించి తెలుసుకుని వుండాలి. దీర్ఘ కాలంలో హాని కలిగించే ప్రతికూల ప్రవర్తనల విషయంలో స్నేహితుల ఒత్తిడికి ‘నొ’, ‘వద్దు’, ‘కాదు’ అని దృఢంగా, స్థిరంగా చెప్పగల నైపుణ్యా లను పెంపొందించుకోవాలి.
‘ఆమోదయోగ్యమైన’ మరియు ‘ఆమోదయోగ్యం కాని’ ప్రవర్తనల పరిణామాలను గుర్తించి తమకు తాము ఒక ‘మౌలిక విలువల వ్యవస్థ’ను ఏర్పరచుకోవాలి.
చాలామంది కౌమార బాలలకు తమ కుటుంబం, సంస్కృతి, విశాల సమాజానికి సంబంధించిన మంచేదో, చెడేదో తెలుసు. సరదా లేక తమాషా కోసం చేసే పని ఏ ప్రమాదానికి దారి తీస్తుందో, ఏ హానిని కలగజేస్తుందో వారు గుర్తించడం అవసరం.
స్వీయ అవగాహన, విచక్షణతో కూడిన ఆలోచన దృఢంగా వుండడానికి, స్నేహితుల ఒత్తిడికి ‘నొ’ అని స్థిరంగా చెప్పేందుకు గట్టి నిర్ణయం తీసుకోవడానికి దోహద పడుతుంది.
స్నేహబృందంతో స్నేహాన్ని పొగొట్టు కోకుండానే ‘నొ’ అని చెప్పేందుకు మంచి సంభాషణా చాతుర్యం లేక భావవ్యక్తీకరణ నైపుణ్యం వుండాలి.
‘స్నేహం’ అంటే తన స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు అని గుర్తించాలి.
కౌమారబాలలు ఆనందాన్ని వాయిదా వేసుకోవడం నేర్చుకోవాలి.
ప్రమాదకర ప్రవర్తనలకు ‘నొ’ అని చెప్పడం కూడా నేర్చుకోవాలి.
9. బాలలపై లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు
బాలలపై లైంగిక వేధింపులు
నిర్వచనం : వివిధ పరిస్థితులలో, సందర్భాలలో ఒక బాలిక లేక బాలుడిపై చూపే అవాంఛిత లైంగిక ఆసక్తి లేక అమలయే లైంగిక ప్రవర్తనను లైంగిక వేధింపుగా పరిగణించవచ్చు.
లైంగిక వేధింపులకు ఉదాహరణలు :
మాటలు :
1.సెక్సువల్ అర్ధాల్ని సూచించే జోక్స్, కామెంట్స్, సెక్సువల్ వ్యాఖ్యలతో కించపరచడం.2.ప్రత్యక్ష / పరోక్ష లైంగిక చొరవ తీసుకుంటూ మాట్లాడడం. 3.ఒకరి శరీరంపై లేక దుస్తులపై అసమంజసమైన వ్యాఖ్యలు చెయ్యడం. 4.అసభ్యకరమైన ఫోన్‌కాల్స్ చెయ్యడం. 5.ద్వందార్ధాలతో మాట్లాడడం
మాటలతో కాకుండా ఇతర రకాలుగా వేధింపు :
1. ఒకరి కదలికలపై నిరంతర నిఘా. 2. లైంగిక సూచనలు వుండే రాతల్ని లేక బొమ్మల్ని గోడలవిూద, బోర్డు విూద రాయడం. 3. ఓరచూపులు, కన్నుకొట్టడం. 4.నీచమైన శబ్దాలు చేయడం, సెక్సువల్ అర్ధం వచ్చే సైగలు చేయడం. 5.బహిరంగంగా జననాంగాన్ని చూపడం, జననాంగాల్ని రుద్దుకోవడం, ప్రదర్శించడం. 6. సెక్సువల్ సూచనలున్న బొమ్మలు, వస్తువులు మొదలైనవాటిని అసభ్యంగా ప్రదర్శించడం. 7.లైంగిక / బూతు మాటల్తో ఆకాశరామన్న ఉత్తరాలు రాయడం. 8. ఒకవ్యక్తి విూద సెక్సువల్ రూమర్లు ప్రచారం చెయ్యడం.
శారీరక వేధింపు :
లైంగిక స్వభావం వున్న స్పర్శ, గిచ్చడం, తట్టడం, అవతలి వ్యక్తి చెక్కిళ్ళను, పెదవులను, రొమ్ములను,
మర్మాయవాలను రుద్దడం మొదలైన అనవసరమైన, అవాంఛితమైన భౌతిక చర్యలు.
– డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)
(ఇంకా వుంది )