జ్ఞాపకం-45 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

“నీ మౌనం చూస్తుంటే నీకో మాట చెప్పాలనిపిస్తుంది. ఒక్క కన్నీటి చుక్క కింద రాలేముందు అది రాలేది దేని కోసమో! దానికంత అర్హత వుందో! లేదో! ఆలోచించాలి” అన్నాడు నవ్వుతూ.
ఆయన ఎప్పుడైనా అంతే! నవ్వుతూనే మనసు లోతుల్లోకి చూస్తాడు. గంభీరంగా మాట్లాడుతాడు. కలవరపాటు కలిగేలా మాట్లాడుతాడు. ఒక్కోసారి ‘ఇదేలా సాధ్యం ఈయనకి?’ అని ఉలిక్కి పడటం కూడా జరుగుతుంది సంలేఖ.
అందుకే సంలేఖ వెంటనే “నలకే మాస్టారూ!” అంటూ తన కాటన్ చున్నీతో కళ్లను అద్దుకుంది.
బస్ ఆదిపురి రాగానే ఆగింది.
సంలేఖ, భరద్వాజ బస్ దిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు.
ఈ లోపల హాస్టల్ కెళ్లిన హస్విత సంలేఖ కన్పించకపోవడంతో కంగారుపడింది. చాలా సేపు వెదికింది. ఇక ఆగలేక ఆ రాత్రికి సంలేఖ అన్నయ్య రాజారాం సెల్ ఫోన్ కి కాల్ చేసింది.
ఆయన “చెల్లెలు ఇంటికొచ్చింది. నువ్వేం భయపడకు హస్వితా !” అని ఫోన్లో చెప్పాడు.
అది వినగానే వూపిరి పీల్చుకుంది హస్విత.

రోజులు గడిచిపోతున్నా…. ఊరు వెళ్లిన సంలేఖ తిరిగి కాలేజీకి రాలేదు.
సంలేఖను, ఆమె తండ్రి రాఘవరాయుడును కాలేజి మేనేజ్ మెంట్ పిలిపించింది.
వాళ్లను కూర్చోబెట్టి “చూడండి! రాఘవరాయుడు గారు! పిల్లల్లో ఇవాళ, రేపు చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరు ఎలా మారిపోతారో తెలుసుకోలేకపోతున్నాం! మీ అమ్మాయి గురించి మీరు పట్టించుకోవాలి. ఇంట్లోనే వుంచుకుంటే చదువెలా వస్తుంది? చదువుకోవాలనేగా కాలేజీలో చేర్పించారు. అన్నిటికీ ఒకే మంత్రం అన్నట్లు మీ అమ్మాయి ఎప్పుడు ఇంటికొచ్చినా హెూం సిక్ అనుకుంటే ఎలా?” అన్నారు చాలా నెమ్మదిగా.
మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు రాఘవరాయుడు. సంలేఖ కొద్దిగా తల వంచుకుని చేతి వేళ్లవైపు చూసుకుంటోంది.
వాళ్లలో ఒకరు రాఘవరాయుడి వైపు చూసి “మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి రాయుడు గారు! ఒక చిన్న పిల్లాడు తను ఎగరేసిన గాలిపటం పైకి వెళ్తుంటే ఎలా ఆనందిస్తాడో మేమూ అంతే! మా విద్యార్థులు చదువులో పై స్థాయికి వెళ్తుంటే చూసి సంతోషిస్తాం! లేకుంటే దారం తెగిన గాలి పటాన్ని చూసి ఆ పిల్లాడు బాధపడినట్లే మేము కూడా ‘అయ్యో ! మా విద్యార్థి చెడిపోతున్నాడే !’ అని విలవిల్లాడుతాం. ఒక అక్షరం వెనుక పెన్ను, ఒక అల వెనుక సముద్రం ఎలా వుంటాయో మేమూ మా విద్యార్థుల వెనుక వుంటాం. అందుకే ఎవరు ఎలా చదువుతున్నారో మాకు వెంటనే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఇది రెసిడెన్షియల్ కాలేజీ కావటం వల్లనే ఇంత జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది” అంటూ వాళ్ల గురించి, వాళ్ల కాలేజీ గురించి రాఘవరాయుడుకి అర్థమయ్యేలా చెప్పాడు.
“పిల్లలకి మా భయమే కాదు. మీ భయమూ వుండాలి రాయుడు గారు! లేకుంటే భవిష్యత్తును నాశనం చేసుకునే సమస్యల్లో ఇరుక్కుంటారు” అన్నారు.
అప్పుడు నోరెతాడు రాఘవరాయుడు.
“మా సంలేఖ అలాంటి అమ్మాయి కాదు సార్! పెద్ద వాళ్ల మాట పట్ల గౌరవం, భయం వున్నాయి. కాకపోతే ఒంట్లో నలతగా వున్నట్లుంది. రోజంతా పడుకొని లేవలేక పోతోంది. మేము కూడా ఏమీ అనటం లేదు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనీయ్! అనుకున్నాము. అంతే !” అన్నాడు.
“అలా అయితే చదువులో వెనకబడిపోతుంది. మాకు మీ అమ్మాయి పట్ల వున్న నమ్మకంతోనే ఫీజు కన్ సెషన్ కూడా ఇచ్చాం. మా కాలేజీకి ర్యాంక్స్ రావాలి అంటే మాకు మీ అమ్మాయి లాంటి వాళ్లు కావాలి. శారీరకంగా, మానసికంగా పిల్లల్ని బలవంతుల్ని చెయ్యటంలో తల్లి, తండ్రుల పాత్ర కూడా వుంటుంది. మీరామెతో నెమ్మదిగా మాట్లాడి చూడండి !” అన్నారు.
రాఘవరాయుడు చాలా వినయంగా “అలాగే ! సార్ ! ” అన్నాడు.
ఆయనకి ఇన్ని రోజులు తిలక్ దిగులే వుండేది. ఇప్పుడు దానికి తోడుగా సంలేఖ ఆలోచన కూడా తోడైంది. కానీ ఎందుకో! ఏమో! ఆమె ముఖం చూస్తుంటే చిన్న మాట కూడా అనాలనిపించడం లేదు. తిలక్ నైతే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు. 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.