మానవత్వాన్ని తట్టిలేపిన సరికొత్త వేకువ..కథాసంపుటి (పుస్తక సమీక్ష )-డా. సమ్మెట విజయ

అణకువ, వినమ్రతకు నిలువెత్తు రూపం కోసూరు ఉమా భారతి. సరికొత్త వేకువ కథల సంపుటి రచయిత్రిగా ఉమాభారతి కథలు చదివిన వారు ఆమె మంచితనానికి , సమున్నత వ్యక్తిత్వానికి , కళాభిమానానికి, సమాజసేవకు తలవంచి సరికొత్త వేకువను వీక్షిస్తారు.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 71 వ ప్రచురణగా 2018 మేలో ప్రచురించబడిన ఈ పుస్తకం 176 పేజీలతో 10 కథలతో సరికొత్తగా రూపుదిద్దుకుంది. ప్రముఖ రచయిత్రి, అనువాదకులు , సంపాదకురాలు భావరాజు పద్మిని , ప్రముఖ రచయిత సత్యం మందపాటి ఈ పుస్తకానికి ముందు మాటను రచించారు. పుస్తకం కూర్పుకు సహకారం అందించారు జె.వి. పబ్లికేషన్స్ జ్యోతి వలబోజు గారు.

కోసూరు ఉమాభారతి హ్యూస్టన్ లో అర్చనా డాన్స్ అకాడమీ స్థాపించారు. శాస్త్రీయ నృత్య గురువుగా ప్రస్తుతం కూచిపూడి శిక్షణాలయాన్ని నడిపిస్తున్న కోసూరు ఉమాభారతి వ్యక్తిగా అందరి మనసులలో ఒక నాట్యకారిణిగా తన ముద్రను వేసుకున్నారు.విదేశీ కోడలు , రాజీపడని బంధం , ఎగిరే పావురమా , వేదిక కోసూరి ఉమాభారతి గారి ఇతర రచనలు.

సరికొత్త వేకువ నాలుగవ రచన. ఒక నృత్య కళాకారిణి రచయిత్రిగా మారి నటన , హావభావాలనుంచి కథలలోని పాత్రలను పలకించడం నిజానికి పెద్ద సాహసం. నాట్య దృక్పథం నుంచి కథాకథనం వైపుకి మారి రెంటికీ న్యాయం చేయడం కత్తిమీద సాము. సర్వకళల సమాహారమైన ఉమాభారతి చాలా సులువుగా కథలలో పరకాయ ప్రవేశం చేసి కథలు నడిపించిన తీరు అద్భుతం . ముందుమాట రచించిన రచయితలు చదివిన పాఠకులు అచ్చెరువొందే రీతిలో ఒక చేయి తిరిగిన రచయిత్రిగా తనను తాను మలుచుకుని రచనలు చేసిన ఉమాభారతి గారు అభినందనీయులు.
ఉమాభారతి గారి గురించి తెలిసిన కొద్దిపాటి సమాచారంతో ఈ పుస్తకంలోకి తొంగి చూసిన నాకు ఒక్కొక్క కథ మానవ విలువలని పెంచే దిశలో మనలో ఒక ఉదాత్తమైన వ్యక్తిత్వం అలవరచుకోమని ఉద్భోదిస్తూ చేసిన రచనల్లా అనిపించాయి. ప్రతి కథలో కరుణ, ప్రేమ, మాతృత్వం , కుటుంబం పట్ల అభిమానం , దేశం పట్ల భక్తి , సమాజ సేవ పట్ల తృష్ణ పరవళ్లు తొక్కుతూ మనల్ని ముందుకు నడిపిస్తాయి.

నా మాట అంటూ ఉమాభారతి స్వామి వివేకానంద అన్నట్టు “అనుభవాల క్రమమే జీవితం . అనుభవమే గురువు”అని చెప్తూ తన నిత్యజీవితం అనుభవాల్లో తాను చూసినవి తన అనుభవంలోకి వచ్చిన విషయాలను కథలుగా మలిచినట్లుగా పేర్కొన్నారు.

సత్యం మందపాటి గారు ఉమాభారతి తీసుకున్న కథాంశాలు తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలను తీసుకుని సీరియస్ గా రచించారని ,మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను ఒక బాధ్యతగా తీసుకుని చూపించారని , నిజాయితీతో కూడిన ఆమె కథలు ఆద్యంతం చదివిస్తాయని ప్రశంసించారు.

భావరాజు పద్మిని గారు “ కథనుంచి కళ్ళు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే శైలి అడుగడుగునా రత్నాల్లా పొదిగిన మానవీయ విలువలు , మనసుని హత్తుకొని , మనలోని మనీషిని తట్టి లేపి మనల్ని కమ్మేసే ఉద్వేగ కెరటాలు, సమున్నతమైన జీవన సరళి , సేవ ద్వారానే ఆత్మానందాన్ని పొందగలమనే అంతర్లీనమైన సందేశం , అన్నింటినీ అత్యంత నైపుణ్యంతో తన అక్షరాల్లో నింపేసారు ఉమగారని చెప్తూ సరికొత్త వేకువ కథాసంపుటి సమాజానికి సరికొత్త వేకువని పేర్కొంటూ ఒక్కొక్క కథ ఒక మాణిక్యం అంటూ ఆయా కథల్లో ప్రత్యేకతలను తెలియజేసారు.
ఈ కథాలంపుటిలో మొత్తంగా పది కథలు. మొదటి కథ పుత్తడి వెలుగులు. కుటుంబ నేపథ్యంలో కుటుంబసభ్యుల తోడ్పాటు అవసరమైనప్పుడు ఒకరికొకరు అండదండగా నిలవడం, కష్టం వచ్చినప్పుడు సమస్య అనిపించినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఉండటం వంటి అంశాలను మాటలురాని ఒక చిన్న పాపను తీసుకుని ఆమెచుట్టూ కథను మలిచిన తీరు ఈ కథలో ఎంతగానో ఆకట్టుకునే విషయం.కథాంశం బయటినుంచి చూసేవారికి చిన్నదిగా అనిపించినా అనుభవించిన కుటుంబసభ్యుల పరంగా నడిపించడంతో భావోద్వేగాలు స్పష్టంగా చూపించగలిగారు పుత్తడి వెలుగులు కథలో. కథనంతో పాటు కుటుంబజీవన విధానం వసంత పాత్రకు సరైన సమయంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సీతమ్మ పిన్ని తోడ్పాటు ..మతసామరస్యం , సంగీతం పట్ల ఆరాధన , మంచి జరగాలని కోరుకోవడం , మంచి జరుగుతుందనే నమ్మకాన్ని స్థిరంగా పెంచుకోవడం ఫలితంగా వారి కుటుంబంలోని ఆవేదన తొలగిపోవడం అనే విషయాన్ని చూపించడం ద్వారా మనకు ఏదైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు పాజిటివ్ దృక్పథం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను చూపెడుతుందీ పుత్తడి వెలుగులు కథ.

“అనగనగా ఓ జాబిలమ్మ కథలో “ కథలు చదవడం ఆ కథలు ఇంట్లో పిల్లలకు చెప్పడం , ఆ కథల ప్రభావం పిల్లలపై పనిచేయడం వంటి మంచి అలవాట్లను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందీ కథ. ఒక అందమైన కథలో జాబిలమ్మ నీలాకాశంలో వెన్నెల సామ్రాజ్యాన్ని చేరుకుని నక్షత్రంగా వెలగాలన్న కోరికను ఆధారంగా చేసుకుని శారదామోహన్ రాజ్ లు భారతదేశం నుంచి అమెరికాలో హ్యూస్టన్ లో ఉద్యోగరిత్యా చేరుకుంటారు. అపురూపంగా పెరిగిన కూతురు చందూని చాలా గారాబంగా చూసుకుంటారు. చందూ పెరిగి పెద్దయి ఒక విదేశీయుడిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి నిర్ణయాన్ని అంగీకరిస్తారు తల్లితండ్రులు . ఆ తర్వాత చందూ వివాహానంతరం బిడ్డని కని ఇస్తుందని ఎదురుచూసిన తల్లితండ్రులకు షరాఘాతం లాంటి వార్తను చెప్తుంది చందు. ఒక సమస్య ఎదురైనప్పుడు చందూ ఎదుర్కొన్న తీరు , తల్లితండ్రుల మనోవ్యధ , సైన్స్ పరంగా కొత్తవిషయాలని ఈ కథలో ఆసక్తికరంగా ఆర్ద్రంగా చిత్రించారు రచయిత్రి. మనసును కదిలింపజేసే కథనం కుటుంబసభ్యుల మధ్య ప్రేమాభిమానాలకు ప్రత్యక్ష ప్రతిబింబం.. అనగనగా ఓ జాబిలమ్మ.

తులసి ప్రతిభావంతురాలైన కూతురి కథ. కుటుంబంలో మామూలుగా చదివే పిల్లల మధ్య బాగా చదువుకునే అమ్మాయి మనస్తత్వం , ఇతర పిల్లల సహజ నడవడి… కుటుంబ సభ్యుల కోసం తులసి ఆరాటం .. తులసి చదువుకి చర్చినుంచి సహకారం లభించడం..ఇంటి సభ్యుల ఖర్చుల సర్దుబాటు కోసం తులసి ట్యూషన్ చెప్పడం ఒకరికొకరు చూపించుకునే ఆరాటాలు ప్రేమలు ఈ కథలో బాగా కనిపిస్తాయి. ప్రధానంగా తల్లి కష్టపడుతుంటే కూతురుగా తులసి తల్లి పట్ల ప్రేమ , తల్లి కష్టంలో పాలు పంచుకుని సహాయం చేయాలనే తపన కథ రూపంలో సమాజంలోని ప్రతి కూతురు ఆలోచించి అమలుపరచాల్సిన ఆవశ్యకతను వ్యక్తపరిచినట్లనిపిస్తుంది. కూతురుని అపార్థం చేసుకోవడం ఎంత సహజంగా ఉందో కుటుంబంలో ఒకరికి ప్రాధాన్యత పెరిగితే ఇతర పిల్లల మధ్య ద్వేషం ఎటువైపు దారి తీస్తుందనడానికి నిదర్శనం తులసి. పేరుకి తగిన పవిత్రత పాత్రచిత్రణలో దర్శనమిస్తుంది.

కంచే చేను మేస్తే అనే కథ సమాజంలో పిల్లల పెంపకం , చిన్న పిల్లలను స్కూల్లలో చేర్పించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ సమాజం కలవరపడాల్సిన ఉదంతాన్ని వివరించారు. “ హానిమార్గంలో పసివారు’ అనే సదస్సుకు తన స్నేహితురాలితో హాజరవుతూ తమ జీవిత సంఘటనలను వివరించిన తీరు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆకాష్ అనే అబ్బాయిని తొలిసారి ..పాఠశాలలో డే కేర్ సెంటర్ లో చేర్పించినప్పుడు నిర్లక్ష్యంతో పట్టించుకోని ఓ సంస్థను గురించి చెప్తూ ..ఇటువంటి విద్యాసంస్థలు డబ్బు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పకనే చెప్పారు. అది విద్యాసంస్థల పరంగా అయితే ప్రత్యేక అవసరం కలిగిన ఒక బాలుని పైకి రానివ్వకుండా అదేవిధంగా కొనసాగిస్తూ లబ్ది పొందాలనుకునే తల్లివృత్తాంతం ప్రపంచంలో ఇటువంటి తల్లులుంటారా అనిపించక మానదు. కథారూపంలో ఒక సముచిత అంశం పై అందరూ తిరిగి ఆలోచించవలసిన అవసరాన్ని వ్యక్తపరుస్తుంది కంచే చేనుమేస్తే కథ.
ఏం మాయ చేసావో ఒక గమ్మత్తైన కథ. స్త్రీ తన మాతృత్వం కోసం ఎంతగానో తపన పడుతుందని..ఆ స్థితిలో అమ్మతనం అంటే కడుపున పుట్టిన బిడ్డలమీదే కానక్కర్లేదని నిరూపించే గొప్పకథ. భర్త కోరికపై కన్నబిడ్డను ఆడపడుచుకి దత్తత ఇచ్చి తాను పోగొట్టుకున్న కూతురి పై అంతులేని ప్రేమను పెంచుకున్న వైదేహి చివరికి చాలా డిప్రషన్ కి వెళ్లిపోతుంది. ఆ స్థితిలో ఒక ఆక్సిడెంట్ కేస్ లో తల్లితండ్రులను కోల్పోయిన పాపని చూసిన వైదేహిలో తల్లిహృదయం తొంగి చూస్తుంది. ఆ బిడ్డను రోగగ్రస్థురాలైనా మాతృహృదయంతో అక్కున చేర్చుకున్న వైనం చాలా హృద్యంగా మలిచారు రచయిత్రి ఏం మాయ చేసావో అంటూ.ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో అటువంటి”మాయ” కు అండదండగా నిలబడాలని నిర్ణయించుకున్న వైదేహి నవీన్ ల కథ మనల్ని ఆద్యంతం ప్రేమ , త్యాగం , మాతృత్వపుకోణాల్లో పలకరిస్తుంది.

పెళ్ళయ్యాక అన్యోన్య దాంపత్యంలో పిల్లలు పుట్టక పోవడం ఒక పెద్ద సమస్య. దీన్ని ఇతివృత్తంగా తీసుకుని అనేక రకాల కథలు మనం చూస్తుంటాం. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన మనుషులకు ప్రతిబింబంగా మలిచిన కథ నిరంతరం నీ ధ్యాస లోనే.. గొప్పింటి యువరాజ్ ను పెళ్ళిచేసుకున్న కళ్యాణి యువరాజ్ తో తన జీవితాన్ని పూర్తిగా మలుచుకుంటుంది. అతని ఇష్టానుసారం అతని వ్యాపారంలోనూ బాధ్యతలను కొనసాగిస్తుంది. కేవలం పిల్లలు పుట్టలేదనే బాధ తప్ప అన్యోన్యంగా చూసుకునే భర్తపట్ల ఎంతో ప్రేమని కలిగి ఉంటుంది కళ్యాణి. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరి అనురాగాలు వారిరువురి నిర్ణయాలు జరిగిన పరిణామాలను తెలియజెప్పే కథ నిరంతరం నీ ధ్యాసలోనే.
భారతీయ సంస్కృతి , తల్లి, తండ్రి, పిల్లల మధ్య బంధాలు బాంధవ్యాలు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నమే కథ కాని కథ. వృద్ధుల పట్ల ఆదరణ ఎంత అవసరమో తెలియజెప్పే కథ. డెత్ విత్ డిగ్నిటీ యాక్ట్ అనే కొత్త స్పర్శ కథని మెలిపెడుతుంది. తన తండ్రితో తన అనుభవాలు స్నేహితురాలు తండ్రి విషయంలో అవసానదశలో పరిణామాలక్రమమే కథ కాని కథ. వృద్దాప్యంలో ఉన్నవారి నుంచి ఎదుర్కోవలసిన పరిస్థితులను చాలా హృద్యంగా చూపించారు రచయిత్రి. తన జీవితం ఎవరికీ భారం కాకూడదనుకునే తండ్రి వ్యక్తిత్వానికి దర్పణం ఈ కథ.

సరికొత్త వేకువ ప్రేమించాను పెళ్ళి చేసుకోమని బెదిరించే ఒక యువకుడినుంచి బయటపడి నిలదొక్కుకున్న బంగారం కథ. అనేక మలుపులు తిరిగి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే పరంపరలో ఎదురైన అనుభవాలు సంఘటనలు అనేకం ఈ కథలో కనిపిస్తాయి. సాగర్ బాబు ఒక ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా అతని పట్ల అభిమానాన్ని పెంచుకున్న బంగారం పాత్ర చిత్రణ సహజంగా చిత్రీకరించారు రచయిత్రి. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్థిరంగా ముందుకు సాగే పాత్రగా సరికొత్త వేకువని తీసుకు రాగల సత్తా గలిగిన వ్యక్తిగా బంగారం కథ మొదటి నుంచీ చివరి వరకూ అద్భుతంగా మనకు కనిపిస్తుంది. మమతానురాగాలు , మానవీయత ఎంత అవసరమో చాటి చెప్పే కథ సరికొత్త వేకువ.
తన వద్దకు వచ్చి ఉండమన్న కొడుకుని కాదని ఆశ్రమంలో వారికి తన అవసరం ఉందని చెప్పి భర్త చనిపోయాక కూతురు కొడుకుల మీద ఆధారపడి ఉండనని తన ఉద్యోగం తాను ఇక్కడే ఉంటానని చెప్పే ఆత్మాభిమానం గల తల్లి కథ మాతృత్వానికి మరో కోణం. పిల్లల ప్రాపకాన్ని భావిజీవితంలో పెట్టుబడిగా భావించకుండా హుందాగ జీవితంలో సాగి పోవడమే మాతృత్వంలో పరమార్థం అనే కొత్త నిర్వచనం ఈ కథలో మనకు కనిపిస్తుంది.
పిల్లల నుంచి ప్రేమానురాగాలు రాబట్టుకోలేక పోతున్నామన్న వ్యధలు వదులుకోవాలనే సందేశం కూడా ఉంది. ఈ కథ గురించి భావరాజు పద్మిని గారన్నట్లు పిల్లలే తమ జీవితాలకు మూలకేంద్రాలుగా భావించి బ్రతికిన తల్లితండ్రులు , వారు రెక్కలొచ్చి ఎగిరిపోయాక , వారు తాము ఆశించినట్లు లేరని విమర్శిస్తూ నిరాశ పడుతూ ఉండేకన్నా తమలోని ప్రేమానురాగాలను మరో కోణంలో ఆవిష్కరించుకుని , నిర్భాగ్యులకు ప్రేమను పంచి , జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్న గొప్ప సందేశాన్నిచ్చే కథ మాతృత్వానికి మరో కోణం.

సరికొత్త వేకువ కథల సంపుటిలోని ఆఖరి కథ జీవ సందీప్తి. కథలో కథనం కట్టి పడేస్తుంది. కంటనీరు తెప్పిస్తుంది. కళ్యాణి పాత్ర సందీప్ వర్మ పాత్రను సజీవంగా నిలబెడుతుంది. మంచితనానికి సేవాతత్పరతకు ప్రతీకగా సందీప్ వర్మ పాత్ర మనకు కనిపిస్తుంది. మనిషి పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎన్ని పనులు చేసినా తోటి ప్రాణులను పట్టించుకోవడం , అవసరమైన వారికి సహాయం పడడం , సేవ చేయడం అవసరమని సూచిస్తుందీ కథ. శాంతి కుటీరం ద్వారా జరిగే సత్కార్యాలు అందరికీ మార్గదర్శకాలు. భర్త పేరు మీద ప్రతియేటా నిర్వహించే సేవారార్యక్రమాలు మానవజీవన సార్థకతని , సంతృప్తిని కలిగింపజేస్తాయి.భర్త ఆశయ సాధనను కొనసాగించిన భార్య మనకు ఈ కథలో కనిపిస్తుంది.

ప్రతి కథలో రచయిత్రి సున్నిత హృదయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కథలు భారతదేశం నుంచి అమెరికా , జర్మనీల మధ్య అంతర్జాతీయంగా సాగి తెలుగుదనం ఉట్టిపడుతూ ఒక విశ్వజనీన ప్రేమ , సహృదయత , సౌజన్యం , స్నేహం , సేవా తత్పరతను ప్రతికథలో అంతర్లీనంగా ప్రవహింపజేస్తూ మానవీయతతో కూడిన మమతానుబంధాలతో కట్టి పడేస్తాయి. సరికొత్త వేకువ కథల ద్వారా ఒక స్వచ్ఛమైన భావావేశం కలిగిన కధకురాలు మన ముందు ముగ్దమనోహరంగా కనిపిస్తారు.
ప్రేమతో , అభిమానంతో ఆత్మీయానుబంధాలతో ఒకరికొకరు జీవించవచ్చనీ ..పేదవారికి , మూగ జీవులకు సేవ చేయాలని , వృద్ధులను ఆదరించాలని మహత్తర సందేశాన్నిచ్చిన సరికొత్త వేకువ కవితాసంపుటి రచయిత్రి కోసూరి ఉమాభారతి కలం నుంచి మరిన్ని మంచి కథలు రావాలని ఆశిద్దాం.

-డా. సమ్మెట విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో